హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొండా మురళీ,సురేఖ దంపతులు ఈరోజు ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలుస్తారు. మధ్యాహ్నం12 గంటలకు వారు చంచల్ గూడ జైలుకు వెళ్లి జగన్ తో మాట్లాడతారు.
ఎన్టీఆర్ విగ్రహా విష్కరణ సాకుతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి జగన్‌కు బెయిల్ రాకుండా చేశారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మారెప్ప ఆరోపించారు. నీచ రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఆయన ద్వజమెత్తారు. యూపీఏ కనుసన్నల్లో సీబీఐ పనిచేస్తోంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన పాలన అందించిన వైఎస్ఆర్ తనయుడిని సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని మారెప్ప అబిప్రాయపడ్డారు. వైఎస్ఆర్‌సీపీ గేట్లు తెరిస్తే టీడీపీ, కాంగ్రెస్‌లలో ఎవరూ మిగలరని మారెప్ప ఓప్రశ్నకు సమాధానమిచ్చారు.మారెప్ప ను గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గం నుంచి తొలగించారు. ఒక జడ్ పిటిసి ఎన్నికలో మారెప్ప నియోజకవర్గంలో ఓడిపోయినందుకుగాను మరో మంత్రి మాగంటి బాబుతో సహా ఈయనను కూడా పదవి నుంచి తప్పించారు. మాగంటి బాబు ఆవేశంతో పార్టీని వదలి వెళ్లిపోగా, మారెప్ప మాత్రం పార్టీలో కొనసాగి ఇప్పుడు వై.ఎస్.జగన్ కు మద్దతుగా నిలవడం విశేషం.
తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతున్న మాజీ మంత్రి కడియం శ్రీహరికి టిడిపి నేతలు శాపనార్దాలు పెడుతున్నారు. టిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆ పార్టీ అదినేత చంద్రశేఖరరావు ప్రాదాన్యత ఇవ్వరని వీరు వ్యాఖ్యానిస్తున్నారు. కడియం శ్రీహరి తత్వానికి కెసిఆర్ తో పడడం అంత తేలికకాదని వీరు అంటున్నారు. టిడిపి తెలంగాణ పోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ కడియం కు టిఆర్ఎస్ లో టిక్కెట్ దొరకడం కష్టమేనని అబిప్రాయపడ్డారు.కెసిఆర్ తన చుట్టూ తిప్పుకుంటారు తప్ప టిక్కెట్ ఇవ్వరని, ఆయన వాటిని అమ్ముకుంటారని , కడియం కు భంగపాటు తప్పదని అన్నారు.కెసిఆర్ డబ్బులు దండుకుంటున్నారని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా కెసిఆర్ ఉన్నారని ఆయన విమర్శించారు.
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలకు సిబిఐపై తోపాటు కోర్టుల మీద కూడా చాలా కోపం వస్తోంది.కాని నేరుగా కోర్టులను విమర్శిస్తే ఏమి ఇబ్బందులు వస్తాయో నని భయపడుతున్నట్లు ఉన్నారు. అయినా ఒక్కోసారి కొన్ని మాటలు వదలి మళ్లీ వెనక్కి తీసుకుంటున్నారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత జూపూడి ప్రభాకరరావు సుప్రింకోర్టు బెయిల్ ఇవ్వకుండా నిర్ణయం చేసినప్పుడు జూపూడి టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఏదో చేశారన్నట్లుగా ఆరోపణ చేశారు. రెండు రోజులపాటు డిల్లీలో ఏమి చేశారని ప్రశ్నించారు. ఆ తర్వాత అది కోర్టు దిక్కారం కింద వస్తుందని టిడిపి నేత యనమల ప్రభృతులు హెచ్చరించారు. కారణం ఏమైనా కాని జూపూడి తన వ్యాఖ్యలను సవరించుకున్నారు.తనకు సుప్రీంకోర్టుపై గౌరవముందని , చంద్రబాబు ఢిల్లీలో ఏం చేశారని ప్రశ్నించాను తప్ప, న్యాయస్థానంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని జూపూడి వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌కు బెయిల్ రాకుండా చేశారని ఆరోపించారు.
మొత్తానికి జగన్ కేసు ద్వారా కాంగ్రెస్ ఒక సంకేతాన్ని పంపించింది. ‘అవినీతిపరులు మా కాంగ్రెస్ లీడర్లయితే రక్షిస్తాం. మమ్మల్ని కాదన్నవారు అమాయకులైనా సరే వారిపై తప్పుడు కేసులు బనాయించి నెలలతరబడి జైళ్ళలో మగ్గబెట్టి శిక్షిస్తాం’.
ఆహా... ఎంతటి గొప్ప సందేశాత్మక సంకేతం! అయినా కాంగ్రెస్ వారు కేసుల బూచిని చూపితే జగన్ భయపడిపోయి కాంగ్రెస్ పంచన చేరతాడన్నది భ్రమ. చంద్రబాబు అంతటివాడే కాంగ్రెస్ చేయి అందుకున్నాడు కదా, జగన్ ఎందుకు అందుకోడని కాంగ్రెస్ నాయకుల ఆశ్చర్యం. చంద్రబాబుది అవకాశవాద పోరాటం. జగన్‌ది అసలైన పోరాటం. అందుకే ఆయన కాంగ్రెస్ పంచన చేరడు. ‘వజ్ర సంకల్పం గల యువకులు, ధీరోదాత్తత కల్గిన వ్యక్తులే ఈ సమాజాన్ని మార్చగలరు’ అన్న స్వామివివేకానంద మాటకు జీవంపోసే జగన్ ప్రభంజనాన్ని ఏ కుట్రలు కుతంత్రాలు అడ్డుకోగలవు? నిత్యం రెండు పత్రికలు, కొన్ని ఛానల్స్ ఎన్ని అసత్యాలను వండి వార్చినా విజ్ఞత కలిగిన ప్రజలకు తెలీదా! వారెప్పుడూ చైతన్యవంతులే! తమ అభిరుచులకి, ఆశయాలకి, ఆదర్శాలకి ఎవరు దగ్గరగా ఉన్నారో వారికి తెలుసు. తమకోసం ఎదురునిలిచి పోరాడే ధైర్యం, శక్తి ఒక్క జగన్‌కే ఉన్నాయని వారికి తెలుసు. అందుకే జగన్ వెంట జనం... జనం ఆశయాల రూపంగా జగన్ ఉన్నారు. కాంగ్రెస్ ఎన్ని సంకేతాలు పంపినా ప్రజలు చూపించే విజయసంకేతం ఒకటే. ‘మా నాయకుడు జగన్. మీరెవ్వరూ కాదు’ అనే సందేశం ఒక్కటే. - జి.పి. ప్రభాకర్, మంటాడ, కృష్ణా జిల్లా
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత అవినీతిమయ పాలనకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నేతృత్వం వహిస్తున్నారని సీపీఎం దుయ్యబట్టింది. బొగ్గు, 2జీ కుంభకోణాల్లో ప్రధాని.. తన పాత్రతోపాటు ఆయన కార్యాలయ పాత్ర ఏమిటో చెప్పాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ డిమాండ్ చేశారు. ‘బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంతోపాటు 2జీ స్కాంలో ప్రధాని పాత్ర ఏమిటి? ఈ రెండు వ్యవహారాల్లో పీఎంఓ ఎలాంటి పాత్ర పోషించింది అనే విషయాలను మన్మోహన్ తెలియజేయాలి’’ అని సోమవారమిక్కడ విలేకరులతో అన్నారు. బొగ్గు శాఖను ప్రధానే నేరుగా చూసినందున ఆయన తన బాధ్యత నుంచి తప్పించుకోలేరని స్పష్టంచేశారు.
వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ధ్వజం నాడు ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాన్ని చేజార్చుకున్నారు ఇప్పుడు మంత్రులను తొలగించమని గవర్నర్‌ను కోరడమా!
హైదరాబాద్: శాసనసభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే పడగొట్టే బంగారంలాంటి అవకాశాన్ని చేజార్చుకుని.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ గవర్నర్ వద్దకెళ్లి మంత్రులను తొలగించాలంటూ వినతిపత్రం ఇవ్వడం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆడుతున్న పెద్ద డ్రామా అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడిమాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంనాటికే మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చిందని, అప్పటికే మిగతా మంత్రులను కూడా సీబీఐ విచారించిందని, అయినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఇప్పుడు గవర్నర్‌ను కలిసి ఆయనేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు భ్రమలు కల్పించడమెందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పై చంద్రబాబు పైపై విమర్శలు చేస్తూ లోలోపల మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్న విషయాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని చెప్పారు. నిజంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి ఉండేవారని, ఆరోజే ప్రభుత్వం పడిపోయేదని చెప్పా రు. ఇప్పుడు మంత్రులను తప్పించాలని గవర్నర్‌ను కోరుతున్న చంద్రబాబు.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగినాటికి, ఇప్పటికి అదే మంత్రుల విషయంలో ఏం మార్పు వచ్చిందో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్‌కు ఏదైనా అయితే తెగ బాధపడిపోయే చంద్రబాబు ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు. సీబీఐ పంజరం లో చిలుక అని, కేంద్రం అడుగుజాడల్లో నడుస్తోందని సుప్రీంకోర్టు అన్నప్పుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదని, ఆరోజు కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. సిగ్గుమాలిన రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందని ధ్వజమెత్తారు. వారి కుట్రలో స్పీకర్ భాగస్వాములు కావద్దు విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్లేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో కాలయాపన చేసి ఉప ఎన్నికలు జరగకుండా చూడాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కలిసి పన్నుతున్న కుట్రలో భాగస్వాములు కావొద్దని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు విజ్ఞప్తి చేశారు. తమను ఈ ఏడాది జూన్ 2 తర్వాత అనర్హులుగా చేస్తే ఉప ఎన్నికలు రావని, తమ నియోజకవర్గాల ప్రజలు శాసనసభలో ప్రాతినిధ్యం లేని వారవుతారని తెలిపారు. అందువల్ల తమ అనర్హత విషయంలో జాప్యం చేయవద్దని కోరారు. తాము అవిశ్వాసంపై ఓట్లేసి రెండు నెలలు కావస్తున్నా, నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. తాము స్పీకర్ నోటీసులకు స్పందించి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం ఏమాత్రం లేదని, తమ వైఖరి ఏమిటో వ్యక్తిగతంగా తెలిపామని, మళ్లీ సోమవారం కూడా ఫ్యాక్స్ ద్వారా తెలిపామని చెప్పారు. స్పీకర్ సమక్షంలోనే విప్‌ను ధిక్కరించాక ఇంకా వ్యక్తిగతంగా హాజరై తెలపాల్సింది ఏముంటుందన్నారు. స్పీకర్ ఇచ్చిన 15 రోజుల సమయం కూడా పూర్తయిందని, అనవసరంగా నోటీసులు ఇచ్చి కాలయాపన చేస్తున్నారని మరో ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు రాకుండా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, తక్ష ణం తమను అనర్హులుగా ప్రకటించాలని కోరారు.
ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 148వ రోజు మంగళవారం 11.8 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. చింతలపూడి మండలం పాత చింతలపూడి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కృష్ణానగర్ చేరుతుందని పేర్కొన్నారు. పర్యటించే ప్రాంతాలు పాత చింతలపూడి, చింతలపూడి, తీగలవంచ, కృష్ణానగర్
వరంగల్ జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ముఖ్య నేతలు కొండా మురళీ,సురేఖ దంపతులు మంగళవారం నాడు జగన్ ను కలవబోతున్నారు. ముందుగా వారు విజయమ్మతో భేటీ అయ్యారు. ఆ తర్వాత రేపు జగన్ తో ములాఖత్ లో కలవడానికి సిద్దమవుతున్నారు. గత కొద్ది రోజులుగా వీరు పార్టీని వదలుతారని, అసంతృప్తితో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాంగ్రెస్,బిజెపి వంటి పార్టీలవైపు వెళుతున్నారని కూడా ప్రచారం జరిగింది.చివరికి గొడవలు సద్దుమణిగి వారు రాజీకి వచ్చారని అనుకోవాలి. లేకుంటే జగన్ ను కలవడానికి వారు వెళతారా?
తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలవరాదని నిర్ణయించుకున్నారు.వీరంతా అవిశ్వాస తీర్మాన సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందున వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ కోరింది. అయితే వీరంతా ఇప్పటికే మనోహర్ ను కోరి తమ అబిప్రాయం చెప్పారు. ఉప ఎన్నికలు వచ్చేలా వెంటనే అనర్హత వేటు వేయాలని కోరినా స్పీకర్ దీనిపై ఒక నిర్ణయం ఇంకా తీసుకోలేదు.దీంతో ఇప్పుడు అనర్హత వేటు వేసినా,ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండదు. ఈ నేపధ్యంలో స్పీకర్ మనోహర్ చేసే విచారణకు స్వయంగా హాజరు కావలసి ఉన్నా, హాజరు కారాదని నిర్ణయం తీసుకుని ఆ మేరకు వారు ఫాక్స్ ద్వారా తమ అబిప్రాయం చెప్పారు.సుజయరంగారావు, ఆళ్లనాని, రాజేష్,తదితరులు తొమ్మిది మంది అప్పట్లో విప్ ఉల్లంఘించారు.వీరంతా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు.
కర్నాటక ముఖ్యమంత్రిగా పిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగలూరు కంఠీవర స్టేడియంలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించారు.పెద్ద ఎత్తున తరలివచ్చిన సిద్దరామయ్య అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల కోలాహలం మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు.కాంగ్రెసేతర రాజకీయాలలో చాలాకాలం ఉన్న సిద్దరామయ్య చివరికి కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి కావడం విశేషం. సిద్దరామయ్య ఒక్కరే ప్రమాణం చేశారు. ఇతర మంత్రివర్గ నిర్మాణం ఇంకా మొదలు కాలేదు.