Tuesday 28 May 2013

కెసిఆర్ పై హద్దుమీరి మాట్లాడిన మోత్కుపల్లి

తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు హద్దులు దాటి మరీ విమర్శలు చేస్తున్నట్లుగా ఉంది.తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు కూడా కొన్నిసార్లు ఇలాంటి విమర్శలు చేస్తుంటారు .కాని మోత్కుపల్లి ఆయన పరుషపదజాలాన్ని మించి మాట్లాడినట్లు కనబడుతుంది.కెసిఆర్ అంటే కింగ్ ఆఫ్ చీటర్స్ అండ్ రాబర్స్ అంటూ కొత్త నిర్వచనం ఇచ్చారు. అక్కడితో ఆగలేదు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ఐదు వేల కోట్లు సంపాదించుకున్నాడని ఆరోపిస్తూ, తాగి,తాగి ఏమి మాట్లాడతావో తెలియని బుద్దిలేని వెదవవు నీవని ఆయన వ్యాఖ్యానించడం అంత పద్దతగా లేదు. తాగి ఫామ్ హౌస్ లో పడుకో అని కూడా ఆయన అన్నారు.కెసిఆర్ పేరులోనే లంగ,దొంగ అని ఉందని మోత్కుపల్లి ఘాటుగా మాట్లాడారు. కెసిఆర్,జగన్ లే లక్షల కోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు.నేతలు హద్దులు దాటి మాట్లాడితే వారికే పరువు తక్కువ అవుతుందన్న సంగతిని మర్చిపోతున్నారు.

ఒక నేత అరెస్టు అయితే ముగ్గురు కొత్త నేతలు!

రాష్ట్ర రాజకీయాలు తమాషాగా మారుతున్నాయి.జగన్ ను జైలులో నిర్బందించి ఏడాది అయిన సందర్భంగా ఆ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం, అందులో వై.ఎస్.కుటుంబీకులు విజయమ్మ, షర్మిల,భారతిలు పాల్గొనడం ఆసక్తికరంగా ఉంది.ఈ సందర్భంగా విజయమ్మ సిబిఐని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పాలి. హైకోర్టు జగన్ ఆస్తులపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వమని అడిగితే ఇరవైఎనిమిది బృందాలను ఆగమేఘాల మీద దింపి రెండు వారాలలో నివేదిక ఇచ్చిన సిబిఐ, ఇప్పుడు రెండేళ్లు అవుతున్నా, దర్యాప్తునకు ఇంకా సమయం కావాలని అంటున్ నదని, ఇదంతా జగన్ ను జైలులో ఎక్కువ కాలం నిర్భందించాలన్న కుట్ర ప్రకారమే ఇది జరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయానికి సిబిఐ సమాధానం చెప్పగలుగుతుందా అన్నది ప్రశ్న.సిబిఐ సుదీర్ఘకాలం తీసుకోవడం ద్వారా జగన్ రాజకీయ ప్రత్యర్ధులకు ఆ సంస్థ ఉపయోగపడుతున్నదన్న విమర్శను ఎదుర్కోవలసి వస్తున్నది.ఇది ఒక కోణం అయితే విజయమ్మ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కార్యక్రమాలకు వెళుతుంటే, షర్మిల సుదీర్ఘ పాదయమాత్ర చేపట్టి ఇప్పటికే రికార్డు సృష్టించారు. ఇక జగన్ కు మద్దతుగా జరిగిన నిరసన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా భారతి కూడా మున్నుందు అవసరమైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్న అభిప్రాయం కలుగుతుంది. మొత్తం మీద ఒక నేతను అరెస్టు చేస్తే, ముగ్గురు నేతలు తయారు అవుతున్నారన్నమాట.

మహాటీవీతో వైఎస్ భారతి

జగన్ భార్య వైఎస్ భారతి మొదటిసారిగా ఓ తెలుగుటీవీకి సుదీర్ఘ ఇంటర్య్వూ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్టు ఐ.వెంకట్రావుతో సంధించిన సూటి ప్రశ్నాలకు ఏమాత్రం తడబడకుండా
సూటిగా సుత్తి లేకుండా సమాధానాలించారు. జగన్ అమ్ములపోదిలో మరో అస్త్రాం ఉందని వైఎస్ అభిమానులకు తెలియజేశారు. జగన్ రాజకీయ కారణాలతోనే జైలులో ఉన్నారని
ఏ తప్పు చేయలేదని ఆమె వ్యాఖ్యానించారు. మంత్రి ఆనం వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతో బాధకల్గించాయని వ్యాఖ్యానించారు జగన్ జైలులో ఉండటం పిల్లలని ఇబ్బందులు పెడుతున్నయని
వ్యాఖ్యనించారు. జగన్ ఇచ్చిన ధైర్యంతోనే విజయమ్మ,షర్మిల నేను ముందుకు పోతున్నామని వైఎస్ మాదిరిగా జగన్ చాలా ఆలోచన పరుడని మంచి వ్యాపారవేత్తని తెలిపారు. జనంకోసం 
ఎంతటికైనా పోరాడుతామని జగన్ జీవితంలో చీకటి ఎంతో కాలం ఉండదని త్వరలోనే వెలుగులు వస్తాయని ఆమె నమ్ముతున్నారు. 

ఎవరి వల్ల ఎవరు ఓడిపోయారో!

రెండువేల నాలుగులో బిజెపి వల్ల నష్టపోయామని వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడుపై బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఎన్నడైనా ఆయన సొంతంగా గెలిచారా అని ప్రశ్నించారు.1999లో తమ పొత్తు వల్ల గెలిచిన టిడిపి, ఇప్పుడు బిజెపి వల్ల ఓడామని చెప్పడం విడ్డూరం అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.2004లో టిడిపి వల్లనే తాము నష్టపోయామని కిషన్ వ్యాఖ్యానించారు.తమతో పొత్తుపెట్టుకున్నప్పుడు మత తత్వం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.ఇక్కడ విశేషం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం తెలంగాణ టిడిపి ఫోరం నేత ఎర్రబెల్లి దయాకరరావు తాము బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు సంకేతం ఇస్తే చంద్రబాబు మాత్రం అలాంటి పొత్తు ఉండదని చెబుతున్నారు.నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏదో ఒక ముఖ్యమైన పార్టీలో పొత్తు పెట్టుకోవలసిన అవసరం ఉందని, అది బిజెపి అయితే బెటర్ అని పార్టీలో కొందరి భావన.కాని అంతకుముందు ఆ పార్టీపై చేసిన విమర్శలతో ఆ విషయంలో ముందుకు వెళ్లడానికి టిడిపి ఇబ్బంది పడుతోంది.ఇంతకీ ఎవరి వల్ల ఎవరు ఓడారంటారు?

163వ రోజు పాదయాత్ర ప్రారంభించిన YSషర్మిల

పాలకొల్లు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటికి 163వ రోజుకు చేరింది. బుధవారం ఉదయం ఆమె పాలకొల్లు బ్రాడీపేట నుంచి యాత్రను ప్రారంభించారు. పాదయాత్ర జిన్నూరు, వేడంగి మీదగా పోడూరు మండలం కవిటం గ్రామానికి చేరుకుంటుంది. ఈరోజు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.

మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్దం అవుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన హస్తినకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పేరుకు అధికారిక సమావేశం కోసం హస్తిన పర్యటన ఉన్నా అందరి అంచనాలు మాత్రం మంత్రివర్గంలో మార్పు చేర్పుల చుట్టే తిరుగుతున్నాయి. ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డిల తొలగింపు తర్వాత ఇంకా వేట్లు ఉంటాయా? కొత్తగా మంత్రివర్గంలో ఎవరైనా చేరుతారా.. లేదంటే అసెంబ్లీ సమావేశాలపేరుతో మరికొంత కాలం సాగతీస్తారా తేలాల్సిఉంది. 

రాహుల్ గాంధీకి కోపమొచ్చింది...

రాయపూర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్ సర్కారుపై, అక్కడి ఉన్నతాధికారులపై తన కోపాన్ని ప్రదర్శించా రు. కాంగ్రెస్ కాన్వాయ్‌పై మావోయిస్టుల దాడి దరిమిలా రాజ్‌భవన్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో రాహుల్ కూడా పాల్గొన్నారు. సమావేశం మొదలైన కొద్దిసేపటికే, ‘దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అంటూ రాహుల్ ఆగ్రహంగా ప్రశ్నించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్, పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జరిగిన సంఘటనపై ప్రధాన కార్యదర్శి తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా, రాహుల్ మళ్లీ అదే ప్రశ్న అడిగారు. అయితే, ఆయన ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించకపోవడంతో ఎవరు స్పందించాలో తోచక అధికారులెవరూ బదులివ్వలేదు.

ముఖ్యమంత్రి కూడా సహనంతో మౌనంగా ఉండిపోయారు. కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత ప్రధాన కార్యదర్శి తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. రాహుల్ మళ్లీ అదే ప్రశ్న అడగడంతో ప్రధాన కార్యదర్శి స్పందించారు. రాష్ట్ర అధికార యంత్రాంగానికి అధినేతగా జరిగిన లోపాలకు బాధ్యత వహించేందుకు సంసిద్ధంగా ఉన్నానని, తన రాజీనామాతో సమస్య పరిష్కారం కాగలదనుకుంటే, అందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దీంతో రాహుల్ మౌనం వహించారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన తనయుడికి బాసటగా నిలుస్తూ, తమ పార్టీ నేతలకు రక్షణ కల్పించడంలో వైఫల్యంపై ఛత్తీస్‌గఢ్ అధికారులను నిలదీశారు. ఈ దశలో రమణ్ సింగ్ జోక్యం చేసుకుని, కాంగ్రెస్ నేతలకు రక్షణ కల్పించామని, వారికి కల్పించే భద్రతా సిబ్బందిని కూడా తగ్గించలేదని చెప్పారు.

ఛత్తీస్‌గఢ్ అధికారుల రుసరుసలు: సమీక్ష సమావేశంలో రాహుల్ తీరుపై ఛత్తీస్‌గఢ్ అధికారులు రుసరుసలాడుతున్నారు. పాలకపక్షానికి ఆయన పెద్ద బాస్ అయితే కావచ్చునని, కేంద్ర ప్రభుత్వంలో గానీ, రాష్ట్రంలో గానీ ఆయనకు ఎలాంటి అధికార హోదా లేదని, అలాంటప్పుడు సమీక్ష సమావేశంలో పాల్గొనే అవసరమే ఆయనకు లేదని ఛత్తీస్‌గఢ్ అధికారి ఒకరు అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారిక పర్యటనలో భాగంగా సోనియా, రాహుల్ రాజ్‌భవన్‌కు అతిథులుగా వచ్చారని అన్నారు. అయితే, సమీక్ష సమావేశంలో ఎవరు పాల్గొనాలనేది గవర్నర్ విచక్షణాధికారంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

మరో ప్రజాప్రస్థానం షర్మిల పాదయాత్ర నేడు సాగేదిలా

ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 163వ రోజు బుధవారం 11 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. పాలకొల్లు బ్రాడీపేట నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర పోడూరు మండలం కవిటం గ్రామానికి చేరుతుందని పేర్కొన్నారు.

పర్యటించే ప్రాంతాలు : పాలకొల్లు బ్రాడీపేట, జిన్నూరు, వేడంగి, కవిటం.

మహానాడుకు దూరంగా హరికృష్ణ, జూ.ఎన్టీఆర్

హైదరాబాద్: మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరయ్యారు. మహానాడు తొలిరోజైన సోమవారం హాజరైన హరికృష్ణ రెండో రోజు ఆ దరిదాపుల్లోకి రాలేదు. మహానాడులో రెండో రోజున పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి నిర్వహిస్తారు. గత కొద్ది సంవత్సరాలుగా హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ క్రమం తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే మంగళవారం మహానాడులో జరిగిన ఎన్టీఆర్ జయంతికి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రాకపోవటం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరై మధ్యాహ్నం వరకూ ఉండి వెళ్లిపోయారు.

కాగా, మంగళవారం ఉదయం ఐదున్నర గంటలకు జూనియర్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డులోని తాత సమాధి వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన్ను మీడియా ప్రతినిధులు ‘మీరు మహానాడుకు హాజరవుతున్నారా?’ అని ప్రశ్నించగా.. తనకు ఆహ్వానం అందలేదు కాబట్టి వెళ్లటం లేదని.. ఒకవేళ ఇపుడు పిలిచినా వెళతానని ఆయన బదులిచ్చారు. అయితే ఆయన్ను పార్టీ వర్గాలు ఆహ్వానించకపోవటంతో మహానాడు ముగిసే వరకూ రాలేదు. ఎన్టీఆర్ కు ఆహ్వానం అందక పోవటంపై మహానాడు ఆహ్వా న కమిటీ చైర్మన్ పి.అశోక్‌గజపతిరాజు వద్ద విలేకరులు ప్రస్తావించగా.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం పంపామని చెప్పారు. ఇదే విషయమై టీడీపీ కార్యాలయవర్గాలు మాత్రం.. వారికి ఆహ్వనం పంపామని కొద్ది సేపు.. పార్టీ నేతలకు మాత్రమే ఆహ్వానాలు పంపుతామని, కుటుంబసభ్యులను ఎపు డూ ఆహ్వానించేది లేదని మరికొద్ది సేపు చెప్పారు.

అంతిమంగా న్యాయమే గెలుస్తుంది: YS విజయమ్మ

హైదరాబాద్ : ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ కు కచ్చితంగా బెయిల్ వస్తుందని ఆమె అన్నారు. సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. 

జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా మంగళవారం ఇందిరా పార్క్ వద్ద విజయమ్మ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీబీఐ ఇంకా ఎన్ని ఛార్జిషీట్లు వేస్తుందని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత తమ కుటుంబం ఎన్నో బాధలు పడిందన్నారు. తమ మానసిక స్థితి చూసి కొందరు ఆనందిస్తున్నారని విజయమ్మ అన్నారు.

విలువలు, విశ్వసనీయత లేని చంద్రబాబుకు తమను విమర్శించే హక్కు ఎక్కడిదని విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. బాబుకు విశ్వసనీయత ఉంటే తెలుగుదేశం పార్టీ అలా ఉండేది కాదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని విజయమ్మ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

జనం కోసం పోరాడినందుకే జగన్ కు జైలు:YS భారతి

హైదరాబాద్ : ప్రజల పక్షాన నిలిచిన వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని జైలులో పెట్టారని ఆయన సతీమణి భారతి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జగన్ నిర్బంధానికి నిరసన తెలుపుతూ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో భారతి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల పక్షాన మాట్లాడేవారు ఉండకూడదన్నదే వారి ఉద్దేశమని, అందుకే జగన్ ను జైలుకు పంపారని చెప్పారు. ఎలాంటి తప్పు చేయకుండా ఏడాదిపాటు జైలులో పెట్టడం అన్యాయం అన్నారు. దేవుడు ఉన్నాడు, న్యాయం తప్పక జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని తెలిపారు. ఈ రోజు మంత్రులుగా ఉన్నవారందరూ రాజశేఖర రెడ్డి వల్లే మంత్రులయ్యారని చెప్పారు. వైఎస్ కుటుంబాన్నే ఇన్ని కష్టాలు పెడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని భారతి ప్రశ్నించారు.

వైఎస్ అభిమానులందరూ అండగా నిలవాలి

శ్రీకాకుళం: ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి వైఎస్ అభిమానులంతా అండగా నిలవాలని ఆ పార్టీ నేతలు పిలుపు ఇచ్చారు. జగన్ నిర్బంధానికి నిరసన తెలుపుతూ శ్రీకాకుళంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలలో ఆ పార్టీ నేతలు ధర్మాన కృష్ణదాస్, సాయిరాజ్, కుంభా రవిబాబు, విశ్వనాథం, పాలవలస రాజశేఖరం, వరుదు కల్యాణి, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కెసిఆర్ ఓడిపోతేనే తెలంగాణ:పాల్వాయి గోవర్ధన రెడ్డి

హైదరాబాద్ : టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఓడిపోతేనే తెలంగాణ వస్తుందని ప్రజలు అనుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన రెడ్డి అన్నారు. తెలంగాణపై టిఆర్ఎస్ కు, టిడిపికి చిత్తశుద్ధిలేదన్నారు. తెలంగాణ ఇవ్వడం లేదనే కాంగ్రెస్ ఎంపీలు పార్టీని వీడుతున్నారని చెప్పారు. చంద్రబాబు వాగ్దానాలు అమలు చేయాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు కావాలని అన్నారు. 

సర్కార్ ఫోన్ టాపింగ్ చేస్తోంది: శంకర్రావు

హైదరాబాద్ : కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టి తన ఫోన్ సంభాషణలను టాపింగ్ చేస్తోందని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత శంకర్రావు ఆరోపించారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఛార్జిషీట్ లో పేర్లు ఉన్న మంత్రులు ప్రభుత్వంలో ఉంటే ఛార్జిషీట్ వేయకుండా జగన్ మోహన్ రెడ్డిని జైల్లోకి పంపారని అన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని శంకర్రావు వ్యాఖ్యానించారు.

ముగిసిన చంద్రబాబు చాప్టర్:తులసిరెడ్డి

హైదరాబాద్ : టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చాప్టర్ ముగిసిందని 20 సూత్రాల పథకం చైర్మన్ తులసి రెడ్డి అన్నారు. చంద్రబాబు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మహానాడులో చంద్రబాబు కాలం చెల్లిన విధానాలు పాటిస్తున్నారని విమర్శించారు. 

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ నిరసన దీక్షలు

హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ మంగళవారం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. అలాగే కాకినాడలో పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబాబు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో గొల్ల బాబురావు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బొడ్డు భాస్కర రామారావు, కుడిపూడి చిట్టబ్బాయ్, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మిధున్ రెడ్డి, నారాయణస్వామి, అమర్ నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ సీపీ దీక్షకు దిగింది. ఈ దీక్షకు జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి,కడప ఇంఛార్జ్ అంజాద్ బాషా తదితరులు హాజరయ్యారు.

మచిలీపట్నంలో వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు దీక్షకు కూర్చున్నారు. ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, పార్టీ నేతలు సామినేని ఉదయభాను, జలీల్ ఖాన్, కుక్కల నాగేశ్వరరావు దీక్షలో పాల్గొన్నారు. కర్నూలులో చేపట్టిన దీక్షలో ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీమంత్రి మారెప్ప, చక్రపాణిరెడ్డి దీక్ష చేపట్టారు.

ఆదిలాబాద్ లో చేపట్టిన నిరసన దీక్షలో బోడ జనార్థన్, జనక్ ప్రసాద్, కోనేరు కోనప్ప, సోయం బాబూరావు పాల్గొన్నారు. అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షతో ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, తోపుదుర్తి కవిత, వై. విశ్వేశ్వరరెడ్డి కూర్చున్నారు. నిజామాబాద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు బాజిరెడ్డి గోవర్థన్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి దీక్ష చేపట్టారు. 

విశాఖలో వైఎస్ఆర్ సీపీ చేపట్టిన దీక్షలో దాడి వీరభద్రరావు, వంశీకృష్ణయాదవ్, గండి బాబ్జీ, చెంగల వెంకట్రావ్, ఎమ్మెల్సీ సర్వేశ్వరరావు పాల్గొన్నారు.మరోవైపు ఏడాది నుంచి వైఎస్ జగన్‌ అక్రమ నిర్బంధానికి నిరసనగా కూకట్‌పల్లి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ నేత వడ్డేపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో రెండు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.

దీక్ష ప్రారంభించిన వైఎస్ విజయమ్మ

హైదరాబాద్ : వైఎస్‌ జగన్‌ అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర చేపట్టిన దీక్షలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పాల్గొన్నారు. మహానేత వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి విజయమ్మ నిరసన దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. జగన్ సతీమణి వైఎస్‌ భారతి కూడా దీక్షలో పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానాలు దీక్షకు తరలి వచ్చారు. 

2014లో YSజగన్ ను సీఎం చేద్దాం:కొండా దంపతులు

వరంగల్: వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని 2014
ఎన్నికలలో ముఖ్యమంత్రిని చేద్దామని కొండా మురళీ, సురేఖ దంపతులు కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. వైఎస్ఆర్ చేసిన మేలు కొందరు మరచిపోవచ్చు గానీ, ఆయన సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందినవారు మాత్రం ఆయనను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. 

మహానాడుకు ఆహ్వానం అందలేదు:జూ.ఎన్టీఆర్

హైదరాబాద్ : మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 90వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌ దగ్గర ఆయన మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ నివాళులు అర్పించారు. ఆయన మంగళశారం ఉదయం సతీసమేతంగా ఘాట్‌కు చేరుకుని తాతకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ మళ్లీ జన్మలోనూ ఎన్టీఆర్‌ కుటుంబంలోనే పుట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. 

మహానాడుకు ఆహ్వానం అందలేదని...... అందితే... హాజరవుతానని ఎన్టీఆర్‌ తెలిపారు. 2014 టిడిపి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. టిడిపి కోరితే ప్రచారం చేయటానికి సిద్ధంగా వున్నానని జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. తెలుగుజాతి బతికున్నంత కాలం మర్చిపోలేని నేత ఎన్టీఆర్ అని, భౌతికంగా లేకున్నా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరారు.