Wednesday 15 May 2013

YSజగన్ కు పీటీవారెంట్‌ జారీ చేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్ : దాల్మియా సిమెంట్ కంపెనీకి సంబంధించి ఐదో ఛార్జి షీటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు గురువారం పీటీ వారెంట్ జారీ చేసింది. జూన్ 7వ తేదీన ఆయన్ని కోర్టుకు హాజరు పరచాలని న్యాయస్థానం చంచల్ గూడ జైలు అధికారులను ఆదేశించింది. కాగా ఇప్పటికే జూన్ 7న కోర్టుకు హాజరు కావాలంటూ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. 

సీరియస్ గానే రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం

ఢిల్లీలో ఏదో రాజకీయ హడావుడి నడుస్తున్నట్లే ఉంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచిన అదిష్టానం పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా ఢిల్లీకి రావాలని కబురు చేయడం, ఆయన బయల్దేరడం తో రాజకీయ వర్గాలలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి, లేదా పిసిసి అద్యక్షుడులలో ఎవరో ఒకరిని మార్చవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎక్కువమంది బొత్సనే మార్చవచ్చని అంటున్నారు. అయితే ఇవేవి కావు కళంకిత మంత్రులపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా డిల్లీలో చర్చలు జరుగుతున్నాయని ఇంకొందరు భావిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర రాజకీయం సీరియస్ గానే ఉందని భావించాలి.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి లగడపాటి సన్నిహితుడు

నిన్న,మొన్నటివరకు విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ కు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు సడన్ గా ఆయన పార్టీ మారారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు. సమైక్యవాద ఉద్యమంలో లగడపాటితో సన్నిహితంగా ఉండడమే కాక, ఆయా విషయాలలో కూడా ఆయనకు మద్దతు ఇస్తున్న విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరడం ఆశ్చర్యంగానే ఉంటుంది.1083 లో టిడిపి పక్షాన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.నాదెండ్ల భాస్కరరావు అనుచరుడిగా టిడిపి లో సంక్షోభం ఏర్పడినప్పుడు నాదెండ్ల పక్షాన నిలిచారు.అప్పటి నుంచి రాజకీయంగా వెనుకబడ్డ అడుసుమిల్లి జయప్రకాష్ ఈ మద్య కాలంలో సమైక్యవాద ఉద్యమం ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఈయన పార్టీ మారడం ఆసక్తికరమై అంశమే. అడుసుమిల్లి జయప్రకాష్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. లగడపాటికి చెప్పకుండానే అడుసుమిల్లి పార్టీ మారి ఉంటారా!

YS Sharmila padaytra reach 2000km mailurai at Ravikampadu

మీది రైతు ప్రభుత్వమా ?


* ఎలా అయిందో చెబుతారా..? 
* మరో ప్రజాప్రస్థానంలో సీఎం కిరణ్‌కు షర్మిల ప్రశ్న
* పంటలన్నింటినీ చేనులోనే ఎండబెట్టినందుకా?
* పంట పొలాలకు కరెంటు, నీరు ఇవ్వనందుకా?
* పంటలకు మద్దతు ధర ఇవ్వనందుకా?
* ఇది రైతు ప్రభుత్వం కాదు.. రాక్షస ప్రభుత్వం
* పేదలు, మహిళలు, రైతులు అందరూ చితికిపోయారు
* ప్రజల వైపు నిలబడాల్సిన చంద్రబాబు.. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పక్షాన నిలిచారు
* ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినవారిని ప్రజలు నమ్మరు
* రాజన్న రాజ్యంలో రైతు రాజులా ఉంటాడు 

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈ ముఖ్యమంత్రి ఇది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి గారూ.. ఎందుకు మీది రైతు ప్రభుత్వం అయింది..? పంట పొలాలకు కరెంటు, నీళ్లు ఇవ్వనందుకా..? నోటి దగ్గరికొచ్చిన పంటలను చేనులోనే ఎండబెట్టినందుకా..? రైతు ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వనందుకా..? చెరకు అమ్మబోతే ధర లేదుగానీ.. చక్కెర కొనబోతే ధర చుక్కల్లో ఉన్నందుకా..? మీది ఏ విధంగా రైతు ప్రభుత్వం అయింది..?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.

‘‘ఇది రైతు ప్రభుత్వం కాదు.. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం..’’ అని నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో సాగింది. టీ నర్సాపురం మండల కేంద్రంలో జరిగిన రచ్చబండలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

విశ్వసనీయత లేని వారిని ఎవరూ నమ్మరు..: 
ఈరోజు ఏ పంటను మార్కెట్‌కు తీసుకొని పోయినా కనీస మద్దతు ధర లేదు. అయినా నిస్సిగ్గుగా ఈ ముఖ్యమంత్రి మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. అంటే అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని అనుకుంటున్నారా? గ్రామాల్లో ఐదు గంటలకు మించి కరెంటు లేదు. రైతులకైతే మూడు గంటలకు మించి కూడా రావడం లేదు. అదీ విడతల వారీగా ఇస్తున్నారు. అభయహస్తం పథకం ఎక్కడా అమలవడం లేదు. ముఖ్యమంత్రి గారు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామంటున్నారు తప్పితే.. ఎవరికీ కూడా ఆ రుణాలు అందడం లేదు. 

ఇప్పుడున్న ప్రభుత్వంలో పేదలు, మహిళలు, రైతులు అందరూ చితికిపోయారు. చంద్రబాబుగారేమో.. రైతులు, పేదల పక్షాన నిలబడకుండా ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన నిలబడ్డారు. చంద్రబాబు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు కళ్లారా చూసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఎన్టీఆర్ వాగ్దానం చేసిన రెండు పథకాలకు చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారు. ఒకటి.. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ఎత్తేశారు.

రెండు.. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి ఎక్కడపడితే అక్కడ బెల్టు షాపులు తెరిచారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఈ ప్రభుత్వం కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన చంద్రబాబు.. ఈ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు పలకొద్దని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు.

ఇక ఈ చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడు కాకుంటే ఇంకేమవుతారు? ఈ ప్రభుత్వం కూలిపోకుండా ఎందుకు కాపాడారు చంద్రబాబు గారూ.. అని ప్రజలు అడిగితే ఈరోజు కూడా ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. ఇలా విలువలు, విశ్వసనీయత లేనివారిని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, కుట్రలు పన్నినవారిని ఎవరూ నమ్మరు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. రాజన్న రాజ్యంలో జగనన్న రైతును రాజులా చూసుకుంటారు. మళ్లీ ప్రతి పేదవాడు తలెత్తుకొని తిరుగుతాడు. గ్రామాల్లో బెల్టు షాపులు, నాటు సారా ఉండవని మీకు మాటిచ్చి చెప్తున్నాను.

12.3 కిలోమీటర్ల పాదయాత్ర
149వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని క్రిష్ణానగర్ గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి ముత్యాలంపేట, టీ నర్సాపురం, గుర్వాయిగూడెం, శ్రీరామవరం, తిరుమలదేవిపేట వరకు సాగింది. మధ్యాహ్నంవారిగూడెం గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.40 గంటలకు షర్మిల చేరుకున్నారు. బుధవారం మొత్తం 12.3 కిలోమీటర్లు నడిచారు. 

ఇప్పటివరకు మొత్తం 1990.2 కి.మీ. పాదయాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో జిల్లా పార్టీ కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్, ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మొవ్వ ఆనంద శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, నేతలు బొడ్డు భాస్కరరామారావు, వైఎస్ కొండారెడ్డి, స్థానిక నాయకులు కర్ర రాజారావు, పాశం రామకృష్ణ, గంట ప్రసాద్ తదితరులున్నారు. 

నేటితో 2 వేల కిలోమీటర్లు పూర్తి.. రావికంపాడులో బహిరంగ సభ
షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం (150వ రోజు) నాటికి 2 వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించనుంది. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం రావికంపాడుకు చేరుకునేటప్పటికి 2 వేల కిలోమీటర్ల నడక పూర్తవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 24 అడుగుల వైఎస్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు. 

ఈ సందర్భంగా రావికంపాడులో జరిగే బహిరంగ సభకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పాటుగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరై షర్మిలకు సంఘీభావాన్ని ప్రకటిస్తారని పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం చెప్పారు. 2012 అక్టోబర్ 18న ఇడుపులపాయలో మొదలైన మరో ప్రజాప్రస్థానం పది జిల్లాల్లోని 67 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మున్సిపాలిటీలు, ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 115 మండలాల మీదుగా సాగింది. 

అవినీతిపై చంద్రబాబు మాట్లాడటమా !


- చంద్రబాబు 9 ఏళ్ల పాలనంతా కుంభకోణాలమయం: అంబటి
- ఆయన అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తానంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు
- బాబు తన కుమారుడ్ని చదివించింది ఏ డబ్బుతో?.. టీడీపీ ఆఫీసు కట్టించి ఇచ్చిందెవరు?
హైదరాబాద్: తొమ్మిదేళ్లు ఈ రాష్ట్రాన్ని అవినీతి, కుంభకోణాలమయంగా పరిపాలించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అవినీతి రహిత భారత దేశాన్ని చూడాలనుకుంటున్నట్లు, అవినీతిపై పోరాటం చేస్తున్నట్లు నీతులు చెప్పడం అక్షరాలా దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిరంతరం అవినీతితోకూడిన, నీచమైన రాజకీయాలు నడిపి ఎన్నికల ఖర్చు అలవికాని రీతిలో పెరగడానికి కారణమైన బాబు అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తానంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, వారు చె వుల్లో పూలు పెట్టుకోలేదని చెప్పారు. ‘‘ఆయన అవినీతి పాలనను చూసిన వారంతా ఇప్పుడు లేరని బాబు అనుకుంటున్నారేమో! ఆయన పాలన చూసిన వారిలో 90 శాతానికి పైగా ఇంకా బతికే ఉన్నారు. బాబు పాలనలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో ప్రజలకు తెలుసు.

నకిలీ స్టాంపుల కుంభకోణంలో ఆయన మంత్రివర్గ సహచరుడే నిందితుడు. నీరు - మీరు, ఇంకుడు గుంతలు పేరుతో వేలాది కోట్ల రూపాయల దుర్వినియోగం, స్కాలర్‌షిప్‌లు, ఏలేరు, అర్బన్ బ్యాంకుల కుంభకోణాలు, టూరిజానికి స్థలాల కేటాయింపు, మద్యం ముడుపుల కేసు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి’’ అని అన్నారు. ‘‘సోనియాను ఎదిరించినందుకు జగన్‌పై సీబీఐ విచారణ వేశారు. ప్రభుత్వాన్ని కాపాడుతున్నందుకు, చీకట్లో చిదంబరాన్ని కలిసినందుకు, కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకున్నందుకు సీబీఐ విచారణ జరపరని చంద్రబాబు ధైర్యంగా ఉన్నారు. 

ఖరీదైన భూమిని ఐఎంజీకి కారుచవకగా కట్టబెట్టిన వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలనే కేసు ఇంకా హైకోర్టులో ఉంది’’ అని గుర్తు చేశారు. ‘‘బాబూ..! అసలు టీడీపీ కార్యాలయం కట్టించి ఇచ్చిందెవరు? నీ తొమ్మిదేళ్ల అవినీతి పాలనలో కాంట్రాక్టులు కట్టబెట్టినందుకు ఎల్ అండ్ టీ కంపెనీ కట్టించి ఇచ్చింది కాదా? నీ కుమారుడు లోకేష్ అమెరికా చదువు కోసం సత్యం రామలింగరాజు డబ్బు కట్టిన విషయం మరిచారా? ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయవేత్త నువ్వేనని తెహల్కా డాట్‌కామ్ వెల్లడించింది మరిచారా’’ అని అన్నారు. వెయ్యి, అయిదు వందల రూపాయల నోట్లు రద్దు చేయాలని బాబు సూచిస్తున్నారంటే.., బహుశా రేపటి ఎన్నికల్లో పంపిణీ చేయడానికి ఆయన వద్ద ఉన్న పెద్ద నోట్లన్నింటినీ వందల్లోకి మార్చుకున్నారేమో అని అంబటి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

వైఫల్యం చెందింది బాబు కాదా: ‘‘అవినీతి మంత్రులను తొలగించాలని వినతిపత్రం ఇస్తే గవర్నర్ పట్టించుకోలేదని, ఆయన విధి నిర్వహణలో విఫలమయ్యారని చంద్రబాబు విమర్శిస్తున్నారు. అసలు చంద్రబాబే ఆయన విధులను నిర్వర్తించే స్థితిలో ఉన్నారా? తొమ్మిదేళ్లు సీఎంగా, మరో తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా బాబు ఎందుకు విధుల నిర్వహణలో విఫలమయ్యారో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. 

‘‘బాబుదంతా లాలూచీ కుస్తీ. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాన్ని వదలిపెట్టి, ప్రభుత్వాన్ని కాపాడి, ఇప్పుడు బజారు నాటకాలు ఆడుతున్నారు. ఓవైపు.. మంత్రులను సీఎం కిరణ్ రక్షిస్తున్నారని చెబుతూనే.., అదే సర్కారును బాబు రక్షించడంలేదా’’ అని ప్రశ్నించారు. కోర్టులను ప్రభావితం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎక్కడా చెప్పలేదని, అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేయగల దిట్ట చంద్రబాబు అని మాత్రమే అన్నారని రాంబాబు తెలిపారు.

జగన్‌ను ఇరికించేందుకే: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కేసుల్లో ఇరికించేందుకే మంత్రులను చార్జిషీట్లలో చేర్చారని, వారు కళంకితులు కారని అంబటి చెప్పారు. ఒక రాజకీయ క్రీడలో భాగంగాకాంగ్రెస్ పార్టీ ఇదంతా చేస్తోందని అన్నారు. ‘‘ఆ 26 జీవోలు సక్రమమేనని, బిజినెస్ రూల్స్ ప్రకారమే జారీ అయ్యాయని సుప్రీం కోర్టుకు మంత్రులే అఫిడవిట్లు ఇచ్చారని, అలాంటపుడు వారు తప్పు చేసినట్లు ఎట్లా అవుతుంది? శంకర్‌రావు లేఖను పరిగణనలోకి తీసుకొని, జీవోలపై హైకోర్టు నోటీసులు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే స్పందించలేదు. ఆ తరువాత సుప్రీంకోర్టులో మాత్రం జీవోలు సక్రమమేనని చెప్పారు. జగన్, మంత్రులు, నిమ్మగడ్డ ప్రసాద్, శ్రీలక్ష్మి ఎవరూ కూడా కళంకితులు కారని తొలి నుంచీ చెబుతున్నాం. 

అయితే , మంత్రుల్లో మోపిదేవికి ఒక న్యాయం, ధర్మానకు, సబితా ఇంద్రారెడ్డికి మరొక న్యాయమెందుకని సీబీఐని ప్రశ్నిస్తున్నాం. జగన్ బయట ఉంటే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని చెబుతున్న సీబీఐ.., బయట ఉండి రోజూ సచివాలయానికి వెళుతున్న మంత్రులు మాత్రం ప్రభావితం చేయరని భావిస్తోందా? నీతి, నిజాయితీ, ధర్మం ప్రకారం విచారణ జరుపుతుంటే సీబీఐ అందరిపట్లా ఒకేలా వ్యవహరించేది. కానీ, కాంగ్రెస్ ఏం ఆదేశిస్తే సీబీఐ అది చేస్తోంది. ఏరోజు ఎవరిని అరెస్టు చేయమంటే ఆరోజు వారిని అరెస్టు చేస్తోంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు.

రఘునందన ఆరోపణలను ఖండించిన హరీష్ రావు

హైదరాబాద్: తనపై రఘునందనరావు చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. పదవులిప్పిస్తానని చెప్పి ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని తెలిపారు. కేటీఆర్ ను ఓడించేందుకు ప్రయత్నించలేదని చెప్పారు. వైఎస్ఆర్ ను రహస్యంగా కలవలేదని పేర్కొన్నారు. విలువలు కట్టుబడి రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు. దిగజారుడుతనం మంచిది కాదని రఘునందనరావుకు హితవు పలికారు.

టీఆర్ఎస్‌లోకి వెళ్లడం లేదు: ఎర్రబెల్లి దయాకరరావు


హైదరాబాద్: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేసే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. దీనిపై ఈ నెల 17న గవర్నర్‌ను కలుస్తామన్నారు. గవర్నర్‌ను కలిసే కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకారని, కాని మద్దతుంటుందని తెలిపారు. బయ్యారం ఐరన్‌ ఓర్ విషయంలో ప్రభుత్వం మాయమాటలు చెబుతోందని విమర్శించారు. బయ్యారం ఉక్కు- స్థానికుల హక్కు అని నినదించారు. తాను టీఆర్ఎస్‌లోకి వెళ్లడం లేదు, అది తప్పుడు ప్రచారమని ఎర్రబెల్లి కొట్టిపారేశారు.

'కలెక్షన్ కోసం పెట్టిన పార్టీ టీఆర్ఎస్'

హైదరాబాద్: కేసీఆర్‌ బృందం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చే అవకాశమే లేదని ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు అన్నారు. ఈ బృందం కలెక్షన్ కోసం పెట్టిన పార్టీయే టీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా కేసీఆర్‌ను వెన్నుపొటు పొడిచేది హరీశ్‌రావేనని అన్నారు.

వైఎస్ఆర్ సీపీలోకి అడుసుమిల్లి జయప్రకాష్

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్‌ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా అడుసుమిల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

టీఆర్ఎస్ లో చేరిన కడియం శ్రీహరి

హైదరాబాద్‌: టీడీపీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరి టీఆర్ఎస్ లో చేరారు. ఈ మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కడియంకు కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. కడియం శ్రీహరితో పాలు పలువురు టీఆర్ఎస్ లో చేరారు.

ఇంటిగుట్టు రట్టు చేసిన రఘునందనరావు


తెలంగాణ రాష్ట్ర సమితి మెదక్ జిల్లా మాజీ అద్యక్షుడు రఘునందనరావు ఇంటి గుట్టును రట్టు చేశారు.ఆయన కెసిఆర్, హరీష్ రావు తదితరులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.దమ్ము ఉంటే పార్టీకి తాను చేసిన ద్రోహం ఏమిటో చెప్పాలని టిఆర్ఎస్ నుంచి సస్పెండైన రఘునందనరావు పార్టీ అదినేత కె.చంద్రశేఖరరావును డిమాండ్ చేశారు. ఏ స్థితిలో అర్దరాత్రి వేళ తనను సస్పెండ్ చేశారో చెప్పాలని రఘునందనరావు వ్యాఖ్యానించారు. చీమలు పెట్టిన పుట్టలో కొన్ని పాములు చేరుతున్నాయని తమలాంటి వారు చెబుతున్నందుకు సస్పెండ్ చేశారా అన్నారు. తాను చంద్రబాబు నాయుడును కలుసుకున్నానని ఆరోపిస్తున్న కెసిఆర్, గతంలో తన మేనల్లుడు హరీష్ రావు రెండువేల తొమ్మిదిలో కాంగ్రెస్ అదికారంలోకి వచ్చాక వై.ఎస్.ను కలిసి పుష్పగుచ్చం ఇచ్చివచ్చారని, ఆయనను కనీసం పిలిచి మాట్లాడారా అని రఘునందనరావు ప్రశ్నించారు.అలాగే తాను ఎమ్మెల్సీ గా పోటీచేసినప్పుడు సిద్దిపేట లో తన ఓట్లను వేరేవారికి వేయించారని , అయినా కనీసం కెసిఆర్ హరీష్ రావును అడగలేదని అన్నారు. ఈ విషయాలపై తాను కెసిఆర్ కుమారుడు తారకరామారావు కు ఈ విషయం బాధపడి చెబితే , ఆయన తనపై కూడా మహేంద్రరెడ్డిని పోటీకి పెట్టించి హరీష్ ఏభై లక్షలు ఇచ్చారని, అయినా తాను మాట్లాడకుండా పనిచేయడం లేదా అని కెటిఆర్ అన్నారని రఘునందనరావు అన్నారు. కాగా తాను పారిశ్రామికవేత్తల నుంచి డబ్బులు వసూళ్లు చేసినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని ఆయన అన్నారు. అలాకాకపోతే తాను కెసిఆర్ కు ఎన్ని చెక్కులు ఎలా వచ్చాయో చెబుతానని ఆయన అన్నారు.నాయిని నరసింహారెడ్డి చెంచా మాదిరి ఎలా పడితే అలా మాట్లాడారని, రెండువేల తొమ్మిది నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నాయిని అన్నారని, అలాంటప్పుడు నాలుగు ఏళ్లు పార్టీ అద్యక్షుడుగా ఉంచారని ప్రశ్నించారు.తనపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పడానికి నలభై ఎనిమిది గంటలు టైమ్ ఇస్తున్నానని అన్నారు. తాను తెలంగాణ వాదినని, అయినా టిఆర్ఎస్ చేస్తున్న మోసాలను చెప్పకుండా ఉండజాలనని అన్నారు. హరీష్ రావు ను కాలిగోటికి కూడా పనికిరారని, అన్న కడియం శ్రీహరిని, అక్కడ ఒక వ్యక్తిని హత్య చేయించిన వ్యక్తిని టిఆర్ఎస్ లో చేర్చుకుంటారా అని రఘునందనరావు ప్రశ్నించారు.గ్రానైట్ వ్యాపారి గంగుల కమలాకర్ ను పార్టీలోకి తీసుకుని నారదాసు లక్ష్మణరావు గొంతు కోశారని ఆయన అన్నారు. డిల్లీ హోటల్ లో ఎవరికి ఎంత డబ్బు కెవిపి ద్వారా వచ్చిందో కూడా తాను చెప్పగలనని అన్నారు. తిరుమలలో హరీష్ రావు కు డబ్బు ఇచ్చానని కూడా అన్నారు.తన పిల్లల కోసం తనను బలి చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల కోసం తాను పోరాడానే కాని డబ్బుల కోసం కాదని అన్నారు.విజయరామారావు స్వయంగా ఫోన్ చేసి కెసిఆర్ తీరుపై బాదపడ్డారని కూడా ఆయన వెల్లడించారు. నీతిబాహ్యమైన రీతిలో వ్యవహరిస్తూ ,పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన తమను ద్రోహి ముద్ర వేస్తారా అని రఘునందనరావు ప్రశ్నించారు. ఫ్రొఫెసర్ జయశంకర్ ను అగౌరపరిచారని, అలాగే కోదండరామ్ ను నోటికి వచ్చినట్లు నిందించారని, ఆయనను తొలగించడానికి ప్రయత్నించారని, అందరూ వ్యతిరేకిస్తే 
అప్పుడు తోకముడిచారని అన్నారు. కెటిఆర్, హరీష్ రావు లు డబ్బులు వసూళ్లు చేశారని , వాటికి సంబందించిన ఆదారాలు అన్ని తన వద్ద ఉన్నాయని అన్నారు.తాను చంద్రబాబు నాయుడును కలిశానన్నది అవాస్తవమని ఆయన అన్నారు. వంద సీట్లు ఇస్తే తెలంగాణ తెస్తానని అంటున్నారని, కాని అది ఎలా సాధ్యమో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తిరుపతి వెంకన్న పై ప్రమాణం చేసి తాను ఎక్కడా ద్రోహం చేయలేదని ఆయన అన్నారు.

YSజగన్‌ను సీఎం చేయటమే లక్ష్యం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


చిత్తూరు : చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. మాజీమంత్రి, పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో బుధవారం మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే తమ లక్ష్యమన్నారు. అందుకోసం తాము కృషి చేస్తామని ఆయన తెలిపారు. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

తండ్రి రికార్డును అదిగమించిన YSషర్మిల

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పాదయాత్రికురాలు షర్మిల పాదయాత్ర రెండువేల కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఈమె కూడా తన తండ్రి రికార్డును అదిగమించారన్నమాట. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1476 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. అప్పట్లో ఆయన కూడా మధ్యలో అస్వస్థతకు గురై దాదాపు వారం రోజులు ఇబ్బంది పడ్డారు. అలాగే షర్మిల కూడా తన మోకాలికి గాయం అవడంతో మధ్యలో నెల లోపు విరామం ఇచ్చారు.ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ సమీపంలోని వవస్థలిపురం వరకు పాదయాత్ర చేసిన ఆమె విరామం తర్వాత అక్కడ నుంచి పశ్చిమగోదావరి జిల్లావరకు పాదయాత్ర ద్వారా చేరుకున్నారు. చింతలపూడి నియోజకవర్గం రావికం పాడు వద్ద ఈనెల పదహారునాటికి రెండువేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేస్తున్న సందర్భంగా పార్టీ ముఖ్యనేతలంతా అక్కడకు వెళ్లి సంఘీభావం ప్రకటించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది.ఒక మహిళ రెండువేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవడం ఒక రికార్డేనని చెప్పాలి. రాష్ట్ర చరిత్రలో ఒక మహిళా నేత ఇలా చేసిన సందర్భమే లేదు. ఆ క్రెడిట్ షర్మిలకు దక్కింది.

క్రమశిక్షణ ఉల్లంఘించలేదు: రఘునందనరావు


హైదరాబాద్ : పార్టీ క్రమశిక్షణను తాను ఏనాడు ఉల్లంఘించలేదని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయన రఘునందనరావు స్పష్టం చేశారు. ఆయన బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తన సస్పెన్షన్ పై వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు అన్ని అవాస్తవమని రఘునందనరావు మీడియా సమావేశంలో తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే తాను చేసిన ద్రోహమేంటో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. 

కేసీఆర్ ను అనుక్షణం కాపాడటమే తాను పార్టీకి చేసిన ద్రోహమా అని రఘునందనరావు ప్రశ్నించారు. పార్టీకి ఏ ద్రోహం చేశానో తాను బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ చేశారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు.

గత అర్థరాత్రి ఏ స్థితిలో తనపై సస్పెన్షన్ వేటు పడిందో తెలుసునన్నారు. అవకాశవాదుల్ని పార్టీలోకి చేర్చుకోవద్దని చెప్పటమే తాను చేసిన తప్పా అని సూటిగా అడిగారు. తాను చంద్రబాబునాయుడును కలిసాననటం అవాస్తవం అన్నారు. ఈ సందర్భంగా రఘునందనరావు ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.