Tuesday, 11 June 2013

బిజెపిలో ముగిసిన సంక్షోభం

న్యూఢిల్లీ: బిజెపిలో సంక్షోభం ముగిసింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్వానీ చెప్పినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారు. అద్వానీతో పార్టీ సీనియర్ నేతల సమావేశం ముగిసింది. అనంతరం అద్వానీ నివాసంలోనే ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలో బిజెపి పార్లమెంటరీ సమావేశం జరుగుతుందని చెప్పారు. అద్వానీ చెప్పిన అంశాలను ఆ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. అయితే విలేకరుల సమావేశానికి అద్వానీ హాజరుకాలేదు. 

మెట్టు దిగిన అద్వానీ?

ఢిల్లీ: బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీని బుజ్జగించడంతో ఆ పార్టీ అగ్రనేతల రాయబారం ఫలించినట్లు కనిపిస్తోంది. అద్వానీ లేవనెత్తిన అంశాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్ హామీ ఇచ్చారు. ఈ సాయంత్రం రాజ్‌నాథ్‌సింగ్ అద్వానీని 
కలవనున్నారు. ఆ తరువాత సంక్షోభం సమసినట్లు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నాపై ఎలాంటి ఒత్తిడి లేదు: లక్ష్మీనారాయణ

హైదరాబాద్: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రిలీవ్‌ అయ్యారు. డిఐజీ వెంకటేష్‌కు తన బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్యాప్తుకు సంబంధించి మీడియాకు ఎలాంటి సమాచారాన్ని లీకు చేయలేదని అన్నారు. మీడియా నుంచే సమాచారాన్ని సేకరించానని చెప్పారు. దర్యాప్తులో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని లక్ష్మీనారాయణ తెలిపారు. 

శుక్లా మరణం పట్ల సోనియా సంతాపం

న్యూఢిల్లీ: తమ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సంతాపం తెలిపారు. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో మే 25న మావోయిస్టులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన గుర్గావ్ లోని వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

విసి శుక్లా కన్నుమూత

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా (84)కన్నుమూశారు. ఛత్తీస్ గఢ్ లో మే 25న మావోయిస్టుల దాడిలో గాయపడిన ఆయన వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1966లో ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. 

మే 25న జరిగిన కాల్పుల్లో గాయపడిన శుక్లాను ముందు జగదల్‌పూర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రికి తీసుకు వచ్చారు. గత వారం ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడినా, ఆ తర్వాత క్షీణించింది. శుక్లా మృతితో మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 29కి పెరిగింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన విద్యా చరణ్‌ శుక్లా, తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, చంద్రశేఖర్‌ కేబినెట్‌లో ఆయన కీలక శాఖలు నిర్వహించారు.

కేసీఆర్ పై హెచ్ఆర్సీలో రఘునందన్ ఫిర్యాదు

హైదరాబాద్ : టీఆర్ఎస్ బహిష్కృత నేత రఘునందన్ రావు మంగళవారం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. టీఆర్ఎస్ కార్యకర్త నాగరాజు ఆత్మహత్యపై విచారణ జరిపించాలని ఆయన తన పిటిషన్ లో హెచ్ ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రఘునందన్ రావు కోరారు. కాగా టీఆర్‌ఎస్ నిర్వహించిన సభ వేదికపైకి రానివ్వలేదని మనస్తాపం చెందిన నాగరాజు అనే టీఆర్ఎస్ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

రెచ్చగొడితే టీఎస్ఆర్ కే నష్టం: దగ్గుబాటి వెంకటేశ్వర రావు

హైదరాబాద్: తనను రెచ్చగొడితే కాంగ్రెస్ పార్టీ రాజసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి (టీఎస్ ఆర్ )కే నష్టమని ఆ పార్టీ ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి డి.పురంధరేశ్వరీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు మంగళవారం హైదరాబాద్ లో స్పష్టం చేశారు. టీఎస్ ఆర్ పంపిన లీగల్ నోటీస్ కు లీగల్ గానే సమాధానమిస్తానన్నారు. అయితే తమ ఇద్దరి మధ్య విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం జరగదని వెంకటేశ్వరరావు తెలిపారు. 

రానున్న ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని టీఎస్ ఆర్ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అయితే గత రెండు సార్లుగా కేంద్ర మంత్రి డి.పురంధరేశ్వరీ విశాఖపట్నం లోక్ సభ నుంచి గెలుపొందుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ లోక్ సభ స్థానంపై రగడ మొదలైంది.

చంద్రబాబు లక్షణం ఇది అంటున్న దాడి

టిడిపి అదినేత చంద్రబాబునాయుడు మనస్తత్వం గురించి టిడిపి మాజీ నేత దాడి వీరభద్రరావు విశ్లేషించారు. చంద్రబాబు తన విశ్వసనీయత పెంచుకోవడం కన్నా, ఎదుటివారిపై ఆరోపణలను చేయడం ద్వారా వారిని దెబ్బతీసే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటారని దాడి వ్యాఖ్యానించారు.దానివల్ల చంద్రబాబు తన విశ్వసనీయతను తానే చంపుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.ఆయన ఎంత సేపు ఎదుటవారిని ఎలా దెబ్బతీయాలనే చంద్రబాబు తరచూ ఆలోచిస్తుంటారని దాడి పేర్కొన్నారు.జైలులో కూడా జగన్ ను ఉండనివ్వరా అంటూ,జైల్లో జగన్ గదికి అడ్డంగా గోడలు ఏమైనా కట్టాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.జైళ్లు నియమ నిబంధనల మేరకే పనిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో సీబీఐ చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిందని దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా చేస్తున్నారని కూడా దాడి విమర్శించారు. 

బాబు, కిరణ్ ఒక్కటయ్యారు: ఈటెల రాజేంద్ర

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీఎం కిరణ్ ఒక్కటయ్యారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన మీడియా పాయింట్ వద్ద ప్రసంగించారు. 

తాము ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించినా పట్టువీడేది లేదని ఈటెల స్పష్టం చేశారు. సీఎం, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ల వ్యవహార శైలి రాచరిక వ్యవస్థను తలపిస్తుందని ఆయన విమర్శించారు. ఛలో అసెంబ్లీ అనుమతి కోసం ముఖ్యమంత్రిని కలుస్తామని ఈ సందర్బంగా ఈటెల తెలిపారు.

డి.ఎల్.కూడా టిడిపిని తప్పుపడుతున్నారా!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని సామెత.ఆ ప్రకారం కాంగ్రెస్ లో గొడవలు టిడిపికి కూడా తలనొప్పిగా చుట్టుకుంటున్నాయి.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బర్తరఫ్ చేసిన మాజీ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ తో పాటు టిడిపిని కూడా ఇరుకున పెట్టాయి.శాసనసభ లాబీలో డిఎల్ రవీంద్ర రెడ్డి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో చేసిన సంభాషణలో ఈ పరిస్థితి కనిపించింది.గత అసెంబ్లీ సమావేశాలలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టిడిపి మద్దతు ఇచ్చి ఉంటే కిరణ్ పదవి పోయేదని డిఎల్ వ్యాఖ్యానించారు.అయితే తాము వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసానికి ఎలా మద్దతు ఇస్తామని రేవంత్ ప్రశ్నించారు. ఒకవేళ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినా ఎమ్.ఐ.ఎమ్. పార్టీ కాంగ్రెస్ ను ఆదుకునేదని ఆయన అన్నారు.కిరణ్ ,చంద్రబాబు కలిసి పనిచేస్తున్నారని ప్రజలలోకి వెళ్లిందని డిఎల్ వ్యాఖ్యానించారు.కొద్ది కాలం క్రితం వరకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు తీవ్ర వ్యతిరేకంగా ఉన్న రవీంద్ర రెడ్డి ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి టిడిపి మద్దతు ఇచ్చి కిరణ్ ప్రభుత్వ పడిపోయేదని అంటున్నారు.అయితే అప్పుడు ఈయన మంత్రిగా ఉన్నారు.అది వేరే విషయం.ఒక పక్క శంకరరావు వచ్చేది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, టిఆర్ఎస్ ల ప్రభుత్వమని చెబుతుంటే,రవీంద్ర రెడ్డి ఇలా కిరణ్ పదవి పోయి ఉండేది కదా అని వ్యాఖ్యానించడమే కాకుండా,అలా జరగనందుకు బాధపడుతుండడం, మధ్యలో టిడిపిని ఆక్షేపించడం విశేషం.

క్విడ్‌ ప్రోకో కేసులో జగన్‌ ప్రమేయం లేదు -శంకర్రావు

హైదరాబాద్ : క్విడ్‌ప్రోకో కేసులో వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రమేయమేమీ లేదని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. 26 జీవోలను జారీ చేసిన మంత్రులందరినీ తప్పించాలని ఆయన మంగళవారమిక్కడ డిమాండ్‌ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిలను తొలగించాలని శంకర్రావు కోరారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రభుత్వంను ప్రజలే తొలగిస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

కారెక్కనున్న ఎర్రబెల్లి సోదరుడు!

వరంగల్‌: టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కారెక్కనున్నారు. ఇప్పటికే ఎర్రబెల్లి ప్రదీప్ రావు చేరికపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరంగల్ తూర్పు నియోజవర్గం ఎమ్మెల్యే టిక్కెట్ ను ఆశిస్తున్న ప్రదీప్ రావు నేడో, రేపో కేసీఆర్ ను కలవనున్నారు.

దాసరికి బొగ్గు మసి

ప్రముఖ దర్శక,నిర్మాత కేంద్ర బొగ్గు గనుల శాఖ మాజీ సహాయ మంత్రి డాక్టర్ దాసరి నారాయణ రావుకు బొగ్గు మసి అంటుకుంది. ఆయన మెడకు కోల్ గేట్ కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది. దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా యుపిఏను కుదిపేసిన బొగ్గు కుంభకోణం కేసులో ఆయన కూడా ఓ నిందితునిగా చేరిపోయారు. ఈ కుంభకోణం పార్లమెంటు ఉభయ సభలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఇదే కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు నివేదికను తెప్పించుకుని మార్పులు చేర్పులు చేసినందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్‌ తన పదవిని కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) వేగవంతం చేసింది. విచారణలో ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కొత్తగా కాంగ్రెస్ నేతలు పలువురు తెరపైకి వస్తున్నారు. లక్షా 86 వేల కోట్ల రూపాయల ఈ కోల్‌స్కామ్‌లో దాసరి నారాయణరావుపై కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. హర్యానాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ ఎంపి నవీన్‌ జిందాల్‌ కంపెనీలకు దాసరి నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు కేటాయింపులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో నవీన్‌ జిందాల్‌ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

వాస్తవానికి గత ఏడాదే బొగ్గు కుంభకోణం సెగ దాసరిని తాకింది. 2006 నుంచి 2009 మధ్య కాలంలో జరిగిన బొగ్గు కేటాయింపులను దృష్టిలోపెట్టుకొని సిబిఐ అధికారులు విచారణలు, సోదాలు, తనిఖీలు చేస్తున్నారు. ఈ కాలంలోనే ఆయన కేంద్ర బొగ్గు గనుల సహాయ మంత్రిగా పనిచేశారు. ఈ కాలంలోనే బొగ్గు గనుల కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయని కాగ్‌ సమర్పించిన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ లో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు సిబిఐ దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, పాట్నా, హైదరాబాద్‌, ధన్‌బాద్‌, నాగపూర్‌లతో పాటు 10 నగరాలలో 30 ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు చేసింది. ఆ సమయంలోనే హైదరాబాద్ లో దాసరిని విచారించినట్లు, ఆయన ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలిసింది. అయితే అప్పట్లో తనను సిబిఐ విచారించలేదని, తన ఇంట్లో తనిఖీలు జరగలేదని ఆయన ఖండించారు. 

ఎఫ్ఐఆర్ లో దాసరి, మాజీ మంత్రి నవీన్ జిందాల్ పేర్లను చేర్చిన సిబిఐ బృందాలుగా విడిపోయి ఈ రోజు(11.06.2013) ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌లోని 19 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా దాసరి నివాసంలో కూడా సోదాలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నవీన్‌ జిందాల్‌ గ్రూపు కంపెనీలకు భారీగా కోల్‌ బ్లాక్‌లు కేటాయించినందుకు ప్రతిఫలంగా దాసరి నారాయణరావు కంపెనీ సిరి మీడియాలో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ ఆరోపణ. దాసరికి చెందిన కంపెనీ షేర్లను మార్కెట్ రేటు కంటే నాలుగు రెట్లు అధికంగా జిందాల్‌ గ్రూపుతో అనుబంధం ఉన్న కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాలు, టీవీ సీరియళ్లు తీసే సౌభాగ్య మీడియా మన రాష్ట్రానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ. ఇది బాంబే స్టాక్‌ ఎక్ఛ్సేంజ్ లో లిస్ట్‌ అయింది. దీంట్లో సిరి మీడియా అనే కంపెనీకి 59.6 శాతం వాటా ఉంది. తెలుగు సినిమా దిగ్గజం, కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి దాసరికి చెందినదే ఈ సిరి మీడియా. అంటే సౌభాగ్య మీడియాలో మెజార్టీ వాటా దాసరిదే. ఈ సౌభాగ్యలో జిందాల్‌తో అనుబంధం ఉన్న న్యూఢిల్లీ ఎగ్జిమ్‌ అనే కంపెనీ 2 కోట్ల 25 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టింది. 2008 డిసెంబరు 8న ఈ పెట్టుబడి పెట్టారు. ఆ సమయంలో సౌభాగ్య షేరు ధర 27 రూపాయలు. మార్కెట్‌ రేటుకు నాలుగు రెట్లు ఎక్కువగా ఒక్కో షేరు 112 రూపాయల 50 పైసలకు న్యూఢిల్లీ ఎగ్జిమ్‌ ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో వాటా తీసుకుంది. ఇప్పుడు సీబీఐ ఈ వ్యవహారాన్ని శోధిస్తోంది. అందుకే సౌభాగ్య మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరిపింది. దాసరి నారాయణరావును ఏ క్షణంలో అయినా సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.