Monday 29 April 2013

సీబీఐ చెప్పిందా.. అధిష్టానం చెప్పిందా?


జగన్ కేసులో కోట్ల వ్యాఖ్యలపై ఎంపీ సబ్బం హరి మండిపాటు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని జైలు నుంచి వదలబోమని సీబీఐ చెప్పిందా... లేక వదలొద్దని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందా అని ఎంపీ సబ్బంహరి ప్రశ్నించారు. ఆయన సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్తూ విశాఖ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌పై కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా మండిపడ్డారు. స్వతంత్య్ర ప్రతిపత్తిగల సంస్థగా వ్యవహరించాల్సిన సీబీఐ కాంగ్రెస్ చెప్పుచేతల్లో ఉందని చెప్పడానికి కోట్ల వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయన్నారు. జగన్ విషయంలో ప్రజలు ఏదైతే అనుమానిస్తున్నారో సూర్యప్రకాష్‌రెడ్డి మాటల ద్వారా అదే వ్యక్తమయిందన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రపై ఆయన స్పందిస్తూ.. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు నాడు వైఎస్సార్ సూర్యోదయం నుంచి మండుటెండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను పొద్దుపోయేవరకూ సాగించి ప్రజల విశ్వాసాన్ని పొందారని గుర్తుచేశారు. నేడు చంద్రబాబు పాదయాత్ర ఎలా చేశారో జనం చూశారన్నారు. 2014 ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోడానికే బాబు శుష్క వాగ్దానాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమ ఫలాలను అందుకోడానికి జగన్‌ను సీఎం చేయాలనే లక్ష్యంతో జనం ఉన్నారన్నారు.

0 comments:

Post a Comment