* బాబుకు పదవీవ్యామోహం లేదనడం భూమి గుండ్రంగా లేదన్నట్లే
* పిల్లనిచ్చి, పదవినిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఘనుడు
* ఎన్టీఆర్ ట్రస్ట్ స్థలాన్ని కుటుంబీకుల పేర్లమీద రాయించుకున్నారు
* కార్యకర్తలను మాత్రం ఆస్తులమ్ముకొని పార్టీ కోసం పనిచేయాలని చెబుతున్నారు
* ధర్మపోరాటం చేస్తున్నానని ఆయన చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది
* సీబీఐ.. కీలుబొమ్మని కోల్‌గేట్ ఉదంతంతో తేటతెల్లమైంది
* అయినా చంద్రబాబు సీబీఐని, కాంగ్రెస్‌ను పల్లెత్తి మాట్లాడరు
* తనపై కేసుల విషయంలో ఆయన కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు
మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబు గారు మారిన మనిషట... ధర్మపోరాటం చేస్తున్నాడట.. ఇప్పుడాయనకు పదవీ వ్యామోహం.. ముఖ్యమంత్రి పీఠం మీద కోరిక లేనే లేదట... చంద్రబాబుగారూ... విలువలను, విశ్వసనీయతను పక్కనపెట్టి అధికార పక్షంతో కుమ్మక్కై ప్రజలకు, ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడవటమేనా ధర్మయుద్ధమంటే... అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకోవాలని కార్యకర్తలకు చెబుతున్న చంద్రబాబు అదే పార్టీకోసం తన ఆస్తులెన్ని అమ్ముకున్నారో చెప్పాలన్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం ఖమ్మంజిల్లా వైరా నియోజకవర్గంలో సాగింది. ఏన్కూరు మండల కేంద్రంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...
నేను ధర్మపోరాటం చేస్తున్నానంటూ ఈ మధ్య చంద్రబాబు నాయుడుగారు సినిమా డైలాగులు కొడుతున్నారు. ఆయనకు పదవీ వ్యామోహం, ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదనడమంటే... భూమి గుండ్రంగా లేదన్నట్లే. మంచివాడనుకుని ఎన్టీఆర్ పిల్లనిచ్చి, పార్టీలో హోదాను, మంత్రి పదవిని ఇచ్చారు. కానీ పట్టపగలే కన్నార్పకుండా అదే మామగారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, కుర్చీని, అధికారాన్ని లాగేసుకున్న ఘనుడు ఈ చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ల ఆస్తులు కూడా అమ్మేసుకుని పార్టీకోసం పనిచేయాలని చెప్తున్నారాయన. కానీ అదే పార్టీకోసం తాను ఏ ఆస్తులు అమ్ముకున్నారో చెప్పనేలేదు. పైగా హైదరాబాద్‌లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్టు భవన్ స్థలాన్ని ట్రస్టు పేరు మీద రాయకుండా తన కుటుంబ సభ్యుల పేరు మీద రాయించుకున్నారు. దాన్నిబట్టే ఆయన ఎలాంటివాడో అర్థమవుతోంది. చంద్రబాబు వేరొకరిని తొక్కి పైకొచ్చిన రకమే గానీ త్యాగాల మీద ఎదిగిన నాయకుడు కాదు. ధర్మపోరాటం చేస్తున్నానని ఆయన చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఆయన ఎన్ని అబద్ధాలైనా కన్నార్పకుండానే చెప్పగలరు. నిజం చెప్తే తల వెయ్యిముక్కలయ్యేలా చంద్రబాబుకు శాపం ఉందని వైఎస్సార్ చెప్పేవారు. అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నిజం చెప్పరు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే ప్రజలు నమ్ముతారని ఆయన సిద్ధాంతం. మోసం, వెన్నుపోటు నుంచి పుట్టి... కుట్రలు, నీచరాజకీయాలతో ఎదిగిన చంద్రబాబుకు న్యాయం, ధర్మం, విలువలు, విశ్వసనీయత అనే పదాలకు కనీస అర్థం తెలియదు. అందుకే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ప్రజాస్వామ్యానికే వెన్నుపోటు పొడిచారు.
సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ కాదని ఎవరైనా వాదించగలరా..!
ఇప్పుడు దేశంలోని నాయకులు అంతా కోల్ గేట్ గురించి మాట్లాడుకుంటున్నారు. బొగ్గును వేలం వేయకుండా, ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడం వల్ల దేశానికి రూ.రెండు లక్షలకోట్ల నష్టం వచ్చిందని స్వయంగా కాగ్ పేర్కొంటే... దానిపై సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐని కోరింది. సీబీఐ విచారణ చేసి తయారు చేసిన నివేదికను ప్రధాన మంత్రి, న్యాయశాఖ మంత్రి కార్యాలయాలకు పంపించి, వాళ్లు నివేదికలో మార్పులు చేర్పులు చేసిన నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించింది.
దీన్నిబట్టి ఈ సీబీఐ ఎవరికోసం పనిచేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. జగనన్నమీద కుట్రలు పన్ని 11 నెలలుగా జైల్లో పెట్టారు. ‘సీబీఐ పెడుతున్న బాధలతో జగన్‌మోహన్‌రెడ్డి తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయక తప్పదని’ ఇటీవల కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చెప్పారు అంటే వీళ్ల మనసుల్లో ఎన్ని కుట్రలు దాగి ఉన్నాయో అర్థమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేలా చేయడానికి అధికార దుర్వినియోగంతో జగనన్నను ఇంత ఇబ్బంది పెడుతున్న వీళ్లను ఏమనాలి? ఇంత జరిగిన తరువాత సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ కాదని ఎవరైనా వాదించగలరా?
సీబీఐ మీద చంద్రబాబు ఎందుకు నోరు విప్పరు...
బొగ్గు కుంభకోణంలో సీబీఐ విచారణ తీరుపై దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నా మన చంద్రబాబు మాత్రం నోరు విప్పటం లేదు. అదే వైఎస్సార్ కుటుంబం మీదనైతే ఇంతెత్తున లేచి, ఎంత నీచంగానైనా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులపై విచారణ జరగకుండా ఉండేందుకు చంద్రబాబు కాంగ్రెస్, సీబీఐకి లొంగిపోయారు కాబట్టే వాటిని విమర్శించే ధైర్యం లేదు. బతికి ఉంటే బలుసాకైనా తిని బతకవచ్చని నిర్ణయించుకొని కాంగ్రెస్, సీబీఐలను ప్రశ్నించడం లేదు, విమర్శించడం లేదు. సీబీఐ మీద, కాంగ్రెస్ మీద ఎందుకు నోరు విప్పడం లేదో చంద్రబాబు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం 136వ రోజు ఖమ్మంజిల్లా వైరా నియోజకవర్గం రాజలింగాల గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి బురదరాఘవాపురం, లచ్చగూడెం, తూతుక లింగన్నపేట, ఇందిరానగర్ మీదుగా ఏన్కూరు మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. అక్కడి నుంచి భగవాన్‌నాయక్ తండా శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి తొమ్మిది గంటలకు చేరుకున్నారు. గురువారం ఆమె మొత్తం 12.3 కిలోమీటర్లు నడిచారు.
ఇప్పటివరకు మొత్తం 1,834 కి.మీ యాత్ర పూర్తయ్యింది. ఏన్కూరు మండలంలోని లచ్చగూడెం శివారులో షర్మిలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ కలిశారు. ఇటీవల ఎడమకాలి మడమ బెణికి రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి పాదయాత్ర చేస్తున్న షర్మిలను కలిసి ఆమె ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు.