Sunday, 26 May 2013

ఆంధ్రప్రదేశ్ కొత్త హోంమంత్రి ?

దాల్మియాకేసులో సబితా ఇంద్రారెడ్డి రాజీనామా ఆమోదించడంతో కొత్త హోం మంత్రి ఎవరన్నదానిపై ఊహాగానాలకు తెరలేసింది. ఈ పదవి కోసం పలువురు కాంగ్రెస్ సీనియర్ మంత్రులు ఢిల్లీ స్థాయిలో పైరవీలు ఇప్పటికే మొదలు పెట్టారు. ఢిల్లీ పైరవీలు చేస్తున్నవారిలో జానారెడ్డి, దామోదర రాజనరసింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శశిధర్ రెడ్డిలుండగా సిఎం మాత్రం మరోముగ్గురు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సిఎం మొగ్గుచూపుతున్న వారిలో డికె అరుణ, శ్రీధర్‌బాబు, సునీతాలక్ష్మారెడ్డిలున్నారు. అయితే ఎక్కువగా దామోదర లేక డికె అరుణ లేదా శ్రీధర్‌బాబులకే ఎక్కువగా అవకాశాలున్నాయని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. 

చంద్రబాబు అవిశ్వాసంపై అనుమానాలు

చంద్రబాబు పెడతానంటున్న అవిశ్వాసంపై వైఎస్సార్‌సిపి నేత శోభానాగిరెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. మొన్నటి అవిశ్వాసంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు లోపాయికారి ఒప్పందం ప్రకారం అవిశ్వాసం పెడతానని బీరాలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. మొన్నటి అవిశ్వాసంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేసిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయించి ఇప్పుడు అవిశ్వాసం పెడతానని చెప్తున్నారన్నారు. ఒకవైపు అవిశ్వాసం పెడతానంటూనే మరోవైపు సర్కారుకు మెజార్టీ ఉందని వ్యాఖ్యానించడాన్ని శోభానాగిరెడ్డి తప్పుపట్టారు. రాజకీయ కుట్రలో భాగంగానే జగన్‌ను ఏడాదిపాటు జైలులో పెట్టారని ఆమె విమర్శించారు.

ప్రధానికి సంబంధంలేదు-YS జగన్ కు సంబంధం ఏమిటి?

హైదరాబాద్: కేంద్రంలో జరుగుతున్న కుంభకోణాలతో ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 26 జిఓలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి సంబంధం ఏమిటని ఆ పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు ప్రశ్నించారు. జగన్ తో ఒక్కసారి కూడా మాట్లాడకుండానే సిబిఐ అధికారులు మూడు ఛార్జీషీట్లు ఎలా వేశారు? ఏ1 నిందితుడిగా ఎలా చేర్చారు? అని ఆయన అడిగారు. 

జగన్ బెయిల్ కోరిన ప్రతిసారి భారీ కుంభకోణంగా చిత్రీకరిస్తూ సిబిఐ అడ్డుపడుతోందని విమర్శించారు. 90 రోజుల్లో దర్యాప్తు పూర్తికాకున్నా బెయిల్ ఇవ్వాలన్న నిబంధన చట్టంలో ఉందని తెలిపారు. సంవత్సరమైనా బెయిల్ ఇవ్వకుంటే ఆ నిబంధన ఎందుకు ఉన్నట్లు? అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీని వ్యతిరేకించిన మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ్ లలను జైల్లో పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ను వ్యతిరేకించినందుకు జగన్ ను వేధిస్తున్నారని చెప్పారు.

ధర్మాన ప్రసాద రావు, సబితల రాజీనామా ఆమోదం

హైదరాబాద్: మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబిత ఇంద్రారెడ్డి రాజీనామాలను ఆమోదించారు. ఇద్దరు మంత్రుల రాజీనామాలను గవర్నర్ నరసింహన్ ఈరోజు ఆమోదించారు. చడీచప్పుడులేకుండా ఈ ప్రక్రియ జరిగిపోయింది. 

మంత్రుల రాజీనామాలకు సంబంధించి గత కొద్దికాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దీంతో రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు.

ఇది ఒక చీకటి రోజు: ప్రధాని మన్మోహన్ సింగ్

రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లో నిన్న జరిగిన మావోయిస్టుల దాడిలో గాయపడి రాయపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పరామర్శించారు. బస్తర్ జిల్లాలోని దర్భాఘాట్ వద్ద కాంగ్రెస్ నేతల కాన్వాయ్ పై మావోయిస్టులు మెరుపు దాడిచేసి పలువురిని హతమార్చిన విషయం తెలిందే. ఈ ఘటనలో గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

వారిని పరామర్శించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజు అన్నారు. హింసకు వ్యతిరేకంగా యావత్ జాతి ఉద్యమించాలని పిలుపు ఇచ్చారు.

రాజకీయ వేధింపుల్లో భాగంగానే జగన్ అరెస్ట్

హైదరాబాద్: రాజకీయ వేధింపుల్లో భాగంగానే కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభానాగిరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె ప్రసంగించారు. విచారణ పేరిట వైఎస్ జగన్ ను జైల్లో ఉంచి సోమవారాని ఏడాది పూర్తి అవుతుందని తెలిపారు. సీబీఐ తీరుకు నిరసనగా సోమ, మంగళవారాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సోమవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 

మంగళవారం ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలకు హాజరయ్యే కార్యకర్తల కోసం వేసవితాపం తట్టుకునేలా ఏర్పాటు చేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ సందర్భంగా శోభానాగిరెడ్డి సూచించారు. 

అవిశ్వాస సమయంలో చంద్రబాబు సర్కారుకు అండగా నిలిచారని ఆమె ఆరోపించారు. అదే ప్రభుత్వంపై బాబు ఇప్పుడు అవిశ్వాసం పెడతానంటున్నారని, మరో వైపు సర్కార్ బలంగా ఉందంటున్నారని బాబు వ్యాఖ్యలను ఆమె ఈ సందర్భంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడ్డాకే బాబు అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారని అన్నారు. 

ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న నేపథ్యంలో తమను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలపక్షాన పోరాడేందుకు వైఎస్ఆర్ క్రాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా శోభానాగిరెడ్డి తెలిపారు. 

ఎంపి గుత్తా సంచలన వ్యాఖ్యలు

నల్గొండ: ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే ఏపీలో కూడా ఛత్తీస్ గఢ్ లాంటి ఘటనలు జరుగుతాయని హెచ్చరించారు. ఛత్తీస్ గఢ్ లో నిన్న మావోయిస్టుల దాడిలో 30 మంది కాంగ్రెస్ నేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్ గఢ్ సంఘటన ప్రజాస్వామ్యంపై దాడి అని ఆయన అన్నారు.