‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘సీబీఐ దర్యాప్తు చేసే సంస్థ కానేకాదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం పెరట్లో పెంచుకునే కుక్క. కేంద్రం ఎవరి మీద మొరగమంటే సీబీఐ వాళ్ల మీద మొరుగుతుంది. ఎవరిని కరవమంటే వాళ్లను కరుస్తుంది. మొరుగుతుండగానే ఇక చాలు ఆపు అని కేంద్రం చెప్పగానే వెంటనే ఆపేసి వెనక్కి వస్తుంది. మరి ఇలాంటి సీబీఐ, ఈడీ సంస్థలను దర్యాప్తు సంస్థలు అనాలా? లేక కేంద్ర ప్రభుత్వం ఎలా పలకమంటే అలా పలికే చిలుకలు అనాలా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉసిగొల్పే కుక్కలు అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఘాటుగా ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సాగింది. సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో కిక్కిరిసి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
ములాయం కూడా చెప్పారు.. ‘‘ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా పని చేసిన ములాయం సింగ్ యాదవ్.. కాంగ్రెస్, సీబీఐ సంబంధం గురించి ఒక మాట అన్నారు. ‘కాంగ్రెస్‌ను వ్యతిరేకించడం అంత సులభం కాదు. కాంగ్రెస్‌కు వెయ్యి తలలుంటాయి. దాన్ని వ్యతిరేకిస్తే వెయ్యి పడగలతో కాటేస్తుంది. సీబీఐని ఉసిగొల్పుతుంది. జైల్లో కూడా పెడుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మాటలను నిజం చేస్తూ.. తమిళనాడులో డీఎంకే అధినేత కరుణానిధి.. యూపీఏకు మద్దతు ఉపసంహరించుకున్న 24 గంటల్లోనే ఆయన సొంత మనుషుల ఇంటి మీద సీబీఐ, ఈడీ విరుచుకుపడ్డాయి. దీని మీద పార్లమెంటులో దుమారం రేగడంతో.. ప్రధాని మన్మోహన్ సింగ్ మాటల మేరకు ఈ సీబీఐ, ఈడీలు వెనక్కి వెళ్లిపోయాయి. అంటే ఈ సీబీఐ, ఈడీలు వెళ్లింది విచారణ చేయడానికి కాదు, దర్యాప్తు చేయడానికి అంతకంటే కాదు. ఆలోచన ఉన్న వాళ్లు ఎవరు ఆలోచన చేసినా ఇది అర్థమవుతుంది.
సీబీఐ ఒక బ్లాక్ మెయిల్ సంస్థ..
జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనేఉంటే ఈ పాటికి ఏ మంత్రో.. ముఖ్యమంత్రో అయి ఉండేవారని, కాంగ్రెస్ పార్టీని వదిలేసినందుకే అన్ని అష్ట కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ అగ్ర నేత గులాం నబీ ఆజాదే స్వయంగా ఒప్పుకొన్నారు. జగనన్న కాంగ్రెస్‌ను వ్యతిరేకించారు కాబట్టే ఆయన మీద సీబీఐని, ఈడీని ఉసిగొల్పి అబద్ధపు కేసులు పెట్టారు. సీబీఐ ఒక దర్యాప్తు సంస్థ కాదు, ఒక బ్లాక్‌మెయిల్ సంస్థ. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పంజరంలో తాము చిలుకలమని ప్రస్తుత సీబీఐ డెరైక్టర్ స్వయంగా ఒప్పుకున్నారు. కేంద్రం ఎట్లా చెప్తే అట్లా పలికే సీబీఐ చిలుక పలుకులను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు జగనన్నకు బెయిల్ నిరాకరించడం చాలా దురదృష్టకరం.
ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం క్విడ్ ప్రో కో కాదా?
వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఆయన మీద ఏ కేసులూ లేవు. జగన్‌మోహన్‌రెడ్డి.. కాంగ్రెస్‌ను వదిలేశాక వైఎస్సార్‌ను దోషి అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు పెట్టారు. ఆ తరువాత జగనన్న మీద కేసులు పెట్టారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకే కేసులు పెట్టామని శంకర్రావు అనే ఎమ్మెల్యే చెప్పారు. కేసులు పెట్టినందుకు ప్రతిఫలంగా ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇలా చేయడం క్విడ్ ప్రో కో కాదా? ఈ క్విడ్ ప్రో కో గురించి ఎవరూ మాట్లాడరు. ఈ క్విడ్ ప్రో కోను ఎవరూ పరిగణనలోకి తీసుకోరా?
ఇది కోర్టు ధిక్కారం కాదా?
ఇంకా ఎన్ని రోజులని, ఎంతకాలమని జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఉంచుతారు? సుప్రీంకోర్టు నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని నిన్న చెప్తే అది చెప్పిన ఐదు నిమిషాలకే సీబీఐ న్యాయవాది బయటికి వచ్చి అలాంటి గడువు ఏదీ లేదని అంటారు. గతంలో అదే కోర్టు అన్ని అభియోగాలనూ కలిపి ఒకే చార్జిషీటు వేయాలని చెప్తే ఈయన గారేమో వచ్చే పది రోజుల్లో మూడు చార్జిషీట్లు వేస్తామని చెప్పారు. అంటే ఇది సుప్రీంకోర్టును, సుప్రీంకోర్టు తీర్పును సీబీఐ ధిక్కరిస్తున్నట్టు కాదా? సుప్రీంకోర్టు తీర్పును సీబీఐ వ్యతిరేకించినట్టు, బేఖాతర్ చేసినట్టు కాదా? సుప్రీంకోర్టు ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటుందనే ఆశిస్తున్నాం.
వారిని అరెస్టు చేయలేదే?
బొగ్గు కుంభకోణం కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ ఇచ్చే నివేదికలను ముందుగానే న్యాయశాఖ మంత్రి కార్యాలయం వారు, ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉన్న వారు, అడ్వొకేట్ జనరల్ అందరూ కలిసి చూసి సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేశారు. నివేదికను ఇష్టమొచ్చినట్లు మార్చారు. కానీ అక్కడ ఏ అరెస్టులూ జర గలేదు. ఇక్కడమటుకు జగన్‌మోహన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేశారు అనడానికి ఏ ఆధారాలు లేకపోయినా... ఏ ఒక్క రోజు కూడా సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేయకపోయినా జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఏ చార్జిషీట్లో జగనన్న పేరుందో అదే చార్జిషీట్లో మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న హోం మంత్రి పేరు కూడా ఉంది. అంటే ముఖ్యమంత్రి తరువాత మనిషి అన్న మాట. కానీ సాధారణ ఎంపీగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డేమో.. సాక్షులను ప్రభావితం చేస్తారంటూ ఆయన్ను అరెస్టు చేశారు. సాక్షులను ప్రభావితం చేసే అధికారం, అవకాశం ఉన్న ఈ మంత్రులను మాత్రం ఇంత వరకు సీబీఐ ఎందుకు అరెస్టు చేయలేదో సమాధానం చెప్పాలి. జగన్‌మోహన్‌రెడ్డికి ఒక న్యాయం, మంత్రులకు మరొక న్యాయం. కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న వారికి ఒక న్యాయం, కాంగ్రెస్‌ను వ్యతిరేకించే వారికి ఇంకొక న్యాయం. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? మన దేశంలో, మనరాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే మన నాయకులు న్యాయాన్ని బతకనిస్తారా? అని అనుమానం కలుగుతోంది.’’
11 కిలోమీటర్ల మేర యాత్ర..
షర్మిల పాదయాత్ర 145వ రోజు శనివారం ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కిష్టారం గ్రామ శివారు నుంచి ప్రారంభమయింది. అక్కడి నుంచి నడుచుకుంటూ షర్మిల సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నారు. ఇక్కడ భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి తాళ్లమడ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.40 గంటలకు చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సత్తుపల్లిలో షర్మిలను కలిసి బాగోగులు తెలుసుకున్నారు. షర్మిల శనివారం మొత్తం 11 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,940.6 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, జలగం వెంకటరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, నేతలు జనక్ ప్రసాద్, గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాశ్, భానోతు మదన్‌లాల్, వైఎస్ కొండారెడ్డి, స్థానిక నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్ విజయకుమార్, రామసహాయం నరేష్‌రెడ్డి, సాదు రమేష్‌రెడ్డి, భూక్యా దళ్‌సింగ్, మెండెం జయరాజ్ తదితరులున్నారు.
నేడు‘పశ్చిమ’లోకి షర్మిల యాత్ర
షర్మిల పాదయాత్ర ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని రాష్ట్ర పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ బాలరాజు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పాకలవారంగూడెం గ్రామం దాటడంతో ఖమ్మం పాదయాత్ర పూర్తి అవుతుందని వారు తెలిపారు. చింతలపూడి నియోజకవర్గం గురుభట్లగూడెం గ్రామం ద్వారా షర్మిల పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగుపెడతారని చెప్పారు.
నాడు వైఎస్.. నేడు షర్మిల
మండే ఎండల్లో పాదయాత్ర
నాడు చంద్రబాబు తొమ్మిదేళ్ల ఏలుబడిలో.. పంటలు పండక, పని దొరక్క, పన్నులు కట్టలేక జనం విలవిల్లాడిపోతుంటే.. భవిష్యత్తుపై భరోసా కల్పించడానికి ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ పేరుతో పాదయాత్ర చేపట్టారు. సరిగ్గా పదేళ్ల కిందట ఇదే మే నెలలో మండే ఎండల్లో.. యాత్ర చేశారు. ఆ యాత్ర 2003 మే 11న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చేరింది. అప్పుడు ఇక్కడి ఉష్ణోగ్రత 45.5 డిగ్రీలు. ఆయనలాగే జనం కూడా ఎండకు వెరవకుండా వైఎస్ వెంట వెల్లువలా తరలివచ్చారు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత శనివారం అదే సీన్ రిపీటైంది. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర కాకతాళీయంగానే మే 11న సత్తుపల్లికి చేరింది. ఇప్పుడిక్కడ ఎండ తీవ్రత 46 డిగ్రీలు. అంతటి ఎండలోనూ షర్మిల ఆగకుండా నడిచారు. జనం కూడా ఆమెలాగే ఎండను లెక్కచేయకుండా కెరటంలా తరలివచ్చారు. పదేళ్ల కిందట వైఎస్సార్ మాట్లాడిన సత్తుపల్లి బస్టాండ్ సెంటర్‌లోనే షర్మిల ప్రసంగించడం విశేషం.
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
శనివారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 145, కిలోమీటర్లు: 1,940.6