మెదక్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఎంపి జగన్మోహన రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వీరారెడ్డి అనే యువకుడు జగన్ ను విడుదల చేయడంలేదన్న మనఃస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తిరుపతి : చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా పక్కన పెట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పని చేయాలని వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శుక్రవారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు-ప్రజా ప్రతినిధుల సదస్సులో పాల్గొన్న ఆయన టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలపై మండిపడ్డారు. ఇక నుంచి వచ్చిన ప్రతి ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ విజయకేతనం ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేకపాటి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో అక్రమ అరెస్టులకు ముఖ్యమంత్రి, డిజిపి, పోలీసు అధికారులదే బాధ్యత అని మాజీ మంత్రి శంకరరావు అన్నారు. వారిపైనే కేసులు పెట్టాలన్నారు. ఛలో అసెంబ్లీ సందర్భంగా ఎవరికైనా ప్రాణనష్టం జరిగినా, గాయాలయినా సీఎంపై చర్యలకు హైకోర్టులో పిల్ వేస్తానని ఆయన హెచ్చరించారు.
తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల నగారాను శుక్రవారం తిరుపతి నగరం నుంచి మోగించింది. రానున్న స్థానిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను సమర్థంగా ఢీకొట్టేందుకు పార్టీ శ్రేణులకు గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ కర్తవ్యబోధ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యమని ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయానికి కార్యకర్తలే మూలమని అన్నారు. సదస్సుకు తరలి వచ్చిన రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి నాయకులు, ప్రతినిధులను ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గ్రామ పంచాయతీలన్నీ కైవసం చేసుకోవాలని సూచించారు. అధికార పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడకుండా చూడాలని ఆమె అన్నారు. స్థానిక సమస్యలపై కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాకా ప్రతి ఎన్నికల్లోనూ పార్టీదే విజయమన్నారు. వైఎస్ జగన్ ను దెబ్బ తీయడమే కాంగ్రెస్, టీడీపీల లక్ష్యమని విజయమ్మ అన్నారు. ఆరెండు పార్టీల ఎత్తుగడలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని విజయమ్మ మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ సత్తా ఏంటో చూపేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఓ అవకాశమన్నారు. అంతకు ముందు సభా ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రేపు తెలంగాణ బంద్ కు
పిలుపునిచ్చారు. చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్ట్ లు చేసిన తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని ఆయన శుక్రవారమిక్కడ డిమాండ్ చేశారు. ప్రభుత్వ దమన కాండను నిరసిస్తూ శనివారం బంద్ పాటించాలని కేసీఆర్ కోరారు.
హైదరాబాద్: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రాంతాల్లో అక్రమ అరెస్టులపై ఈ హౌస్ మోషన్ దాఖలు చేశారు. అరెస్టుల విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించాలని హైకోర్టు సూచన చేసింది. అక్రమ అరెస్ట్లులు లేకుండా చూడాలని పోలీస్ శాఖను హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్ : విద్యార్థుల అక్రమ నిర్బంధాలకు నిరసనగా ఓయూ జేఏసీ శనివారం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. అరెస్ట్ చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని ఓయూ జేఏసీ ఛైర్మన్ కిషోర్ డిమాండ్ చేశారు. కాగా మరోవైపు ఓయూ ఎన్సీసీ గేటు వద్ద విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు గులాంనబీ ఆజాద్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ముట్టడి అంశాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, అంతకు ముందు డిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గులాంనబీ ఆజాద్ ను కలిశారు. వారు కూడా అసెంబ్లీ ముట్టడి, రాష్ట్రంలో పరిస్థితులపైనే చర్చించినట్లు తెలిసింది.
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ వివాంతో జేడీయూలో చీలిక ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎన్డీయేతో ఇప్పటికిప్పుడు తెగదెంపులు లేవని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ చెబుతోంటే, మరోవైపు నితీష్ కుమార్ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. బీహార్ లో శనివారం జరిగే ర్యాలీలో నితీష్ కుమార్ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా ఎన్డీయేలో కొనసాగడంపై జేడీయూ సస్పెన్స్ కొనసాగుతోంది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కారులో సచివాలయానికి వెళ్లడం చర్చనీయాంశం అయింది. చలో అసెంబ్లీ నేపధ్యంలో ఉద్రిక్త వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కిరణ్ రహస్యంగా వెళ్లిపోయారని కధనాలు వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి కాన్వాయ్ పూర్తి భద్రతతో ఉంటుంది కనుక అది పెద్ద ఇబ్బంది అవుతుందా అన్నది ప్రశ్న.ఏమైనప్పట్టికీ ఇలాంటి సమయాలలో వేరే నేత కారులో వెళ్లడం రకరకాల చర్చలకు ఆస్కారం ఇస్తుంది.
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి ఆర్ట్స్ కాలేజ్ నుంచి బయల్దేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. రాళ్లు రువ్విన విద్యార్థులపై పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. ఈ సందర్భంగా పీజీ విద్యార్థి కృష్ణకు టియర్‌గ్యాస్ షెల్ తగలడంతో గాయపడ్డాడు. సొమ్మసిల్లిపోయిన విద్యార్థిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. దాంతో ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి మెదక్ ఎమ్.పి విజయశాంతికి కొత్త దిగులు పట్టుకుంది. ఈసారి మెదక్ లోక్ సభ సీటు రాదన్న ప్రచారం ఆమెకు చికాకు కలిగిస్తోంది.టిఆర్ఎస్ అదినేత కె.చంద్రశేఖరరావు ఈసారి మెదక్ సీటు నుంచి పోటీచేయాలని భావిస్తుండడమే దీనికి కారణం.ఇప్పుడున్న పరిస్థితిలో మెదక్ నుంచి పోటీచేయడం బాగుంటుందని కెసిఆర్ అనుకుంటున్నారు.తన సొంత అసెంబ్లీ సెగ్మెంట్ అయిన సిద్దిపేట అందులో ఉండడం,పైగా తన ప్రభావంతో మెదక్ జిల్లాలో మరికొన్ని అసెంబ్లీ సీట్లు గెలిచే అవకాశం ఉండడం వంటి కారణాలతో ఈసారి సొంత జిల్లా నుంచి పోటీచేయాలని కెసిఆర్ యోచిస్తున్నారు. ఆయన ఇంతకుముందు కరీంనగర్ నుంచి మూడుసార్లు ( ఒక సాధారణ ఎన్నిక,రెండు ఉప ఎన్నికలు)మహబూబ్ నగర్ నుంచి ఒకసారి లోక్ సభకు ఎన్నికయ్యారు.కిందటిసారే మెదక్ నుంచి పోటీచేయాలని అనుకున్నా, విజయశాంతికి మాట ఇచ్చినందున ఆయన మహబూబ్ నగర్ నుంచి పోటీచేసి తీవ్రమైన పోటీని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నేపధ్యంలో ఆయన మెదక్ నుంచి పోటీచేస్తే, విజయశాంతికి సికింద్రాబాద్ సీటు ఇవ్వాలని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.కాని విజయశాంతికి ఇక్కడ నుంచి పోటీచేయడం ససేమిరా ఇష్టం లేదు.అయితే తప్పకపోతే తనకు మెదక్ బదులు జహీరాబాద్ లోక్ సభ స్థానం కేటాయించాలని ఆమె కోరుతున్నట్లు సమాచారం.కాని సాధ్యమైనంతవరకు మెదక్ ను వదలిపెట్టరాదన్న అబిప్రాయంతో ఉన్నారు.దేవుడు ఆశిస్సులు తనకు ఉంటే మెదక్ సీటు నుంచే పోటీచేస్తానని విజయశాంతి తాజాగా వ్యాఖ్యానించడం గమనించవలసిన అంశం. కాగా టిఎన్జీఓ నేత దేవీ ప్రసాద్ కూడా మెదక్ సీటు ఇస్తే పోటీచేయాలని లోక్ సభకు పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.ఈ మేరకు జెఎసి సమావేశాలలో కూడా ఆయన ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది.ఎన్.జి.ఓ నేతలు కొందరు టిఆర్ఎస్ నాయకత్వం తో దీనిపై మాట్లాడాలని కూడా బావిస్తున్నారు.మెదక్ సీటు మొత్తం మీద హాట్ ఫేవరైట్ గా ఉండడం విశేషం.
తెలుగుదేశం పార్టీ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై అవిశ్వాసం పెడతామని అనడాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎద్దేవ చేసింది.ఇది కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని ఆ పార్టీ ముఖ్య నేత డాక్టర్ మైసూరారెడ్డి అన్నారు. నామ్ కే వాస్తేగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.ఫెడరల్ లేదా మూడో ఫ్రంట్‌లో భాగస్వాములవుతామని, పిలవని పేరంటానికి చంద్రబాబు ఆరాట పడుతున్నారని మైసూరా వ్యంగ్యంగా అన్నారు. ఒకటి, రెండు సీట్లు కూడా రాని చంద్రబాబును ఎవరు చేర్చుకుంటారని మైసూరారెడ్డి ప్రశ్నించారు.శాసనసభ నిర్వహణకు సంబంధించి అధికార, ప్రతిపక్షాలకు సమాన బాధ్యత ఉందన్నారు. సభను అడ్డుకుంటున్న సభ్యులను సస్పెండ్ చేసి సభ నడిచేలా చూడడం పద్దతిగా ఉంటుందని ఆయన అబిప్రాయపడ్డారు.
గత కొంతకాలంగా అలకలో ఉన్నారని భావిస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ముఖ్యనేతలలోఒకరైన కొండా మురళీ, ఆయన భార్య సురేఖలు మళ్లీ పూర్తి స్థాయిలో పనిచేయడానికి సన్నద్దం అవుతున్నట్లు కనిపిస్తుంది. జగన్‌ను సీఎం చేసేంతవరకు ప్రతి కార్యకర్త సైనికునిలా పనిచేయాలని కొండా మురళీ పిలుపునిచ్చారు. చంద్రబాబు పాదయాత్రను ప్రజలు చీదరించుకుంటే, షర్మిల పాదయాత్రను ప్రజలు గుండెలో పెట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత నీతిమాలిన రాజకీయాలు తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఏమీ తెలియనట్టు, ఇంతకుముందెలాంటి ఘోరకలికి తాను కారణం కాదని బుకాయించజూచే వాడికి నటించేవాడికి మనపెద్దలు "నంగనాచి తుంగబుర్ర'' అని ఎద్దేవా చేసేవారు! ఇప్పుడు అలాంటి పరిణామం "హిందుత్వ'' పేరిట మతరాజకీయాలు నడుపుతున్న భారతీయ జనతా పార్టీ మూలంగా ఏర్పడింది. నిజానికి అది "హైందవం'' అనేది అసలైన సిసలైన లోకికభారతం, అదే "ఆది బౌద్ధం''. కులాతీత, మతాతీత వృత్తి సమాజాన్ని బౌద్ధధర్మం నిర్మించింది. దాన్ని చెడకొట్టి వృత్తులమీద, శ్రమజీవనంమీద ఆధారపడి బతికే వృత్తి సమాజాన్ని కాస్తా దెబ్బతీసి సమాజంలోని ఛాందస వర్గం సోమరిపోతులను, దోపిడీ వర్గాన్ని పెంచే మతరాజకీయానికి ప్రాణం పోసింది. ఆ సంప్రదాయ ఛాయల్లో స్వాతంత్ర్యానికి ముందూ, ఆ తరువాతా ఎదిగివచ్చిన ఛాందసవర్గానికి "హిందూ మహాసభ'' పేరిట కొన్నాళ్ళూ, 'జనసంఘ్' పేరిట మరికొన్నాళ్ళూ, 'రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్' ముసుగులో ఇంకొన్నాళ్ళు పెరుగుతూ వచ్చిన మతశక్తులకు ఎమర్జెన్సీ కాలంలో ఏర్పడిన "జనతాపార్టీ''లోకి దూరి, మత రాజకీయాలకు కానరాని ప్రతినిధిగా అవతరించిందే "భారతీయ జనతా పార్టీ''. దానికి పొట్టిపేరు బి.జె.పి. జనతాపార్టీ ప్రభుత్వంలో దూరడం ద్వారా కొన్నాళ్ళ పాటు మతరాజకీయాన్ని పెట్టెలో దాచి, జనతా ప్రభుత్వం కూలిపోయిన తరువాత తిరిగి మతరంగంలో ["హిందూత్వ''] జనంలో ప్రవేశించింది. ఎమర్జెన్సీ దుష్టపాలనకు నిలువెత్తు చిహ్నంగా మిగిలిపోయిన ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం జనరల్ ఎన్నికల్లో కుప్ప కూలిపోవటంతో హిందూత్వశక్తులు జనతా ప్రభుత్వంలో పాగావేశాయి.
ఆదినుంచీ ఈ శక్తులకు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చింది. ఆర్.ఎస్.ఎస్. సంస్థ. ఈ సంస్థలో ప్రధాన కార్యకర్త అయిన నాధోరామ్ గాడ్సే జాతిపిత గాంధీజీని ప్రార్థనా సమయంలో దారుణంగా హత్య చేసినవాడు. గాంధీ హత్యతో దేశం అట్టుడికి పోతున్న సమయంలో ఆర్.ఎస్.ఎస్. కార్యాలయాలపైన ప్రజలు తిరగబడుతున్న సమయంలో గాంధీ హత్యలతో తనకెలాంటి 'సంబంధంలేద'ని గాడ్సే ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త కాదనీ బుకాయించడానికి ఆర్.ఎస్.ఎస్. నాయకత్వం ప్రయత్నించి విఫలమవడం, గాడ్సే తమ్ముడు తన సోడరుడే గాంధీజీని హత్య చేసినవాడని అతను ఆర్,ఎస్,ఎస్, క్రియాశీల కార్యకర్త అని తరువాత వాంగ్మూలం యివ్వడం చేరపరాని చరిత్ర. ఈ చరిత్ర పూర్వరంగంనుంచి వచ్చిన వాడే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ! ఆ మాటకొస్తే బి.జె.పి. రాజకీయాలను మతరాజకీయాలుగా మలిచి, పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ దేశంలో అమలు జరిపిస్తున్నది ఆర్.ఎస్.ఎస్., భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంస్థలే.
ఈ తానులోని 'ముక్క' అయిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్ లో 2000 మంది ముస్లీం మైనారటీల ఊచకోతకు కారణం అయి, దేశ లౌకిక (సెక్యులర్) ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికే ప్రమాదంగా పరిణమించడం దేశప్రజలకు తెలుసు; అలాంటి మోడీని రేపు 2014 నాటి జనరల్ ఎన్నికలలో నరేంద్రమోడీని బిజెపి జాతీయ ప్రచారక్ సంఘ్ సారధిగా, అదే ఆర్.ఎస్.ఎస్. తానులో మరో ముక్కగా అవతరించిన బిజెపి అధ్యక్షుడుగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ తన నిర్ణయంగా గోవాలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకపక్షంగా ప్రకటించాడు. దాంతో బిజెపి శ్రేణుల్లో, నాయకుల్లో ముసలం పుట్టింది. ఇందుకు బిజెపి అగ్రనాయకుడు, ప్రధానమంత్రి పదవి తానింతవరకు నిర్వహించలేదన్న దిగులుతో ఉన్న లాల్ కిషన్ అద్వానీ కోపంతో గోవా సమావేశానికి గ్రైర్ హాజరై ఇంటివద్ద కూర్చున్నాడు. అయితే ఈ 'అలకపాన్పు' మానడానికి ఆయనకు రెండురోజులు కూడా పట్టలేదు.
ఏడాదిలోగా జనరల్ ఎన్నికలు జరుగనుండగా బిజెపిలో ముసలం వల్ల కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం లేదా పాత ఎన్.డి.ఎ. పక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం కష్టమని భావించిన బిజెపి అగ్రశ్రేణి నాయకులంతా పునరాలోచన చేసుకుని అద్వానీపై వత్తిడి తెచ్చి, ఆయన అన్ని పార్టీ పదవులకు యిచ్చిన రాజీనామానుంచి వెనక్కి తగ్గెట్టు చేయగలిగారు! కాని, ఇలా వెనక్కి తగ్గడానికి మూడ్ను చేసిన ఒక ప్రకటనలో అద్వానీ "పార్టీలో కొందరు పదవీకాంక్షతో తీసుకుంటున్నందువల్లనే పార్టీ పక్కతోవలు పడుతోంద''ని విమర్శించారు. నిజానికి "ప్రధానమంత్రి'' పదవిని తాను అనుభవించలేదన్న 'గుర్రు' అద్వానీలో కూడా చాలాకాలంగా గూడుకట్టుకుని ఉండిపోయిందని మరవరాదు! అయితే అదే తపనలో ఉన్న నరేంద్రమోడీ గుజరాత్ లో తన ప్రభుత్వం చేసిన మానవమారణకాండ తాలూకు కేసులనుంచి తప్పించుకుపోవాలన్న కోర్కె బలీయంగా తనలో పీడిస్తున్నందున బిజెపిలోని ఆర్.ఎస్.ఎస్. ముఠాను కూడగట్టుకుని దేశ ప్రధానమంత్రి పదవివైపు మోరలు చాచాడు.
అతని కోర్కెను రాజ్ నాథ్ సింగ్ రానున్న ఎన్నికల్లో బిజెపిని తిరిగి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన వాతావరణాన్ని సమీకరించగల శక్తి మోడీకి ఉందని భావించి, పార్టీ ప్రచార సంఘానికి సారథిగా చేశాడు. అయితే రాజ్ నాథ్ సింగ్ నిర్ణయం తప్పని బిజెపి సీనియర్ నాయకులు కొందరు భావించడానికి కారణం ఉంది. నరేంద్ర మోడీ మతతత్వ రాజకీయాన్ని మానవమారణకాండకు ఆయుధంగా మార్చినందువల్ల, ఇప్పటికి గుజరాత్ వరకే పరిమితమై ఉన్న మత దురహంకార రాజకీయం రేపు అతను ప్రధాని అయ్యే పక్షంలో దేశాన్ని అల్లకల్లోలంలోకి నెట్టే ప్రమాదం లేకపోలేదని లోలోన భయ సందేహాలున్నాయి.
మత దురహంకారానికి సరిహద్దులుండవన్న నిజాన్ని జర్మనీలో, అబిసేనియా (ఇటలీ)లో హిట్లర్, ముస్సోలినీలు నిరూపించడం ఒక చారిత్రిక సత్యం. ఆ హిట్లర్ "ఆర్య జాతి'' రక్తం ఏ జాతికన్నా కూడా పవిత్రమైనదన్న నమ్మకం మీదనే జర్మనీలో యూదుల్ని లక్షల సంఖ్యలో కాల్చి చంపాడు, గ్యాస్ ఛాంబర్లలో బంధించి చంపాడు. ఆ హిట్లర్ ఆరాధకులే భారతదేశంలోని హిందూ మహా సభ, విశ్వహిందూ పరిషత్, ఆర్.ఎస్.ఎస్. వర్గీయులని మరచిపోరాదు! ఈ 'హిట్లర్ ఆరాధన' పూర్వరంగాన్ని ఏయే భారత ప్రతినిధులు హిట్లర్ నాజీ పార్టీతో ఒకనాడు కలిసి వచ్చారో ప్రసిద్ధ పరిశోధకుడు జెఫ్రలాట్ భారతదేశంలో 'హిందూత్వ'' ముఠా పుట్టుపూర్వోత్తరాలను వెల్లడిస్తూ రాశాడు!
ఎందుకంటే, అయోధ్యలో తప్పుడు భావాల మీద ఆధారపడి బాబ్రీ మసీదును కూలగొట్టిన 'హిందుత్వ' ముఠా, గుజరాత్ లో మైనారిటీళ ఊచకోతకు వెనుకాడని మతశక్తులు రేపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రత్యామ్నాయం తామేనని భావిస్తున్నందువల్ల భారతదేశ లౌకిక వ్యవస్థను "కుమ్మరి పురుగుల్లా'' తొలుచుకుంటూ వెళ్ళి గుజరాత్ ఘటనలను జాతీయస్థాయిలో పునరావృత్తం చేయరన్న గ్యారెంటీ లేదు, ఆ భరోసాను ఎంతటి శాంతికాముకుడూ, మరెంతటి ప్రజాస్వామ్యవాదీ కూడా యివ్వలేరు. కనుకనే రాజ్యాంగబద్ధమైన లౌకిక, ప్రజాతంత్ర సమసమాజ వ్యవస్థాభిలాషులంతా ఇనుమడించిన చైతన్యంతో మతశక్తుల రేపటి ఎజెండాను ఈ రోజు నుంచీ, ఈ క్షణం నుంచీ మిలిటెన్సీతో ఎదుర్కొని లౌకిక సమైక్య భారత వ్యవస్థను, విభిన్నజాతులు, మతధర్మాలు, భిన్నభాషలతో దీపించె భారతదేశాన్ని వేయికళ్ళతో కాపాడుకోవలసిన అవసరం ఉంది. ప్రమత్తత ప్రాణం తీస్తూంది, అప్రమత్తత ప్రాణం పోస్తూంది! కనుకనే 'మోడీ' తపనను తుంచివేయాలి గాని 'తంథాన' పలకరాదు!