Friday, 10 May 2013

కడియం శ్రీహరి కోవర్టు: మోత్కుపల్లి

హైదరాబాద్ : కడియం శ్రీహరి రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహలు తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీలో కడియం ఓ కోవర్టుగా పనిచేశారని ఆయన ఆరోపించారు. కడియం మానసికంగా ఎప్పుడో టీఆర్ఎస్ లో చేరిపోయారని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. కడియం శ్రీహరి రాజీనామాతో పార్టీకి పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదని ఆయన అన్నారు.

టీడీపీ విశ్వసనీయత కోల్పోయింది: కడియం శ్రీహరి


వరంగల్ : అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవటంతో తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని కడియం శ్రీహరి అన్నారు. ఆయన శనివారం టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు.

టీడీపీ-కాంగ్రెస్ కలిసిపోయాయనే సంకేతాలు ప్రజలకు వెళ్లాయన్నారు. తనకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి ఆహ్వానం వచ్చిందని, అయితే ఏ పార్టీలో చేరేది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కడియం శ్రీహరి తెలిపారు. భవిష్యత్ కార్యచరణపై త్వరలో ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. 

మెగాస్టార్ చిరంజీవి ఇంటి స్థలం పైల్ స్వాధీనం

గత కొద్ది కాలంగా కేంద్ర మంత్రి , మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారంటూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి కిరణ్ శిబిరానికి ఆగ్రహం తెప్పించాయా?తమ సత్తా ఏమిటో చూపించాలని అనుకున్నారా?ఆకస్మికంగా చిరంజీవికి సంబంధించిన ఇంటి స్థలం పైలును, బ్లడ్ బ్లాంక్ స్థలం ఫైలును సిఐడి అదికారులు స్వాదీనం చేసుకున్న వైనం రాజకీయ వర్గాలలో చర్చనీయంగా మారింది.ఒకపక్క చిరంజీవి కి అదిష్టానం వద్ద పరపతి పెరుగుతున్నది తెలిసి కూడా సి.ఎమ్.క్యాంప్ ఈ సాహసం చేసిందంటే ఆశ్చర్యంగానే ఉంది. గతంలో తన ఇంటి పక్కన ఉన్న 900 గజాల స్థలాన్ని కూడా చిరంజీవి కలుపుకున్నారని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంపై అది కేసుగా మారడం జరిగింది. అయితే ఆ తర్వాత కాలంలో దానిని ఆయన క్లియర్ చేసుకున్నారని అంటారు. కాగా బ్లడ్ బ్యాంక్ స్థలం పక్కన ఉన్న రెండువందల గజాల స్థలం కూడా ఆక్రమించారన్నది మరో అభియోగం. చాలా సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఈ వ్యవహారాలపై సిఐడి దృష్టి సారించడం వెనుక ఏదో మతలబు ఉందని అంటున్నారు. ఇది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవిలకు మద్య అంతరం బాగా పెంచవచ్చన్న అబిప్రాయం కలుగుతుంది.

టిడిపికి కడియం శ్రీహరి షాక్

తెలుగుదేశం సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం కు షాకిచ్చారు.గత కొద్దిరోజులుగా ఆయన పై ప్రచారం జరుగుతున్నప్పట్టికీ ఆయన ఖండిస్తూ వస్తున్నారు.తెలంగాణ వాదిగా గుర్తింపు పొందిన శ్రీహరి 1994,99లలోను వరంగల్ జిల్లా స్ఏషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఎన్.టి.ఆర్.క్యాబినెట్ లో ను, అలాగే చంద్రబాబు క్యాబినెట్ లోను 1994-2004 వరకు మంత్రిగా ఉన్నారు. గత ఏడాది జరిగిన అఖిల పక్ష సమావేశానికి కూడా ఆయన టిడిపి ప్రతినిధిగా హాజరై సమర్దంగా తన వాదన వినిపించారు. కాని ఆశ్చర్యంగా ఆయనే పార్టీని వీడడం విశేషం.గత ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోవడంతో ఆయనలో సందేహాలు ఏర్పడి ఉండవచ్చని భావన ఉంది. దీంతో ఆయన పార్టీని వీడడానికి నిర్ణయం తీసుకున్నారు.కాగా ఆయనను కెసిఆర్ కుమారుడు కెటిఆర్ కలిసి టిఆర్ఎస్ లో రావాలని కూడా ఆహ్వానించారు.ఈ నేపధ్యంలో కడియం టిఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖరారు కావచ్చు.

కొండా దంపతులకు బీజేపీ గాలం !


తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పార్టీని

బలపరుచుకునే ప్రయత్నాలలో బీజేపీ జోరుగా తన ప్రయత్నాలు చేస్తోంది. జగన్ పార్టీకి అండదండగా ఉన్న కొండా సురేఖ దంపతులను బీజేపీలోకి తెచ్చేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేరుగా కొండా దంపతులకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొండా దంపతులు వరంగల్ జిల్లాలో పార్టీ పగ్గాలన్నీ తమ చేతుల్లో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఇటీవల అధిష్టానం నిర్ణయాలకు నిరసనగా పార్టీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపిన కొండా అనుచరులు నలుగురిని సస్పెండ్ చేసిన నేపథ్యంలో కొండా దంపతులు పార్టీ వీడడం ఖాయంగా కనిపిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీలోకి రానున్న నేపథ్యంలో కొండా దంపతులను కూడా పార్టీలోకి లాగితే బీజేపీకి ఊపు వస్తుందని కిషన్ రెడ్డి భావిస్తున్నారు. ఇక గత ఉప ఎన్నికల్లో కొండా సురేఖ గెలవాలని కిషన్ రెడ్డి పరోక్షంగా సాయం చేశారు. పది స్థానాలలో పోటీ చేస్తున్నా ఒక్క పరకాల సీటుమీదనే దృష్టి పెట్టి టీఆర్ఎస్, తెలంగాణ ఓట్లు చీల్చి సురేఖ గెలిచేలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం వికటించింది. 

YS జగన్‌కి కాదు...జనానికి ఈ నిర్బంధం


అంతా అనుకున్నట్లే జరిగింది. జగన్‌కి బెయిల్ రాలేదు. మరో నాలుగు నెలల తరవాతే బెయిల్‌కి అప్పీల్ చేసుకోవాలని సుప్రీంకోర్టు నిర్ణయం. గడువు లోపల సీబీఐ తన విచారణ పూర్తి చెయ్యకపోతే, అప్పుడు జగన్ అవసరమైతే మళ్లీ పిటిషన్ పెట్టుకోవచ్చట. ఒకవేళ అలా పెట్టుకోకుండా సీబీఐ ఎన్ని సంవత్సరాలు విచారణ జరపాలనుకున్నా అంతకాలం జగన్ జైల్లో నిరభ్యంతరంగా ఉండొచ్చు. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి గాను తన శక్తియుక్తులన్నిటినీ ధారబోసిన సీబీఐ న్యాయవాది బయటకు రాగానే ‘‘అవసరమైతే నాలుగునెలల తరవాత కూడా మరింత గడువు ఇవ్వాలని కోరతాం’’ అని వ్యాఖ్యానించారు. దీనినిబట్టే అర్థమవుతోంది సీబీఐ ఎలాంటి పన్నాగాలు పన్నుతోందో! కుట్ర ఫలించడంతో కాంగ్రెస్‌కు, తెలుగుదేశానికి, ఎల్లో మీడియాకు, సీబీఐకి అపరిమిత ఆనందం కలిగి వుంటుంది. జగన్‌కు బెయిల్ రాలేదు కదా! అందుకు. కానీ ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న సామాన్య ప్రజానీకానికిది పిడుగుపాటు. ఏం జరుగుతుందో, ఇంకా ఏం జరగబోతుందో దిక్కు తెలియని స్థితి. జగన్ నిర్బంధంతో జనానికి సంకెళ్లు పడినట్లయింది!
ఒక ముఖ్యమంత్రిని నిర్దేశించగల అధికారం హైకమాండ్‌కి ఉంటుంది. కానీ ఒక ముఖ్యమంత్రి కుమారుడు మంత్రివర్గాన్ని, గవర్నమెంటుని నిర్దేశించగల సూపర్ నేచురల్ పవర్ అని కేవలం సీబీఐ హ్రస్వదృష్టికి మాత్రమే కనిపిస్తుంది. ఆర్థికశాస్త్రనిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నదేమంటే... ఇన్వెస్ట్‌మెంట్‌కీ ఆర్జనకీ మధ్య తేడా తెలియనట్లు సీబీఐ ప్రవర్తించడం. జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడి అతని అక్రమార్జన ఎలా అవుతుంది? కానేకాదు అన్నది కామన్‌సెన్స్. కానీ సీబీఐ ఏ మాత్రం కామన్‌సెన్స్ లేకుండా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు జగన్ అక్రమార్జన అని తేల్చింది. కంపెనీరూల్స్‌కి తాజా కొత్త భాష్యం ఏమంటే... ముఖ్యమంత్రి కుమారుడి కంపెనీల్లో ఎవరూ పెట్టుబడి పెట్టకూడదు!

ఇంతవరకూ ఏ ఎనలిస్ట్‌కీ అందని పాయింట్ ఇది! అలా పెట్టుబడి పెట్టినవారంతా దోషులేనట. ఈ లాజిక్ కేవలం సీబీఐకి మాత్రమే అర్థమౌతుంది. అలా ప్రజల్ని నమ్మించడానికి ఎన్ని టక్కుటమార విద్యలైనా ప్రదర్శించగలదు. ఈ డ్రామాకి సహాయ సహకారాలు అందిస్తున్నవాళ్లు సచ్ఛీలులు! వాళ్లు చేసే వ్యాపార, పారిశ్రామిక వ్యవహారాల్లో పెట్టుబడులన్నీ సక్రమార్జన. ఆహా! ఎంత అద్భుత విన్యాసం. ఏ కొమ్ములు తిరిగిన ఆడిటర్ జనరల్‌కీ అర్థం కాని అర్థశాస్త్ర వైచిత్రి. రాజశేఖరరెడ్డిగారు తాను జీవించినంతకాలం, తనకి సాధ్యమైనంత సహాయం చేస్తూ, తన శత్రువుని కూడా చేరదీసిన గొప్పవ్యక్తి. ఆయన ప్రవర్తనాసరళి తెలుసుకోవడానికి ఆయన స్వచ్ఛమైన నవ్వు చాలు. ఆయన జనాన్ని ప్రేమించారు.

జనం కోసం జీవించారు. ఆ జనం కోసమే మరణించారు. కానీ నేడు జరుగుతున్నదేమిటి? ఆయన్ని ద్వేషించేవాళ్లు, ఆయన పెంచి పోషించిన పార్టీ కలిసి ఆయన తనయుడు జగన్‌ని రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి సహాయసహకారాలు అందించేందుకు ఎల్లో మీడియా రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. పర్యవసానమే జగన్ నిర్బంధం, బెయిల్ రాకపోవడం. జగన్‌ని జనానికి దూరంగా ఉంచినందువల్ల వీరు ఆశించినట్లు ఏమీ జరగదు. పైగా జనమే జగన్‌కి దగ్గరవుతారు.

జగన్ ఈ రెండుసంవత్సరాల్లో జనంతో మమేకమైన విధానం, అతని వ్యవహారశైలి, తీసుకున్న నిర్ణయాలు... అతని నాయకత్వ లక్షణాలను ప్రజలందరికీ సుపరిచితం చేశాయి. ఒక నిర్ణయం తీసుకుంటే, హరిహరాదులున్నా లెక్కచెయ్యని ధీశాలి జగన్. అందుకే ఇన్ని కష్టాలు. అందుకే ప్రజల్లో అతని మీద ఇంత విశ్వాసం. పాలక ప్రతిపక్షాలని ప్రజలు సమూలంగా కూకటివేళ్లతో పెకలించి దూరంగా విసిరేసే రోజు ఒకటి వస్తుంది. అదెంతో దూరంలో లేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. సీతమ్మ వనవాస కాలం దాటాక, రావణ వధ. సీతమ్మవారి చెర తొలగించబడినట్లే, ప్రజాతీర్పు కోరే ఆ రోజుతో జగన్ కష్టాలు చెల్లు. జనానికి సంకెళ్లు తెగిపడే రోజు, ఈ ఆంధ్రదేశానికి పట్టిన చీడ వదిలే రోజు కూడా అదే.

- వి.నాగరాజాచార్యులు, మియాపూర్, హైదరాబాద్

వచ్చేది కాంగ్రెస్ సమాధి నామ సంవత్సరం

నేను ఆర్‌టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నాను. డ్యూటీ మీద ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు తిరుగుతుంటాను. జనం మాటలు, అభిప్రాయాలు, వాదనలు నేను విన్నదాని ప్రకారం ఇలా ఉన్నాయి. డెబ్బై శాతం ప్రజలు ఎన్నికలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. వారిలో తొంభై శాతం ప్రజలు కాంగ్రెస్ సమాధి కోరుకుంటున్నారు. ఇక చంద్రబాబు జైలు శిక్ష నుండి తప్పించుకోవటానికి కాంగ్రెస్‌తో చెయ్యి కలిపి, తనని నమ్ముకున్న టీడీపీ నాయకుల రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తున్నాడన్నమాట కూడా వినిపిస్తోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇవే మనకు ఆఖరి పదవులు అనే నిర్ణయానికొచ్చేశారు. అటువైపు చంద్రబాబు మాటకు విలువ లేదు, అతడిని ప్రజలే కాదు, ఆ పార్టీలోని వారు కూడా నమ్మడం లేదు. ఈ రెండు పార్టీలు కలిసి తమ దుష్ర్పచారాలతో జగన్ పార్టీకి మేలే చేస్తున్నాయి. ‘పాతాళభైరవి’ సినిమాలో విలన్, హీరోను దేవతకు బలివ్వబోతాడు. కానీ విలన్ చేతిలోనే బలైపోతాడు. జగన్‌మీద కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్‌కూ చివరికి అదే పరిస్థితి ఎదురవుతుంది.

- ఎ.వి.వి.ఎస్.ఎన్.మూర్తి, కాకినాడ

రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టండి..


సర్కారుపై షర్మిల ధ్వజం
ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు చదువులు మానేస్తున్నారు
వైఎస్ తెచ్చిన పథకాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది
పేదల కోసం పెట్టిన ఫీజుల పథకానికీ కిరణ్ సర్కారు తూట్లు పొడుస్తోంది
రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టండి..
‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కింది. పేదరికం పోవాలంటే ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదవాలనే గొప్ప ఆశయంతో వైఎస్సార్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి ఈ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. 

విద్యార్థులకు పాతిక శాతమిస్తాం... ముప్పాతిక శాతమిస్తాం అంటూ ఫీజులు భిక్షం వేసినట్లుగా వేస్తోంది. ఫీజులు కట్టలేక విద్యార్థులు చదువులు మానేసే రోజులు మళ్లీ వచ్చాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అమ్మా..! కొద్దిగా ఓపిక పట్టండి, త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. అంత వరకు మీ చదువులు ఆపొద్దు’’ అని ఆమె విద్యార్థులకు సూచించారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సాగింది. పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంలో జరిగిన రచ్చబండలో చిన్నారి అనే విద్యార్థిని మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేకుండానే డిగ్రీ పూర్తి చేశాను. ఇప్పుడు ఎమ్మెస్సీ జువాలజీ చేస్తున్నాను. ఇంత వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదు’’ అని చెప్పడంతో షర్మిల పై విధంగా స్పందించారు.

వడ్డీలేని రుణాలు ఎవరికి ఇస్తున్నారు?
షర్మిల యాత్రలో సాగుతుండగా దారి వెంట పలువురు మహిళలు కలిసి ఆమెకు తమ సమస్యలు వివరించారు. షర్మిల వారితో మాట్లాడుతూ.. ‘‘అమ్మా..! వడ్డీ లేని రుణాలు అందడం లేదని మీరు బాధపడుతున్నారు. పల్లెల్లో ఏ మహిళను అడిగినా కూడా అసలు మాకు రూణాలే అందటం లేదని చెప్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రేమో వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తున్నామని రూ. కోట్లు ఖర్చు చేసి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈ ముఖ్యమంత్రి వడ్డీలేని రుణాలు ఎవరికి ఇస్తున్నట్లు?’’ అని విమర్శించారు. ‘‘ఆమ్మా... అక్కా... సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధిచెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకానికీ జీవం పోస్తారు’’ అని షర్మిల వారికి ధైర్యం చెబుతూ ముందుకు కదిలారు.

రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి..
మార్గమధ్యంలో తనను కలిసి సమస్యలు చెప్పుకొన్న రైతులు, కూలీలతో షర్మిల మాట్లాడుతూ...‘‘రాబోయే రాజన్న రాజ్యంలో అన్ని వర్గాల వారికీ జగనన్న మేలు చేస్తారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేటట్టు, అవసరమైతే ప్రభుత్వమే పంట కొనుగోలు చేసేటట్టు రూ. 3 వేల కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. మన విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. పేదల కోసం ఆరోగ్యశ్రీని నిలబెడతారు. వృద్ధులకు, వితంతువులకు పింఛను రూ. 700 చేస్తారు. వికలాంగులకైతే రూ. 1,000 ఇస్తారు. పిల్లలను పనికి కాకుండా బడికి పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెడతారు. చిన్నారికి రూ. 500 చొప్పున పదో తరగతి వరకు తల్లి ఖాతాలో డబ్బులు వేస్తారు. ఇలా కుటుంబానికి ఇద్దరేసి పిల్లలకు పథకం వర్తింపజేస్తారు. ఇంటర్ చదివితే రూ. 700 చొప్పున, డిగ్రీ చదివితే రూ. 1,000 చొప్పున అమ్మ అకౌంట్లోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఉండనే ఉంది’’ అని షర్మిల ధైర్యం చెప్పారు.

12.2 కిలోమీటర్ల మేర యాత్ర..
పాదయాత్ర 144వ రోజు శుక్రవారం షర్మిల ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వీఎం బంజర శివారు నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి రామచంద్రరావు బంజర, మండాలపాడు, లంకపల్లి, కొత్తలంకపల్లి మీదుగా నడిచారు. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,929.6 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, జలగం వెంకటరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, నేతలు భానోతు మదన్‌లాల్, వైఎస్ కొండారెడ్డి, స్థానిక నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్ విజయకుమార్, సాదు రమేష్‌రెడ్డి, భూక్యా దళ్‌సింగ్, మెండెం జయరాజ్ ఉన్నారు.

పదేళ్ల కిందట ఇక్కడే వైఎస్ పాదయాత్ర..
మహానేత వైఎస్ చేపట్టిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చేరుకొని శనివారానికి సరిగ్గా 10 ఏళ్లు పూర్తవుతుండగా.. షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర కాకతాళీయంగా శనివారమే సత్తుపల్లికి చేరడం విశేషం. నాడు వైఎస్ పాదయాత్ర చేస్తూ సత్తుపల్లి బస్టాండ్ రింగ్‌సెంటర్ వద్ద బహిరంగసభలో ప్రసంగించి తాళ్లమడ గ్రామ శివారులో బస చేశారు. మరుసటి రోజున యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. షర్మిల కూడా శనివారం సత్తుపల్లి బస్టాండ్ రింగ్‌సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించి తాళ్లమడ శివారులోనే రాత్రి బస చేయనున్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశించనుంది.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
శుక్రవారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 144, కిలోమీటర్లు: 1,929.6

YS జగన్ బెయిల్ తీర్పులో కొన్ని సందేహాలు

జగన్ కేసులో సుప్రింకోర్టు నిర్దేశించిన నాలుగు నెలల గడువు కు కట్టుబడి ఉండాలని అనుకోవడం లేదా?సిబిఐ న్యాయ వాది అశోక్ భాన్ చేసిన వ్యాఖ్యలు సహజంగానే ఈ అనుమానాలకు తావిస్తాయి. నాలుగు నెలల్లో పూర్తి కావాలని అనేముంది. ఆరు నెలలు పట్టవచ్చు. అవసరమైతే మరో పిటిషన్ వేస్తామని భాన్ చెప్పిన తీరు విమర్శలకు గురి అవుతోంది. దీనిపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. సిబిఐ న్యాయవాదిగా కాకుండా కాంగ్రెస్ అదికార ప్రతినిధిలా అశోక్ భాన్ మాట్లాడారని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.తమ అదికారులు విదేశాలలో ఉన్నారని, సమాచారం వారికి అందుబాటులోకి రాకపోతే,మరింత గడువు కోరతామని ఆయన అన్నారు. 

                                          నిజానికి గతంలోనే సుప్రింకోర్టు జగన్ కేసులో సాధ్యమైనంత త్వరంగా పూర్తి చేయాలని కోరింది.మార్చి ముప్పై ఒకటి తేదీ గడువు పెట్టాలని కోర్టు భావిస్తే, జగన్ తరపు న్యాయవాదులు అది సుదీర్ఘకాలం అవుతుందని భావించి, దానికి అభ్యంతరం చెప్పారు.దాంతో ఆ గడువు ప్రస్తావన తీర్పులో లేదు.సాధ్యమైనంత త్వరగా అని మాత్రం పేర్కొన్నారు.విశేషం ఏమిటంటే అప్పటి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును ఇప్పటి న్యాయమూర్తులు పట్టించుకున్నట్లు కనబడదు. సిబిఐ కోరిన విదంగా మరో నాలుగు నెలల గడువు ఇవ్వడం ఆశ్చర్యంగానే ఉంటుంది. నిజంగానే సిబిఐ చేసిన వాదన ప్రకారం సుప్రింకోర్టుకు కూడా ఈ కేసులో ఆధారాలు కనిపించాయా?లేక సిబిఐకి ఇలాంటి విషయాలలో స్వేచ్చ ఇవ్వాలని భావించారా అన్న విషయం తెలియదు. అదే సమయంలో ఈ కేసులో అదికారంలో ఉన్న మంత్రులు కొందరికి ఇప్పటికే బెయిల్ ఇవ్వడమో, అరెస్టు చేయకుండా ఉండడమో జరిగింది.దాని గురించి సుప్రింకోర్టు ఎందుకు ప్రశ్నించదో అర్ధం కాదు. దీంతో సుప్రింకోర్టు తీర్పును విమర్శించే అవకాశాలు వచ్చాయి. అలాగే అశోక్ భాన్ హడావుడిగా ఒక ప్రత్యర్ధి న్యాయవాది గా మాట్లాడారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రచారం చేయడానికి అవకాశం కల్పించారు.ఒక కేసులో దర్యాప్తు సంస్థలు ఎంత కాలమైనా దర్యాప్తు చేసుకుంటూ పోవచ్చా?కొందరు నిందితులను వదలి, కొందరినే నిర్భందించడం వంటి వాటి ద్వారా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగడం లేదేమో అన్న భావన కలగడానికి ఆస్కారం కలిగించడం లేదా?ఇలాంటి ప్రశ్నలకు ఈ కేసులో సమాధానం రావడం లేదు.దాంతో ఇది రాజకీయ ప్రేరిత కేసుగానే జనం భావించే పరిస్థితి రావడం మాత్రం దురదృష్టకరం.

ప్రజలతరపున మరిన్నిపోరాటాలు: వైఎస్ఆర్

వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అధ్యక్షతన రాజకీయవ్యవహారాల కమిటీ సమావేశమైంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. తెలంగాణలో ఓదార్పుయాత్రపై కూడా చర్చించారు. ప్రజల తరపున మరిన్ని పోరాటాలు చేయాలని నిర్ణయించారు. త్వరలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ త్వరలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ను విజయమ్మ సందర్శిస్తారని చెప్పారు. 

Telangana area YSRCP plan to start Odarpu Yatra

అసలు ఆయనొక ఎంపీ అన్న సంగతి ఎవరికీ గుర్తున్నట్టులేదు!!


భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికీ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. వాటిలో ఓటు హక్కు, విద్యా హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, జీవించే హక్కు... ఇలా కొన్ని హక్కుల్ని భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికీ కల్పించింది. ఈ హక్కులకు అడ్డు తగులుతూ, కక్ష సాధింపు ధోరణితో వ్యక్తిని నిర్బంధించే హక్కు ఎవరికీ లేదు. అయితే జగన్ విషయంలో కాంగ్రెస్‌పార్టీ సీబీఐతో కుమ్మక్కై ఆయన ప్రాథమిక హక్కుకే భంగం కలిగేలా కుటిల రాజకీయాలకు పాల్పడుతోంది! ఇది రాజ్యాంగ ఉల్లంఘన తప్ప మరొకటి కాదు.

రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న యువనేత జగన్‌ను ఎదుర్కోవటానికి ఎన్ని కుయుక్తులు, ఎన్ని అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయో! నూట ఇరవై ఐదేళ్ల చరిత్ర కలిగి, రాజకీయాల్లో తలపండిన అతిరథ మహారథులు ఉన్న కాంగ్రెస్ పార్టీ; ముప్పై యేళ్ల రాజకీయానుభవం, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ... కడప లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన విషయం గుర్తొచ్చి, గుండెల్లో దడపుట్టి, జగన్‌కు ఎక్కడ ప్రజాదరణ పెరుగుతుందోనన్న భయంతో... ఈర్ష్య, కక్ష సాధింపులతో ఆయన్ని జైల్లో నిర్బంధించటం ఎంతవరకు న్యాయం?

కాంగ్రెస్, టీడీపీలకు ప్రజల మద్దతు ఉంటే, ప్రజలే కనుక వారిని కోరుకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచి సత్తా చూపించాలి కాని, అనవసరమైన వ్యర్థ ఆరోపణలతో, కుంటి సాకులతో జగన్‌ను జైల్లో నిర్బంధించటం ప్రాథమిక హక్కులను కాలరాయడమే! కాంగ్రెస్‌పార్టీ జగన్‌ను ఇలా అక్రమంగా జైల్లో నిర్బంధిస్తే, అంతకంతా వంద రెట్లు జగన్‌కు ప్రజాభిమానం పెరుగుతుందే తప్ప ఏమాత్రం తరగదు. న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని అంటారు. న్యాయమూర్తులైనా జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వొచ్చు కదా. జగన్ ఏమైనా దేశం విడిచి పారిపోతాడా? అసలు ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడన్న విషయం వీళ్లెవరికైనా గుర్తుందా? 

జగన్ ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారోనని కాంగ్రెస్, తెలుగుదేశం, ఎల్లో మీడియాల భయం. అయినా జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవటం తప్పు కాదే! ఆయనకు ఆ హక్కు లేదా? ప్రజా సంక్షేమానికి పాటుపడగల సామర్థ్యం ఉంది. ప్రజాదరణ ఉంది. అది తెలుసుకోకుండా ‘నవ్విపోదురుగాక నాకేటి’ అన్న చందాన కాంగ్రెస్, టీడీపీలు ప్రవర్తిస్తే, ప్రజలే తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ తందాన అంటే సీబీఐ తాన తందాన అనటం బాగా అలవాటైపోయింది. దీన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక వ్యక్తి స్వేచ్ఛను నిర్బంధించటం శోచనీయం. ఇదేనా మనం భావితరాలకు ఇచ్చే రాజకీయ సందేశం, ఉపదేశం!

- చింతపల్లి సత్యనారాయణ ప్రసాద్, భవానిపురం, విజయవాడ

జగన్ బయట ఉండి వుంటే వీళ్లు ఇన్నేసి మాటలు అనేవారా?!

ఒక వ్యక్తి బాణం వదిలితే, ఎదుటి వ్యక్తి మనోధైర్యం గలవాడైతే, ఆ బాణం వారిని తాకదు. తిరిగి ప్రయోగించిన వ్యక్తికే వచ్చి గుచ్చుకుంటుంది. జగన్‌పై మాటల బాణాలు సంధించినవారికి కూడా ఇదే పరిస్థితి. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలని రాజశేఖరరెడ్డిగారు అనేక సందర్భాల్లో చెప్పేవారు. ఒక మాట మాట్లాడితే దానిలో నిబద్ధత ఉండాలి, నోటికొచ్చినట్లు మాట్లాడితే అది మాట్లాడినవారికే అనర్థం అనేవారు. ఎదుటివారికి బాధ కలిగించే ఏ మాటలైనా క్షమించరానివి. 

అసలు జగన్ ఏం తప్పు చేశారని అందరూ ఇన్ని మాటలంటున్నారు? జగన్ ఆస్తులను అక్రమాస్తులు అనడమే తప్పు. వ్యాపారం సజావుగా సాగాలంటే పెట్టుబడులు రాబట్టాలి కదా. ఆ విధంగా వచ్చిన పెట్టుబడులన్నీ అక్రమాస్తులు అనడం సమంజసమేనా? సీబీఐ ఇంకా జగన్ ఆస్తుల విషయంలో ఒక నిర్థారణకు రాలేదు. నేటికీ అభియోగాలు మాత్రమే దాఖలు చేస్తోంది. అలాంటప్పుడు ‘అక్రమం’ అనే మాట ఎలా ఉపయోగిస్తారు. ‘జగన్ ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు, ఆ డబ్బుతో ఒక రాష్ట్రాన్నే కొనెయ్యగలడు’ అని కొందరు నాయకులంటున్నారు. ఒక నాయకుడైతే మరికాస్త ముందుకెళ్లి ‘జగన్‌కు పద్నాలుగేళ్లు జైలుశిక్ష వేయాలి’ అన్నాడు. 

ఇంకొకాయన ‘ఉరిశిక్ష’ వేయించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఏం మాటలండీ ఇవి? ఒకసారి ఆ వ్యక్తులు తమ బిడ్డలమీద ప్రమాణం చేసి చెప్పమనండి... జగన్ దోషి అని. రాజకీయ కక్షతో జగన్‌ని అణగదొక్కటానికి ఆయనపై అనేక రకాలుగా రాళ్లు వేస్తున్నారు. అవి ఎంతమాత్రం జగన్‌ను తాకవు. అసలు జగన్ జైల్లో కాకుండా, బయట ప్రజల్లో ఉండి ఉంటే, వీరు ఇన్ని మాటలు ధైర్యంగా అనగలిగేవారా? ఆ ధైర్యం వారికి ఉందా? గుండెల మీద చేతులేసుకుని చెప్పమనండి. ఏదైతేనేం. జగన్ మీద ఒక మబ్బు పొర కమ్ముకుని ఉంది. అది త్వరలో తొలగిపోయి, స్వచ్ఛమైన వ్యక్తిగా బయటకు వస్తారు. 

- టి.వి.సుబ్బారెడ్డి, కూకట్‌పల్లి, హైదరాబాద్

జానా రెడ్డి, డీఎస్ లకు చుక్కెదురు!

దర్పల్లి: కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, డీ శ్రీనివాస్ లకు చుక్కెదురైంది. నిజమాబాద్ జిల్లాలో కార్యకర్తల సమావేశంలో అధికారులు ఎందుకు పాల్గొన్నారని టీడీపీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ వెంకటేశ్వరగౌడ్‌, నర్సాగౌడ్, లు నిలదీశారు. నిజామాబాద్‌ జిల్లాలో దర్పల్లి మండలం లోలం గ్రామంలో మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌లు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు అధికారులను నిలదీశారు. దాంతో అక్కడినుంచి అధికారులు వెనుదిరిగి వెళ్లారు.

13న సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య పేరును ఎకె ఆంథోని అధికారికంగా ప్రకటించారు. అధిష్టానం ప్రతినిధులు ఆంటోనీ, అంబికా సోనీ ఇక్కడకు వచ్చి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తరువాత సిద్ధ రామయ్య పేరును ఆంథోని ప్రకటించారు. ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహిస్తారు.

టిడిపి అధికారప్రతినిధి 'ఈనాడు': అంబటి రాంబాబు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా 'ఈనాడు' వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో చంద్రబాబు పేరు రాయవలసిన చోట ఈనాడులో అప్పటి ముఖ్యమంత్రి అని రాశారని తెలిపారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కు కారు చౌకగా భూమి కట్టబెట్టింది చంద్రబాబు అని చెప్పారు. ఎకరం దాదాపు 4 కోట్ల రూపాయలు ధర ఉన్న సమయంలో కేవలం 29 లక్షల రూపాయలకే ఇచ్చారని వివరించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడుపై సిబిఐ ఎందుకు విచారణ జరపడంలేదని ఆయన ప్రశ్నించారు. 

కుట్ర వల్లే YS జగన్ కు బెయిల్ రాలేదు: బాలినేని

ఒంగోలు : టీడీపీ, కాంగ్రెస్ పార్టీల రాజకీయ కుట్ర వల్లే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రాలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సీబీఐ పక్షపాత వైఖరి మరోసారి రుజువైందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. జగన్ ఎప్పటికీ కాంగ్రెస్ కు లొంగడని... ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండలని బాలినేని సూచించారు. జగన్ త్వరలోనే బయటకు వస్తారని ఆయన తెలిపారు.

మంత్రుల విషయంలో ఓ విధంగా... జగన్ విషయంలో మరోలా సీబీఐ వ్యవహరించిందని బాలినేని అన్నారు. 2జీ కుంభకోణం వ్యవహారంలో నిందితులకు అనుకూలంగా సీబీఐ కాంగ్రెస్ డైరెక్షన్ లో నడుచుకుందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏదో రాజకీయం నడిపారని ప్రజలు అనుకుంటున్నారని బాలినేని అన్నారు. 

YS షర్మిలను కలిసిన జలగం వెంకట్రావు

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఉన్న షర్మిలను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కలుసుకున్నారు. సత్తుపల్లి మండలం మందాలపాడులో ఆయన పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు.

YS జగన్ వెంటే ఉంటా: చెరుకుపల్లి

వరంగల్ : రాజీనామా వార్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. ఎప్పటికీ వైస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటానని ఆయన శుక్రవారమిక్కడ స్పష్టం చేశారు. తనపై మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని చెరుకుపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.