Saturday 25 May 2013

జనం గుండెల్లో YSజగన్

* ఆయనలో తమ నాయకుణ్ని చూసుకుంటున్న ప్రజలు
* మాటపై నిలిచి తండ్రి వైఎస్‌ను తలపించిన తనయుడు

అన్నింటా విఫలమవుతూ వస్తున్న అధికార పార్టీ. అన్ని విలువలకూ పాతరేసి మరీ దానితో అంటకాగుతున్న
ప్రధాన ప్రతిపక్షం. ఫలితంగా రాష్ట్రాన్ని ఆవరించిన రాజకీయ శూన్యం. దాన్ని భర్తీ చేసేందుకు మహా ప్రభంజనంలా దూసుకొచ్చారు జగన్. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు తిరుగులేని శక్తిగా, ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదిగారు. అందుకోసం నిత్యం ఏటికి ఎదురీదారు. అనునిత్యం పోరాటాలు చేశారు. ఇంత స్వల్పకాలంలో జగన్ ఈ స్థాయికి ఎదిగారంటే అందుకు కారణాలు అనేకం. ఎన్ని కష్టాలెదురైనా ఇచ్చిన మాట తప్పని జగన్‌లో ‘మడమ తిప్పని వైఎస్’ను చూసుకున్నారు జనం. తమ కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీసిన తీరులో నాయకున్ని చూశారు జనం. అధికార, విపక్ష శక్తులు అక్రమంగా నిర్బంధించినా... తల్లిని, చెల్లిని తమకు మారుగా తమ మధ్యకు పంపిన జగన్‌లో అణువణువునా ఆత్మీయ నేతను దర్శిస్తున్నారు జనం. అలా వారి మనసు చూరగొని, తిరుగులేని జననేతగా ఎదిగిన జగన్ అనే మూడక్షరాలను వింటే చాలు, కుమ్మక్కు పార్టీలకు ఎక్కడ లేని జంకూ పుడుతోందిప్పుడు...

కుట్రలను పటాపంచలు చేస్తూ, కుమ్మక్కులను కూకటివేళ్లతో పెకిలిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా దూసుకొచ్చింది. ప్రజా నాయకునిగా జగన్ ఎదగడం, ఆయన స్థాపించిన పార్టీ రాష్ట్ర రాజకీయాల రూపురేఖలనే మార్చేయడం ఒక్క గంటలోనో... రోజులోనో జరిగిన పరిణామం కాదు. దానివెనుక సుదీర్ఘ ప్రస్థానముంది. దాని ఆవిర్భావం వెనుక మొక్కవోని ఆశయముంది. అన్నింటికీ మించి అడుగడుగునా ప్రజల అండదండలున్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత అతి కొద్ది కాలంలోనే శరవేగంగా జరిగిన పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా గూడు కట్టుకున్న వైఎస్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు, ఆయన కుటుంబాన్ని వేధించేందుకు జరిగిన కుట్రలు... తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న తనయుణ్ని ఏం చేసైనా ప్రజలకు దూరం చేసేందుకు పన్నిన కుతంత్రాలు... వీటన్నింటి మధ్య జన్మించిన రాజకీయ శక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

ఎన్నికల ఆరాటం కాదు..
వైఎస్సార్‌సీపీని స్థాపిస్తున్నట్టు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రోజున కాదు కదా, కనీసం సమీప భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఎన్నికలనేవే లేవు. అయినా సరే, ఎక్కడ పీఠం కదిలిపోతుందోనన్న భయం అధికార పక్షానిది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు దూరమైన అధికారం శాశ్వతంగా అందకుండా పోతుందేమోనన్న ఆందోళన ప్రధాన ప్రతిపక్షానిది. రెండూ కలసికట్టుగా ఎంతగా గొంతు చించుకున్నా, ఎన్నో కుట్రలు చేసినా జగన్ నిత్యం జనం మధ్యే తిరిగారు. వారిలో ఒకడయ్యారు. వారి కష్టనష్టాల్లో పాలుపంచుకున్నారు. దాంతో ఏం చేసైనా సరే జగన్‌ను, వైఎస్సార్‌సీపీని అణిచేయడమే లక్ష్యంగా.. శత్రువుకు శత్రువు మిత్రుడన్న చందంగా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయి. ప్రజాదరణతో దూసుకుపోతున్న జగన్‌ను, ఆయన పార్టీని వారికి దూరం చేయలేక తెరవెనుక కుట్రలకు తెర తీశాయి. ఆయన కుటుంబాన్ని విడదీయజూశాయి. కడప లోక్‌సభ నుంచి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తల్లి వైఎస్ విజయమ్మ వైఎస్సార్‌సీపీ తరఫున నిలిచినప్పుడు రెండు పార్టీలూ కుట్రలకు మరింత పదును పెట్టాయి. వైఎస్ కుటుంబంలో చీలిక తేవడానికి ఒక పార్టీ పని చేస్తే, ఎలాగైనా వారిద్దరినీ ఓడించేందుకు ఆ పార్టీకి లోపాయికారీగా మద్దతిచ్చింది టీడీపీ. వాటి కుయుక్తులకు ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పారు. జగన్‌కు రికార్డు స్థాయి మెజారిటీ కట్టబెట్టి వాటికి గుణపాఠం నేర్పారు. తర్వాత 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీని అడ్డుకునేందుకు రెండు పార్టీలూ కలిసి నానా గడ్డీ కరిచినా జనం మరోసారి కర్రు కాల్చి వాత పెట్టారు. తాజాగా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూడా 9 మంది కాంగ్రెస్, ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజా పక్షాన నిలిచి వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చారంటే.. విప్ ధిక్కరించినందుకు తమపై తక్షణం అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు వచ్చేలా చూడాలని బహిరంగంగా డిమాండ్ చేశారంటే.. దాని అర్థమేమిటో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

...అప్పుడే తెర లేచింది
మాటకు కట్టుబడి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేస్తూ, మహా నేత మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన కుటుంబాలను పేరుపేరునా ఇంటికెళ్లి పరామర్శిస్తున్న తరుణంలోనే కుట్రలకు తెర లేచింది. ఢిల్లీ స్థాయిలో అడ్డంకులొచ్చాయి. జన నేతకు లభిస్తున్న ఆదరణ తట్టుకోలేని కాంగ్రెస్ నేతలు, ఆ ప్రభంజనం ముందు తాము కొట్టుకుపోవడం ఖాయమని భయపడ్డ టీడీపీ నాయకత్వం చేతులు కలపడంతో ఉమ్మడి కుట్రలకు అంకురార్పణ జరిగింది. జగన్ మాటపై నిలవకపోయినా, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్టు విన్నా ఈ రోజు ఆయన జైల్లో ఉండేవారే కాదు. స్వేచ్ఛగా పదవులు అనుభవిస్తూ ఉండేవారు. పార్టీ చెప్పినట్టు విని, ఏడాది ఆగితే జగన్ కేంద్ర మంత్రి, తర్వాత సీఎం కూడా అయ్యేవారని స్వయంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి హోదాలో గులాంనబీ ఆజాదే చెప్పినా... అధిష్టానం మాట విని ఉంటే జగన్‌పై ఈ కేసులు ఉండేవే కాదని మరో కాంగ్రెస్ నాయకుడన్నా... సారాంశం మాత్రం సుస్పష్టం. కానీ ఇదంతా జరగాలంటే జగన్ ఒకే ఒక పని చేయాలి. కాంగ్రెస్ మాట వినాలి. అంటే తండ్రి హఠాన్మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన అభిమానుల కుటుంబాలను స్వయంగా ఓదారుస్తానంటూ తానిచ్చిన మాట తప్పాలి. కానీ... అలా మాట తప్పడం జగన్ కుటుంబంలోనే లేదు. అందుకే ఆనాడు వైఎస్ జగన్ కళ్లెదుట కన్పించింది ఈ పదవులూ, ప్రలోభాలూ కాదు. కేవలం తన తండ్రి, ఆయన ఆశయాలు మాత్రమే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు మాత్రమే.

పార్టీ ప్రస్థాన దిశలో...
ఆ రోజు.... ఆయన ఈ కుటిల రాజకీయాల గురించి ఆలోచించలేదు. కుళ్లిన కుట్రలపై దృష్టి సారించలేదు. అప్పటికి ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. నల్లకాలువ సభలో ‘‘రాజశేఖరరెడ్డి చనిపోతూ... ఆయన నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు...’’ అని చెప్పిన జగన్... ఆ రోజు నుంచీ తన లక్ష్యమేంటో... తన దారేంటో... తన మాటేంటో... దాని కోసమే తపించారు. మాటపై నిలిచి, దివంగత నేత లక్ష్యసాధన కోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ కుట్రలు పుట్టుకొచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా... ఎన్ని ఇబ్బందుల పాలు చేసినా వెనక్కి తిరిగి చూడలేదు జగన్. లక్ష్యం దిశగా ముందుకు నడవడాన్నే జీవితంగా మార్చుకున్నారు. ఇచ్చిన మాట... దానికోసం మేరునగంలా నిలబడిన తీరు... ఎంచుకున్న బాట... ఇవే ఈ రోజు జగన్‌ను ప్రజల్లో నిలబెట్టాయి. తమ బాధలు తీర్చేవారి కోసం ఎదురుచూస్తున్న ప్రజలు జగన్‌లో తమకు పెద్ద దిక్కును చూసుకున్నారు. తమ నాయకుణ్ని చూసుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియే రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. జగన్ బలమైన శక్తిగా అవతరించడానికి కారణమైంది. యాదృచ్ఛికమే అయినా.. జగన్ వేసిన తొలి అడుగులే... పలికిన తొలి పలుకులే పార్టీ ఏర్పాటుకు నాంది పలికినట్టయింది. కుట్రలు, కుతంత్రాల్లో ఇమిడేందుకు ఇష్టపడక, ప్రజల పక్షాన నిలవడానికి పార్టీని ఏర్పాటు చేసే దిశగా పరిస్థితులే జగన్‌ను నడిపించాయి.

జగనే ఎందుకు?
మూడు పదులు దాటిన వయసులో తనకెందుకీ బాధలనే ఆలోచనను జగన్ ఒక్కరోజు కూడా తన మదిలోకి రానివ్వలేదు. ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన తండ్రికి కొడుకుగా తన బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆటుపోట్లు.. ఇంకెన్నో కుట్రలు.. మొత్తంగా ముళ్ల బాటే ముందుందని ముందే తెలుసు. అడుగడుగునా సవాళ్లే ఎదురవుతాయనీ తెలుసు. అయినా ఆయన దేనికీ వెరవలేదు. తన తండ్రి దేనికోసమైతే పరితపించారో.. ఏ లక్ష్యం కోసం పని చేశారో.. దాని సాధనే ధ్యేయంగా ముందుకు సాగడాన్నే తొలి కర్తవ్యంగా ఎంచుకున్నారు.

ఒకవైపు ఓదార్పు... మరోవైపు పోరాటం...
తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన కుటుంబాలను ఒకవైపు పరామర్శిస్తూనే, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతోనూ పోరాటం చేశారు జగన్. ప్రతి సమస్యపైనా ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేశారు. ఆత్మహత్యల బాట పట్టిన చేనేత కార్మికుల కోసం 2010 డిసెంబర్ 20న విజయవాడలో 48 గంటల పాటు లక్ష్య దీక్ష చేపట్టారు. నదీ జలాల వాటాలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీ పెద్దలను నిలదీసేందుకు 2011 జనవరి 22న హస్తినలో జల దీక్ష చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ 2011 ఫిబ్రవరి 6న పోలవరం కోసం హరితయాత్ర చేశారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ప్రభుత్వం గండికొడుతున్న తీరును చూడలేక ఫిబ్రవరి 18న ఫీజు పోరు పేరుతో వారం రోజులు నిరాహార దీక్ష చేశారు.రైతు సమస్యలను ఎలుగెత్తుతూ మే 17న రైతు దీక్షకు పూనుకున్నారు. వారి సాగు కష్టాలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు జూన్ 13న చిత్తూరులో, గ్యాస్ ధరల తగ్గింపు కోసం జూన్ 30న అనంతపురం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఇలా ఒకటేమిటి... వైఎస్ మరణానంతరం ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు, ఇబ్బందుల్లో అడుగడుగునా వారి వెంటే నిలిచారు.

పోరాటాలను నిర్బంధించలేవు
కుమ్మక్కు కుట్రలు ఏడాదిగా జైల్లో నిర్బంధించినా, జగన్ ప్రజలకు ఏనాడూ దూరమైంది లేదు. తల్లికి, చెల్లికి కర్తవ్యం
వివరించారు. వారి రూపంలో నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ విజయమ్మ నిత్యం పోరాడుతున్నారు. అన్న మార్గనిర్దేశకత్వంలో, తండ్రి బాటలో షర్మిల చరిత్రాత్మకం, సాహసోపేతం అయిన పాదయాత్ర సాగిస్తున్నారు. జనం కూడా విజయమ్మలో, షర్మిలలో జగన్‌ను చూసుకుంటున్నారు. విజయమ్మ కూడా... విద్యుత్ కోతలు, చేనేత సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్... ఇలా ఒకటని కాకుండా అన్ని ప్రజా సమస్యల విషయంలోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు.

తండ్రి బాటలోనే...
వైఎస్ ఎప్పుడూ ప్రజలనే నమ్ముకున్నారు. 2009 ఎన్నికలప్పుడు ఇతర పార్టీలన్నీ ప్రచారం కోసం సినీ స్టార్లను నమ్ముకున్న వేళ... రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది లబ్ధిదారులే తమ పార్టీకి స్టార్ ప్రచారకులని సంపూర్ణ నమ్మకంతో చెప్పారాయన. ఫలితాల రూపంలో జనం దాన్ని అక్షరాలా నిజం చేసి చూపారు. జగన్ కూడా సరిగ్గా తండ్రి అడుగుజాడల్లోనే, జనంపై అచంచల విశ్వాసంతోనే ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నా, కుట్రలకు తెర తీస్తున్నా ఆయన అణుమాత్రమైనా వెరవడం లేదంటే... కేవలం ప్రజలపై ఆయనకున్న నమ్మకం వల్లే! 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఓడించడానికి అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎంతగా కుమ్మక్కయినా... ‘ప్రజలే మిమ్మల్ని గెలిపిస్తార’న్న జగన్ మాటలే అక్షరాలా నిజమయ్యాయి!

జగన్ వైపే.. జనం చూపు...
ఒకవైపు కరెంట్ లేక, తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. వైఎస్ పథకాలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 వంటివాటికి తూట్లు పొడుస్తున్నారు. ప్రతి మహిళనూ లక్షాధికారిని చేయాలన్న వైఎస్ సంకల్పాన్ని నీరుగారుస్తున్నారు. ప్రజలంతా సమస్యల సుడిలో చిక్కి... వాటిని తీర్చే, తమకోసం నిలిచే నాయకుని కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నాయకుడు జగనేనని వారిప్పటికే స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని పలుమార్లు స్పష్టంగా రుజువైంది. రాజన్న స్వప్నించిన సంక్షేమ రాజ్యమే లక్ష్యంగా ముందుకొచ్చిన జగన్ వైపే ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారికి కనబడుతున్న ఒకే ఒక్క నాయకుడు.. ఏకైక ప్రత్యామ్నాయం జగన్!!

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 160వ రోజు ఆదివారం 14.8 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ప్రారంభమయ్యే పాదయాత్ర వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామానికి చేరుతుందని పేర్కొన్నారు.

పర్యటించే ప్రాంతాలు :
గొరగనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, నందమూరుగరువు,
వీరవాసరం, బొబ్బనపల్లి, మత్స్యపురి

టీఆర్‌ఎస్.. కాంగ్రెస్‌లో కలిసేదే: బీజేపీ

హైదరాబాద్: తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న తమ పార్టీని విమర్శించే అర్హత, హక్కు టీఆర్‌ఎస్‌కు లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లు గెలిచినా ఆ పార్టీ కాంగ్రెస్‌లో కలవడం ఖాయమని చెప్పారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆరే స్వయంగా ఆ విషయాన్ని చెప్పారని తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధులు ఎస్.కుమార్, ప్రకాశ్‌రెడ్డితో కలిసి ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. దేశంలో జాతీయ పార్టీలు కూడా పెద్ద ప్రాంతీయపార్టీలుగా మారాయని, అందుకు బీజేపీ మినహాయింపు కాదన్న టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్న కేసీఆర్ పార్టీ అంతకుమించి మాట్లాడుతుందని ఊహించలేమన్నారు. ఎన్నికలకోసం తెలంగాణను ఉపయోగించుకోవాలన్నది తమ ఉద్దేశం కానేకాదన్నారు.

తెలంగాణ అమరవీరుల త్యాగం వృథా కాకూడదన్నదే తమ వాంఛ అని చెప్పారు. నిబద్ధతతో కూడిన తమ పార్టీని విమర్శించే స్థాయి టీఆర్‌ఎస్‌కు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదన్నారు. స్వతంత్రంగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసిందని చెప్పారు. రాష్ట్రం అగ్నిగుండంగా మారి రోజూ వందలాది మంది పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపులేకుండా ఉందని ఆయన దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నవారికి పదవులుతప్ప ప్రజాసమస్యలు పట్టట్లేదని మండిపడ్డారు. కరువు మండలాల్లో మంచి నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. 

YSజగన్‌ను కేసులతో వేధిస్తూ జైలుకు పంపిన కుట్రలు


* నల్లకాలువ సభలో ప్రజలకిచ్చిన మాట.. ఓదార్పు
* ఆయన యాత్రల ప్రభంజనం చూసి కుళ్లుకున్న నేతలు
* కాంగ్రెస్ అధిష్టానం ఆంక్షలు.. ఆప్తులపై వేటు అస్త్రాలు
* కుటుంబాన్ని విడదీసే కుట్రలతో పార్టీని వీడిన జననేత
* వైఎస్సార్ సీపీ ఆవిర్భావానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ
* ప్రతి ఎన్నికలోనూ బ్రహ్మరథం పట్టిన రాష్ట్ర ప్రజానీకం

ప్రజలకు ఇచ్చిన మాట తప్పినట్లయితే.. ఆయనకు పదవులు దక్కేవి! మడమ తిప్పి.. ఓదార్పు యాత్రను వదిలేస్తే ఆయనను కేంద్రమంత్రి పదవి వరించేది! అధిష్టానం ఆదేశాలకు జీ హుజూర్ అంటూ శిరసును నేలకు తాటిస్తే ఇంకెన్నో భోగభాగ్యాలు లభించేవి! 

కానీ.. మాట తప్పటం.. మడమ తిప్పటం.. ఆయన రక్తంలోనే లేదు! అందుకోసం కష్టాలెన్ని ఎదురైనా వెరపులేదు!
ఫలితం.. అవినీతి అంటూ నోటీసులు, కేసులు, ఆస్తుల అటాచ్‌మెంట్లు, అనూహ్య అరెస్టులు, రిమాండ్ పేరుతో జైలు, బెయిల్ కూడా రానివ్వకుండా వేధింపులు! వారం, నెలా కాదు.. ఏకంగా ఏడాది కాలం గడచిపోయింది!

‘‘మాట తప్పటం కన్నా మరణించటం మేలు. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యం’’ అంటూ తన తండ్రి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎప్పుడూ చెప్పే మాటను నరనరానా జీర్ణించుకున్న వ్యక్తి. ఆయనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
ఇంతకీ జగన్ ప్రజలకు ఇచ్చిన మాట ఏమిటి? ఏ మాటపై నిలబడినందుకు జగన్‌కు ఇన్ని కష్టాలు?

నల్లకాలువ సభలో ఇచ్చిన మాట... నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో రాష్ట్ర ప్రజలంతా దిగ్భ్రమకు లోనయ్యారు. ఆత్మీయమైన ఆసరా కోల్పోయామంటూ తెలుగుజాతి యావత్తూ విలవిలాడింది. వైఎస్ మరణ వార్త విన్న షాక్‌లో ఎన్నో గుండెలు ఆగిపోయాయి. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది ప్రాణాలొదిలారు. ఈ మరణాలు జగన్‌మోహన్‌రెడ్డిని కదిలించివేశాయి. వైఎస్ మరణంతో పెద్ద దిక్కుకోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రజలంతా ఓదార్చగా.. వైఎస్ కోసం చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు తాను స్వయంగా ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి కలుస్తానని.. జగన్ మాట ఇచ్చారు.

వైఎస్ మరణించిన 22వ రోజున నల్లకాలువ వద్ద అశేష జనవాహిని సమక్షంలో ఆయన ఈ విషయం ప్రకటించారు. ఇచ్చిన మాట మేరకు 2010 ఏప్రిల్ 10న పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన యాత్ర ప్రారంభించారు. వైఎస్ కోసం చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా వారి ఇంటికి వెళ్లి.. వారికి తానున్నానంటూ ఓదార్పునందించారు. జగన్ ఓదార్పు యాత్ర ప్రజావెల్లువతో ప్రభంజనంలా మారింది. తమను ఓదార్చటానికి వచ్చిన జగన్‌లో ప్రజలు కన్న కొడుకును, తోబుట్టువును చూసుకున్నారు. ఆత్మీయుడిగా ఆదరించి అక్కున చేర్చుకున్నారు. తమ కష్టాలు చెప్పుకుని కన్నీరు కార్చారు. కంచంలో కూటిని నోటికి అందించారు. నీవు ఒంటరివి కావంటూ జగన్‌కూ ఓదార్పునందించారు. ఆయనకు, ఆయన కుటుంబానికి తోడుగా నిలిచారు.


* వైఎస్ మరణం తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చుతానని జగన్ మాట ఇవ్వటం నేరమా?
* కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఇంటికి వెళ్లి పరామర్శించటం మన సాంప్రదాయం కాదా?
* రాజన్న కొడుకుకు జనాదరణ పెరగటం చూసి కాంగ్రెస్ పెద్దలకు కన్నుకుట్టటం నిజంకాదా?
* రాజన్నను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారనటానికి ఓదార్పుయాత్ర అద్దం పట్టలేదా?

ప్రభంజనంగా మారిన ఓదార్పు..
వ్యక్తిగా ఓదార్పు యాత్ర ప్రారంభించిన జగన్ ప్రజల ఆదరాభిమానాల వెల్లువతో ఓ శక్తిగా మారారు. ప్రజల కష్టాలు, కడగండ్లను దగ్గరగా చూసి చలించిపోయి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర వైఎస్‌ను చరిత్రలోనే అరుదైన సంక్షేమపథగామిగా మారిస్తే.. ఓదార్పు యాత్ర జగన్‌ను ప్రజల ఆశలు, ఆకాంక్షలకు నిలువుటద్దంలా మార్చింది. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు, వారిలో భవిష్యత్‌పై భరోసా కల్పించేందుకుగాను జగన్‌లో వయసుకు మించిన ఓర్పును, పరిణతిని ఓదార్పు యాత్ర కల్పించింది. వేనవేల కిలోమీటర్ల ప్రయాణంలో కోట్లాది మంది జనం గుండె తలుపులు తట్టిన ఓదార్పుయాత్ర ఇక జగన్‌ది కాకుండా పోయింది. అది ప్రజల ఓదార్పుయాత్రగా మారిపోయింది. ఓదార్పు యాత్రకు లభిస్తున్న ప్రభంజనం కాంగ్రెస్ వృద్ధ జంబూకాల మదిలో కల్లోలం రేపింది.

జగన్ జననేతగా ఎదగటం వారికి ఇష్టం లేకపోయింది. కుట్రలు, కుతంత్రాలు బయల్దేరాయి. కాంగ్రెస్ నేతలు ఈ యాత్ర వద్దన్నారు. అధిష్టానం ఆంక్షలు పెట్టింది. ఎమ్మెల్యేలు, ఎంపీలెవరూ ఓదార్పు యాత్రలో పాల్గొనరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. జగన్‌కు మద్దతుగా నిలబడిన నాయకులపై వేటు పడింది. అయినా జగన్ వెనక్కు తగ్గలేదు. ఓదార్పు ఆగలేదు. అరెస్టయ్యే వరకూ ఆయన యాత్ర సాగుతూనే ఉంది. మొత్తం 13 జిల్లాల్లో 265 రోజుల పాటు సాగిన ఓదార్పు యాత్రలో 494 కుటుంబాలను జగన్ ఓదార్చారు. 18,162 కిలోమీటర్ల మేర ఓదార్పు యాత్ర సాగటం, 5,124 గ్రామాలు, పట్టణాలలో 2,217 సభలు నిర్వహించటం ఓ రికార్డు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారందరినీ తాము పరామర్శిస్తామని, కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున అందజేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఆ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండాఅటకెక్కించేసింది.

* జగన్ కోసం ప్రజలు రేయనక పగలనక ఎదురుచూడటం నిజం కాదా?
* ప్రజానాయకుడిగా ఎదుగుతున్న జగన్ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కుట్రలు సాగటం, తప్పుడు నివేదికలివ్వటం ఎందుకు?
* ఓదార్పుపై ఆంక్షలు.. జగన్‌ను జనం నుంచి దూరం చేయటానికి కాదా?
* ప్రజలను కదిలించగలిగే నాయకుడిగా జగన్ ఎదగటం కాంగ్రెస్ నేతలకు ఎందుకు కంటగింపయ్యింది?


పథకాల అమలు కోసం నిరంతర పోరాటం
వైఎస్ మరణం తర్వాత.. జగన్‌మోహన్‌రెడ్డికి జనం నీరాజనం పడుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు గండికొట్టటం ప్రారంభించింది. ఆరోగ్యశ్రీ పథకానికి కోత పెట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరతను తీర్చకుండా, మౌలిక వసతులు కల్పించకుండానే.. 133 జబ్బులను ప్రయివేటు ఆస్పత్రుల జాబితా నుంచి తొలగించి, ప్రభుత్వాస్పత్రులకు బదలాయించారు. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో ఆయా జబ్బులకు చికిత్స లభించక రోగులు అల్లాడుతున్నారు. అలాగే.. వేల సంఖ్యలో రోగులకు చికిత్సలకు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీకి నిధులూ అరకొరే. అటు లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులపై భరోసా కల్పించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ఆంక్షలతో సర్కారు తూట్లు పొడిచింది. ఫీజులు ఏ సంవత్సరమూ సక్రమంగా విడుదల చేయలేదు.

పైగా వయోపరిమితి, ఆదాయపరిమితి, ప్రభుత్వ కాలేజీల్లోనే చదవాలి అంటూ విపరీతమైన ఆంక్షలతో పాటు.. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ఫీజులపై పరిమితులు వంటి చర్యలతో మొత్తం పథకం స్ఫూర్తికే తూట్లు పొడిచారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల పథకానికీ సర్కారు ఎసరు పెట్టింది. కొత్తగా పెన్షన్లే ఇవ్వకపోగా ఉన్న వాటినే తొలగించింది. మహిళలకు పావలా వడ్డీ పథకం కాగితాలకే పరిమితమయింది. ఇక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చారు. రోజుకు 9 గంటలు విద్యుత్ అందిస్తామన్న వైఎస్ హామీకి పాతరేశారు. కనీసం ఏడు గంటల విద్యుత్ అయినా సరఫరా అవుతుందా అంటే.. రోజుకు రెండు మూడు గంటలు విద్యుత్ వస్తే ఎంతో గొప్పగా మారిపోయింది. వీటిపై జగన్ పోరాటానికి దిగారు.

ఓదార్పు యాత్ర కొనసాగిస్తూనే వివిధ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ ఎన్నో దీక్షలు నిర్వహించారు. అన్నదాత కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం 2010 డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో విజయవాడలో కష్ణా నది తీరాన జగన్ లక్ష్యదీక్ష నిర్వహించారు. జగన్‌తో పాటు లక్షలాది మంది రైతులు ఈ దీక్షలో పాల్గొన్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రానికి తెలియజెప్పటం కోసం జగన్ 2011 జనవరి 11న దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు వీధిలో జల దీక్ష పేరుతో ఒక రోజంతా నిరశనదీక్ష నిర్వహించారు. రాష్ట్రం నుంచి ప్రత్యేక రైలులో వేలాదిమంది రైతులు, నాయకులు ఢిల్లీ తరలివెళ్లారు. నిత్యావసరాల ధరలపై విశాఖలో 2011 జనవరి 22న జనదీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని కోరుతూ 2011 ఫిబ్రవరి 7 నుంచి 10 వరకూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి 88 కిలోమీటర్ల దూరం హరితయాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఫీజుల పథకాన్ని నిర్వీర్యం చేస్తుండటంపై 2011 ఫిబ్రవరి 18 నుంచి హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో వారం రోజుల పాటు జగన్ నిరాహార దీక్ష నిర్వహించారు.

రైతుల సమస్యలపై 2011 మే 15 నుంచి రెండు రోజులు గుంటూరులో, 2012 జనవరి 10 నుంచి 12 వరకూ 3 రోజుల పాటు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతు దీక్షలు నిర్వహించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేనేత దీక్ష చేపట్టారు. చిత్తూరులో సాగుపోరు ధర్నా, వైఎస్‌ఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కరెంటు పోరు ధర్నా, విజయవాడలో రైతు సమస్యలపై మహాధర్నా, ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఫీజుపోరు ధర్నా, నరసరావుపేటలో వస్త్రవ్యాపారులకు వ్యాట్ రద్దు డిమాండ్‌తో ధర్నా, మొగల్తూరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ధర్నా.. జగన్ నిర్వహించారు.

* ప్రజా సమస్యల పరిష్కరిం చాలని కోరుతూ ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు దీక్షలు చేయటం ప్రజాస్వామ్యంలో ఒక ఉద్యమ రూపం కాదా?
* జగన్ ఏ సమస్యపై నిరాహార దీక్ష చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం నిజం కాదా?
* వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను ఆయన మరణం తర్వాతి ప్రభుత్వాలు నిర్వీర్యం చేయటం నిజం కాదా?
* ప్రజలు పెద్ద ఎత్తున దీక్షలు, ధర్నాలలో పాల్గొంటుంటే అదే స్థాయిలో జగన్‌పై కుట్రలు, కుతంత్రాలు పెంచటం జగన్‌ను అడ్డుకోవటానికి కాదా?

పొమ్మనకుండా పొగబెట్టిందెవరు?
ఒకవైపు ఓదార్పుయాత్రకు ఆటంకాలు కలిగిస్తూ ఆంక్షలు విధిస్తూనే.. మరోవైపు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని తమవైపు తిప్పుకునే వ్యూహానికి కాంగ్రెస్ తెరతీసింది. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు కోరే సాకుతో సోనియాగాంధీ స్వయంగా చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు ఓదార్పును తాత్కాలికంగా వాయిదా వేసుకున్న జగన్.. తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల వెంటరాగా ఢిల్లీకి వెళ్లి.. ఓదార్పు యాత్రను కొనసాగించేందుకు సోనియాను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నెల రోజులు నాన్చిన సోనియా తర్వాత ఓదార్పును జిల్లాకో సభకు పరిమితం చేసుకోవాలని ఆంక్షలు పెట్టారు. అయితే ఇచ్చిన మాటను తప్పటానికి సిద్ధంగా లేని జగన్ 2010 జూలై 8న శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు.

జగన్ మద్దతుదారులపై వేటువేస్తూ పార్టీలో జగన్‌ను ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తూనే కుటుంబాన్ని చీల్చేందుకు కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించింది. ఇక కాంగ్రెస్‌లో ఉండలేని పరిస్థితులు తీవ్రమవటంతో జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కడప లోక్‌సభ స్థానానికి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానానికి విజయమ్మ రాజీనామా చేశారు. చివరకు వైఎస్‌ఆర్ ఆశయ సాధన కోసం, ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుచేసి పేదప్రజలను ఆదుకోవటం కోసం.. ఆ సంక్షేమ పథకాలే జెండా, ఎజెండాగా జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఆ క్రమంలో వైఎస్ తమ పార్టీ నేతని, ఆ పథకాలన్నీ తమ పార్టీ పథకాలని ప్రచారం చేసుకోవటానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. కానీ.. అవి విఫలమవటంతో వైఎస్‌ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంది.

* జగన్ కాంగ్రెస్‌లో ఉండగానే.. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో విలీనం మంతనాలు నిజం కాదా?
* విజయమ్మకు నెల రోజుల వరకూ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవటం వైఎస్‌ఆర్ కుటుంబం విషయంలో సోనియా వైఖరి ఎలా ఉందో అద్దం పట్టటం లేదా?
* జగన్ మద్దతుదారులపై వేటు వేయటం, ఆయన కుటుంబాన్ని చీల్చేందుకు ప్రయత్నించడం జగన్‌ను కాంగ్రెస్ నుంచి బయటకు పంపటం కోసం కాదా?


కుట్రలను ఛేదించుకుంటూ... 
దివంగతనేత రాజశేఖరరెడ్డి ఆశయాల స్ఫూర్తితో ప్రజాసంక్షేమం కోసం జగన్‌మోహనరెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అడుగడుగునా కుట్రలు, కుతంత్రాల నడుమ ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్షగా విజయపథాన ముందుకుసాగుతోంది. కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జగన్, విజయమ్మ తిరుగులేని ఆధిక్యంతో గెలుపొందారు. 2011 డిసెంబర్‌లో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జగన్‌కు మద్దతిస్తున్న 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి అనర్హత వేటుకు గురయ్యారు.

సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరును చేర్చినందుకు నిరసనగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి కూడా పదవికి రాజీనామా చేశారు. జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో 15 అసెంబ్లీ, నెల్లూరు లోక్‌సభ స్థానాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి మెజారిటీతో గెలుచుకుంది. కడప ఎన్నికల్లోనూ, ఆ తర్వాత ఉపఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ సీపీని ఓడించటం కోసం అధికార కాంగ్రెస్, దాని బద్ధశత్రువైన ప్రతిపక్ష టీడీపీలు రెండూ రహస్యంగా చేతులు కలిపినా ప్రయోజనం లేకపోయింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మరో 9 మంది ఎమ్మెల్యేల వరకూ ఆ పార్టీలను వీడి వైఎస్‌ఆర్ సీపీలో చేరినా ఓటమి భయంతోనే వారిపై అనర్హత వేటు వేయటానికి ఆయా పార్టీలు జంకుతున్నాయి.

* సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరును చేర్చటం వెనక కాంగ్రెస్ కుట్ర ఉందనటం నిజం కాదా?
* కడప ఎన్నికల్లో జగన్‌ను, విజయమ్మను ఓడించటానికి, కనీసం మెజారిటీ తగ్గించటానికి ప్రయత్నించాలని మంత్రులందరినీ మోహరించింది నిజం కాదా?
* లోక్‌సభ ఓటు మీకు, అసెంబ్లీ ఓటు మాకు అంటూ కడప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ రహస్య అవగాహనకు ఎందుకు రావలసి వచ్చింది?.. ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఓడించటానికి కాంగ్రెస్, టీడీపీలు పరస్పరం సహకరించుకోవటం నిజం కాదా?

జనం మధ్య ఉన్న జగన్‌ను పిలిచి అరెస్టు... 
2012 జూన్ 12న ఉప ఎన్నికలకు ముందు కుట్రలు మరింత పదునుతేలాయి. మే 28న నేరుగా కానీ, న్యాయవాది ద్వారా గానీ విచారణకు హాజరుకావాలని ఓదార్పుయాత్రలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి సమన్లు అందాయి. కానీ న్యాయస్థానానికి వెళ్లక ముందే తనను అరెస్టు చేసే అవకాశం ఉందని జగన్‌మోహన్‌రెడ్డి ఊహించారు. ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఆ అనుమానాన్ని నిజం చేస్తూ మే 25వ తేదీన తమ ఎదుట విచారణకు రావాలంటూ అంతకు రెండు రోజుల ముందు జగన్‌కు సీబీఐ నోటీసులిచ్చింది. ఎన్నికలు ముగిసే వరకూ సమయమివ్వాలని, జూన్ 12 తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకు హాజరవుతానని సీబీఐని జగన్ కోరారు. కానీ సీబీఐ ససేమిరా అంది.


25 నుంచి 27 వరకూ మూడు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారించిన సీబీఐ.. కోర్టుకు హాజరు కావటానికి ఒక రోజు ముందు అంటే మే 27 ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జగన్‌ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉప ఎన్నికల ప్రచారంలో జగన్‌ను పాల్గొననీయకుండా చేయటం, వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులను గందరగోళ పరిస్తే ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తాయనే ఇలాంటి కుట్రలు జరిగాయి. కానీ జనం స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఏ కేసులోనైనా 90 రోజుల్లోగా చార్జిషీటు సమర్పించటం, నిందితులపై ఆరోపణలు రుజువు చేయలేకపోతే బెయిల్ మంజూరు చేయటం చట్టంలోని నిబంధనలు. కానీ జగన్ కేసులో అవన్నీ తారుమారయ్యాయి. ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు విడతల వారీగా చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు.

* ఏడాది పాటు ఏ ఒక్కసారీ జగన్‌ను విచారించని సీబీఐ.. హఠాత్తుగా ఎన్నికల వేళ విచారణకు సమన్లు పంపటం వెనక కుట్ర లేదా?
* ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననీయకుండా జగన్‌ను అరెస్టు చేయటానికి సీబీఐని పురికొల్పటం నిజం కాదా?
* జగన్ ఎంపీ కనుక సాక్ష్యాలను తారుమారు చేస్తారని సీబీఐ అంటోంది? అంటే జగన్ ఇప్పుడే కొత్తగా ఎంపీ అయ్యారా? ఈ కేసు దాఖలై విచారణ కొనసాగిన 9 నెలల కాలంలో కూడా ఆయన ఎంపీనే కదా?
* జగన్‌కు బెయిల్ రాకుండా చేయటం కోసమే విచారణను సాగదీస్తున్నారని, చార్జిషీట్లను ముక్కలు ముక్కలుగా దాఖలు చేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదా?

దుష్ర్పచారాన్ని పటాపంచలు చేస్తూ..
తాము అనుకున్న పరిస్థితులు వచ్చేవరకూ జగన్‌ను జనం నుంచి దూరంగా ఉంచాలన్నది అధికార పార్టీ పథకంగా కనిపిస్తోంది. జగన్‌ను నిర్బంధిస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఛిన్నాభిన్నమయిపోతుందని, కార్యకర్తలు, నాయకులు మనోస్థయిర్యం కోల్పోతారని ఆశించినవారికి భంగపాటు ఎదురయ్యింది. కొండా సురేఖ దంపతులు దూరమయ్యారని, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్ టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని, జలగం వెంకట్రావ్ అసంతృప్తితో ఉన్నారని, దాడి చేరికతో కొణతాల పార్టీని వీడబోతున్నారని రకరకాల ఊహాగానాలు ప్రచారంలో పెట్టి పార్టీని గందరగోళ పరిచేందుకు కాంగ్రెస్, టీడీపీలతో పాటు మీడియాలో ఒకవర్గం విశ్వప్రయత్నాలు చేసింది. కానీ అవన్నీ పటాపంచలవుతున్నాయి.

టీడీపీ ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ.. ప్రజా సమస్యలపై నిబద్ధతతో పోరాడుతున్నది వైఎస్‌ఆర్ కాంగ్రెసేనని ప్రజలు గుర్తించారు. కుట్రలను ఎండగట్టడం, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి రాజన్న రాజ్యం వస్తుందన్న భరోసా కల్పించడం కోసం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్రను కొనసాగించే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకుని.. ఇటీవలే 2,000 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించారు.

వైఎస్ కుటుంబంపై సాగుతున్న కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారనటానికి విజయవంతంగా సాగుతున్న షర్మిల
పాదయాత్ర ప్రత్యక్ష నిదర్శనం. ఎన్నికలు ఏ క్షణాన వచ్చినా కుట్రదారులందరికీ ప్రజలు బుద్ధి చెప్పటం ఖాయం.

జగనన్నను ఎవరూ ఆపలేరు: YS షర్మిల


భీమవరం: ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు 8సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని రైతులకు ఒక్క రూపాయికి సహాయం చేయలేదని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతు కుటుంబాలకు సహాయం చేశారని గుర్తు చేశారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్‌లో బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా లక్షల కోట్లు విలువైన భూములను తన బినామీలకు కారుచౌకగా కట్టబెట్టారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి అంటే ఇలావుండాలని చూపిన నాయకుడు వైఎస్ఆర్ అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేశారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు చార్జీలు పెంచలేదని తెలిపారు. 

కిరణ్ సర్కారు ప్రజలను కాల్చుకు తింటోందని అన్నారు. విద్యుత్ కోతలతో రాష్ట్రంలో వేల పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా కరెంట్ చార్జీలు పెంచిందన్నారు. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈగ కూడా వాలకుండా చంద్రబాబు కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో ఊడిపడిన కిరణ్ కు ప్రజలు కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రజల నుంచి పుట్టిన నాయకుడే జనం గురించి ఆలోచిస్తారని చెప్పారు. 

అవిశ్వాసానికి మద్దతు ఇచ్చివుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేదన్నారు. చంద్రబాబుకు పదవీకాంక్ష లేకుంటే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచేవారా? అని నిలదీశారు. అబద్దపు కేసులు పెట్టి జగనన్నను జైలు పాలు చేశారన్నారు. జైలులో ఉన్నా సింహం సింహమే అన్నారు. జగనన్నను ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి హామీ నెరవేరుతుందన్నారు. అందరికీ మేలు జరుగుతుందని షర్మిల అన్నారు. ఆ రోజు వచ్చే వరకు జగనన్నను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలపర్చాలని కోరారు. 

'వైఎస్ఆర్ సిపికి అధికారం ఖాయం'

విజయవాడ: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, ఆయనకు చెందిన టివి ఛానెళ్లు జగన్ ను ఎంత విమర్శించినా 2014 ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రావడం ఖాయం అని దేవినేని చంద్రశేఖర్ అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవడం కూడా ఖాయం అని ఆయన అన్నారు. చంద్రబాబు ఢిల్లీలో చేసిన చీకటి రాజకీయాలు ప్రజలందరికీ తెలుసన్నారు. 

మైలవరంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈ చిన్నబాబు నియోజకవర్గ సమస్యలు గాలికొదిలి పెద్దబాబు మెప్పుపొందడానికి జగన్‌ను విమర్శిస్తూ గాలికి తిరగడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.

'బాబు అవిశ్వాసంపెడితే వైఎస్ఆర్

హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికైనా శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే గురునాథ రెడ్డి డిమాండ్ చేశారు. బాబు విశ్వాసం ప్రవేశపెడితే వైఎస్ఆర్ సీపీ మద్దతిస్తుందని చెప్పారు. శాసనసభలో ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం పాత్రను వైఎస్ఆర్ సీపీ పోషిస్తుందన్నారు. 

రాష్ట్రంలో భానుడి భగభగ:62 మంది మృతి


హైదరాబాద్: రాష్ట్రంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వడగాలులకు జనం మృత్యువాతపడుతున్నారు. వడదెబ్బతో ఈరోజు 62 మంది మృతి చెందారు. కరీంనగర్ జిల్లాలో ఆరుగురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, నల్గొండ జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, మెదక్ జిల్లాలో ఆరుగురు, వైఎస్ఆర్‌ జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో నలుగురు, వరంగల్ జిల్లాలో ఇద్దరు , గుంటూరు జిల్లాలో ఆరుగురు, శ్రీకాకుళం, విజయనగరం, రంగారెడ్డ, ఖమ్మం, చిత్తూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 

శ్రీకాకుళం జిల్లా హిరమండలం మంమండలం కంపలో వడగాలులకు వృద్ధురాలు మృతి చెందింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం నత్తవలసలో యువకుడు వడదెబ్బతో మృతి చెందాడు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం కత్తులూరులో వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి చెందాడు. నల్గొండ జిల్లా ఆత్మకూరు ఎస్.మండలం గట్టికల్లులో వడదెబ్బతో ఒక వృద్ధుడు, కోటపహాడ్‌లో మరోయువతి, త్రిపురారం మండలంలో ఒకరు, హాలియా మండలం తిరుమలగిరిలో ఒకరు మృతి చెందారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలో ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి అమర్‌నగర్‌లో ఒకరు మృతి చెందారు. కరీంనగర్ బస్టాండ్‌లో ఒకరు, హుస్నాబాద్‌లో పసిపాప, జూలపల్లిలో ఒకరు, కాచారంలో ఒకరు, వేములవాడ న్యూ అర్బన్ కాలనీలో ఒకరు మృతి చెందారు. 

రంగారెడ్డి జిల్లా కాటారంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం రామిరెడ్డినగర్‌లో ఒకరు మృతి చెందారు. వరంగల్ జిల్లా సంగ్యం మండలం తీగరాజుపల్లిలోవృద్దుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నిడగల్లులో రైతు మృతి చెందాడు. గుంటూరు జిల్లా బాపట్లలో వృద్ధుడు, మాచర్లలో ఇద్దరు మృతి, అమరావతిలో ఇద్దరు , దుగ్గిరాలలో ఒకరు మృతి చెందారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాలలో ఇద్దరు, కంతి మండలం తడకల్లులలో ఒకరు మృతి చెందారు.