Wednesday, 22 May 2013

YS జగన్ అరెస్టుకు ఏడాది-ధర్నాలు


వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఆ పార్టీ వివిద కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ఈనెల 27 సాయంత్రం నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజా నుంచి 10వేల మందితో కొవ్వుత్తుల ర్యాలీ ఏర్పాటు చేస్తున్నామని ఆ పార్టీ అదికార ప్రతినిది జనక్‌ప్రసాద్‌ తెలిపారు. 28న ఇందిరాపార్క్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ ఆధ్వర్యంలో ధర్నా చేస్తారని ఆయన చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది.

ఆ జీవోల జారీలో తప్పేమీ లేదు: లగడపాటి రాజగోపాల్

హైదరాబాద్: రాష్ట్ర మంత్రులుగా ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలు తమ శాఖలకు సంబంధించి జారీచేసిన జీవోలలో ఎక్కడా తప్పులేదని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అలాంటి జీవోలను అంతకు మందున్న ప్రభుత్వాలు వందల సంఖ్యలో ఇచ్చాయన్నారు. ‘ఒక కంపెనీకి కేటాయించిన గనులను వేరొక కంపెనీకి బదలాయించిన’ట్లు సబితను తప్పుపడుతున్నారని, కానీ అలాంటి జీవోలు తెలుగుదేశం సర్కారు హయాంలో అనేకం వచ్చాయన్నారు. 2004కు ముందు అలాంటి బదలాయింపు ఒప్పందాలు 53 జరిగాయంటూ వాటి వివరాలను బుధవారం మీడియాకు అందజేశారు. ‘తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు జీవోలు తప్పు అంటారు. ప్రభుత్వానికి జీవోలు ఇచ్చే అధికారం లేదా? మంత్రులు, అధికారులు జీవోలపై సంతకాలే చేయకూడదా? మంత్రిగా ఒకరిచ్చిన గనులను ఆ తరువాత మరొకరికి బదలాయిస్తే ఆ జీవోలో తప్పు ఎక్కడిది? అని అన్నారు.

మైనార్టీలో కిరణ్ సర్కార్: విజయమ్మ


పులివెందుల : కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ మైనార్టీలో పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విప్ జారీ చేసి ప్రభుత్వాన్ని కాపాడారని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంతో పాటు కేంద్రాన్ని కూడా బాబే కాపాడుతున్నారని విజయమ్మ ఆరోపించారు. 

విజయమ్మ బుధవారం పులివెందులలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ తో చంద్రబాబు దోస్తీ కట్టారన్నారు. కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కై జగన్ ను జైల్లో పెట్టించాయని ఆమె అన్నారు. చంద్రబాబు తనపై విచారణ జరగకుండా జగన్ ను టార్గెట్ చేశారన్నారు. అవినీతి మంత్రులంటూ ఇప్పుడు డ్రామాలాడుతున్నారని ఆమె మండిపడ్డారు.

జగన్ కు బెయిల్ రాకుండా డ్రామాలాడుతున్నారని విజయమ్మ ధ్వజమెత్తారు. ఫలానా పని చేయమని జగన్ ఎప్పుడైనా ఏ అధికారికి అయినా ఫోన్ చేశారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఏడు నెలలు సమయం ఇచ్చినా 26జీవోలు అక్రమమా, సక్రమమా అనేది కిరణ్ కుమార్ రెడ్డి తేల్చలేకపోయారని విజయమ్మ అన్నారు. నకిలీ స్టాంపులు, ఏలేరు...తదితర కుంభకోణాలపై విచారణ ఎందుకు జరపటం లేదని ఆమె ప్రశ్నించారు. ఐఎంజీ అడిగిన దానికంటే చంద్రబాబు ఎక్కువ భూమి కేటాయించారని విజయమ్మ గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరితో ప్రజలు కష్టాలు పడుతున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను సర్కార్ పట్టించుకోవటం లేదన్నారు. అంతకాకుండా ఎడాపెడా ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజలపై 4వేల కోట్ల రూపాయల భారం పడిందని విజయమ్మ అన్నారు.

సర్కార్ తీరుపై సొంత పార్టీ నేతల ఆగ్రహం


హైదరాబాద్: కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు తమ అసంతృప్తిని వెల్లగక్కారు. మైనార్టీలంతా వైఎస్‌ఆర్‌ సీపీ పక్షాన్నే ఉన్నారని మైనార్టీల కోసం ఏదైనా కొత్త పథకం ప్రవేశ పెడితేగానీ కాంగ్రెస్‌ వైపు రారని కదిరి బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాహుద్దీన్‌ అన్నారు.

ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించకుంటే తెలంగాణలో కాంగ్రెస్‌ బతికి బట్టకట్టదని ఆదిలాబాద్‌ నేత హరికృష్ణ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పథకాలు జిల్లా నేతలకే తెలియకుంటే ప్రజలకు ఏం తెలుస్తాయని ఎమ్మిగనూరు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పురుషోత్తం గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

గతంలో చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తే ఇప్పుడున్న పాలకులు పెళ్లి కొడుకుల్లా భోగాలు అనుభవిస్తున్నారని కామారెడ్డి బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరుమల్‌గౌడ్‌ విరుచుకుపడ్డారు. జిల్లా స్థాయి నేతలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.