Thursday 2 May 2013

దాడి వీరభద్రరావు రాజీనామాపై చంద్రబాబు స్పందన

దాడి వీరభద్రరావుకు తాను చాలా ప్రాధాన్యత ఇచ్చానని టిడిపి అదినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. టిడిపికి దాడి రాజీనామా చేసిన నేపద్యంలో ఆయన అందుబాటులో ఉన్న నాయకులతో దీనిపై కొద్ది సేపు మాట్లాడారని కధనం, దాడి రాజీనామా ఆశ్చర్యంగానే ఉందని, పార్టీలో ఆయనకు విశేష ప్రాముఖ్యత ఇచ్చినా వెళ్లిపోయారని చంద్రబాబు అన్నట్లు చెబుతున్నారు. రాజీనామా చేసే ఉద్దేశంలో ఉండే విశాఖ పాదయాత్రలో ఉన్న సమయంలో దాడి వీర భద్రరావు అంటి,ముట్టనట్లు వ్యవహరించారని ఆయన అబిప్రాయపడ్డారు.

6న జగన్ పార్టీ లో దాడి వీరభద్రరావు చేరిక


జగన్ పార్టీ లో చేరేందుకు దాడి వీరభద్రరావు దాదాపుగా రంగం సిద్దం చేసుకున్నట్టే. గురువారం టీడీపీ కి రాజీనామాను మెయిల్లో పంపిన దాడి.... వైసిపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మిని మాత్రం స్వయంగా కలుసుకున్నారు. చంచల్గూడ జైలు లో శుక్రవారం జగన్ను కలిసి... మిగతా విషయాలు మాట్లాడు కొనున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ నెల 6న విజయలక్ష్మి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. విశాఖ లో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని, కోణతాలతో సఖ్యతతో పనిచేస్తానని హామీ ఇచ్చి, తన కుమారుడు రాత్నాకర్కు అనకాపల్లి లేదా విశాఖ పశ్చిమ సీటు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని వైసిపీ వర్గాలు చెబుతున్నాయి. 
ఐతే, దాడి మాత్రం ఈమధ్య మంత్రి గంటా శ్రీనివాసరావును కలుసుకొవడం .... మరింత ఆసక్తి కలిగిస్తుంది.  అదే సమయం లో 'కిరణ్ కుమార్ రెడ్డి టచ్ లో ఉన్నారు' అని దాడి కుమారుడు రత్నాకర్ ద్రువికరిస్తున్న దరిమిలా..... దాడి చూపు కాంగ్రెస్ వైపు ఉన్నదనే ఉహాగానాలు వస్తున్నాయి. 

వైఎస్సార్ టీయూసీకి అనుబంధంగా ఆర్టీసీ మజ్దూర్ యూనియన్

హైదరాబాద్: ఆర్టీసీలోని రాష్ట్రీయ మజ్దూర్ ఫెడరేషన్ సభ్యులందరూ ఈనెల 1 నుంచి వైఎస్సార్ టీయూసీ అనుబంధ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సభ్యులుగా కొనసాగాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2011, జూలై 5న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రీయ మజ్దూర్ ఫెడరేషన్ వైఎస్సార్ టీయూసీకి అనుబంధ సంఘంగా ఏర్పడిందని వివరించారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌గా మార్పు చేయాలని సంకల్పించి ఏప్రిల్ 29న కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించామని వెల్లడించారు.

చంద్రబాబు నాయుడు సీబీఐని, కాంగ్రెస్‌ను పల్లెత్తి మాట్లాడరు


* బాబుకు పదవీవ్యామోహం లేదనడం భూమి గుండ్రంగా లేదన్నట్లే
* పిల్లనిచ్చి, పదవినిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఘనుడు
* ఎన్టీఆర్ ట్రస్ట్ స్థలాన్ని కుటుంబీకుల పేర్లమీద రాయించుకున్నారు
* కార్యకర్తలను మాత్రం ఆస్తులమ్ముకొని పార్టీ కోసం పనిచేయాలని చెబుతున్నారు
* ధర్మపోరాటం చేస్తున్నానని ఆయన చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది
* సీబీఐ.. కీలుబొమ్మని కోల్‌గేట్ ఉదంతంతో తేటతెల్లమైంది
* అయినా చంద్రబాబు సీబీఐని, కాంగ్రెస్‌ను పల్లెత్తి మాట్లాడరు
* తనపై కేసుల విషయంలో ఆయన కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు
మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబు గారు మారిన మనిషట... ధర్మపోరాటం చేస్తున్నాడట.. ఇప్పుడాయనకు పదవీ వ్యామోహం.. ముఖ్యమంత్రి పీఠం మీద కోరిక లేనే లేదట... చంద్రబాబుగారూ... విలువలను, విశ్వసనీయతను పక్కనపెట్టి అధికార పక్షంతో కుమ్మక్కై ప్రజలకు, ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడవటమేనా ధర్మయుద్ధమంటే... అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకోవాలని కార్యకర్తలకు చెబుతున్న చంద్రబాబు అదే పార్టీకోసం తన ఆస్తులెన్ని అమ్ముకున్నారో చెప్పాలన్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం ఖమ్మంజిల్లా వైరా నియోజకవర్గంలో సాగింది. ఏన్కూరు మండల కేంద్రంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

నేను ధర్మపోరాటం చేస్తున్నానంటూ ఈ మధ్య చంద్రబాబు నాయుడుగారు సినిమా డైలాగులు కొడుతున్నారు. ఆయనకు పదవీ వ్యామోహం, ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదనడమంటే... భూమి గుండ్రంగా లేదన్నట్లే. మంచివాడనుకుని ఎన్టీఆర్ పిల్లనిచ్చి, పార్టీలో హోదాను, మంత్రి పదవిని ఇచ్చారు. కానీ పట్టపగలే కన్నార్పకుండా అదే మామగారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, కుర్చీని, అధికారాన్ని లాగేసుకున్న ఘనుడు ఈ చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ల ఆస్తులు కూడా అమ్మేసుకుని పార్టీకోసం పనిచేయాలని చెప్తున్నారాయన. కానీ అదే పార్టీకోసం తాను ఏ ఆస్తులు అమ్ముకున్నారో చెప్పనేలేదు. పైగా హైదరాబాద్‌లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్టు భవన్ స్థలాన్ని ట్రస్టు పేరు మీద రాయకుండా తన కుటుంబ సభ్యుల పేరు మీద రాయించుకున్నారు. దాన్నిబట్టే ఆయన ఎలాంటివాడో అర్థమవుతోంది. చంద్రబాబు వేరొకరిని తొక్కి పైకొచ్చిన రకమే గానీ త్యాగాల మీద ఎదిగిన నాయకుడు కాదు. ధర్మపోరాటం చేస్తున్నానని ఆయన చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఆయన ఎన్ని అబద్ధాలైనా కన్నార్పకుండానే చెప్పగలరు. నిజం చెప్తే తల వెయ్యిముక్కలయ్యేలా చంద్రబాబుకు శాపం ఉందని వైఎస్సార్ చెప్పేవారు. అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నిజం చెప్పరు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే ప్రజలు నమ్ముతారని ఆయన సిద్ధాంతం. మోసం, వెన్నుపోటు నుంచి పుట్టి... కుట్రలు, నీచరాజకీయాలతో ఎదిగిన చంద్రబాబుకు న్యాయం, ధర్మం, విలువలు, విశ్వసనీయత అనే పదాలకు కనీస అర్థం తెలియదు. అందుకే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ప్రజాస్వామ్యానికే వెన్నుపోటు పొడిచారు.

సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ కాదని ఎవరైనా వాదించగలరా..! 
ఇప్పుడు దేశంలోని నాయకులు అంతా కోల్ గేట్ గురించి మాట్లాడుకుంటున్నారు. బొగ్గును వేలం వేయకుండా, ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడం వల్ల దేశానికి రూ.రెండు లక్షలకోట్ల నష్టం వచ్చిందని స్వయంగా కాగ్ పేర్కొంటే... దానిపై సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐని కోరింది. సీబీఐ విచారణ చేసి తయారు చేసిన నివేదికను ప్రధాన మంత్రి, న్యాయశాఖ మంత్రి కార్యాలయాలకు పంపించి, వాళ్లు నివేదికలో మార్పులు చేర్పులు చేసిన నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించింది.

దీన్నిబట్టి ఈ సీబీఐ ఎవరికోసం పనిచేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. జగనన్నమీద కుట్రలు పన్ని 11 నెలలుగా జైల్లో పెట్టారు. ‘సీబీఐ పెడుతున్న బాధలతో జగన్‌మోహన్‌రెడ్డి తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయక తప్పదని’ ఇటీవల కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చెప్పారు అంటే వీళ్ల మనసుల్లో ఎన్ని కుట్రలు దాగి ఉన్నాయో అర్థమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేలా చేయడానికి అధికార దుర్వినియోగంతో జగనన్నను ఇంత ఇబ్బంది పెడుతున్న వీళ్లను ఏమనాలి? ఇంత జరిగిన తరువాత సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ కాదని ఎవరైనా వాదించగలరా?

సీబీఐ మీద చంద్రబాబు ఎందుకు నోరు విప్పరు...
బొగ్గు కుంభకోణంలో సీబీఐ విచారణ తీరుపై దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నా మన చంద్రబాబు మాత్రం నోరు విప్పటం లేదు. అదే వైఎస్సార్ కుటుంబం మీదనైతే ఇంతెత్తున లేచి, ఎంత నీచంగానైనా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులపై విచారణ జరగకుండా ఉండేందుకు చంద్రబాబు కాంగ్రెస్, సీబీఐకి లొంగిపోయారు కాబట్టే వాటిని విమర్శించే ధైర్యం లేదు. బతికి ఉంటే బలుసాకైనా తిని బతకవచ్చని నిర్ణయించుకొని కాంగ్రెస్, సీబీఐలను ప్రశ్నించడం లేదు, విమర్శించడం లేదు. సీబీఐ మీద, కాంగ్రెస్ మీద ఎందుకు నోరు విప్పడం లేదో చంద్రబాబు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం 136వ రోజు ఖమ్మంజిల్లా వైరా నియోజకవర్గం రాజలింగాల గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి బురదరాఘవాపురం, లచ్చగూడెం, తూతుక లింగన్నపేట, ఇందిరానగర్ మీదుగా ఏన్కూరు మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. అక్కడి నుంచి భగవాన్‌నాయక్ తండా శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి తొమ్మిది గంటలకు చేరుకున్నారు. గురువారం ఆమె మొత్తం 12.3 కిలోమీటర్లు నడిచారు.

ఇప్పటివరకు మొత్తం 1,834 కి.మీ యాత్ర పూర్తయ్యింది. ఏన్కూరు మండలంలోని లచ్చగూడెం శివారులో షర్మిలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ కలిశారు. ఇటీవల ఎడమకాలి మడమ బెణికి రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి పాదయాత్ర చేస్తున్న షర్మిలను కలిసి ఆమె ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు.

టీడీపీలో 'దాడి' కలకలం!

మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీకి 30 ఏళ్లుగా చిత్తశుద్ధితో సేవలందించిన దాడి వీరభద్రరావు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవహారశైలి కారణంగా గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న దాడి గురువారం తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. టీడీపీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన కుమారుడు దాడి రత్నాకర్ కూడా పార్టీకి రాజీనామా చేయడంతో విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నెలకొనడమే కాకుండా తెలుగుదేశం వర్గాలను తీవ్రమైన షాక్‌కు గురిచేసింది.
శాసనమండలిలో అనేక విషయాల్లో దాడి వీరభద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ వస్తున్న దాడి వీరభద్రరావు విషయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గత కొంతకాలంగా అనుసరించిన వైఖరి రాజీనామాకు దారి తీసినట్టు తెలుస్తోంది. గత కొద్దికాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ.. ఎమ్మెల్సీ పదవీకాలం గురువారమే ముగియగానే వ్యూహాత్మకంగా దాడి షాకిచ్చారు. పార్టీని వీడుతున్నందుకు బాధగానే ఉన్నప్పటికీ పార్టీని వీడివెళ్లే విధంగా పరిస్థితులు కల్పించారని, ఆ కారణంగానే తాను, తనతో పాటు కుటుంబ సభ్యులందరం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

అయితే దాడి వీరభద్రరావులాంటి నాయకుడు పార్టీ వీడాలన్న నిర్ణయానికి వచ్చారంటే బలమైన కారణాలే ఉన్నాయని, పార్టీలో ఆర్థికంగా బలమైన వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తోందని, క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేసే నాయకులందరికీ ఈ రకంగానే అవమానం జరుగుతోందని ఓవర్గం పార్టీ అధినేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలోనూ, సంక్షోభ సమయాల్లోనూ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన దాడి వీరభద్రరావు లాంటి నేత విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరిని పార్టీ నేతలు తప్పుపట్టడం గమనార్హం. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తెలుగు దేశం పార్టీ బీసీలను అణచివేస్తూ అగ్రవర్ణాలకు పట్టకడుతోందనే విమర్శలకు చంద్రబాబు సమాధానమివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నేతలు నిలదీస్తున్నారు. 

ఉత్తరాంధ్రలో బలహీనపడ్డ తెలుగుదేశం పార్టీకి కింజరాపు ఎర్రన్నాయుడు మరణం, వీరభద్రరావు రాజీనామా మరింత కుంగదీసే అవకాశం స్సష్టం కనిపిస్తోంది. క్రమంగా పార్టీ పట్టుకోల్పోతున్న సమయంలో సీనియర్ నేతలు నిష్క్రమించడం పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు!

దాడి వీరభద్రరావు దారి జగన్ పార్టీవైపేనా!

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన శాసనమండలిలో విపక్ష నేత దాడి వీరభద్రరావు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ వైపు కూడా ఆలోచన చేయవచ్చని కొందరు ప్రచారం చేస్తున్నా, ఎక్కువ శాతం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకే వెళ్లవచ్చని అంటున్నారు. ఆయన రెండు,మూడు రోజులలో చంచల్ గూడ జైలులో ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ ను కలిసి పార్టీలో చేరాలన్న తన ఆకాంక్షను వ్యక్తం చేయవచ్చు.అక్కడ ఉన్న సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ,సబ్బం హరిలతో ఒక అవగాహనకు వచ్చాకే ఆయన ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కొద్ది రోజుల క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావును దాడి కలుసుకున్న సందర్భం గుర్తు చేసి ఆయన కాంగ్రెస్ లో చేరవచ్చని కొందరు అంటున్నారు. కాని ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల రీత్యా కొణతాల వైపు నుంచి అభ్యంతరం లేకపోతే దాడి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరవచ్చు. కొణతాల ఈసారి యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీచేయవచ్చని అంటున్నారు. అప్పుడు దాడి వీరభద్రరావు లేదా ఆయన కుమారుడు అనకాపల్లి నుంచి పోటీచేయడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ అవగాహన కుదిరితే పార్టీలో చేరతారు.శుక్రవారం నాడు ఆయన తన కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు.అప్పుడు తుది నిర్ణయం తీసుకుంటారు.

YS Rajashekar Reddy HD Photo Gallery