న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం)ల ద్వారా వేసిన ఓటు తాము ఎంచుకున్న అభ్యర్థికే పడిందా లేదా అనే విషయాన్ని ఓటర్లు ఇకపై స్వయంగా తెలుసుకోవచ్చు. ఎన్నికల సంఘం కొత్తగా తయారుచేయించిన ‘ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్(వీవీపీఏటీ)’ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఇది సాకారం అవుతుంది. ఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా బీజేపీ పలు సందేహాలు వ్యక్తంచేసిన నేపథ్యంలో వీవీపీఏటీ రూపకల్పనకు ఈసీ శ్రీకారం చుట్టింది. ఇది అమల్లోకి వస్తే ఓటరు తన ఓటు వేసిన వెంటనే ఏ అభ్యర్థికి ఆ ఓటు పడిందో అతడి పేరు, పార్టీ తదితర వివరాలతో కూడిన రశీదు వస్తుంది. ఓటరు ఆ రశీదు చూసి, తన ఓటు సరిగా పడిందో లేదో పరిశీలించుకోవచ్చు. అయితే ఎన్నికల ప్రక్రియ రహస్యంగా ఉంచేందుకుగాను ఆ రశీదును ఇంటికి పట్టుకెళ్లడానికి అనుమతించరు. ఈ కొత్త విధానంపై చర్చించి.. సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఎన్నికల సంఘం ఈనెల 10న రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. ఇందుకోసం ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులకు ఆహ్వానం పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
కొత్త విధానం కోసం 250 ప్రింటర్లకు ఆర్డర్ ఇచ్చామని, అవి జూన్ మొదటివారంలో వస్తాయని, అనంతరం వాటిని ఈవీఎంలకు అమర్చి, ఏదైనా ఉప ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని తెలిపాయి. అయితే ఈ కొత్త విధానాన్ని 2014 సాధారణ ఎన్నికల్లో అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నాయి. సాధారణ ఎన్నికల్లో దీనిని అమలు చేయాలంటే దాదాపు 13 లక్షల యంత్రాలు అవసరమవుతాయని, ఇందుకు దాదాపు రూ.1,700 కోట్లు వ్యయం అవుతుందని వివరించాయి. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు ఈనెల 10న రాజకీయ పార్టీలతో సమావేశమవుతున్నట్టు తెలిపాయి. కొత్త విధానం పట్ల బీజేపీ అనుకూలంగా ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనే దీనిని ప్రవేశపెట్టాలని ఈసీని కోరుతున్నట్టు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. కాంగ్రెస్ కూడా ఈ విధానం పట్ల సుముఖంగానే ఉన్నప్పటికీ, దాని పనితీరు పరిశీలించిన తర్వాతే తమ అభిప్రాయం చెబుతామని పేర్కొంది. జేడీ(యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు.