Sunday 28 April 2013

గులాబీ గూటికి కడియం శ్రీహరి!

సైకిలు దిగి కారెక్కుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఏళ్ల తరబడి పచ్చ జెండా మోసిన నేతలు గులాజీ కండువా కపుకునేందుకు సిద్ధపడుతున్నారు. తమ ప్రాంతంపై రెండుకళ్ల సిద్ధాంతాన్ని అవలంభిస్తున్న పచ్చ పార్టీ అధినేత తీరుతో విసిగిపోయిన నేతలు గలాబీ దళంలో చేరేందుకు వరుస కడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా సంక్లిష్ట సమస్యపై స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన టీడీపీ అధ్యక్షుడి దాటవేత ధోరణి తమ భవిష్యత్ రాజకీయ జీవితానికి ముప్పుగా మారే అవకాశముందన్న ఆందోళనతో తెలంగాణ నేతలు తమదారి తాము చూసుకుంటున్నారు.
టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోని నేతల వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు పాదయాత్రతో పార్టీకి ఊపు వచ్చిందని తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్న సమయంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇటీవలే గులాబీ చేరిన సంగతి తెలిసిందే. మరో మాజీ మంత్రి పి. చంద్రశేఖర్ కూడా టీఆర్ఎస్ బాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే గులాబీ గూటికి చేరగా... వేణుగోపాలచారి, జోగురామన్న, నాగం జనార్దనరెడ్డి, హరీశ్వర్ రెడ్డి టీడీపీ నుంచి బయటకు వచ్చారు.

కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం ఖరారైంది. టీఆర్ఎస్ లో 'సీటు' ఖాయమడంతో టీడీపీని వదిలివెళ్లాలని ఆయన నిశ్చయించుకున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తనయుడు, ఎమ్మెల్యే కె.తారక రామారావు శుక్రవారం(ఏప్రిల్ 26) శ్రీహరి నివాసానికి వెళ్లి సుమారు రెండున్నర గంటల పాటు 'ఒప్పందం'పై మంతనాలు సాగించారు. కేసీఆర్ కూడా ఫోన్‌లో మాట్లాడారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్ టికెట్ ఇస్తామని కడియంకు కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో కారు ఎక్కాలని కడియం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. మే నెల మొదటివారంలో ఆయన కేసీఆర్ పార్టీలోకి వెళ్లనున్నారు.

ముందుగా వచ్చిన వారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తామని గులాబీ దళం అధినేత ఆఫర్ చేయడంతో వలస నేతలు తొందర పడుతున్నారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కూడా త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లో చేరితే ఆయనను కరీంనగర్ జిల్లా మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాథం, పెద్దపల్లి ఎంపీ వివేక్ కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్టున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టకుంటే వీరు కారెక్కే అవకాశ ముందంటున్నారు. చంద్రబాబు పాదయాత్ర టీడీపీ నేతలను, అధిష్టానం బుజ్జగింపులు కాంగ్రెస్ నేతలను గడప దాటకుండా ఆపలేకపోతున్నాయి. ఇంకెంత మంది నేతలు గులాబీ గూటికి చేరతారో వేచిచూడాలి!

0 comments:

Post a Comment