Monday, 10 June 2013

అద్వానీ రాజీనామాను ఆమోదించం: బీజేపీ

న్యూఢిల్లీ: సీనియర్ నేత ఎల్ కే అద్వానీ రాజీనామాను ఆమోదించేదే లేదు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం ముగిసిన తర్వాత రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. పార్టీకి అద్వానీ సూచనలు, సలహాలు చాలా అవసరం అని అన్నారు. అద్వానీ రాజీనామా అనంతర పరిస్థితులపై పార్లమెంటరీ కమిటీ భేటిలో చర్చించామని బీజేపీ నేతలు వెల్లడించారు. 

పార్టీ పదవులకు అద్వానీ రాజీనామా

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ బీజేపీలోని అన్ని పదవులకు సోమవారం రాజీనామా చేశారు. జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ బోర్డు, ప్రచార కమిటీ బాధ్యతలకు రాజీనామా చేస్తూ ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. 

నరేంద్ర మోడీని పార్టీ ప్రచార కమిటీ సారధిగా నియమించటంపై అసంతృప్తితో ఉన్న అద్వానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, పండిట్‌ దీన్‌దయాళ్‌, నానాజీ, వాజ్‌పేయి వంటి వారు రూపొందించిన సిద్ధాంతాలకనుగుణంగా పార్టీ పనిచేస్తున్నట్టు కనిపించడం లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌కు రాసిన లేఖలో అద్వానీ పేర్కొన్నారు. 

పార్టీ ప్రస్తుతం పనిచేస్తున్న తీరు, పార్టీ గమనం అర్థం కాకుండా ఉందని అన్నారు. ఈ పరిస్థితులతో రాజీపడటం తనకు ఇబ్బందిగా ఉందని అద్వానీ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మూడు పేరాల రాజీనామా లేఖలో అద్వానీ మూడు విభిన్న అంశాల్ని ప్రస్తావించారు. మొదటి పేరాలో జనసంఘ్‌, బీజేపీలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు. రెండో పేరాలో పార్టీ ప్రస్తుత తీరు, నాయకుల వ్యక్తిగత అజెండాలను ప్రస్తావించారు. 

మూడో పేరాలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ముప్పావు గంట సేపు సాగిన నరేంద్ర మోడీ ప్రసంగంలో ఎక్కడా తన పేరు ప్రస్తావించకపోవడం కూడా అద్వానీని మనస్థాపానికి గురి చేసినట్టు తెలుస్తోంది. మోడీకి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలియడంతో... గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. 

ఈ ఉదయం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ ఢిల్లీలో అద్వానీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాజీనామా నిర్ణయాన్ని అద్వానీ ప్రకటించడం విశేషం. మోడీని వ్యతిరేకిస్తున్నారనే తెలియగానే మోడీ అభిమానులు అనేక మంది ఢిల్లీలో అద్వానీ నివాసం ముందు ఆందోళనకు దిగారు. ఇది కూడా అద్వానీని కలిచివేసినట్టు తెలుస్తోంది. అయితే అద్వానీ రాజీనామాపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

మోడీతో లౌకికవాదానికి ముప్పు: చెన్నితల

తిరువనంతపురం: గుజరాత్ సీఎం నరేంద్రమోడీని 2014 లోక్‌సభ ఎన్నికల సమరానికి పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా బీజేపీ నియామించడంపై కేరళ పీసీసీ అధ్యక్షుడు రమేష్ చెన్నితల ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ నియామకం దేశ ప్రజాస్వామ్యం, లౌకికవాదానికి సవాల్ అని వ్యాఖ్యానించారు. మోడీ పనితీరు లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉంటుందన్నారు. మోడి, అద్వానీ నాణానికున్న రెండు పార్వ్శాలాంటి వారని పేర్కొన్నారు. మోడీని అద్వానీయే ఆమోదించలేకపోయారని చెన్నితల అన్నారు.

Sunday, 9 June 2013

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా

రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో సోమ వారం (175వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీ నర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆదివారం ప్రకటించారు. మండపేట కె.పి. రోడ్డు నుంచి సోమవారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. 7.2 కిలోమీటర్ల నడక అనంతరం మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 7.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. రామచంద్రపురంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడే రాత్రి బస చేస్తారు. సోమవారం మొత్తం 14.4 కిలోమేటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.

పర్యటించే ప్రాంతాలు
మారేడుబాక, పులగుర్త, మాచవరం, పసలపూడి, వై.ఎస్.ఆర్. స్టాట్యూ, రామచంద్రపురం

ఉపఎన్నికలకు వీలుంది: గోనె ప్రకాశ్‌రావు

హైదరాబాద్: ఎన్నికలకు ఏడాది గడువుంటే ఉపఎన్నికలు నిర్వహంచకూడదన్న నిబంధన ఏదీ లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్‌తో సీఈసీ కుమ్మక్కై ఉపఎన్నికలు రావని చెబుతోందని ఆరోపించారు. ఏడాదిలోపే గడువున్నా ఉపఎన్నికలు నిర్వహించిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ఎలక్షన్ కమిషన్‌ స్వతంత్ర సంస్థ అయినప్పటికీ ఇలాంటి నిర్ణయాలపై కోర్టు తీర్పుఉందని తెలిపారు. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు ఉపఎన్నికలు నిర్వహించాలని న్యాయపోరాటం చేస్తారని చెప్పారు.

ఆనం సోదరులకు మతిభ్రమించింది

తిరుపతి: జగన్‌ను విమర్శించడమే ఆనం సోదరులు పనిగా పెట్టుకున్నారని వైఎస్ఆర్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆనం సోదరులు మతిభ్రమించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పదవి వ్యామోహంతో సోనియా మెప్పుపొందేందుకు జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆనం సోదరులకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. 

టీడీపీలో గుర్తింపు పొందేందుకే వర్ల రామయ్య అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ-కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు త్వరలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

రేవంత్ డిమాండ్ కే సిబిఐ స్పందించిందా!

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధికార ప్రతినిది అంబటి రాంబాబు కొత్త ఆరోపణ సంధిస్తున్నారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన తర్వాతే సిబిఐ విజయసాయి రెడ్డి, జగన్ లను ఒకే జైలులో ఉంచరాదని కోర్టులో మెమో దాఖలు చేసిందని రాంబాబు అంటున్నారు.ఇక్కడే అనుమానం వస్తోందని ఆయన చెబుతున్నారు.ఇప్పటివరకు నిందితులను వేర్వేరు జైళ్లలో ఉంచాలని సిబిఐ కోరలేదని,రేవంత్ రెడ్డి కోరిన తర్వాతే ఇది జరిగినట్లు కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం సాక్ష్యాలు తారుమారు చేస్తారనే కారణంతోనే జగన్‌ను అరెస్టు చేశారని, అలాంటప్పుడు సిబిఐ ఈ విధంగా ఎలా వాదిస్తుందని ఆయన ప్రశ్నించారు.జగన్‌ను మానసికంగా వేధించి లబ్ధి పొందాలని కాంగ్రెస్, టీడీపీలు చూస్తున్నాయని , అందుకోసం సీబీఐని పావుగా వాడుకుంటున్నాయని రాంబాబు ఆరోపించారు.

సి.ఎమ్.క్యాంప్ ఆపీస్ వద్ద టిడిపి దర్నా

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేయాలని కోరుతూ ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ ను కలిసి తాము దీనిపై వివరించాలని అనుకున్నామని,కాని ఆయన అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా తమను అడ్డుకోవడం పద్దతి కాదని టిడిపి ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. వారంతా సి.ఎమ్.క్యాంప్ ఆపీస్ వద్ద భైఠాయించారు.అయితే ముఖ్యమంత్రి వీరికి ఎందుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదో తెలియదు.ముందుగా అప్పాయింట్ మెంట్ కోరకుండా వీరు క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారా?లేక లోపలికి వచ్చి వారు గొడవకు దిగే అవకాశం ఉందని కిరణ్ వారిని కలుసుకోలేదా అన్నది కూడా చర్చనీయాంశమే.ఏది ఏమైనా విచారణకు ఆదేశించిన కిరణ్ అదే సంగతి టిడిపి నేతలకు చెప్పి ఉంటే సరిపోయేదేమో.

ముఖ్యమంత్రి కిరణ్ ను అసమ్మతి మంత్రులు ఏమీ చేయలేరా!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి అధిష్టానంలో పట్టు పెరిగిందా?కాంగ్రెస్ లో ఆయనదే పై చేయి అవుతోందా?కాంగ్రెస్ లో దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తాజా పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ అసమ్మతిని తుంచడానికే మొగ్గు చూపుతోందని సి.ఎమ్ శిబిరంలో సంతోషం వ్యక్తం అవుతోంది. వైద్య శాఖ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డిని బర్తరఫ్ చేసిన తీరు పై అసమ్మతి ఏర్పాడింది. అసమ్మతి మంత్రులు డిల్లీ వెళ్లి దానిపై తమ అబిప్రాయాలు చెప్పినా అధిష్టానం సీరియస్ గా పట్టించుకోలేదన్న అబిప్రాయం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీనియర్ మంత్రి జానారెడ్డి వంటి వారు డి.ఎల్.ను బర్తరఫ్ చేసిన తీరుపై బహిరంగంగానే వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక మంత్రివర్గ భేటీలో వారు దీనిపై ముఖ్యమంత్రిని నిలదీస్తారని ప్రచారం జరిగింది.కాని అసలు ఆ అంశమే ప్రస్తావనకు రాకపోవడం గమనించదగిన అంశంగా ఉంది. డి.ఎల్. బర్తరఫ్ అదిష్టానం పెద్దలకు చెప్పే సి.ఎమ్. చేశారన్నది ఒక వాదనగా ఉంది.ఇక ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఢిల్లీ యాత్ర చేసినా పెద్దగా ఒరిగింది లేదని సి.ఎమ్. శిబిరం వ్యాఖ్యానిస్తోంది. మెదక్ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా దామోదరకు లేని విషయాన్ని అదిష్టానం గుర్తించిందని, అదే విషయాన్ని ఆయనతో అదిష్టానం పెద్దలు ప్రస్తావించారని,దాంతో ఆయన వైఖరిలో కొంత మార్చు వచ్చిందని కొందరు చెబుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ వద్ద దామోదర్ ప్రవర్తించిన తీరును వారు ఉదహరిస్తున్నారు. ఆయన చాలా వినయంగా కనిపించారని కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు. సోనియాగాందీ గతంలో కన్నా ఇప్పుడు చాలా విషయాలు సేకరించి వచ్చినవారితో మాట్లాడుతున్నారని, దాంతో ఏదో ఒక ఫిర్యాదు చేయాలని వెళ్లినవారే ఇబ్బంది పడవలసి వస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని బట్టి కిరణ్ కు ఎన్నికలవరకు ఎదురు లేదని అనుకోవచ్చా!

బిజెపి బ్రాండ్ అంబాసిడర్ గా నరేంద్ర మోడీ

మొత్తం మీద బిజెపి బ్రాండ్ అంబాసిడర్ గా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నియమితులయ్యారు. పార్టీ అగ్ర నేత ఎల్.కె. అద్వాని కి అంతగా ఇష్టం లేకపోయినప్పట్టికీ పార్టీ అద్యక్షుడుగా ఉన్న రాజ్ నాద్ సింగ్ ఆధ్వర్యంలో కార్యవర్గం ఈ నిర్ణయం తీసేసుకుంది.దీనిపై మోడీ అనుకూల వర్గం అంతా ఆనందంతో ఉంది.కొత్తగా పార్టీలో చేరిన మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణలో బీజేపీకే పట్టం కడతారని దీమా వ్యక్తం చేశారు. మోడి నాయకత్వాన్ని ప్రజలు కోరుతున్నారని అన్నారు.