Thursday 30 May 2013

నాకు వేరే మార్గం లేదు: జానారెడ్డి

హైదరాబాద్: ఎంపీలు మందా జగన్నాథం, వివేక్‌తో పాటు సీనియర్ నేత కె.కేశవరావు కాంగ్రెస్‌ను వీడి వెళ్లటం కచ్చితంగా పార్టీపై ప్రభావం చూపుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి పేర్కొన్నారు. ఎంత ప్రభావం ఉంటుందనేది ఎన్నికల సమయంలో తెలుస్తుందని, దాన్ని ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. జానారెడ్డి గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ వీడి వెళ్తున్న ఎంపీలతో పాటు మిగతా వారిని కూడా పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. తనకు వేరే మార్గం లేదని, కాంగ్రెస్‌లోనే ఉంటానని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరుతానని పేర్కొన్నారు. సహచర నాయకులు పార్టీ వీడి వెళ్లినప్పటికీ.. తమ మధ్య దూరం పెరగదన్నారు. ఉదయం కేకే తనతో సమావేశమైన సందర్భంగా తాను ఏం చెప్పాననేది వెల్లడించనని.. అది ఆయననే అడగాలని చెప్పారు. తాను హోంమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరగటం తనకే సిగ్గుచేటుగా ఉందని జానారెడ్డి పేర్కొన్నారు. సీఎం పదవే కావాలని అడగలేదని, ఎన్నడూ ఫలానా శాఖ మంత్రి పదవి ఇమ్మని అడగలేదని చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసి పంచాయతీ ఎన్నికలపై చర్చించానని, శాఖల గురించి కాదన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండు లేదా మూడు రోజుల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తామని, వారంలోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపిస్తామని జానారెడ్డి తెలిపారు. జూలై తొలి వారంలో పంచాయతీ ఎన్నికలుంటాయన్నారు. 

0 comments:

Post a Comment