Monday, 20 May 2013

గోతిలో కాంగ్రెస్ నేతలే పడ్డారు


వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ తీసిన గోతిలో కాంగ్రెస్ వారే పడుతున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అదికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. జగన్ ను ఎక్కువకాలం జైలులో ఉంచే కుట్రతోనే ఇప్పుడు దర్మాన, సబితలతో రాజీనామాలు చేయించారని ఆయన అన్నారు.జగన్‌పై కుట్రలు బయటపెడితే జైలుకు పంపుతామని ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారని రాంబాబు తెలిపారు. ధర్మాన, మరో మంత్రి పార్థసారధికి కోర్టు జైలు శిక్ష విధించినా .. ఇంకా మంత్రి పదవిలో ఉండటం దారుణమని అంబటి వ్యాఖ్యానించారు. 
. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీల కూటమి పాలన కొనసాగుతోందని అంబటి విమర్శించారు. గవర్నర్, రాష్ట్రపతిలను చంద్రబాబు కలవడం కాంగ్రెస్‌ గేమ్ ప్లాన్‌లో భాగమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేస్తాయని అంబటి అంటున్నారు.

దిగివస్తున్న బంగారం ధరలు


ముంబయి : నిన్న మొన్నటి వరకూ ఆకాశాన్నంటిన పసిడి ధరలు క్రమక్రమంగా దిగివస్తున్నాయి. బంగారం ధర 23,500 రూపాయలకు వస్తుందని నిన్న పలువురు మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. గతరాత్రి 10 గ్రాముల ధర బాగా కోలుకుంది. ఎంసీక్స్ లో నిన్న ఒక దశలో 24 క్యారెట్ల ధర 25,400 రూపాయలకు వచ్చింది. అలాంటిది రాత్రి ట్రేడింగ్ ముగిసే సమాయానికి ధర 350 రూపాయల నష్టాన్ని పూడ్చుకోవడమే కాకుండా.. మరో 237 రూపాయలు పెరిగి 26 వేల 72 రూపాయల వద్ద ముగిసింది. 

అంతర్జాతీయ మార్కెట్లో నిన్న ఔన్స్ ధర కనిష్ఠ స్థాయి 40 డాలర్లకు పైగా పెరగడంతో మన మార్కెట్లో పసిడి ధర కనిష్ఠ స్థాయి 600 రూపాయలకు పైగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌లో బలహీనత లేనప్పటికీ అనూహ్యంగా ఔన్స్‌ బంగారం ధర కోలుకుంది. ప్రస్తుతం 1387 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. 

అయితే 8 రోజులుగా బంగారం ధర పడుతూ రావడం వల్ల ఇన్వెస్టర్లు షార్ట్‌ కవరింగ్‌ చేశారని ఫలితంగానే ధర పెరిగిందని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. మరో వైపు రూపాయి నిన్న 20 పైసలు నష్టపోవడం కూడా మన మార్కెట్లో బంగారం ధర పెరగడానికి కారణమైంది.

షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా


ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 155వ రోజు మంగళవారం 11.8 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని వెల్లమిల్లిలో ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని ముదునూరుపాడు చేరుతుందని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్‌లో సభ జరుగుతుందన్నారు. 

పర్యటించే ప్రాంతాలు :
వెల్లమిల్లి, పెదతాడేపల్లి, తాడేపల్లిగూడెంలోని గొల్లగూడెం సెంటర్, తాలూకా ఆఫీస్ సెంటర్, పోలీస్ ఐలండ్ సెంటర్, జయలక్ష్మి థియేటర్ సెంటర్, ముదునూరుపాడు 

నేడు ‘ప్రాణహిత’కు YSవిజయమ్మ


- ప్రాణహిత-చేవెళ్ల సత్వర సాధన కార్యాచరణలో భాగంగా పర్యటన
- ప్రాజెక్టు శిలాఫలకానికి పాలాభిషేకం
- అనంతరం కాగజ్‌నగర్‌లో బహిరంగ సభ
హైదరాబాద్: తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి తలపెట్టిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేసిన ప్రదేశాన్ని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మంగళవారం సందర్శించనున్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతిగా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టు సత్వర సాధన కార్యాచరణలో భాగంగా ఆమె అక్కడకు వెళుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారిగా 2008 మే 26న అదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దుల్లో గల తుమ్మిడిెహ ట్టి గ్రామం వద్ద ప్రాణహిత నది ప్రారంభమయ్యే చోటును సందర్శించి అక్కడ పుష్కలంగా ఉన్న నీటిని తెలంగాణలో వినియోగంలోకి తేవాలని అభిలషించారు.

ఆ తరువాత అదే సంవత్సరం డిసెంబర్ 17న మళ్లీ అక్కడకు వెళ్లి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైఎస్ సంకల్పించిన ఈ ప్రాజెక్టు ద్వారా 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అం దుతుంది. ఇంతటి బృహత్తరమైన ప్రాజెక్టు వైఎస్ మరణించిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. పోల వరంతో పాటుగా ఈ ప్రాజెక్టును కూడా జాతీ య ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వంతో ప్రకటింపజేయాలని వైఎస్ భావించారు. ఆయన మరణానంతరం నేతల అలసత్వం, అశ్రద్ధ కారణంగా ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా లభించడం లో జాప్యం జరుగుతూ వస్తోంది. తెలంగాణ ప్రజల జీవగర్ర కాగల ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలని విజయమ్మ డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు నిర్మాణానికి శిలాఫలకం వేసిన చోటును సందర్శించనున్నారు.

ధర్మాన,సబిత ల రాజీనామాల పెండింగ్


మంత్రి దర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా పత్రాలను పెండింగులో ఉంచారు.మరో నాలుగు నెలల గడువు ఇవ్వాలని, అప్పటికీ కోర్టులో తమకు అనుకూలంగా రాకపోతే రాజీనామాలను ఆమోదించవచ్చని దర్మాన ప్రసాదరావు ప్రతిపాదించారు.ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి కిరణ్ ఈ విషయాలను పేర్కొంటూ సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ కు నివేదిక పంపారని కదనం.అయినా ఈ దశలో ఆమోదించకుండా ఉంటారా అన్నది చర్చనీయాంశం. ఈ రోజు ధర్మాన పుట్టిన రోజు కనుక ఇవ్వాళకు ఆపవచ్చు. రెండు రోజులలో ఆమోదం పొందవచ్చని అంటున్నారు. అధిష్టానం ఈ విషయంలో గట్టిగా ఉండాలని భావిస్తోందని చెబుతున్నారు.అయితే కిరణ్ వారి విజ్ఞప్తిని అంగీకరించిన నేపధ్యంలోనే దర్మాన ప్రసాదరావు, సబితలు ఆయనకు బహిరంగంగా దన్యవాదాలు చెప్పారని అనుకోవచ్చు.

అది వైఎస్ ఒక్కరి నిర్ణయం కాదు:ధర్మాన ప్రసాదరావు

హైదరాబాద్: భూ కేటాయింపులు ఆ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కరి నిర్ణయం కాదని రాజీనామా చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొనేవారందరూ దోషులుకాదని ఆయన అన్నారు. క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. '' పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేపని నేను ఏనాడూ చేయలేదు. వాన్ పిక్ కు భూమి ఇవ్వాలన్నది నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కరి నిర్ణయం కాదు. భూమి ఎవరికివ్వాలన్నది ఐ అండ్ ఐ శాఖ నిర్ణయం. వాన్ పిక్ విషయంలో నోడల్ ఏజెన్సీ ఐ అండ్ ఐ శాఖ మాత్రమే. వాన్ పిక్ భూ కేటాయింపుల్లో నేను సొంతనిర్ణయం తీసుకోలేదు. మంత్రి మండలి నిర్ణయం మేరకే రెవెన్యూ మంత్రిగా తాను వాన్ పిక్ భూ కేటాయింపులపై సంతకం చేశాను. ఈ వ్యవహారంతో రెవెన్యూశాఖకు సంబంధంలేదు. రెవెన్యూశాఖ తప్పులేదని త్వరలో తేలుతుంది. పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందిలేకుండా ఉండేందుకే సిబిఐ ఛార్జిషీటు వేసిననాడే ఆగస్టులోనే నేను రాజీనామా చేశాను. ఆ రాజీనామాకు కట్టుబడి ఉన్నాను. సిబిఐ మమ్మల్ని దోషులుగా పేర్కొనలేదు. ఆరోపణలు వచ్చినంత మాత్రాన దోషులుగా పరిగణించకూడదు. 'ఐఎంజీ భారత' ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్ర బాబు భూములు కేటాయించారు. కోర్టు మమ్మల్ని తప్పు పట్టి శిక్షవిధిస్తే అప్పుడు మేము కళంకితులం అవుతాము. క్విడ్ ప్రోకో అంశాన్ని నావద్ద సిబిఐ ప్రస్తావించలేదు. కొన్ని సాంకేతికాంశాలను మాత్రమే సిబిఐ ప్రస్తావించింది. అవగాహనలేని పేపర్లు మమ్మల్ని అవినీతి మంత్రులని అంటున్నాయి. మేము నిర్ధోషులమని త్వరలో కోర్టులో తేలుతుంది.'' అని ధర్మాన చెప్పారు. 

రాజీనామాలు ఇచ్చిన ధర్మాన, సబిత

హైదరాబాద్: తమ రాజీనామాలపై కొనసాగుతున్న హైడ్రామాకు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి తెర దించారు. తమ రాజీనామాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఇరువురు మంత్రులు సీఎంను కలిసి రాజీనామా లేఖలు ఇచ్చారు.

వికలాంగులను మోసం చేసిన చిరంజీవి

హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవి వికలాంగులను మోసం చేశారని వికలాంగుల హక్కుల వేదిక ఆరోపించింది. ఒక వికలాంగుడి చేత పార్టీ జెండా ఆవిష్కరించుకున్న చిరంజీవి వారి సంక్షేమానికి ఏమీ చేయలేదని పేర్కొంది. అటువంటి చిరంజీవిని బర్తరఫ్ చేయాలని వేదిక డిమాండ్ చేసింది. 

ఇంకా ప్రధాని మౌనంగానే ఉంటారా! YSభారతి ప్రశ్న


ప్రధాని మన్మోహస్ సింగ్ కు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సతీమణి వై.ఎస్.భార్య రాసిన లేఖ ఆసక్తికరంగా ఉంది.తొలుత ఏబై రెండో ప్రతివాదిగా ఉన్న జగన్ ను ఒకటో నిందితుడు గా చేశారని, అలాగే మొదట మూడు నెలల సమయం కావాలన్న సిబిఐ, ఆ తర్వాత ఎనిమిదినెలల తర్వాత కూడా మరో నాలుగు నెలలగడువు కావాలని కోరడం నుంచి సిబిఐ న్యాయవాది అశోక్ భాన్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ప్రదాని దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రధాని మౌనంగా ఉండడం కాకుండా సమాధానం ఇవ్వాలని ఆమె కోరారు.జగన్ కేవలం ఒక నిందితుడే కాదు. ఎమ్.పి కూడా . ఆయన భార్య రాసిన లేఖకు ప్రదాని జవాబు చెప్పవలసిన నైతిక బాద్యత ఉంటుంది. మరి మన్మోహన్ సింగ్ సమాధానం ఇస్తారా అన్నది ఆసక్తికరమైన అంశంగా ఉంది.భారతి ప్రదానికి రాసిన లేఖను యధాతధంగా ఇస్తున్నాము.
సర్,
ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన ఉపఎన్నికల ప్రచారం చేస్తుండగా 2012 మే 27న నా భర్త వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేశారు. అప్పటి నుంచీ అంటే ఏడాది కాలంగా ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి మీకు తెలిసిందే. ఓ భర్త కోసం ఎదురుచూస్తున్న భార్యగా, ఓ తల్లిగా నేను మీకు ఈ లేఖ రాస్తున్నాను. మిమ్మల్ని గురుతర బాధ్యతల్ని నిర్వర్తించేందుకు శాయశక్తులా యత్నించే వ్యక్తిగా భావిస్తూ కూడా నేను ఈ లేఖ రాస్తున్నాను. ఈ కేసులో ఇటీవలి పరిణామాలు మా అందరినీ దిగ్భ్రాంతికి, భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఈ లేఖ రాయక తప్పడం లేదు. ఈ కేసులో దర్యాప్తు తీరు మమ్మల్ని తీవ్రంగా బాధిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనల ప్రకారం జరగడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించి (ఆర్‌సీ: 19ఏ/2011-సీబీఐ-హైదరాబాద్) గడచిన 22 నెలలుగా దర్యాప్తు సాగుతోంది. ఈ దర్యాప్తు పూర్తి చేయడానికి మూడు నెలల గడువు కావాలని 2012 అక్టోబర్‌లో సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. అది జరిగిన 8 నెలల తర్వాత.. అంటే 2013 మే నెలలో బెయిల్ కోసం మేము సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు.. దర్యాప్తు పూర్తి చేయడానికి మరో 4 నెలలు కావాలని సీబీఐ కోరింది. దీంతో దర్యాప్తు పూర్తి చేయడానికి మరో 4 నెలల గడువును సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ తర్వాత మాత్రమే జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ బెయిల్ కోరవచ్చని పేర్కొంది.

అయితే, తీర్పు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే సీబీఐ న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు పూర్తి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దిష్ట కాల పరిమితికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని, గడువు పొడిగించడానికి అవసరమైన కారణాలు తాము వెతుకుతామని సంకేతాలిచ్చారు. దర్యాప్తును చిత్తశుద్ధితో పూర్తి చేయాలన్న ఆలోచన సీబీఐకి ఏ మాత్రమూ లేదని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సీబీఐ పనితీరు ఆత్మ ప్రబోధానుసారం సాగుతోందనిగాని లేదా స్వతంత్రంగా సాగుతోందనిగాని నాకు అనిపించడం లేదు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ఫుటేజ్ ఉన్న డీవీడీని ఈ లేఖతో జతచేసి మీకు పంపిస్తున్నాను.

తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లతో సాగుతున్న సీబీఐ దర్యాప్తునకు సంబంధించి, నా భర్త నిర్బంధానికి సంబంధించి పలు వాస్తవాలను మీ ముందు ఉంచదలిచాను. అవి..

* దర్యాప్తు జరిపిస్తున్న హయాం అంటే.. 2004-09 కాలంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో నా భర్తకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆయన ఎంపీ కాదు. ఎమ్మెల్యే కూడా కాదు. ఆ సమయంలో.. అంటే 2001 నుంచి మేము బెంగళూరులో నివసిస్తున్నాం. నిజాయితీ కలిగిన వ్యక్తిగా, ఓ మంచి వ్యాపారవేత్తగా ఆయన పలు ప్రాజెక్టులు మొదలుపెట్టారు. జల విద్యుత్ కేంద్రాల్లో వివేచనతో పెట్టుబడులు పెట్టారు.

* మా మామగారు మరణించిన 15 నెలల తర్వాత, కాంగ్రెస్ పార్టీని జగన్ విడిచిపెట్టిన నెల తర్వాత, ఆ పార్టీ ఎమ్మెల్యే పి.శంకర్రావు.. ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. దివంగత వైఎస్సార్‌పైన, జగన్‌పైన ఆ లేఖలో పలు ఆరోపణలు చేశారు. అయితే మా మామగారి ప్రభుత్వంలో ఆయన భాగంగా ఉన్న 6 సంవత్సరాల్లో ఏ రోజూ ఆయన ఈ ఆరోపణలు చేయలేదు. ఆయన లేఖ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)గా మారిన వెంటనే ఆయనకు రివార్డులు అందాయి. రాష్ట్ర క్యాబినెట్‌లో ఆయన మంత్రి పదవి అందుకున్నారు. ఆ తర్వాత ఆయన పిటిషన్‌లో తెలుగుదేశం పార్టీ ఇంప్లీడ్ అయ్యింది. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని స్పష్టమైంది.

హైకోర్టు తీర్పులో నా భర్త జగన్ 52వ ప్రతివాది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వానికి సంబంధించిన ఇతరులు 1 నుంచి 15 వరకు ప్రతివాదులుగా ఉన్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగా స్పందించరాదని నిర్ణయించుకుంది. స్పందించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ, జీవించి లేని వ్యక్తిపై దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆయన మరణించిన 15 నెలల తర్వాత, ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీని వదిలేసిన తర్వాత ఇది చోటుచేసుకుంది.

* రాష్ట్ర ప్రయోజనాల కోసం తన సహచరులతోపాటు తాను తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకోవడానికి మా మామగారు ఇప్పుడు జీవించి లేరు. బాధాకరమైన విషయమేంటంటే.. ఆయన కేబినెట్ సహచరులందరూ ఇప్పుడు జీవించే ఉన్నప్పటికీ, స్వేచ్ఛగా బయట తిరుగుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్నప్పటికీ.. నాడు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధమూ లేని నా భర్త మాత్రం జైల్లో మగ్గుతున్నారు. ఆయన ఒక ఎంపీ అయినప్పటికీ కూడా..‘‘దర్యాప్తును ప్రభావితం చేస్తారు’’ అని, ‘‘శక్తిమంతుడు’’ అని సాకులు చెబుతూ ఆయన్ను జైల్లోనే ఉంచుతున్నారు.

* జగన్ ప్రభుత్వంలో లేకపోవడంతో.. ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వివరణ ఇచ్చే స్థితిలో ఆయన లేరు. ప్రస్తుత మంత్రులకు మాత్రం ఆ అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం వారి వ్యాజ్యాలకయ్యే ఖర్చులను భరించాలని నిర్ణయించుకోవడం ద్వారా వారికి క్లీన్‌చిట్ ఇచ్చేసింది. మరో విషయమేంటంటే, ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారమే ఆ జీవోలన్నీ జారీ అయ్యాయంటూ ఆయా మంత్రులు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

* సీబీఐ దర్యాప్తు అధికారి జాయింట్ డెరైక్టర్ ఉద్దేశపూర్వకంగా ఈ కేసును జాప్యం చేస్తున్నారని విశ్వసిస్తున్నాను. నా భర్త నేతృత్వంలోని రాజకీయ పార్టీ ఇదే అంశా న్ని బయటపెట్టింది. నా భర్తకు, పార్టీకి వీలైనంత ఎక్కువగా నష్టం కలిగించేలా ఆయన దర్యాప్తుపై ఏకపక్ష సమాచారాన్ని, నిర్దిష్ట లీకులను ఇచ్చారు. దీనిపై పలువురితోపాటు పార్టీ కూడా నిరసన వ్యక్తంచేసింది. సీబీఐ దురుద్దేశపూరిత వైఖరిపై ఇదివరకే ఫిర్యాదు చేశాం. వ్యతిరేక వార్తలు రాస్తూ నా భర్తకు, ఆయన పార్టీకి శత్రువుల్లా వ్యవహరించే నిర్దిష్ట మీడియా సంస్థలకు జాయింట్ డెరైక్టర్ చేసిన 500కుపైగా ఫోన్ కాల్స్ వివరాల జాబితాను కూడా ఆ ఫిర్యాదుకు జతచేశాం. నా భర్త ప్రతిష్టకు భంగం కలిగించే హక్కు వీరికి ఎవరిచ్చారు?

సాక్షి అనేది నకిలీ ఇన్వెస్టర్లు తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బునుదాచుకునేందుకు.. రాత్రికి రాత్రి పుట్టించిన డమ్మీ కంపెనీ కాదు. ప్రారంభమైన ఐదేళ్లలోపే ‘సాక్షి’ 1.43 కోట్ల మంది పాఠకులను ఆకట్టుకుని.. ఈ రోజు దేశంలోనే ఏడో స్థానంలో నిలిచింది. ఇందులో పెట్టుబడులు పెట్టిన వారందరూ రెండింతలు లాభం పొందారు. వారి వాటా ధ్రువపత్రాలన్నీ కూడా వారి వద్దే ఉన్నాయి. వారికి నచ్చినప్పుడు నచ్చినవారికి తమ వాటాలను అమ్ముకునే స్వేచ్ఛ వారికుంది. రూ. 1,800 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న ‘ఈనాడు’ సంస్థ రూ. 100 విలువైన వాటాను రూ. 5.26 లక్షలకు విక్రయించినప్పటికీ.. ‘సాక్షి’ విలువను ‘ఈనాడు’ విలువలో సగానికే మదింపు చేశారు. అయినప్పటికీ ఇది తప్పన్నట్లు సీబీఐ ప్రశ్నిస్తోంది. వాటాదారులకు లాభాలు తెచ్చిపెట్టినందుకు, 40 వేల మందికిపైగా కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నందుకు నా భర్తను ఏకాకిని చేసి వేధిస్తున్నారన్నది సుస్పష్టం.

* సీబీఐ దర్యాప్తులో ముఖ్యమైన వాన్‌పిక్ ప్రాజెక్టు.. కాల్దర్-హిక్స్ ఎఫిషియెన్సీ సిద్ధాంతానికి(దీని గురించి మీకు బాగా తెలిసి ఉంటుందని నేను భావిస్తున్నాను) అద్దం పడుతోంది. ఇదే ప్రాజెక్టు గురించి మీకు రస్ అల్ ఖైమా ప్రభుత్వం లేఖ రాసింది కూడా. ఆంధ్రప్రదేశ్‌లోని బాగా వెనుకబడిన రెండు జిల్లాలను అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులను చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తులకు/ప్రభుత్వాలకు ఇచ్చిన ఉదంతాలు ఇంతకు ముందూ ఉన్నాయి. రస్ అల్ ఖైమా చంద్రబాబు హయాం నుంచీ కూడా రాష్ట్రంలో ప్రాజెక్టులు చేస్తోంది.

నేను బ్రిటిష్ పాలనలో లేని, చట్టం ముందు అంతా సమానమని నమ్మే సర్వసత్తాక, స్వతంత్ర భారతదేశంలో జన్మించాను. ఇక్కడ ప్రతి వ్యక్తికీ జీవించే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు ఉన్నాయని విశ్వసిస్తున్నాను. దేశంలో రాజ్యాంగమే సమున్నతమని, న్యాయం ఉందని, చట్టం ముందు అంతా సమానమేనని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.

నా భర్తకు ఏ ప్రభుత్వ నిర్ణయాలతోనూ సంబంధం లేదు. ఆయన ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా జీతంగా పొందలేదు. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారు. తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వాటాదారులకు లాభాలు తెచ్చిపెట్టారు. అలాంటి వ్యక్తిని దర్యాప్తు పేరుతో గత ఏడాది కాలంగా జైల్లో పెట్టారు. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రైవేటు వ్యక్తులు అన్న కారణంగా రాబర్ట్ వాద్రా, డింపుల్ యాదవ్‌లపై దర్యాప్తులను నిలిపివేశారు. మరి జగన్‌కు, వారికి తేడా ఏమిటని నేను అడుగుతున్నా. జగన్ కూడా ప్రైవేటు వ్యక్తే అయినప్పుడు ఇలా ఎందుకు వేధిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీని వీడినందుకేనా?

సార్వత్రిక ఎన్నికల వరకు నా భర్తను జైల్లోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం చేతిలోని సీబీఐ భావిస్తోంది. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమేనని విశ్వసించడానికి సహేతుక కారణాలు ఉన్నాయి. ఇటీవల కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితో పాటు మీ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఏడాది కిందట ఎన్డీటీవీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్‌కు రాజకీయ అస్త్రాలు ఉన్నాయని వీరప్ప మొయిలీ అన్నారు. అందుకు నేను స్పందిస్తూ.. ఆ అస్త్రాల్లో సీబీఐ కూడా ఉందా అని ప్రశ్నించా. ఈ విషయంలో దేశంలో ఈరోజు ఎవ్వరికీ అనుమానం లేదన్నది వాస్తవం.

దురదృష్టవశాత్తూ, కుటిల రాజకీయాల కారణంగా నేను, నా పిల్లలు త్యాగాలు చేయాల్సి వస్తోంది. తన తండ్రి చనిపోయిన చోట జగన్ ఒక మాటిచ్చారు. ఆ మాటకే కట్టుబడి ముందుకు నడిచారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలే కన్నుమూసినవారి కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. వెంటనే సీబీఐని రంగంలోకి దించింది. జగన్ నిర్ణయానికి మా కుటుంబం మద్దతుగా నిలిచింది. అయితే మా కుటుంబ పెద్దను మాకు దూరంగా ఉంచేందుకు సీబీఐ చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ మౌనంగా చూస్తూ నిలవాల్సి వచ్చినందుకు శోకిస్తున్నాం. ఆయన రాజకీయ నేత అయినప్పటికీ.. మాకు ప్రశాంతంగా జీవించే హక్కుంది. తండ్రి సంరక్షణలో పెరిగే హక్కు మా పిల్లలకు ఉంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో మీకు ఒక విన్నపం చేస్తున్నా. ఈ విషయంలో మీరు చొరవ చూపడం ద్వారా న్యాయానికి, సమానత్వానికి దేశం దన్నుగా నిలుస్తుందన్న నమ్మకాన్ని దేశ పౌరులు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగేలా చేయాలని కోరుతున్నాను. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడరాదన్న సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను.

సర్, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ప్రజల హక్కుల కోసం నిలబడిన నేతగా మిమ్మల్మి ఈ దేశం గుర్తుంచుకునేలా చేయండి. మూడు దశాబ్దాలుగా దేశానికి సేవ చేసిన వ్యక్తికి, మీ పార్టీ కోసం ముందుండి పోరాడిన సైనికుల్లో ఒకరైన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే మౌనం దాల్చిన వ్యక్తిగా మిగిలిపోకండి.

కృతజ్ఞతలతో

ఇట్లు
వైఎస్ భారతీరెడ్డి 

నరేంద్ర మోడీ పై పవార్ విమర్శలు

థానే: విద్యార్థిని ఇష్రత్ జహాన్ హత్య కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై ఎన్పీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. అమాయక జహాన్ పై తీవ్రవాది ముద్ర వేసి ఆమెను గుజరాత్ పోలీసులు చంపేశాయని ఆరోపించారు. తమ పోలీసులేదో ఘనత సాధించినట్టు మోదీ ఈ విషయాన్ని గర్వంగా ప్రకటించుకున్నారని పవార్ అన్నారు.

కాంగ్రెస్ లోనే ఉంటా-సబిత ఇంద్రారెడ్డి

తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని హోం మంత్రి పదవికి రాజీనామా చేసిన సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.తనను కలిసిన వారితో ఆమె మాట్లాడుతూ తాము బిజినెస్ రూల్స్ ప్రకారమే పనిచేశామని, తన పై వచ్చిన కేసులో న్యాయపరంగా పోరాటం చేస్తానని ఆమె చెబుతున్నారు.జీవితంలో ఎన్నో పోరాటాలు చూశామని,అందువల్ల కార్యకర్తలంతా దైర్యంగా ఉండాలని ఆమె అన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి తాను కృషి చేస్తానని,మంత్రిగాఉన్నప్పట్టికీ, కార్యకర్తగానే పనిచేశానని ఆమె అన్నారు.

సబితను బలిచేయటం తగదు: దానం నాగేందర్

హైదరాబాద్ : మంత్రివర్గం సమష్టి నిర్ణయాలకు సబితా ఇంద్రారెడ్డిని బలి చేయడం తగదని కార్మిక శాఖ మంత్రి మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన సబితకు సంఘాభావం ప్రకటించారు. సంతకం పెట్టడమే తప్పయితే 26 జీవోలు జారీ చేసిన మంత్రుల అందరితోనూ రాజీనామాలు చేయించాల్సి వస్తుందని దానం అన్నారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలవాలంటే సబిత నాయకత్వం అవసరమన్నారు. 

ఎలాంటి అవినీతికి పాల్పడలేదు: సబిత ఇంద్రారెడ్డి


హైదరాబాద్ : తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పదవిలో ఉన్నంతకాలం నిబంధనలకు అనుకూలంగానే జీవోలు ఇచ్చినట్లు ఆమె సోమవారమిక్కడ తెలిపారు. తాను 20 రోజుల క్రితమే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాజీనామా లేఖను ఇచ్చినట్లు పేర్కొన్నారు. నిన్న తాను ఎలాంటి రాజీనామా లేఖ ఇవ్వలేదని సబిత వెల్లడించారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

కాగా సబిత నివాసం వద్ద ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా బంద్ కు సబిత మద్దతుదారులు పిలుపునిచ్చారు.

కిరణ్‌, బొత్స మాట మార్చారు: తలసాని


హైదరాబాద్ : ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సోమవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టింది. ధర్నాలో పాల్గొన్న టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 48 గంటల్లో మంత్రులను తొలగించకపోతే రాజ్ భవన్, ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

మంత్రులను సమర్థిస్తూ సీబీఐని తప్పుబట్టిన ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇప్పుడు మార్చారని ఆయన ఆరోపించారు. గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అవినీతికి గేట్లు తెరిచారని తలసాని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిపైనే ఎర్రచందనం తరలింపు ఆరోపణలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ రక్షకుడు చంద్రబాబే: కడియం శ్రీహరి


హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌-టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వని బాబు ఇప్పుడు మంత్రులను రాజీనామా చేయాలని డిమాండ్ చేయటం విడ్డూరంగా ఉందన్నారు. 

కిరణ్ కుమార్ సర్కార్ ను కాపాడుతున్నదే చంద్రబాబు అని, టీడీపీ మెల్లమెల్లగా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తోందని కడియం అన్నారు. అన్నివిధాలా విఫలమైన ప్రభుత్వాన్ని ఓ వైపు తిడుతూ...మరోవైపు తెరవెనక మద్దతు ఇస్తూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ - టీడీపీలు కలిసి పనిచేస్తున్నాయని కడియం అన్నారు. కాంగ్రెస్‌కు భరోసా ఇస్తున్న బాబు టీఆర్ఎస్, వైఎస్‌ఆర్ సీపీ అవిశ్వాసానికి ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు. 

బలి పశువు అయ్యాను: ధర్మాన ప్రసాదరావు

హైదరాబాద్ : మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మంత్రులు వట్టి వసంత్ కుమార్, ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈరోజు ఉదయం ధర్మానను కలిశారు. తాను బలిపశువునయినట్లు ధర్మాన ఈ సందర్బంగా వారి వద్ద వాపోయినట్లు సమాచారం. కాగా ఈరోజు సాయంత్రం 6.30గంటలకు ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం వెళ్లనున్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన ధర్మాన భవిష్యత్‌ కార్యాచరణను తేల్చుకోనున్నట్టు సమాచారం. అయితే ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

YS జగన్మోహన్ రెడ్డి కేసులో ఉద్దేశపూర్వక తాత్సారం


హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య శ్రీమతి వైయస్ భారతి ఆదివారం నాడు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. తన భర్త శ్రీ జగన్మోహన్ రెడ్డి కేసులో సీబీఐ ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ప్రధాని జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఆమె ఆ లేఖలో విజ్ఙప్తి చేశారు.

సీబీఐ దర్యాప్తు నిబంధనల ప్రకారం సాగటం లేదని ఆ లేఖలో ఆరోపించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టడమే సీబీఐ లక్ష్యంగా పెట్టుకోవడమే దీనికి కారణమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిన సీబీఐ శ్రీ జగన్మోహన్ రెడ్డిని వచ్చే సాధారణ ఎన్నికల వరకూ జైలులోనే ఉంచేలా కుట్ర చేస్తోందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.  
తన భర్త శ్రీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆయనపై కేసులు బనాయించారని తెలిపారు. ఏడాది కాలంగా ఆయనను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారనీ, గత ఏడాది మే 27న శ్రీ జగన్‌ను అరెస్టు చేశారనీ వివరించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ కేసు దర్యాప్తును సీబీఐ తాత్సారం చేస్తోందని చెప్పారు.

కిందటేడాది అక్టోబరులో దర్యాప్తు పూర్తికి మూడు నెలల గడువు కోరిన సీబీఐ ఈ మేనెలలో సుప్రీం కోర్టులో బెయిలు పిటిషన్ విచారణకు వచ్చినపుడు మరో నాలుగు నెలల సమయం కావాలని కోరిందనీ తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలు వెలువడిన నిముషాలలో సీబీఐ న్యాయవాది అశోక్ భాన్ విలేకరులతో మాట్లాడుతూ దర్యాప్తునకు మరింత గడువు కోరతామని సూచనప్రాయంగా చెప్పిన విషయాన్ని శ్రీమతి భారతి ఈ సందర్భంగా ప్రస్తావించారు.దర్యాప్తు నాలుగు నెలలలో పూర్తికాకపోవచ్చని చెప్పారన్నారు.
అశోక్ భాన్ చేసిన ఈ ప్రకటనను పురస్కరించుకుని సీబీఐ దర్యాప్తును పూర్తిచేసే ఉద్దేశంలో లేనట్లు స్పష్టమైందనీ, మీరు ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకోవాలనీ ఆమె ప్రధానికి విజ్ఞప్తిచేశారు. జోక్యం చేసుకుని న్యాయంచేస్తే దేశం మిమ్మల్ని న్యాయమైన అంశాలను గుర్తించే ఓ నాయకునిగా గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే నిశ్శబ్దంగా నిలిచిపోయిన నాయకుడిగా మీరు మిగిలిపోకూడదని సూచించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ మూడు దశాబ్దాల పాటు దేశానికీ, కాంగ్రెస్ పార్టీకి సేవచేసిన విషయాన్ని మరువరాదని శ్రీమతి భారతి ఆ లేఖలో మన్మోహన్ సింగ్‌ను కోరారు.

2004-2009 సంవత్సరాల మధ్యకాలంలో తన భర్త శ్రీ జగన్మోహన్ రెడ్డి రాజ్యంగపరమైన ఎటువంటి భాధ్యతలను నిర్వర్తించని విషయాన్ని ఆమె ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీని శ్రీ జగన్ వీడిన తర్వాత, దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ మరణించిన 15 నెలల తర్వాత కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ శంకరరావు రాసిన లేఖతో ఆయనపై కేసులు నమోదుచేశారన్నారు. అనంతరం శంకరరావుకు మంత్రి పదవి దక్కిన విషయాన్ని ఆమె ఆ లేఖలో గుర్తుచేశారు.

మంత్రులు, ఇతరులను విడిచిపెట్టి 52వ నిందితుడిగా ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఒకటో నిందితునిగా మార్చారని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడమే కాక న్యాయపరమైన ఖర్చులను కూడా భరించాలని నిర్ణయించిందన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే నెపం చూసి శ్రీ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు.

సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తును జాప్యం చేస్తున్నారని శ్రీమతి భారతి పేర్కొన్నారు. దర్యాప్తు అంశాలను ఎంపిక చేసుకున్న మీడియాకు సీబీఐ జేడీ లీక్ చేసి తద్వారా తన భర్త శ్రీ జగన్మోహన్ రెడ్డినీ, ఆయన స్థాపించిన పార్టీ  ప్రతిష్టనూ దెబ్బతీసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ అంశంపై తాము ఇప్పటికే ఫిర్యాదు చేశామనీ, ఆయన చేసిన 500 కాల్సు జాబితాను మీడియాకు విడుదల చేశామనీ వివరించారు. నా భర్త ప్రతిష్టను దెబ్బతీసే హక్కు ఆయనకు ఎవరిచ్చారనీ శ్రీమతి భారతి ప్రశ్నించారు. 

సాక్షిలో పెట్టుబడులు అనైతికమన్న ఆరోపణలను ఆ లేఖలో శ్రీమతి భారతి ఖండించారు. రాబర్టు వాద్రా, డింపుల్ యాదవ్ లాంటి వారికి ఆరోపణలనుంచి విముక్తి కల్పించి, ప్రభుత్వానితో సంబంధంలేని తన భర్తను వేధించడం ఎంతవరకూ సమంజసమని ఆమె ప్రధానిని ప్రశ్నించారు.
తమ కుటుంబం ప్రశాంతమైన జీవితం గడపాలనీ, అలాగే తండ్రి అభిమానాన్ని పొందే హక్కు పిల్లలకుంటుందనీ, పేర్కొంటూ.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని శ్రీమతి భారతి ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.  

సీబీఐ డైరెక్టరుకూ లేఖ
శ్రీమతి భారతి సీబీఐ డైరెక్టరకు కూడా లేఖ రాశారు. నాలుగు నెలల అనంతరం మరింత సమయం కావాలని కోరతామని సీబీఐ న్యాయవాది అశోక్ భాన్ చేసి ప్రకటనపై విచారణ చేపట్టాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఈ విధమైన ప్రకటన చేయడానికి అశోక్ భాన్‌కు ఎవరు అధికారమిచ్చింది కనుగొనాలని ఆమె విజ్ఞప్తిచేశారు.