Tuesday 7 May 2013

జగన్ సిఎం-ప్రజలకు మేలు:కొణతాల రామకృష్ణ ఆశయం


హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలన్నదే తన ఆశయం, ఉద్దేశం అని ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఆయన నిర్ణయానికి కట్టుబడి లేనప్పుడు నమస్కారం పెట్టి వెళ్లిపోవాలన్నారు. వైఎస్ తో, ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధంతోనే తాను ఇక్కడకి వచ్చానని, ఈ పార్టీ తన పుట్టినిల్లు అని తెలిపారు. 
ఏ రాజకీయపార్టీ అయినా కార్యకర్తల మనో వేదనను పరిగణలోకి తీసుకోకుంటే, ఆ పార్టీ ఉంటుందా? నాయకుడు ఉంటాడా? అని కొణతాల ప్రశ్నించారు. కార్యకర్తలను కాదని ఎక్కడో కూర్చుని నిర్ణయాలు తీసుకునే సంస్కృతిలో తాను పెరగలేదని చెప్పారు. తాను పోరాటాల నుంచి వచ్చిన వాడినే కాని, వెనుక డోర్ నుంచి వచ్చినవాడిని కాదన్నారు.దాడి వీరభద్రరావు వ్యవహారం పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయ పార్టీల్లో ఏ సమస్య ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలన్నారు. పార్టీలో ఇలాంటి వన్నీ సహజమేనని పేర్కొన్నారు. ఏ రోజూ ప్రలోభాలకు లోనైన వ్యక్తిని కానని చెప్పారు. భరించలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం అన్నారు. కోవర్టు ఆపరేషన్లు చేయడానికే కొంతమంది పార్టీలోకి వస్తారన్నారు. కోవర్టులను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. తన పార్టీలో తాను ఎవరి సలహాలూ (దాడి) వినాల్సిన అవసరం లేదన్నారు. తాను జగన్ తో ములాఖత్ అవుతానని కూడా వారు ప్రచారం చేస్తున్నారని, అలా వ్యాఖ్యలు చేసేవారి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలన్నారు.

0 comments:

Post a Comment