
వాస్తవానికి గత ఏడాదే బొగ్గు కుంభకోణం సెగ దాసరిని తాకింది. 2006 నుంచి 2009 మధ్య కాలంలో జరిగిన బొగ్గు కేటాయింపులను దృష్టిలోపెట్టుకొని సిబిఐ అధికారులు విచారణలు, సోదాలు, తనిఖీలు చేస్తున్నారు. ఈ కాలంలోనే ఆయన కేంద్ర బొగ్గు గనుల సహాయ మంత్రిగా పనిచేశారు. ఈ కాలంలోనే బొగ్గు గనుల కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయని కాగ్ సమర్పించిన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు సిబిఐ దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, పాట్నా, హైదరాబాద్, ధన్‌బాద్, నాగపూర్‌లతో పాటు 10 నగరాలలో 30 ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు చేసింది. ఆ సమయంలోనే హైదరాబాద్ లో దాసరిని విచారించినట్లు, ఆయన ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలిసింది. అయితే అప్పట్లో తనను సిబిఐ విచారించలేదని, తన ఇంట్లో తనిఖీలు జరగలేదని ఆయన ఖండించారు.
ఎఫ్ఐఆర్ లో దాసరి, మాజీ మంత్రి నవీన్ జిందాల్ పేర్లను చేర్చిన సిబిఐ బృందాలుగా విడిపోయి ఈ రోజు(11.06.2013) ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌లోని 19 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా దాసరి నివాసంలో కూడా సోదాలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నవీన్ జిందాల్ గ్రూపు కంపెనీలకు భారీగా కోల్ బ్లాక్‌లు కేటాయించినందుకు ప్రతిఫలంగా దాసరి నారాయణరావు కంపెనీ సిరి మీడియాలో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ ఆరోపణ. దాసరికి చెందిన కంపెనీ షేర్లను మార్కెట్ రేటు కంటే నాలుగు రెట్లు అధికంగా జిందాల్ గ్రూపుతో అనుబంధం ఉన్న కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాలు, టీవీ సీరియళ్లు తీసే సౌభాగ్య మీడియా మన రాష్ట్రానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ. ఇది బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ లో లిస్ట్ అయింది. దీంట్లో సిరి మీడియా అనే కంపెనీకి 59.6 శాతం వాటా ఉంది. తెలుగు సినిమా దిగ్గజం, కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి దాసరికి చెందినదే ఈ సిరి మీడియా. అంటే సౌభాగ్య మీడియాలో మెజార్టీ వాటా దాసరిదే. ఈ సౌభాగ్యలో జిందాల్‌తో అనుబంధం ఉన్న న్యూఢిల్లీ ఎగ్జిమ్ అనే కంపెనీ 2 కోట్ల 25 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టింది. 2008 డిసెంబరు 8న ఈ పెట్టుబడి పెట్టారు. ఆ సమయంలో సౌభాగ్య షేరు ధర 27 రూపాయలు. మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు ఎక్కువగా ఒక్కో షేరు 112 రూపాయల 50 పైసలకు న్యూఢిల్లీ ఎగ్జిమ్ ప్రిఫరెన్షియల్ పద్ధతిలో వాటా తీసుకుంది. ఇప్పుడు సీబీఐ ఈ వ్యవహారాన్ని శోధిస్తోంది. అందుకే సౌభాగ్య మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరిపింది. దాసరి నారాయణరావును ఏ క్షణంలో అయినా సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
0 comments:
Post a Comment