Thursday 2 May 2013

టీడీపీలో 'దాడి' కలకలం!

మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీకి 30 ఏళ్లుగా చిత్తశుద్ధితో సేవలందించిన దాడి వీరభద్రరావు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవహారశైలి కారణంగా గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న దాడి గురువారం తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. టీడీపీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన కుమారుడు దాడి రత్నాకర్ కూడా పార్టీకి రాజీనామా చేయడంతో విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నెలకొనడమే కాకుండా తెలుగుదేశం వర్గాలను తీవ్రమైన షాక్‌కు గురిచేసింది.
శాసనమండలిలో అనేక విషయాల్లో దాడి వీరభద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ వస్తున్న దాడి వీరభద్రరావు విషయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గత కొంతకాలంగా అనుసరించిన వైఖరి రాజీనామాకు దారి తీసినట్టు తెలుస్తోంది. గత కొద్దికాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ.. ఎమ్మెల్సీ పదవీకాలం గురువారమే ముగియగానే వ్యూహాత్మకంగా దాడి షాకిచ్చారు. పార్టీని వీడుతున్నందుకు బాధగానే ఉన్నప్పటికీ పార్టీని వీడివెళ్లే విధంగా పరిస్థితులు కల్పించారని, ఆ కారణంగానే తాను, తనతో పాటు కుటుంబ సభ్యులందరం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

అయితే దాడి వీరభద్రరావులాంటి నాయకుడు పార్టీ వీడాలన్న నిర్ణయానికి వచ్చారంటే బలమైన కారణాలే ఉన్నాయని, పార్టీలో ఆర్థికంగా బలమైన వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తోందని, క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేసే నాయకులందరికీ ఈ రకంగానే అవమానం జరుగుతోందని ఓవర్గం పార్టీ అధినేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలోనూ, సంక్షోభ సమయాల్లోనూ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన దాడి వీరభద్రరావు లాంటి నేత విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరిని పార్టీ నేతలు తప్పుపట్టడం గమనార్హం. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తెలుగు దేశం పార్టీ బీసీలను అణచివేస్తూ అగ్రవర్ణాలకు పట్టకడుతోందనే విమర్శలకు చంద్రబాబు సమాధానమివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నేతలు నిలదీస్తున్నారు. 

ఉత్తరాంధ్రలో బలహీనపడ్డ తెలుగుదేశం పార్టీకి కింజరాపు ఎర్రన్నాయుడు మరణం, వీరభద్రరావు రాజీనామా మరింత కుంగదీసే అవకాశం స్సష్టం కనిపిస్తోంది. క్రమంగా పార్టీ పట్టుకోల్పోతున్న సమయంలో సీనియర్ నేతలు నిష్క్రమించడం పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు!

0 comments:

Post a Comment