Saturday, 4 May 2013

ఆయన గేట్లు తెరిస్తే ఉన్నవారందరూ వెళ్లిపోతారు

బాబు పాదయాత్ర చేస్తే ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడారు
ఆయన గేట్లు తెరిస్తే ఉన్నవారందరూ వెళ్లిపోతారు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాయకత్వంపై విశ్వాసం సడలిపోయినందునే నాయకులు ఆ పార్టీని వీడిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించారు. మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నుంచి శాసనమండలిలో మాజీ ప్రతిపక్ష నాయకుడు దాడి వీరభద్రరావు వరకు సీనియర్ నేతలు టీడీపీకి గుడ్‌బై చెప్పడాన్ని పరిశీలిస్తే బాబును ఎవరూ నమ్మడం లేదనేది స్పష్టమవుతోందన్నారు. 

జూపూడి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత చంద్రబాబు ఇక ఈ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రి అయినట్లు, అధికారం తనదే అయినట్లు కలలు కన్నారని... జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి తిరుగులేని ప్రజాదరణను పొందడంవల్ల తన ఆశలు అడియాసలు అవుతుండడంతో అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు వాస్తవాలను పట్టించుకోకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌ను, జగన్‌మోహన్‌రెడ్డిని ఆడిపోసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజల్లో అడుగంటిన పార్టీ ప్రతిష్టను పెంచడానికి బాబు పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటికి ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లారని, ఆయన పెంచుకున్న ప్రతిష్టకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. తమ పార్టీ గేట్లు తెరిస్తే ఎంతోమంది వచ్చి చేరడానికి సిద్ధంగా ఉన్నారని బాబు చెప్పడం హాస్యాస్పదమనీ, వాస్తవానికి ఆయన గేట్లు తెరిస్తే ఉన్నవారందరూ పొలోమని వెళ్లిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. 

కొత్తగూడెంలో వైఎస్ విగ్రహావిష్కరణ


ఖమ్మం: కొత్తగూడెంలోని హౌసింగ్‌బోర్డ్ కాలనీ వద్ద దివంగత మహానేత డాక్టర్ వైఎస్‌ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉదయం 
మంగపేట నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. హౌసింగ్‌బోర్డ్ కాలనీ వద్ద రాగానే షర్మిలకు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

బాపట్లలో నేడు పార్టీ ‘మహిళా నగారా’


గుంటూరు, 5 మే 2013: గుంటూరు జిల్లా బాపట్లలో ఆదివారం సాయంత్రం వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు జ‌రుగుతుంది. మహిళల ఆత్మగౌరవ పరిరక్షణే ధ్యేయంగా, వారి ఆర్థిక భద్రతతే లక్ష్యంగా 'మహిళా నగారా' పేరున నిర్వహిస్తున్న ఈ సదస్సుకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. మహిళా సమస్యలపై కూలంకషంగా చర్చించేందుకు పార్టీ నిర్వహిస్తున్న తొలి రాష్ట్ర స్థాయి సదస్సు కావడంతో అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివస్తారని అంచనా. సదస్సు నిర్వహణకు నిర్వాహకులు భారీ యెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. బాపట్లలోని ఆర్ట్సు అండ్ సై‌న్సు కళాశాల ప్రాంగణంలోని సదస్సు ప్రాంగణానికి ఇటీవల తెనాలిలో మరణించిన బేతాళకాంత సునీల పేరిట సునీల ప్రాంగణంగా నామకరణం చేశారు. సదస్సుకు హాజరయ్యే మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ సదస్సుకు హాజరయ్యే విఐపిలకు ప్రత్యేకంగా ఓ గ్యాలరీని ఏర్పాటు చేశారు. సదస్సుకు ముందు పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ వంగపండు ఉష నేతృత్వంలో కళాబృందాల ప్రదర్శన ఉంటుంది.‌ శ్రీమతి వైయస్ విజయమ్మ ఆదివారం ఉదయం హైదరాబా‌ద్ నుంచి విమానంలో బయలుదేరి గన్నవరం‌లో దిగుతారు. అక్కడి ఆమె నుంచి రోడ్డు మార్గంలో బాపట్ల చేరుకుంటారు. ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకూ ఇంజినీరింగ్ కళాశాలలోని అతిథిగృహంలో ఆమె మహిళా ప్రతినిధులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తారు. ఆ‌ తర్వాత సాయంత్రం 5 గంటలకు ఆర్ట్సు అండ్ సై‌న్సు కళాశాలలో జరిగే సదస్సులో పాల్గొంటారని పార్టీ కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురా‌మ్, పార్టీ‌ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్ తెలిపారు.

వి.హనుమంతరావు లేఖలకు సి.ఎమ్. రిప్లై ఇవ్వరా!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు లేఖకు సమాధానం ఇవ్వడం లేదు. స్వయంగా వి.హెచ్ ఈ విషయం చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు కొందరిపై వచ్చిన అభియోగాలపై చర్యలు తీసుకోవాలని, అందరి అబిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.జగన్ కేసులో మంత్రుల రాజీనామాలపై ఏమి చేయాలో తేల్చుకోలేక తలపట్టుకుని కూర్చుని ఉంటే వి.హెచ్ రాసే లేఖలకు ముఖ్యమంత్రి ఏమని సమాధానం ఇవ్వగలుగుతారు. తెలంగాణ కోసం ఉద్యమాలు, ధర్నాలు చేశామని, ఆఖరికి బస్సు కింద పడమన్నా పడతామని ఆయన అనడం విశేషం.

ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి: మమత బెనర్జీ

పానిహతి: కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.తద్వారా దేశ రాజకీయాల్లో నాలుగు కూటమి ఏర్పాటు ఆవశ్యకతపై సంకేతాలిచ్చారు.‘కేంద్రంలో ఇక మూడో యూపీఏ ప్రభుత్వం ఉండకూడదు. కేంద్రంలో ప్రజానుకూల, సుస్థిర ప్రభుత్వాన్ని అందించడానికి అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకే గొడుగు కిందకి రావాలి’ అని అన్నారు. ఆమె శనివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పానిహతిలో జరిగిన తృణమూల్ సభలో మాట్లాడారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో మూడో పర్యాయం యూపీఏ సర్కారు ఏర్పాటవకుండా అడ్డుకునే సత్తా మనకుంది’ అని అన్నారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, సీపీఎంలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు 

YS విజయమ్మను కలిసిన దాడి వీరభద్రరావు

హైదరాబాద్, 04 మే 2013: టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు శనివారం సాయంత్రం లోటస్ పాండ్‌లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నివాసానికి వెళ్ళారు. ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట తనయుడు రత్నాకర్ కూడా ఉన్నారు. విజయమ్మ వారికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.

ప్రభుత్వాన్ని కాపాడుతున్న బాబు: YSషర్మిల

ఖమ్మం: రాష్ట్రంలో వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటిని కిరణ్ సర్కారు నీరుగార్చిందని షర్మిల ఆరోపించారు. అన్ని రంగాల్లో విఫలమయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో చంద్రబాబు కాపాడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు నీతి, నియమాలు లేవని ధ్వజమెత్తారు. ప్రతిరైతు గుండెల్లో వైఎస్‌ఆర్ ఉన్నారని చెప్పారు. జగనన్న సీఎం అయితే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఒక్కరిని ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. 

ఇలాగైతే కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క క్షణం కూడా ఉండరాదు..

కర్నూలు జిల్లా లో సహకార ఉద్యోగి ఒకరిని కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేసిన ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని రక్షించలేకపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక క్షణం కూడా పాలించే అర్హత లేదని అన్నారు.ఆ ఉద్యోగి మూడు నెలల క్రితం నుంచి కనిపించకపోతే, దాని గురించి తమ నాయకుడు కె.ఇ.కృష్ణమూర్తి అసెంబ్లీలో కూడా ప్రస్తావించినా ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన అన్నారు.కిడ్నాప్ కేసును మిస్సింగ్ కేసుగా నమోదు చేశారని ఆయన ఆరోపించారు.అతనిని ఏమి చేశారు? హత్య చేశారా?ఏమైనా చేశారా అన్నది కూడా ఇంతవరకు తేల్చలేదని చంద్రబాబు అన్నారు. కిడ్నాపర్లు, హంతకులను రక్షించే పనిలో కిరణ్ ప్రభుత్వం ఉందా అని ఆయన అన్నారు.అక్కడ నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఫ్యాక్షనిస్టు అని ఆయనకు ఈ కేసుతో సంబందం ఉందని ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు.ప్రతి విషయంలో రాజకీయ జోక్యం తగదని చంద్రబాబు స్పష్టం చేశారు.

6న ఢిల్లీకి కిరణ్ పర్యటన- ఎందుకో!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల ఆరున ఢిల్లీ వెళుతున్నారు. అధిష్టానం పిలుపు మేరకే ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు సమాచారం. ఆయన ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకుమూడు రోజులపాటు ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది.. అనంతపురంలో ఇందిరమ్మ బాట కార్యక్రమం ఉన్నా,దానిని రద్దు చేసుకుని కిరణ్ ఢిల్లీ వెళుతున్నారు.అసమ్మతి మంత్రుల ఫిర్యాదు, కిరణ్ శిబిరం ఎదురుదాడి నేపధ్యంలో కిరణ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. 

నేను విన్న జగన్ వేరు-చూసిన జగన్ వేరు


హైదరాబాద్‌: త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు దాడి వీరభద్రరావు వెల్లడించారు. ఆయన శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైల్లో కలిశారు. అనంతరం దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్లూ తాను విన్న జగన్ వేరు... ఇప్పుడు తాను చూసిన జగన్ వేరు అని అన్నారు. 
గతంలో తెలుగుదేశం పార్టీ వైఖరి మేరకే తాను వైఎస్ఆర్ కుటుంబంపై ఆరోపణలు చేశానని ఆయన తెలిపారు. ఆరోపణలపై అప్పట్లో రెండో వైపు తెలుసుకునే అవకాశం లేదని... ఇప్పుడు అసలు వాస్తవం తెలిసిందని, అందుకే ఆ కుటుంబంతో కలిసి నడవాలనుకుంటున్నట్లు దాడి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి అన్యాయం జరుగుతోందని, ఆ కుటుంబానికి అండగా నిలబడాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 11 నెలలుగా జైల్లో ఉన్నా జగన్‌లో రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్న కసి కన్పించిందని దాడి వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ నేత అమృతం పటేల్ హత్య

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం ఘనపురంలో టీఆర్ఎస్ నేత అమృతం పటేల్ హత్యకు గురయ్యారు. రాజకీయ కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.