Sunday 26 May 2013

రాజకీయ వేధింపుల్లో భాగంగానే జగన్ అరెస్ట్

హైదరాబాద్: రాజకీయ వేధింపుల్లో భాగంగానే కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభానాగిరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె ప్రసంగించారు. విచారణ పేరిట వైఎస్ జగన్ ను జైల్లో ఉంచి సోమవారాని ఏడాది పూర్తి అవుతుందని తెలిపారు. సీబీఐ తీరుకు నిరసనగా సోమ, మంగళవారాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సోమవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 

మంగళవారం ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలకు హాజరయ్యే కార్యకర్తల కోసం వేసవితాపం తట్టుకునేలా ఏర్పాటు చేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ సందర్భంగా శోభానాగిరెడ్డి సూచించారు. 

అవిశ్వాస సమయంలో చంద్రబాబు సర్కారుకు అండగా నిలిచారని ఆమె ఆరోపించారు. అదే ప్రభుత్వంపై బాబు ఇప్పుడు అవిశ్వాసం పెడతానంటున్నారని, మరో వైపు సర్కార్ బలంగా ఉందంటున్నారని బాబు వ్యాఖ్యలను ఆమె ఈ సందర్భంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడ్డాకే బాబు అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారని అన్నారు. 

ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న నేపథ్యంలో తమను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలపక్షాన పోరాడేందుకు వైఎస్ఆర్ క్రాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా శోభానాగిరెడ్డి తెలిపారు. 

0 comments:

Post a Comment