Friday 31 May 2013

బాబు మానసికస్థితిపై జూపూడి ప్రభాకర రావు అనుమానాలు

హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మానసిక పరిస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు గానీ, మిత్రుల గానీ ఆయనను విదేశాలకు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించడం మంచిదని సలహా ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖైదీలను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జైళ్లలో అభ్యంతరకర సౌకర్యాలు అందజేస్తున్నారని చంద్రబాబు చేసిన నిరాధారమైన ఆరోపణలపై జైళ్ల శాఖ డిజి కృష్ణంరాజు స్పందించారని తెలిపారు. టీడీపీ నేతలకు చెంపపెట్టులా కృష్ణరాజు వివరణ ఇచ్చారని చెప్పారు. ఆయన వివరణకు టీడీపీ నేతలు ఇంతవరకూ ఎందుకు స్పందిచలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ములాఖత్ లపై గతంలో వైఎస్ భారతి విసిరిన ఛాలెంజ్ కు ఇప్పటి వరకూ స్పందన లేదన్నారు. చంద్రబాబు తన అలవాట్లను ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చిల్లర మాటలు మాట్లాడటం మానుకోవాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు ఆరోపణలపై రాష్ట్రప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ పై టిడిపి నేతలు అనుచిత ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. జగన్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కూడా జూపూడి హెచ్చరించారు. 

0 comments:

Post a Comment