Thursday 30 May 2013

రాజ్యసభకు ఐదోసారి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్నిక

గువాహటి: ప్రధాని మన్మోహన్ సింగ్ వరుసగా ఐదోసారి అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొత్తం 126 స్థానాలు ఉన్న అస్సాం అసెంబ్లీలో ఆయనకు 49 తొలి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. అస్సాం నుంచి పోటీ చేసిన మరో కాంగ్రెస్ అభ్యర్థి శాంటియస్ కుజుర్‌కు 45 ఓట్లు లభించాయి. ఆలిండియా యునెటైడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) తరఫున పోటీచేసిన అమీనుల్ ఇస్లాంకు 18 ఓట్లు మాత్రమే దక్కడంతో ఓడిపోయారు. ఫలితాల వివరాలను అస్సాం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి జి.పి.దాస్ వెల్లడించారు. తొలి ప్రాధాన్యత ఓట్లు గల స్థానానికి ప్రధాని మన్మోహన్ మాత్రమే పోటీ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఇతర పార్టీలేవీ తమ అభ్యర్థులను పోటీలో నిలపలేదు. కాగా, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న అస్సాం గణ పరిషత్, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఓటింగుకు దూరంగా ఉండిపోయాయి. 

ఈ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరిగింది. కాంగ్రెస్‌కు చెందిన 78 మంది ఎమ్మెల్యేలు, భాగస్వామ్య పార్టీ అయిన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు వేసిన ఓట్లు చెల్లినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఐదోసారి తనను రాజ్యసభకు ఎన్నుకున్న సందర్భంగా ప్రధాని మన్మోహన్ అస్సాం ప్రజలకు, ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సహా పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. అస్సాం అభివృద్ధి కోసం తన కృషిని కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

0 comments:

Post a Comment