Tuesday, 11 June 2013

బాబు, కిరణ్ ఒక్కటయ్యారు: ఈటెల రాజేంద్ర

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీఎం కిరణ్ ఒక్కటయ్యారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన మీడియా పాయింట్ వద్ద ప్రసంగించారు. 

తాము ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించినా పట్టువీడేది లేదని ఈటెల స్పష్టం చేశారు. సీఎం, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ల వ్యవహార శైలి రాచరిక వ్యవస్థను తలపిస్తుందని ఆయన విమర్శించారు. ఛలో అసెంబ్లీ అనుమతి కోసం ముఖ్యమంత్రిని కలుస్తామని ఈ సందర్బంగా ఈటెల తెలిపారు.

డి.ఎల్.కూడా టిడిపిని తప్పుపడుతున్నారా!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని సామెత.ఆ ప్రకారం కాంగ్రెస్ లో గొడవలు టిడిపికి కూడా తలనొప్పిగా చుట్టుకుంటున్నాయి.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బర్తరఫ్ చేసిన మాజీ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ తో పాటు టిడిపిని కూడా ఇరుకున పెట్టాయి.శాసనసభ లాబీలో డిఎల్ రవీంద్ర రెడ్డి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో చేసిన సంభాషణలో ఈ పరిస్థితి కనిపించింది.గత అసెంబ్లీ సమావేశాలలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టిడిపి మద్దతు ఇచ్చి ఉంటే కిరణ్ పదవి పోయేదని డిఎల్ వ్యాఖ్యానించారు.అయితే తాము వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసానికి ఎలా మద్దతు ఇస్తామని రేవంత్ ప్రశ్నించారు. ఒకవేళ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినా ఎమ్.ఐ.ఎమ్. పార్టీ కాంగ్రెస్ ను ఆదుకునేదని ఆయన అన్నారు.కిరణ్ ,చంద్రబాబు కలిసి పనిచేస్తున్నారని ప్రజలలోకి వెళ్లిందని డిఎల్ వ్యాఖ్యానించారు.కొద్ది కాలం క్రితం వరకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు తీవ్ర వ్యతిరేకంగా ఉన్న రవీంద్ర రెడ్డి ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి టిడిపి మద్దతు ఇచ్చి కిరణ్ ప్రభుత్వ పడిపోయేదని అంటున్నారు.అయితే అప్పుడు ఈయన మంత్రిగా ఉన్నారు.అది వేరే విషయం.ఒక పక్క శంకరరావు వచ్చేది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, టిఆర్ఎస్ ల ప్రభుత్వమని చెబుతుంటే,రవీంద్ర రెడ్డి ఇలా కిరణ్ పదవి పోయి ఉండేది కదా అని వ్యాఖ్యానించడమే కాకుండా,అలా జరగనందుకు బాధపడుతుండడం, మధ్యలో టిడిపిని ఆక్షేపించడం విశేషం.

క్విడ్‌ ప్రోకో కేసులో జగన్‌ ప్రమేయం లేదు -శంకర్రావు

హైదరాబాద్ : క్విడ్‌ప్రోకో కేసులో వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రమేయమేమీ లేదని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. 26 జీవోలను జారీ చేసిన మంత్రులందరినీ తప్పించాలని ఆయన మంగళవారమిక్కడ డిమాండ్‌ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిలను తొలగించాలని శంకర్రావు కోరారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రభుత్వంను ప్రజలే తొలగిస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

కారెక్కనున్న ఎర్రబెల్లి సోదరుడు!

వరంగల్‌: టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కారెక్కనున్నారు. ఇప్పటికే ఎర్రబెల్లి ప్రదీప్ రావు చేరికపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరంగల్ తూర్పు నియోజవర్గం ఎమ్మెల్యే టిక్కెట్ ను ఆశిస్తున్న ప్రదీప్ రావు నేడో, రేపో కేసీఆర్ ను కలవనున్నారు.

దాసరికి బొగ్గు మసి

ప్రముఖ దర్శక,నిర్మాత కేంద్ర బొగ్గు గనుల శాఖ మాజీ సహాయ మంత్రి డాక్టర్ దాసరి నారాయణ రావుకు బొగ్గు మసి అంటుకుంది. ఆయన మెడకు కోల్ గేట్ కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది. దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా యుపిఏను కుదిపేసిన బొగ్గు కుంభకోణం కేసులో ఆయన కూడా ఓ నిందితునిగా చేరిపోయారు. ఈ కుంభకోణం పార్లమెంటు ఉభయ సభలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఇదే కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు నివేదికను తెప్పించుకుని మార్పులు చేర్పులు చేసినందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్‌ తన పదవిని కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) వేగవంతం చేసింది. విచారణలో ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కొత్తగా కాంగ్రెస్ నేతలు పలువురు తెరపైకి వస్తున్నారు. లక్షా 86 వేల కోట్ల రూపాయల ఈ కోల్‌స్కామ్‌లో దాసరి నారాయణరావుపై కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. హర్యానాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ ఎంపి నవీన్‌ జిందాల్‌ కంపెనీలకు దాసరి నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు కేటాయింపులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో నవీన్‌ జిందాల్‌ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

వాస్తవానికి గత ఏడాదే బొగ్గు కుంభకోణం సెగ దాసరిని తాకింది. 2006 నుంచి 2009 మధ్య కాలంలో జరిగిన బొగ్గు కేటాయింపులను దృష్టిలోపెట్టుకొని సిబిఐ అధికారులు విచారణలు, సోదాలు, తనిఖీలు చేస్తున్నారు. ఈ కాలంలోనే ఆయన కేంద్ర బొగ్గు గనుల సహాయ మంత్రిగా పనిచేశారు. ఈ కాలంలోనే బొగ్గు గనుల కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయని కాగ్‌ సమర్పించిన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ లో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు సిబిఐ దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, పాట్నా, హైదరాబాద్‌, ధన్‌బాద్‌, నాగపూర్‌లతో పాటు 10 నగరాలలో 30 ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు చేసింది. ఆ సమయంలోనే హైదరాబాద్ లో దాసరిని విచారించినట్లు, ఆయన ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలిసింది. అయితే అప్పట్లో తనను సిబిఐ విచారించలేదని, తన ఇంట్లో తనిఖీలు జరగలేదని ఆయన ఖండించారు. 

ఎఫ్ఐఆర్ లో దాసరి, మాజీ మంత్రి నవీన్ జిందాల్ పేర్లను చేర్చిన సిబిఐ బృందాలుగా విడిపోయి ఈ రోజు(11.06.2013) ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌లోని 19 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా దాసరి నివాసంలో కూడా సోదాలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నవీన్‌ జిందాల్‌ గ్రూపు కంపెనీలకు భారీగా కోల్‌ బ్లాక్‌లు కేటాయించినందుకు ప్రతిఫలంగా దాసరి నారాయణరావు కంపెనీ సిరి మీడియాలో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ ఆరోపణ. దాసరికి చెందిన కంపెనీ షేర్లను మార్కెట్ రేటు కంటే నాలుగు రెట్లు అధికంగా జిందాల్‌ గ్రూపుతో అనుబంధం ఉన్న కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాలు, టీవీ సీరియళ్లు తీసే సౌభాగ్య మీడియా మన రాష్ట్రానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ. ఇది బాంబే స్టాక్‌ ఎక్ఛ్సేంజ్ లో లిస్ట్‌ అయింది. దీంట్లో సిరి మీడియా అనే కంపెనీకి 59.6 శాతం వాటా ఉంది. తెలుగు సినిమా దిగ్గజం, కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి దాసరికి చెందినదే ఈ సిరి మీడియా. అంటే సౌభాగ్య మీడియాలో మెజార్టీ వాటా దాసరిదే. ఈ సౌభాగ్యలో జిందాల్‌తో అనుబంధం ఉన్న న్యూఢిల్లీ ఎగ్జిమ్‌ అనే కంపెనీ 2 కోట్ల 25 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టింది. 2008 డిసెంబరు 8న ఈ పెట్టుబడి పెట్టారు. ఆ సమయంలో సౌభాగ్య షేరు ధర 27 రూపాయలు. మార్కెట్‌ రేటుకు నాలుగు రెట్లు ఎక్కువగా ఒక్కో షేరు 112 రూపాయల 50 పైసలకు న్యూఢిల్లీ ఎగ్జిమ్‌ ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో వాటా తీసుకుంది. ఇప్పుడు సీబీఐ ఈ వ్యవహారాన్ని శోధిస్తోంది. అందుకే సౌభాగ్య మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరిపింది. దాసరి నారాయణరావును ఏ క్షణంలో అయినా సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Monday, 10 June 2013

అద్వానీ రాజీనామాను ఆమోదించం: బీజేపీ

న్యూఢిల్లీ: సీనియర్ నేత ఎల్ కే అద్వానీ రాజీనామాను ఆమోదించేదే లేదు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం ముగిసిన తర్వాత రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. పార్టీకి అద్వానీ సూచనలు, సలహాలు చాలా అవసరం అని అన్నారు. అద్వానీ రాజీనామా అనంతర పరిస్థితులపై పార్లమెంటరీ కమిటీ భేటిలో చర్చించామని బీజేపీ నేతలు వెల్లడించారు. 

పార్టీ పదవులకు అద్వానీ రాజీనామా

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ బీజేపీలోని అన్ని పదవులకు సోమవారం రాజీనామా చేశారు. జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ బోర్డు, ప్రచార కమిటీ బాధ్యతలకు రాజీనామా చేస్తూ ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. 

నరేంద్ర మోడీని పార్టీ ప్రచార కమిటీ సారధిగా నియమించటంపై అసంతృప్తితో ఉన్న అద్వానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, పండిట్‌ దీన్‌దయాళ్‌, నానాజీ, వాజ్‌పేయి వంటి వారు రూపొందించిన సిద్ధాంతాలకనుగుణంగా పార్టీ పనిచేస్తున్నట్టు కనిపించడం లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌కు రాసిన లేఖలో అద్వానీ పేర్కొన్నారు. 

పార్టీ ప్రస్తుతం పనిచేస్తున్న తీరు, పార్టీ గమనం అర్థం కాకుండా ఉందని అన్నారు. ఈ పరిస్థితులతో రాజీపడటం తనకు ఇబ్బందిగా ఉందని అద్వానీ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మూడు పేరాల రాజీనామా లేఖలో అద్వానీ మూడు విభిన్న అంశాల్ని ప్రస్తావించారు. మొదటి పేరాలో జనసంఘ్‌, బీజేపీలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు. రెండో పేరాలో పార్టీ ప్రస్తుత తీరు, నాయకుల వ్యక్తిగత అజెండాలను ప్రస్తావించారు. 

మూడో పేరాలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ముప్పావు గంట సేపు సాగిన నరేంద్ర మోడీ ప్రసంగంలో ఎక్కడా తన పేరు ప్రస్తావించకపోవడం కూడా అద్వానీని మనస్థాపానికి గురి చేసినట్టు తెలుస్తోంది. మోడీకి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలియడంతో... గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. 

ఈ ఉదయం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ ఢిల్లీలో అద్వానీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాజీనామా నిర్ణయాన్ని అద్వానీ ప్రకటించడం విశేషం. మోడీని వ్యతిరేకిస్తున్నారనే తెలియగానే మోడీ అభిమానులు అనేక మంది ఢిల్లీలో అద్వానీ నివాసం ముందు ఆందోళనకు దిగారు. ఇది కూడా అద్వానీని కలిచివేసినట్టు తెలుస్తోంది. అయితే అద్వానీ రాజీనామాపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

మోడీతో లౌకికవాదానికి ముప్పు: చెన్నితల

తిరువనంతపురం: గుజరాత్ సీఎం నరేంద్రమోడీని 2014 లోక్‌సభ ఎన్నికల సమరానికి పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా బీజేపీ నియామించడంపై కేరళ పీసీసీ అధ్యక్షుడు రమేష్ చెన్నితల ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ నియామకం దేశ ప్రజాస్వామ్యం, లౌకికవాదానికి సవాల్ అని వ్యాఖ్యానించారు. మోడీ పనితీరు లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉంటుందన్నారు. మోడి, అద్వానీ నాణానికున్న రెండు పార్వ్శాలాంటి వారని పేర్కొన్నారు. మోడీని అద్వానీయే ఆమోదించలేకపోయారని చెన్నితల అన్నారు.

Sunday, 9 June 2013

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా

రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో సోమ వారం (175వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీ నర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆదివారం ప్రకటించారు. మండపేట కె.పి. రోడ్డు నుంచి సోమవారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. 7.2 కిలోమీటర్ల నడక అనంతరం మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 7.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. రామచంద్రపురంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడే రాత్రి బస చేస్తారు. సోమవారం మొత్తం 14.4 కిలోమేటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.

పర్యటించే ప్రాంతాలు
మారేడుబాక, పులగుర్త, మాచవరం, పసలపూడి, వై.ఎస్.ఆర్. స్టాట్యూ, రామచంద్రపురం

ఉపఎన్నికలకు వీలుంది: గోనె ప్రకాశ్‌రావు

హైదరాబాద్: ఎన్నికలకు ఏడాది గడువుంటే ఉపఎన్నికలు నిర్వహంచకూడదన్న నిబంధన ఏదీ లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్‌తో సీఈసీ కుమ్మక్కై ఉపఎన్నికలు రావని చెబుతోందని ఆరోపించారు. ఏడాదిలోపే గడువున్నా ఉపఎన్నికలు నిర్వహించిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ఎలక్షన్ కమిషన్‌ స్వతంత్ర సంస్థ అయినప్పటికీ ఇలాంటి నిర్ణయాలపై కోర్టు తీర్పుఉందని తెలిపారు. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు ఉపఎన్నికలు నిర్వహించాలని న్యాయపోరాటం చేస్తారని చెప్పారు.