Monday 10 June 2013

అద్వానీ రాజీనామాను ఆమోదించం: బీజేపీ

న్యూఢిల్లీ: సీనియర్ నేత ఎల్ కే అద్వానీ రాజీనామాను ఆమోదించేదే లేదు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం ముగిసిన తర్వాత రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. పార్టీకి అద్వానీ సూచనలు, సలహాలు చాలా అవసరం అని అన్నారు. అద్వానీ రాజీనామా అనంతర పరిస్థితులపై పార్లమెంటరీ కమిటీ భేటిలో చర్చించామని బీజేపీ నేతలు వెల్లడించారు. 

పార్టీ పదవులకు అద్వానీ రాజీనామా

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ బీజేపీలోని అన్ని పదవులకు సోమవారం రాజీనామా చేశారు. జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ బోర్డు, ప్రచార కమిటీ బాధ్యతలకు రాజీనామా చేస్తూ ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. 

నరేంద్ర మోడీని పార్టీ ప్రచార కమిటీ సారధిగా నియమించటంపై అసంతృప్తితో ఉన్న అద్వానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, పండిట్‌ దీన్‌దయాళ్‌, నానాజీ, వాజ్‌పేయి వంటి వారు రూపొందించిన సిద్ధాంతాలకనుగుణంగా పార్టీ పనిచేస్తున్నట్టు కనిపించడం లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌కు రాసిన లేఖలో అద్వానీ పేర్కొన్నారు. 

పార్టీ ప్రస్తుతం పనిచేస్తున్న తీరు, పార్టీ గమనం అర్థం కాకుండా ఉందని అన్నారు. ఈ పరిస్థితులతో రాజీపడటం తనకు ఇబ్బందిగా ఉందని అద్వానీ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మూడు పేరాల రాజీనామా లేఖలో అద్వానీ మూడు విభిన్న అంశాల్ని ప్రస్తావించారు. మొదటి పేరాలో జనసంఘ్‌, బీజేపీలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు. రెండో పేరాలో పార్టీ ప్రస్తుత తీరు, నాయకుల వ్యక్తిగత అజెండాలను ప్రస్తావించారు. 

మూడో పేరాలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ముప్పావు గంట సేపు సాగిన నరేంద్ర మోడీ ప్రసంగంలో ఎక్కడా తన పేరు ప్రస్తావించకపోవడం కూడా అద్వానీని మనస్థాపానికి గురి చేసినట్టు తెలుస్తోంది. మోడీకి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలియడంతో... గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. 

ఈ ఉదయం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ ఢిల్లీలో అద్వానీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాజీనామా నిర్ణయాన్ని అద్వానీ ప్రకటించడం విశేషం. మోడీని వ్యతిరేకిస్తున్నారనే తెలియగానే మోడీ అభిమానులు అనేక మంది ఢిల్లీలో అద్వానీ నివాసం ముందు ఆందోళనకు దిగారు. ఇది కూడా అద్వానీని కలిచివేసినట్టు తెలుస్తోంది. అయితే అద్వానీ రాజీనామాపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

మోడీతో లౌకికవాదానికి ముప్పు: చెన్నితల

తిరువనంతపురం: గుజరాత్ సీఎం నరేంద్రమోడీని 2014 లోక్‌సభ ఎన్నికల సమరానికి పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా బీజేపీ నియామించడంపై కేరళ పీసీసీ అధ్యక్షుడు రమేష్ చెన్నితల ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ నియామకం దేశ ప్రజాస్వామ్యం, లౌకికవాదానికి సవాల్ అని వ్యాఖ్యానించారు. మోడీ పనితీరు లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉంటుందన్నారు. మోడి, అద్వానీ నాణానికున్న రెండు పార్వ్శాలాంటి వారని పేర్కొన్నారు. మోడీని అద్వానీయే ఆమోదించలేకపోయారని చెన్నితల అన్నారు.