Saturday, 18 May 2013

గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో విఫలం: ఎమ్మెల్యే కేటీఆర్


హైదరాబాద్: గల్ఫ్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గల్ఫ్ బాధితుల కోసం బడ్జెట్‌ను సవరించి 500 కోట్ల రూపాయలను కేటాయించాలి అని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. గల్ఫ్‌ బాధితుల కోసం కేరళ తరహాలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ సూచించారు. పార్టీ మారుతున్నారనే సమాచారంతోనే రఘునందన్‌రావుపై వేటు వేశామని కేటీఆర్‌ తెలిపారు.

కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు కొత్త డ్రామా

- కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు కొత్త డ్రామాకు తెరలేపారు
- ఆరోపణలున్న మంత్రుల వ్యవహారంలో ఏడాదిగా మౌనం పాటించారు
- ఢిల్లీ వెళ్లివచ్చాకే అకస్మాత్తుగా గొంతు విప్పడం అనుమానాలకు తావిస్తోంది 
- లోకకల్యాణం కోసం పాటుపడుతున్నానని బాబు చెప్పుకోవడం సిగ్గుచేటు
- చీకటి ఒప్పందాలతో.. కాంగ్రెస్‌కు ఆపన్నహస్తం అందిస్తున్నారు 


హైదరాబాద్: వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు కొత్త డ్రామాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ఇటీవలి కాలంలో బాబు రెండు పర్యాయాలు ఢిల్లీ పర్యటన చేసిన తరువాతే.. వివాదాస్పద 26 జీవోలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలో కొత్త పంథాలో ముందుకెళుతున్నారని ఆయన చెప్పారు. మంత్రి ధర్మానపై చార్జిషీట్ వేసి ఏడాది కావొస్తున్నదని, ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు ఢిల్లీ వెళ్లిరాగానే అకస్మాత్తుగా గవర్నర్, రాష్ట్రపతిని కలవాలనే ఆలోచన తట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. శ్రీకాంత్‌రెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతున్నా, సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నా, ప్రజలపై పెనుభారం మోపుతున్నా ఏనాడూ స్పందించని చంద్రబాబు.. కుట్రలు, కుతంత్రాలే ఎజెండాగా ముందుకెళుతున్నారని ధ్వజమెత్తారు. 

రాజకీయంగా వైఎస్సార్‌సీపీని నిలువరించేందుకు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ చేసే కుట్రలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలుకుని కేంద్రంలో ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా ముగ్గురు టీడీపీ ఎంపీల గైర్హాజరుతోపాటు ఇటీవలి కాలంలో రాష్ట అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్‌ను రక్షించేందుకు చంద్రబాబు చేసుకున్న కుమ్మక్కులను ఆయన ఒక్కొక్కటిగా వివరించారు.

ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకే జరుగుతున్నదని తెలిపారు. మూడేళ్లుగా కాంగ్రెస్‌తో బాబు నడిపిస్తున్న ఈ చీకటి వ్యవహారాలను ఎప్పటికప్పుడు ఆధారాలతోసహా తాము నిరూపిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని చెప్పారు. ఇలాంటి వ్యక్తి లోక కల్యాణంకోసం పాటుపడుతున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అధికార దాహంతో సొంత మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి మరణానికి కారకుడైన వ్యక్తి నీతులు వల్లించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తనకు సైకిల్‌గుర్తు ఎలా వచ్చిందో? పార్టీ కార్యాలయం ఏవిధంగా నిర్మించారో? కొడుకు లోకేష్ చదువులు అమెరికాలో ఎలా కొనసాగాయో ప్రజలకు వివరించగలరా? అని గడికోట సూటిగా ప్రశ్నించారు.

మీకు పార్లమెంటు, మాకు అసెంబ్లీ!
కేంద్ర మంత్రి చిదంబరంను చీకట్లో కలిసి తనపై ఉన్న కేసులు విచారణకు రాకుండా చూసుకున్న చంద్రబాబు... కాంగ్రెస్‌కు అవసరం వచ్చిన ప్పుడల్లా ఆపన్నహస్తం అందిస్తున్నారని శ్రీకాంత్ ఆరోపించారు. ప్రజాసమస్యలు విస్మరించి సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలు నిత్యం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నా బాబుకు పట్టదన్నారు. చీకట్లో కుదిరిన ఒప్పందం మేరకు కాంగ్రెస్.. పార్లమెంటు, టీడీపీ అసెంబ్లీ స్థానాలకు ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించారని పేర్కొ న్నారు. తమను ఎన్ని కష్టనష్టాలకు గురిచేసినా వైఎస్ కుటుంబం ప్రజలకోసం మొక్కవోని ధైర్యంతో ముం దుకు సాగుతోందన్నారు. వైఎస్ జగన్‌పై సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ జరపట్లేదని, అదంతా లోపభూయిష్టంగా ఉందని చెప్పారు. వైఎస్ ఇమేజ్‌ను దెబ్బతీసేం దుకు, జగన్‌ను అణచివేసేందుకు కాంగ్రెస్, టీడీపీలు కలిసి సీబీఐతో నాటకమాడిస్తున్నాయన్నారు.

మంత్రి దర్మాన ప్రసాదరావుకు కిరణ్ ఫోన్

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దర్మాన ప్రసాదరావుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మని కోరడంతో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం వెలువడుతుందా అన్న చర్చ జరుగుతోంది.మంత్రి దర్మాన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ స్వయంగా దర్మానకు ఫోన్ చేశారని సమాచారం.ఎఐసిసి అధికార ప్రతినిది చాకో జగన్ కేసులో ఉన్న మంత్రులు రాజీనామా చేయాలని బహిరంగంగా ప్రకటించడంతో ముఖ్యమంత్రికి సైతం ఇరకాట పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే మంత్రులు ధర్మాన,సబితలు రాజీనామా చేయగా వాటిని సి.ఎమ్. తోసిపుచ్చారు. ఈ దశలో మళ్లీ రాజీనామా కోరాల్సి రావడం ఆయనకు ఇబ్బందిగా మారుతుంది.అయినప్పట్టికీ ధర్మానతో ,అలాగే సబితతో కిరణ్ ఏమి చెబుతారో చూడాలి.కాగా ఒక వేళ మంత్రి పదవిని వదలుకోవలసి వస్తే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని ధర్మాన అనుచరులు డిమాండ్ చేస్తూ పార్టీని హెచ్చరిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవికే క్లీన్ ఇమేజీ ఉందా

రాష్ట్ర మంత్రి సి.రామచంద్రయ్య మెగాస్టార్ తరపున గట్టి వాదనే వినిపిస్తున్నారు.కర్నాటకలో కాంగ్రెస్ కు క్లీన్ ఇమేజీ ఉంది కాబట్టే ప్రజలు అదికారంలోకి తెచ్చారని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ కు క్లీన్ ఇమేజీ ఉంటేనే అదికారంలోకి తెస్తామని ఆయన చెబుతున్నారు. రెండువేల పద్నాలుగులో చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్ది అయితే తప్పేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే చిరంజీవికి క్లీన్ ఇమేజీ ఉందని ఆయన చెప్పదలచారు.నేరుగా ముఖ్యమంత్రి కిరణ్ కు క్లీన్ ఇమేజీ లేదని చెప్పనప్పట్టికీ, చిరంజీవి తరపున ప్రచారం చేయడం ద్వారా రామచంద్రయ్య ముఖ్యమంత్రికి అసహనం తెప్పిస్తున్నారన్న భావన కలుగుతుంది. అయినప్పట్టికీ తనను మంత్రి పదవి నుంచి తొలగించరని,అలాంటి ప్రచారం అంతా అవాస్తవమని ఆయన చెబుతున్నారు.వచ్చే ఎన్నికలలో ఎవరి నాయకత్వం కోరుకుంటారో ప్రజలే చూసుకుంటారని ఆయన అబిప్రాయపడ్డారు.చిరంజీవి తరపున గట్టిగానే బాటింగ్ చేస్తున్న రామచంద్రయ్యకు తన వికెట్ పడకుండా చిరూనే చూసుకుంటారన్న దీమా కావచ్చు.

పొత్తులకు, విధానాలకు సంబంధం ఉండదా!


భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అగ్రనేత ఎబి బర్దన్ ఒక మాట చెప్పారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఆ పార్టీ విధానాలను తాము ఆమోదించినట్లు కాదని, అలాగే ప్రత్యేక తెలంగాణను సమర్థించినంత మాత్రాన తమది టీఆర్ఎస్ భావజాలం కాదని ఆయన చెప్పారు.గత కొంతకాలంగా సిపిఐ నేతలు టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఉండగా , ఆ తర్వాత పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చాక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆయనను కలిశారు. రెండు రోజుల క్రితం బర్దన్ కూడా చంద్రబాబు కలిసి తృతియ ఫ్రంట్ గురించి చర్చించారు.అయితే వారిది ఒక చిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుందామని అనుకుంటే ఆ పార్టీ అందుకు సిద్దంగా లేదు. దాంతో కొంత నిరుత్సాహానికి గురి అయింది.ఆ మీదట టిఆర్ఎస్ పై నారాయణ మండిపడ్డారు. కాగా టిడిపితో పొత్తు పెట్టుకునే విషయంలో ఒక అడుగు ముందుకు వేసినట్లు కనిపిస్తుంది.కాకపోతే ఇప్పుడే ఆ విషయం ప్రకటించకుండా ఎన్నికల సమయంలోనే పొత్తులు ఉంటాయని నారాయణ కూడా అన్నారు.అయితే ఎందుకైనా మంచిదని పొత్తులకు , పార్టీల విధానాలకు సంబందం లేదని సిపిఐ నేతలు సూత్రీకరిస్తున్నారు.

సిరిసిల్లా బయలుదేరిన YSవిజయమ్మ!

హైదరాబాద్: నేతన్నల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు బయలుదేరారు. అప్పలు బాధను తట్టుకోలేక ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలను విజయమ్మ పరామర్శించనున్నారు.

బీజేపీలోకి కేసీఆర్ అన్నకూతురు ?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అన్న కూతురు రమా మధుసూదనరావు బీజేపీలో చేరేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నారు. రమ కొన్ని రోజులుగా బీజేపీ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. జూన్ 3న హైదరాబాద్ నిజాం గ్రౌండ్స్‌లో జరిగే పార్టీ సభలో జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలోనే ఆమె చేరే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు అంటున్నా యి. అదేవిధంగా...హైదరాబాద్ పాతబస్తీలో కాంగ్రెస్ కార్పొరేటర్ ఆలె జితేంద్ర జూన్ 3వ తేదీన బీజేపీలో చేరనున్నారు. ఇతడు కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర రెండో కుమారుడు.

హరీష్ రావు అక్రమాలు బయటపెడ్తా!


కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావుపై టీఆర్‌ఎస్ బహిష్కృత నేత ఎం.రఘునందన్‌రావు గురి పెట్టారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. తనను పార్టీ గెంటి వేయడంతో గుర్రుగా ఉన్న రఘునందన్ రోజుకో బండారం బయటపెడతానంటూ ప్రకటించారు. హరీష్‌రావు అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడతానంటూ ప్రతిన బూనారు. అన్నట్టుగా బాంబు పేల్చారు. పద్మాలయ స్టూడియో వివాదం సెటిల్ మెంట్ వ్యవహారంలో హరీష్ రూ. 80 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఎంపీ విజయశాంతి నివాసంలో జరిగిన ఈ వ్యవహారానికి శ్రీనివాస ప్రసాద్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సినీ నిర్మాత కూడా సాక్షులుగా ఉన్నారని వెల్లడించారు. 

టీఆర్ఎస్ లో చంద్రబాబుగా హరీష్‌రావును పోల్చారు రఘునందన్. 2008 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోర పరాజయం తర్వాత పార్టీ అధ్యక్ష పదవి నుంచి కేసీఆర్ ను తప్పించేందుకు హరీష్ కుట్రలు చేశారని వెల్లడించి సంచలనం రేపారు. 'టీఆర్ఎస్ లో చంద్రబాబులా కష్టపడతా.. పార్టీని మళ్లీ బతికించుకుందాం' అని తనతో నేరుగా చెప్పారని కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా తన వద్ద అప్పుడప్పుడు డబ్బు తీసుకున్నారని చెప్పారు. 

కేసీఆర్ తనయుడు కేటీఆర్ హవాను అడ్డుకునేందుకు హరీష్‌రావు ప్రయత్నించారని రఘునందన్ ఆరోపించారు. సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు రెబల్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డికి హరీష్ ఏకంగా రూ. 50 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా అంటూ నిలదీశారు. పార్టీలో ఆధిపత్యం కోసం హరీష్ ఇదంతా చేశారన్నారు. కేసీఆర్‌పై తిరుగుబాటు చేసిన మాజీమంత్రి డాక్టర్ చంద్రశేఖర్, నేతలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రవీంద్రనాయక్, జిట్టా బాలకృష్ణారెడ్డి వంటివారంతా హరీష్‌రావు కుట్రలకు బలైనవారేనని ఆరోపించారు. అటు కేసీఆర్ కూ డబ్బు తప్ప ఏమీ పట్టడం లేదని వాపోయారు. హరీష్ గురించి ఎన్నిసార్లు చెప్పినా అధినేత పట్టించుకోలేదన్నారు. 

రఘునందన్‌రావు తీవ్ర ఆరోపణలు చేస్తున్నా కేసీఆర్ ఇప్పటివరకు నోరు మెదపలేదు. టీఆర్ఎస్ అధ్యక్ష పదవి నుంచి తనను హరీష్ దించేందుకు కుట్రలు చేశారని ప్రకటించినా కేసీఆర్ కిమ్మనకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తనతో పాటు తనయుడు కేటీఆర్ కు ఎసరు పెట్టారని చెప్పినా మేనల్లుడిపై కేసీఆర్ ఒక్క కామెంట్ చేయకపోవడం మరింత అవాక్కయ్యేలా చే్స్తోంది. అటు పార్టీ నేతలు కూడా ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు జంకుతున్నారు. హరీష్‌రావును సమర్ధిస్తే కేసీఆర్ ఆగ్రహానికి గురవుతామేమోననే భయంతో మీడియాకు మొహం చాటేస్తున్నారు. 

మరోవైపు తన ప్రాణానికి ముప్పు వుందంటూ రఘునందన్‌రావు పోలీసులను ఆశ్రయించారు. హరీష్‌రావు గురించి మాట్లాడొద్దని, మాట్లాడితే చంపేస్తామంటూ తనకు సిద్దిపేట నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరారు. అలాగే హరీష్ అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మరోవైపు ఏ విచారణకైనా తాను సిద్ధమని హరీష్‌రావు ప్రకటించారు. వీరిద్దరి వ్యవహారం ఇంకా ఎంతదూరం పోతుందోనని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. 

'మెజార్టీ స్థానాలు వైఎస్‌ఆర్‌ సీపీవే'

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. గ్రామ గ్రామానా వైఎస్‌ఆర్‌ సీపీకి ప్రజాదరణ వెల్లువెత్తుతోందని ఆయన చెప్పారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా మెజార్టీ స్థానాలు వైఎస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

ధర్మాన ప్రసాదరావు అనుచరుల రహస్య సమావేశం

శ్రీకాకుళం: భవిష్యత్‌ కార్యాచరణపై మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుచరులు ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. మంత్రిగా వైదొలిగే పరిస్థితులు వస్తే ఏంచేయాలన్నదానిపై సమాలోచనలు జరిపారు. చర్యలు ఎదురైతే ఏకంగా ఎమ్మెల్యే పదవినీ వదిలేయాలని ధర్మానపై ఒత్తిడి తేవాలని వారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీకీ గుడ్‌బై చెప్పేందుకూ వెనుకాడబోమని సంకేతాలు పంపాలనుకుంటున్నట్టు సమాచారం.

మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ: నాగం జనార్ధన్ రెడ్డి

హైదరాబాద్: రాజ్‌నాథ్‌సింగ్‌ సూచన మేరకు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్దనరెడ్డి తెలిపారు. బీజేపీలో చేరి మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేయాలని ఆలోచిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ప్రాంతం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో వస్తారని ఆయన వెల్లడించారు. 

తెలంగాణ యుపిఎ ఎజెండాలో లేదు

ఎఐసిసి అదికార ప్రతినిధి పిసి చాకో తెలంగాణ అంశంపై మరో సంచలన ప్రకటన చేశారు. యుపిఎ ఉమ్మడి ఎజెండాలో తెలంగాణ అంశం లేదని స్పష్టం చేశారు. అంటే యుపిఎ ప్రబుత్వం ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేమని చెబుతున్నారని అనుకోవాలి.తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలను ఇటీవలికాలంలో కాస్త మచ్చిక చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా కాస్త దూకుడుగా ఈ విషయాన్ని ప్రకటించడం ఆసక్తి కలిగించే అంశమే.

ఈటెలకు రఘునందన్ సమాధానం

సీమాంధ్ర పేరుతో టిఆర్ఎస్ శాసనసభ పక్షం నేత ఈటెల రాజేందర్ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన రఘునందనరావు వ్యాఖ్యానించారు. తాను చంద్రబాబు,జగన్ బాబు,కిరణ్ బాబుల కుట్ర ప్రకారం తాను మాట్లాడుతున్నానని ఈటెల అనడాన్ని రఘునందన్ ఖండిస్తూ, మూడు పదాలు తీసుకు వచ్చి మాట్లాడితే సరిపోదని అన్నారు. తాను స్టింగ్ ఆపరేషన జరపలేదని, వేరేవారు తీసిన సిడిలు తనకు ఇచ్చారని ఆయన చెప్పారు. వీటిని సోమవారం నుంచి బయటపెడతానని ఆయన అన్నారు.

సి.పిఎమ్. బ్రాహ్మణవాద పార్టీనా!


భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత ఎబి బర్దన్ సిపిఎం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సిపిఐ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీపీఎం విధానాలు పనికిరానివని, అగ్రకులాలకే పెద్దపీఠ వేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. సీపీఎం బ్రాహ్మణ వాదాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ప్రపంచ స్థితిగతులకు అనుకూలంగా అందరం మారాల్సిందేనని బర్దన్ అబిప్రాయపడ్డారు. సిపిఎం అగ్రనేతలుగా ఉన్న సీతారామ్ ఏచూరి బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు. అయితే ప్రకాష్ కారత్ కూడా బ్రాహ్మణుడో ఏమో తెలియదు. అయితే పశ్చిమబెంగాల్ లో ఎక్కువమంది బ్రాహ్మణ నేతలు సిపిఎంలో ఉండి ఉంటారు. అందువల్ల బర్దన్ ఈ విమర్శలు చేసినట్లు కనిపిస్తుంది. అయినప్పట్టికీ కూడా బర్దన్ వంటి పెద్ద నాయకులు కూడా తోటి కమ్యూనిస్టు నేతలను కులం పేరుతో విమర్శించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న వస్తుంది. 

మంత్రులు ధర్మాన,సబితలపై కీలక నిర్ణయం !

జగన్ కేసులో నిందితులుగా ఉన్న మంత్రులపై వేటు వేయాలా?వద్దా అన్నదానిపై భిన్న కదనాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆ మంత్రులను ఇప్పుడున్న పరిస్థితులలో తొలగించరాదని తన వాదన అధిష్టానం వద్ద వినిపించారు. అయితే అదిష్టానం మాత్రం వారిని తొలగించాల్సిందేనని అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.ప్రత్యేకించి సిబిఐ చార్జీషీట్ లో ఉన్న మంత్రులనైనా తొలగించాలని అదిష్టానం అబిప్రాయంపడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఎప్పుడు వారిని తొలగించాలన్నదానిపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కిరణ్ కే వదలివేసినట్లు చెబుతున్నారు.శనివారం నాడు కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ గులాం నబీ అజాద్ తో ముఖ్యమంత్రి కిరణ్ బేటీ అయి ఆయా విషయాలు చర్చించారు.ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి ప్రయాణం అయ్యారు. ఆయన ఇక్కడకు వచ్చాక ఎలాంటి సమాచారం వెల్లడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.అయితే మీడియాలో మాత్రం రెండు రకాల కధనాలు వస్తున్నాయి. మంత్రులు దర్మాన,సబితా ఇంద్రారెడ్డిలకు ఉద్వాసన తప్పదని కొందరు చెబుతుంటే, మరికొందరు వెంటనే జరగకపోవచ్చని అంటున్నారు. మొత్తం మీద ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది.

తిరుగుబాటు ఎమ్మెల్యేల విచారణ 28కి వాయిదా


హైదరాబాద్: టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ ఎమ్మెల్యేలను విచారించారు. రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌ రెడ్డి, ఆదిలాబాడ్‌ జిల్లాకు చెందిన ముధోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి తమ న్యాయవాదులతో కలిసి వచ్చి తమ వాదనలు వినిపించారు. తెలుగుదేశం పార్టీ తరపున విప్ ధూళిపాళ్ల నరేంద్ర హాజరై తమ వాదనలు వినిపించారు.

విచారణ అనంతరం వేణుగోపాల చారి మాట్లాడుతూ విప్ ఇచ్చామని టీడీపీ వాదిస్తోందని, తమకు ఎలాంటి విప్ అందలేదని చెప్పారు. అందువల్ల అనర్హత పిటిషన్ చెల్లదన్నారు. తమ వాదనలను వినడానికి కేసును ఈ నెల 28కి వాయిదా వేశారని 
చెప్పారు.

చింతలపూడి శ్రీరాం చిట్స్‌లో ఘరానా మోసం

చింతలపూడి : పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి శ్రీరాం చిట్స్ లో ఘరానా మోసం జరిగింది. ఉపాధ్యాయులకు తెలియకుండా వారి శాలరీ సర్టిఫికెట్లను ఇతరులకు జామీన్ గా పెట్టిన వైనం బయటపడింది. అయితే చిట్ పాడినవారు సరిగా వాయిదాలు చెల్లించకపోవటంతో జామీనుగా ఉన్న ఉపాధ్యాయులకు కోర్టు నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్న ఉపాధ్యాయులు శనివారం శ్రీరాం చిట్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత టీచర్లకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలిచాయి.

సినీ నటుడు అలీ ఇక డాక్టర్ అలీ


ప్రముఖ హాస్య నటుడు ఆలి ఇక డాక్టర్ అలీ కాకబోతున్నారు.ఆయనకు యూరోపియన్ యునైటెడ్ యూనివర్శిటీ ఆలికి డాక్టరేట్ ను ప్రదానం చేస్తోంది.ఈ నెల ఇరవైఐదున కోయంబత్తూరులో ఆలి డాక్టరేట్ అందుకుంటున్నారని సమాచారం. ముప్పై ఏళ్లుగా ఆలీ సినీ రంగంలో ఉన్నారు. అయితే మన రాష్ట్ర యూనివర్శీటీ కాకుండా, వేరే ప్రాంత యూనివర్శిటీ డాక్టరేట్ ఇవ్వడం విశేషం.

బొత్స సత్యనారాయణను మార్చనట్లేనా!

పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణను మార్చనట్లేనా! పిసిసి కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.తొమ్మిది మంది ప్రధానకార్యదర్శులు, ఐదుగురు ఉపాధ్యక్షులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి బొత్సకు అనుమతి ఇచ్చారని అంటున్నారు. ఒక వైపు మంత్రుల వ్యవహారంలో అధిష్టానం సీరియస్ గానే ఉన్నా ముఖ్యమంత్రి వారిని తొలగించడానికి సిద్దంగా లేరన్నది ఒక కదనం, బొత్సను మార్చుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయినా అదేమీ లేదని ఇప్పటికైతే అర్ధం అవుతుంది.

టిడిపిని వీడి సొంత గూటికి రాధోడ్


తెలుగుదేశం పార్టీకి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాధోడ్ రాజీనామా చేస్తున్నారు.ఈయన గతంలో బిజెపి తరపున శాసనషభకు మహరాజ్ గంజ్ నియోజకవర్గంలో ఎన్నికయ్యారు.ఆ తర్వాత కాలంలో ఆయన టిడిపిలో చేరారు. తిరిగి ఈ పార్టీకి రాజీనామా చేసి సొంత గూడు బిజెపికి చేరుతున్నారు.దీనివల్ల తెలుగుదేశం పార్టీకి పెద్ద నష్టం లేదు కాని , అనవసర ప్రచారానికి ఇలాంటివి ఉపయోగపడతాయి.కాగా పార్టీ అద్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో రాధోడ్ బిజెపిలో చేరుతున్నట్లు కధనం.ఇప్పటినుంచి ఫిరాయింపుల సీజన్ గానే పరిగణించాటేమో!

టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత విచారణ

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత విచారణ శనివారం ప్రారంభమైంది. స్పీకర్ ఛాంబర్ లో ఈ విచారణ కొనసాగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలు వేణుగోపాలాచారీ, హరీశ్వర్ రెడ్డి న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చారు. వారు ఇరువురు స్పీకర్ ఎదుట తమ వాదనలు వినిపిస్తున్నారు. 

దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలి: ఈటెల రాజేందర్


హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంపై మరోసారి కుట్ర జరుగుతోందని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఆయన శనివారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కుట్రలో భాగంగానే రఘునందన్ టీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీనివెనకుండి నడిస్తున్నారని ఈటెల ఆరోపించారు.

దమ్ముంటే రఘునందర్ ఆరోపణలు రుజువు చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. ఆంధ్రా సంపన్నుల గొంతై రఘునందర్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పద్మాలయ స్టూడియోపై టీఆర్ఎస్ న్యాయపోరాటం చేసిందని ఈటెల తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవలసింది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. కాగా విజయశాంతి ఎందుకు స్పందించలేదన్న విషయంపై ఈటెల మాట దాటవేశారు.

జగన్ సీఎం అవటం ఖాయం: గట్టు రామచంద్రారావు


తిరుమల: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రారావు అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం వైఎస్ఆర్ ను గుండెల్లో దాచుకుందని ఆయన తెలిపారు. గట్టు రామచంద్రరావు శనివారం ఉదయం వెంకన్నను దర్శించుకున్నారు. 

అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జగన్ జైలుకెళ్లాక కార్యకర్తలు కసిగా పార్టీ కోసం పని చేస్తున్నారన్నారు.అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై ఒక వ్యక్తిపై కుట్రలు చేయటం దారుణమని గట్టు రామచంద్రరావు అన్నారు. జగన్ తరపున ప్రజలే ఉద్యమిస్తున్నారని, త్వరలోనే జగన్ ప్రజల్లోకి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.