Friday 10 May 2013

YS జగన్ బెయిల్ తీర్పులో కొన్ని సందేహాలు

జగన్ కేసులో సుప్రింకోర్టు నిర్దేశించిన నాలుగు నెలల గడువు కు కట్టుబడి ఉండాలని అనుకోవడం లేదా?సిబిఐ న్యాయ వాది అశోక్ భాన్ చేసిన వ్యాఖ్యలు సహజంగానే ఈ అనుమానాలకు తావిస్తాయి. నాలుగు నెలల్లో పూర్తి కావాలని అనేముంది. ఆరు నెలలు పట్టవచ్చు. అవసరమైతే మరో పిటిషన్ వేస్తామని భాన్ చెప్పిన తీరు విమర్శలకు గురి అవుతోంది. దీనిపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. సిబిఐ న్యాయవాదిగా కాకుండా కాంగ్రెస్ అదికార ప్రతినిధిలా అశోక్ భాన్ మాట్లాడారని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.తమ అదికారులు విదేశాలలో ఉన్నారని, సమాచారం వారికి అందుబాటులోకి రాకపోతే,మరింత గడువు కోరతామని ఆయన అన్నారు. 

                                          నిజానికి గతంలోనే సుప్రింకోర్టు జగన్ కేసులో సాధ్యమైనంత త్వరంగా పూర్తి చేయాలని కోరింది.మార్చి ముప్పై ఒకటి తేదీ గడువు పెట్టాలని కోర్టు భావిస్తే, జగన్ తరపు న్యాయవాదులు అది సుదీర్ఘకాలం అవుతుందని భావించి, దానికి అభ్యంతరం చెప్పారు.దాంతో ఆ గడువు ప్రస్తావన తీర్పులో లేదు.సాధ్యమైనంత త్వరగా అని మాత్రం పేర్కొన్నారు.విశేషం ఏమిటంటే అప్పటి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును ఇప్పటి న్యాయమూర్తులు పట్టించుకున్నట్లు కనబడదు. సిబిఐ కోరిన విదంగా మరో నాలుగు నెలల గడువు ఇవ్వడం ఆశ్చర్యంగానే ఉంటుంది. నిజంగానే సిబిఐ చేసిన వాదన ప్రకారం సుప్రింకోర్టుకు కూడా ఈ కేసులో ఆధారాలు కనిపించాయా?లేక సిబిఐకి ఇలాంటి విషయాలలో స్వేచ్చ ఇవ్వాలని భావించారా అన్న విషయం తెలియదు. అదే సమయంలో ఈ కేసులో అదికారంలో ఉన్న మంత్రులు కొందరికి ఇప్పటికే బెయిల్ ఇవ్వడమో, అరెస్టు చేయకుండా ఉండడమో జరిగింది.దాని గురించి సుప్రింకోర్టు ఎందుకు ప్రశ్నించదో అర్ధం కాదు. దీంతో సుప్రింకోర్టు తీర్పును విమర్శించే అవకాశాలు వచ్చాయి. అలాగే అశోక్ భాన్ హడావుడిగా ఒక ప్రత్యర్ధి న్యాయవాది గా మాట్లాడారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రచారం చేయడానికి అవకాశం కల్పించారు.ఒక కేసులో దర్యాప్తు సంస్థలు ఎంత కాలమైనా దర్యాప్తు చేసుకుంటూ పోవచ్చా?కొందరు నిందితులను వదలి, కొందరినే నిర్భందించడం వంటి వాటి ద్వారా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగడం లేదేమో అన్న భావన కలగడానికి ఆస్కారం కలిగించడం లేదా?ఇలాంటి ప్రశ్నలకు ఈ కేసులో సమాధానం రావడం లేదు.దాంతో ఇది రాజకీయ ప్రేరిత కేసుగానే జనం భావించే పరిస్థితి రావడం మాత్రం దురదృష్టకరం.

1 comment: