Thursday, 9 May 2013

కారు దిగితే సీన్ వేరేలా ఉండేది: హీరో రామ్ చరణ్

హైదరాబాద్: నడిరోడ్డుపై జరిగిన 'రచ్చ'పై హీరో రామ్ చరణ్ స్పందించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే తనతో దురుసుగా ప్రవర్తించారని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను కారు దిగలేదని, తన ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఓ ఫోటో గ్రాఫర్ తనను బ్లాక్ మెయిల్ చేయబోయాడని చెప్పారు. తాను కారు దిగివుంటే సీన్ వేరేలా ఉండేదన్నారు. 
'రచ్చ'జరిగినప్పుడు కారులో తన భార్య ఉపాసన ఉందన్నారు. రెడ్ సిగ్నల్ వద్ద పదేపదే హారన్ కొట్టడమే కాకుండా, వాళ్లే రెండుసార్లు తన కారు డోర్ కొట్టారన్నారు. వారే తనతో దురుసుగా ప్రవర్తించారన్నారు. ఫ్యామిలీ మేన్ ని కాబట్టే తన సెక్యురిటీతో కొట్టించానన్నారు. తనతో గొడవ పెట్టుకున్న వారు ఐటీ ఉద్యోగుల్లా లేరన్నారు. వారు మద్యపానం సేవించి ఉన్నారన్న అనుమానాన్ని చరణ్ వ్యక్తం చేశారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. 

కాంగ్రెస్ మెడకే చుట్టుకునేలా ఉంది: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

హైదరాబాద్: జగన్ విషయంలో సీబీఐ వ్యవహారశైలిని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తప్పుబట్టారు. ఛార్జిషీట్ దాఖలు విషయంలో సీఆర్‌పీసీ నిబంధనలను సీబీఐ ఉల్లంఘిస్తోందన్నారు. కేసు నమోదైన మూడునెలల్లోగా ప్రధాన ఛార్జిషీట్ దాఖలు చేయాలని, ఆ తరువాతవన్నీ సప్లిమెంటరీ ఛార్జిషీట్లేనని నిబంధనలు చెప్తున్నాయన్నారు. సీబీఐ వ్యవహరిస్తున్న తీరు.. కాంగ్రెస్ మెడకే చుట్టుకునేలా ఉందని జీవన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

అవును పంజరంలోని చిలుకే: సీబీఐ డైరెక్టర్

న్యూఢిల్లీ : సీబీఐ పంజరంలోని చిలుకేనని స్వయంగా సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హానే అంగీకరించారు. సుప్రీంకోర్టు చెప్పిన మాటలన్ని వాస్తవమేనని ఆయన గురువారమిక్కడ అన్నారు. బొగ్గు కుంభకోణం కేసులో స్వతంత్రంగా వ్యవహరించాల్సింది పోయి, పంజరంలోని చిలుక మాదిరిగా తన యజమాని (కేంద్రం) పలుకులనే వల్లిస్తోందంటూ సీబీఐ తీరును సుప్రీంకోర్టు తూర్పారబట్టిన విషయం తెలిసిందే. 

కోర్టు తీర్పును తప్పుపట్టడం లేదు: వైఎస్ విజయమ్మ


హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ అర్థంలేని ఆరోపణలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఆమె గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీబీఐ పని తీరును సుప్రీంకోర్టే తప్పు పట్టిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని, కోర్టు తీర్పును తప్పుబట్టడం లేదని ఆమె అన్నారు.

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్ పై కుట్ర పన్నాయని విజయమ్మ ఆరోపించారు. పార్టీని వీడినందుకే కాంగ్రెస్ కక్ష కట్టిందని ఆమె అన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని విజయమ్మ తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబం ప్రజాసేవకే అంకితమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉందని విజయమ్మ స్పష్టం చేశారు. 

వైఎస్ జగన్‌ విషయంలో సీబీఐ దూకుడు: కిషన్ రెడ్డి


హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అదే సీబీఐ....ప్రధానమంత్రి, కేంద్రమంత్రుల విషయంలో అలా ఎందుకు వ్యవహరించడంలేదని ఆయన గురువారమిక్కడ ప్రశ్నించారు.
దొంగల వద్దకు వెళ్లి చార్జిషీటు మార్చిన ఘనత సీబీఐదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో సీబీఐ చిలక అని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. రాహుల్‌కు చరిష్మా ఉంటే అతన్ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు. కర్ణాటక ఫలితాలు ముందుగానే ఊహించామని కిషన్ రెడ్డి అన్నారు. 

YSRCP Leader Ambati Rambabu comments on YS Jagan's bail - Video

YSRCP Leader Konatala comments on YS Jagan's bail - Video

YSRCP Leader Konatala comments on YS Jagan's bail - Video

సుప్రీంకోర్టు తీర్పు నిరాశపరిచింది: ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి


హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పు నిరాశ పరిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 
జగన్‌మోహన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారనడం ఎంతవరకు సాధ్యమని ఆయన గురువారమిక్కడ ప్రశ్నించారు.
మంత్రులు ప్రభావితం చేయలేని సాక్షులను జగన్‌ ఎలా చేస్తారని శ్రీకాంత్ రెడ్డి సూటి ప్రశ్నించారు. 
కాంగ్రెస్‌ నాయకులు బెయిల్‌ రాదని చెప్పనట్లే జరిగిందని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రెండు రోజులుగా ఏంచేశారన్నది తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. సీబీఐ వాదనపట్ల ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. 

'సీబీఐ చిలుక పలుకుల్ని కోర్టులు నమ్మాయి'


న్యూఢిల్లీ : సీబీఐ చిలుక పలుకులను న్యాయస్థానాలు నమ్మాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అయితే న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని....మరో నాలుగు నెలలు తర్వాత అయినా న్యాయమే గెలుస్తుందన్నారు.
రాజకీయ క్రీడలో జగన్ పావుగా మారారని అంబటి రాంబాబు అన్నారు. జగన్ ను మరో ఏడాది జైల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. బెయిల్ రానంతమాత్రాన పార్టీ శ్రేణుల నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆ మైండ్ గేమ్ లో పడవద్దని అంబటి సూచించారు. కాంగ్రెస్, టీడీపీని ఓడించేందుకు పార్టీ కార్యకర్తలు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.