వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, నిరాధారమైన ఆరోపణలతో, కుట్రలు కుతంత్రాలతో అరెస్టుచేసి ఏడాది కాలం పూర్తయింది. దీన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని జననేతకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసించారు. జగన్‌మోహన్‌రెడ్డి జనంలోఉంటే ఆయన ప్రభంజనాన్ని తట్టుకోవడం అసాధ్యమని భావించిన అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు చీకటి ఒప్పందానికి వచ్చి ఆయన్ను అక్రమంగా జైలుకు పంపించాయని వైఎస్సార్సీపీ నేతలు పలువురు ఆరోపించారు. నిరాధారమైన ఆరోపణలతో జగన్‌ను ఏడాది పాటు జైల్లో నిర్బంధించడమే గాక నిబంధలనకు విరుద్ధంగా చార్జిషీట్లు వేస్తూ సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని, కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో సీబీఐ నడుచుకుంటూ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తుండ డాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో వారు తగు విధంగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.