Sunday, 19 May 2013

రేవంత్ గాడిదలా మాట్లాడుతున్నారు

నోరు పారేసుకునే పిట్టల దొరలను తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు అదుపుచేయాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎస్.సి.సెల్ కన్వీనర్ నల్లా సూర్య ప్రకాష్ వ్యాఖ్యానించారు. వర్ల రామయ్య అడ్డుగోలుగా మాట్లాడుతూ ఇంటిపేరు సార్థకం చేసుకుంటున్నారని అన్నారు. వైఎస్ఆర్‌సీపీవి కాకిపలుకులంటూ రేవంత్‌రెడ్డి గాడిదలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పాదయాత్ర ద్వారా చంద్రబాబుకు కాళ్ల నొప్పులు తప్ప మిగిలిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిలో వెన్నుపోటు దారుడు, పన్నుపోటు దారుడు చంద్రబాబు అని ఆయన విరుచుకుపడ్డారు.రేవంత్ , వర్ల రామయ్య లను అదుపులో పెట్టాలన్న నల్లా సూర్యప్రకాష్ కూడా అదే రీతిలో మాట్లాడినట్లు అనిపించడం లేదూ!

దర్శక రత్న దాసరి మాటల అర్ధం ఏమిటో!


ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ఎప్పుడూ ఏదో ఒక సంచలనం చేస్తూ ఉండాలని అనుకుంటారు. అయితే ఆయన ఆ వ్యహారాన్ని పూర్తి స్థాయిలో చేయరు. ఎవరినో ఉద్దేశించి వ్యాఖ్యానిస్తుంటారు. ఆ తర్వాత ఆయనను కాదని చెబుతుంటారు. పైసా సినిమా ఆడియో విడుదల సందర్భంగా మాట్లాడుతూ నటుడిని మహా నటుడిగా చేసే శక్తి దర్శకుడికే ఉందన్నారు. తన యాభై ఏళ్ల సినిమా కెరీర్ లో ఏ హీరోకు తల దించలేదన్నారు. దర్శకుడు చెప్పినట్టు నటించిన ప్రతి హీరో గొప్ప హీరోయ్యారని చెప్పారు.హీరోల గురించి ఎందుకు మాట్లాడారో తెలియదు.తెలుగు సినిమా మూసలో పోతోందని, ఈ విధానం మారాలని కూడా ఆయన అబిప్రాయపడ్డారు.

ఎజెండాలో లేనప్పుడు టి.లో కాంగ్రెస్ ఎందుకు!

అవకాశం వస్తే చాలు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు వేరే పార్టీలలో ఉండే వారిని ఇంకా ఆ పార్టీలలో ఉన్నారేమిటని ప్రశ్నిస్తుంటారు. కాంగ్రెస్ అధికార ప్రతినిది చాకో తెలంగాణ అంశం తమ యుపిఎ ఎజెండాలో లేదని చెప్పాక కూడా తెలంగాణ లో కాంగ్రెస్ జెండా అవసరమా?అని టిఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు.ఈ ప్రకటన తర్వాత అయినా తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు వాస్తవాలు గ్రహించాలని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు గడువులు మాని పార్టీ నుంచి బయటకు రావాలని హరీష్ రావు అన్నారు.వీరంతా టిఆర్ఎస్ తో కలిసి రావాలని ఆయన కోరారు. అయితే చాకో మాట మార్చారు.మరి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు కూడా డెడ్ లైన్ మార్చుతారా?లేక దానికి కట్టుబడి ఉంటారా అన్నది చూడాలి.

సి.ఎమ్.తో ధర్మాన, సబిత బేటీ-రాజీనామాలు?


రాష్ట్ర హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డి, రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో వీరిద్దరూ రాజీనామాకు సంసిద్దమై వచ్చారని ప్రచారం ఆరంభమైంది.పైగా సబిత ప్రభుత్వ వాహనంలో కాకుండా సొంత వాహనంలో వెళ్లారని కూడా అంటున్నారు. దీంతో రాజీనామాకు సిద్దమై ఆమె వెళ్లారని అంటున్నారు. ధర్మాన అయితే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని వదలుకుంటారని అంటున్నారు.కాగా మరో మంత్రి పార్ధసారధికి ఏకంగా శిక్ష పడితేనే రాజీనామా కోరకుండా చార్జీషీట్ లో ఉన్న తమను రాజీనామా చేయాలని కోరతారా అని ఈ మంత్రులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.