Friday, 3 May 2013

137 రోజులుగా షర్మిలతోపాటు వైఎస్ అభిమానుల పాదయాత్ర


రాజన్నే నడిపిస్తున్నాడు

* 137 రోజులుగా షర్మిలతోపాటు వైఎస్ అభిమానుల పాదయాత్ర
* జ్వరమొచ్చినా.. కాళ్లు బొబ్బలెక్కినా.. ఆగకుండా నడక
* వైఎస్ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నిరసనగా కొందరు
* సాయం చేసిన మహానేత రుణాన్ని తీర్చుకోడానికి మరికొందరు
* పాదయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రైతు బాంధవుడు రాజశేఖరన్న... రచ్చబండకు పయనమై...

చోదకుని తప్పిదమో... మానవ కుట్రయో మరణం వాటిల్లెనయా..
ఆంధ్రదేశ ప్రజలు అల్లాడిరి... కొందరు ఆహుతైరి...
నువ్వు తెచ్చిన అధికారంతో నీ పుత్ర బాంధవుడిని జైలు పాలు చేసిరన్నా... ఆలకింపుడయ్యా...!
ఇదెక్కడి న్యాయమో... ఆలకింపుడయ్యా ఆంధ్రదేశ ప్రజలారా... ఆంధ్రదేశ పౌరులారా...
అమ్మా...! షర్మిలమ్మ ఏ నాడు నడిచినావు... ఈ గతుకుల రోడ్లలోనా...
ఈ నాడు తల చూపితివి ప్రచండపుటెండకు.. నడిచావుతలశిల రఘురామ వేసిన బాటలోనా...
ప్రజల, రైతుల కష్ట సుఖములను చెవిచేర్చితివి..
అమ్మా...! షర్మిలమ్మా.. నీ వెంటే మేమంత జగనన్న దారిలోనా.. షర్మిలమ్మా!


అని మందలపు సత్తెన్న రాగమెత్తితే జనమంతా వంత పాడారు. ‘‘కుట్రేదో చేసి పులి లాంటి మహానేతను పొట్టనబెట్టుకున్నారు.. అదే కుట్రతో పులి బిడ్డను బంధించారు.. ఆడబిడ్డను ఇలా రోడ్డు మీద నిలబెట్టారు. ఆమెకు అండగా నిలబడాలనే పాదయాత్రలో మేము సైతం అంటూ పదం కలుపుతూ కదం తొక్కుతున్నాం. మహానేతపై ఉన్న అభిమానంతోనే ఇంత దూరం అలుపన్నదే లేకుండా అవలీలగా నడుస్తున్నాం.

రాజన్నే మమ్మల్ని నడిపిస్తున్నాడు’’ అని ‘మరో ప్రజాప్రస్థానం’లో ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేస్తున్న పలువురు తమ మనోభావాలను వివరించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన పాదయాత్ర రెండు రోజులుగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సాగింది. కాళ్లు బొబ్బలెక్కినా.. జ్వరమొచ్చినా.. ఆగకుండా ఏడు నెలలుగా తన అడుగులో అడుగువేసి కదం తొక్కుతున్న అలుపెరగని పాదయాత్రికులతో కలిసి షర్మిల వారి అభిప్రాయాలు పంచుకున్నారు. శుక్రవారం ఎన్కూరు మండలం రాజలింగాల గ్రామ శివారులో చెట్టుకింద కూర్చొని వారంతా మాట్లాడారు. వారి అభిప్రాయం వారి మాటల్లోనే..


ఆదుకునే కుటుంబానికి ఆపద వచ్చింది... దేవుడి లాంటి వైఎస్సార్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో పెట్టడం మా కుటుంబాన్ని
బాగా బాధించింది. అప్పుడే నాభర్త కాపు రామచంద్రారెడ్డి పదవీ త్యాగానికి సిద్ధపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టారు. ఈ సమయంలో కూడా తన కుటుంబ కష్టాలను పక్కనబెట్టి , కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం షర్మిల పాదయాత్ర చేయడం చూసి నేనూ ఆగలేకపోయా.. ఇడుపులపాయ నుంచి నడుస్తున్నా.
- కాపు భారతి, రాయదుర్గం, అనంతపురం

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెన్నెముకకు వ్యాధి సోకడంతో ఆరోగ్యశ్రీ ద్వారా రూ. లక్ష విలువైన ఆపరేషన్ చేయించుకున్నా. ఇల్లు లేక ఇబ్బందులు పడుతుంటే నాకు ఇల్లు మంజూరు చేయించారు. ఆ కుటుంబాన్ని కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేస్తుంటే తట్టుకోలేక, పాదయాత్రలో పాల్గొంటున్నా. జగనన్న మచ్చలేని చంద్రుడిలా బయటకు వస్తారు.
- దయామణి, బల్లెపల్లి, ప్రకాశం జిల్లా

వైఎస్సార్ పాలనలో ప్రతి పల్లె పచ్చగా ఉంది. ప్రతి కుటుంబం బాగుపడింది. ఇప్పుడు పల్లెల్లో ఆ పరిస్థితి లేదు.
జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ, కాంగ్రెస్‌లు కుట్రపన్ని ఆయన్ను జైలు పాలు చేశాయి. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చాలని, మళ్లీ ఆయన పాలన రావాలనే తలంపుతో పాదయాత్రలో పాలుపంచుకుంటున్నా.
- అంజిరెడ్డి, పర్చూరు, ప్రకాశం జిల్లా

మహానేత మరణించినప్పుడు నేను లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా... జగనన్న సీఎం అవుతాడు అనుకున్న.. కుట్రేదో జరిగింది. జగన్‌రెడ్డిని బందీని చేశారు. నా మనుసు నిలబడలేదు. ఉద్యోగం వదిలి రాష్ట్రానికి వచ్చాను. పాదయాత్రలో షర్మిలమ్మతో నడవాలని నిర్ణయించుకున్నా... ఇచ్ఛాపురం వరకు పాదయాత్రలో పాల్గొనాలని నిర్ణయించుకున్నా.
- దవళ వెంకట గిరిబాబు, ఎన్‌ఆర్‌ఐ, టెక్కలి, శ్రీకాకుళం

మొదట్నుంచి నేను వైఎస్సార్ కుటుంబానికి అభిమానిని. 2003లో వైఎస్ ప్రజాప్రస్థానం పాదయాత్రలో 65
కిలోమీటర్లు నడిచా. ఇప్పుడు కూడా షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొంటున్నా. జగనన్నపై ఎన్ని అబద్ధపు నిందలు వేసినా ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడు.
-ఉప్పు వరప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా

డాక్టర్‌గా వైఎస్సార్ పేదల నాడిపట్టుకున్నారు. ఆయన అంటే నాకు చాలా అభిమానం. నేనూ డాక్టర్‌గా పనిచేస్తున్నా. పాదయాత్ర మొదలవగానే షర్మిల వద్దకు వచ్చేశా. పాదయాత్రలో పాల్గొనాలా.. వద్దా.. అనేది కొద్దిగా సంశయించా... కానీ ఇప్పుడు తెలిసింది... పాదయాత్రలో పాల్గొనకుంటే నేను చాలా కోల్పోయేవాడిని. షర్మిలమ్మ మనోధైర్యంతో ముందుకు సాగుతుండటంతో ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మేం కూడా ముందుకు సాగుతున్నాం. నమ్ముకున్న జనం కోసం దేనికైనా సిద్ధపడే జగనన్నకు అనుచరుడినని చెప్పుకోవడానికి గర్విస్తున్నా.
- డాక్టర్ హరికృష్ణ, పుట్టపర్తి, అనంతపురం జిల్లా

మూడు తరాలుగా మా తాత ముత్తాతలు వైఎస్సార్ కుటుంబాన్నే దైవంగా భావించి పనిచేస్తున్నారు. ఆ కుటుంబం
కోసం పని చేయడం అంటే దేవునికి పూజ చేయడమే. వైఎస్సార్ దయవల్లే నాకు డిప్లొమా సీటొచ్చింది. జగన్ సార్ వల్ల నాకు ఉద్యోగం లభించింది. వైఎస్సార్ కుటుంబంలో పనిచేయడం మేం అదృష్టంగా భావిస్తున్నాం.
- కరుణాకర్, పులివెందుల, కడప జిల్లా

జగనన్న జైలు నుంచి బయటకు రావాలని ప్రతి రోజూ ప్రార్థిస్తున్నా. పేదల కోసం ప్రతి నిత్యం ఆలోచించే వైఎస్సార్ కుటుంబాన్ని కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తుంది. ఈ కుటుంబానికి అండగా నిలబడాలనే సంఘీభావంగా నడుస్తున్నా.
- పేరమ్మ, పులివెందుల, కడప జిల్లా

జగనన్నను కావాలనే జైలు పాలు చేశారు. ఒంటరిగా పార్టీని పెట్టినందుకు ఆయనపై కక్ష గట్టారు. ప్రజల
సమస్యలను తెలుసుకునేందుకు షర్మిల చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాలూ మద్దతు తెలుపుతున్నాయి. షర్మిలమ్మ అందరికీ ధైర్యం చెబుతూ అండగా నిలుస్తున్నారు. ఈ మంచి కార్యక్రమంలో ఆమెకు మద్దతు తెలుపుతూ నేనూ నడుస్తున్నా..
- లక్ష్మీరెడ్డి, జమ్మలమడుగు, కడప జిల్లా

జగనన్న బయట ఉంటేనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజల కోసం వైఎస్సార్ కుటుంబం పనిచేస్తుంది. వైఎస్సార్ కుటుంబం కోసం నేను పని చేయాలని అనుకొని పాదయాత్ర చేస్తున్నాను.
- కె.వెంకటనారాయణ, ఎర్రగుంట్ల కడప జిల్లా


వైఎస్సార్ దగ్గర పనిచేశాను. ఆయన కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం. ఓదార్పు యాత్రలో పూర్తిగా జగనన్న
వెంటే ఉన్నాను. ఇప్పుడు షర్మిల వెంట నడవాలని నిర్ణయించుకొని నడుస్తున్నా. షర్మిలమ్మ పాదయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా.
- జొన్నల శ్రీనివాసరెడ్డి, దేవరపల్లి, కృష్ణా జిల్లా

ఊహ తెలిసిన దగ్గర్నుంచి వైఎస్సార్ అభిమానిగా ఉన్నాను. జగనన్న ముఖ్యమంత్రి కావాలని దేవుడిని
కోరుకుంటూ యాత్రలో పాల్గొం టున్నా. ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తీరుతాయి.
- ఐలా వెంకట కోటిరెడ్డి, నర్సరావుపేట, గుంటూరు జిల్లా


తిరుపతిలో డిగ్రీ చదివే సమయంలో జగన్‌సార్ ప్రోత్సాహంతో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశా. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా. పాదయాత్ర కోసం ఉద్యోగానికి సెలవుపెట్టా. పాదయాత్రలో పాల్గొంటున్న వారికి ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నా.
- ఇమాం బాష, పులివెందుల, కడప జిల్లా


మా కుటుంబానికి వైఎస్సార్ ఎంతో చేశారు. ఆయన వల్ల నేను ఇల్లు కట్టుకున్నాను. మా నాన్నకు ఆరోగ్యశ్రీ కింద
ఆపరేషన్ చేశారు. వైఎస్సార్ కుటుంబానికి చేతనైనంత సహాయం చేయాలని వచ్చాను. పాదయాత్రలో నడుస్తున్న వారికి మంచినీళ్లు అందిస్తున్నాను.
- నర్సింహ్మ, అనంతపురం


ఎండలో షర్మిలమ్మ మా కోసం నడుస్తోంది. వైఎస్సార్ వల్ల నేను, నా కుటుంబం చాలా లబ్ధి పొందాం. మా లాంటి పేదలకు న్యాయం జరగాలంటే జగన్ బయటికి రావాలి.
- నాగలక్ష్మి, పులివెందుల, కడప జిల్లా

'YSజగన్ కు మంచి జరగాలని కోరుకున్నా'

తిరుమల: రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ కు మంచి జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ వైఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారని అన్నారు. జగన్ పై ఎవరెన్ని కుట్రలు చేఇస భగ్నం అవుతాయని అమర్ నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభకు

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభకు ఎన్నిక కావచ్చన్న సమాచారం ఆసక్తికరంగా ఉంది. గత కొద్దికాలంగా ఈసారి మన్మోహన్ పోటీచేయబోరని, ప్రధాని పదవి రేసులో ఉండబోరని కాంగ్రెస్ నేతలు భావించారు. కాని ప్రదాని మన్మోహన్ మాత్రం పూర్తిగా కొట్టి పారేయకుండా, అలాగని పూర్తిగా వదలకుండా మర్మగర్బంగా కద నడుపుతూ వస్తున్నారు. మూడోసారి కూడా ప్రధాని రేసులో ఆయన అవసరమైతే ఉండే అవకాశం కనబడుతోంది.రాహుల్ గాందీకి ఇబ్బంది లేని విధంగా యుపిఎ మెజార్టీ సాదింస్తే ఒకే.లేకుంటే మన్మోహన్ మళ్లీ రేసులో ఉన్నట్లే లెక్క. అదే సమయంలో పదేళ్లాపాటు ప్రధాని పదవిలో ఉన్న ప్రముఖుడికి ఆ పదవితో సంబందం లేకుండా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కేటాయించడంలో ఔచిత్యం కూడా ఉంటుంది.అందువల్ల భవిష్యత్తులో ఏమి జరిగినా మన్మోహన్ రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగవచ్చు.ఆయన వద్దనుకుంటే తప్ప. జూన్ లో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగియనుండడంతో ఈ చర్చ జరుగుతోంది. పదేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రదాని గా ఉన్న రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు.

బాబు అండతోనే కిరణ్ విర్రవీగుతున్నాడు: YS షర్మిల


ఖమ్మం: చంద్రబాబు అండతోనే సీఎం కిరణ్ విర్రవీగుతున్నారని ఖమ్మం జిల్లా జూలూరుపాడులో జరిగిన బహిరంగసభలో షర్మిల మండిపడ్డారు. చంద్రబాబును నాయకుడు కాదు దుర్మార్గుడు అనాలని షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మామను వెన్నుపోటు పొడిచారు.. నేడు ప్రజలను వెన్నుపోటు పొడిచారు అని షర్మిల అన్నారు. అన్ని ఛార్జీలు పెంచుతూ కిరణ్ సర్కారు ప్రజలపై అదనపు భారం మోపుతోందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని షర్మిల తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ దుర్మార్గాలను బయటపెడతారనే జగనన్నను జైలుకు పంపారని ఆమె అన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్‌ఆర్ ఎంతో కృషి చేశారని షర్మిల గుర్తు చేశారు. 

వైఎస్ఆర్సీపీలోకి నేతల వలసలు సహజమే: ఎంపీ సబ్బంహరి

విశాఖ: వైఎస్ఆర్సీపీలోకి నేతల వలసలు సహజమేనని అనకాపల్లి ఎంపీ సబ్బంహరి వ్యాఖ్యానించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్‌లోకి అలా వచ్చినవాడేనని సబ్బంహరి చురకలంటించారు. నేతల చేరికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని సబ్బంహరి అన్నారు. తెలుగుదేశం పార్టీకి దాడి రాజీనామా చేయడంపై ఎంపీ సబ్బంహరి స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. 

దాడి వీరభద్రరావుకు అప్పుడు డిపాజిట్ రాలేదు

తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసిన సీనియర్ నేత దాడి వీరభద్రరావుకు గత ఎన్నికలలో డిపాజి్ట్ రాలేదని మాజీ మంత్రి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత కొణతాల రామకృష్ణ సోదరుడు పెదబాబు వ్యాఖ్యానించారు. దాడి తమ పార్టీలోకి వచ్చినందువల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కొందరు టిడిపి కార్యకర్తలు కూడా అదే సమయంలో టిడిపిని దాడి వీడడంపై విమర్శలు చేస్తున్నారు.

జడ్జిలను కొట్టడం మినహా అంతా చేశారు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ :సకల జనుల సమ్మె సమయంలో హైకోర్టులో విధ్వంసం సృష్టించిన కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయటం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిట్టనిలువుగా చీలిందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హైకోర్టులో ఇలాంటి విధ్వంసాలను తామెన్నడూ వినలేదని, జడ్జిలను కొట్టడం మినహా అంతా చేశారని సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.