Tuesday, 11 June 2013

డి.ఎల్.కూడా టిడిపిని తప్పుపడుతున్నారా!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని సామెత.ఆ ప్రకారం కాంగ్రెస్ లో గొడవలు టిడిపికి కూడా తలనొప్పిగా చుట్టుకుంటున్నాయి.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బర్తరఫ్ చేసిన మాజీ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ తో పాటు టిడిపిని కూడా ఇరుకున పెట్టాయి.శాసనసభ లాబీలో డిఎల్ రవీంద్ర రెడ్డి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో చేసిన సంభాషణలో ఈ పరిస్థితి కనిపించింది.గత అసెంబ్లీ సమావేశాలలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టిడిపి మద్దతు ఇచ్చి ఉంటే కిరణ్ పదవి పోయేదని డిఎల్ వ్యాఖ్యానించారు.అయితే తాము వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసానికి ఎలా మద్దతు ఇస్తామని రేవంత్ ప్రశ్నించారు. ఒకవేళ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినా ఎమ్.ఐ.ఎమ్. పార్టీ కాంగ్రెస్ ను ఆదుకునేదని ఆయన అన్నారు.కిరణ్ ,చంద్రబాబు కలిసి పనిచేస్తున్నారని ప్రజలలోకి వెళ్లిందని డిఎల్ వ్యాఖ్యానించారు.కొద్ది కాలం క్రితం వరకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు తీవ్ర వ్యతిరేకంగా ఉన్న రవీంద్ర రెడ్డి ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి టిడిపి మద్దతు ఇచ్చి కిరణ్ ప్రభుత్వ పడిపోయేదని అంటున్నారు.అయితే అప్పుడు ఈయన మంత్రిగా ఉన్నారు.అది వేరే విషయం.ఒక పక్క శంకరరావు వచ్చేది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, టిఆర్ఎస్ ల ప్రభుత్వమని చెబుతుంటే,రవీంద్ర రెడ్డి ఇలా కిరణ్ పదవి పోయి ఉండేది కదా అని వ్యాఖ్యానించడమే కాకుండా,అలా జరగనందుకు బాధపడుతుండడం, మధ్యలో టిడిపిని ఆక్షేపించడం విశేషం.

0 comments:

Post a Comment