Tuesday 28 May 2013

రాహుల్ గాంధీకి కోపమొచ్చింది...

రాయపూర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్ సర్కారుపై, అక్కడి ఉన్నతాధికారులపై తన కోపాన్ని ప్రదర్శించా రు. కాంగ్రెస్ కాన్వాయ్‌పై మావోయిస్టుల దాడి దరిమిలా రాజ్‌భవన్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో రాహుల్ కూడా పాల్గొన్నారు. సమావేశం మొదలైన కొద్దిసేపటికే, ‘దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అంటూ రాహుల్ ఆగ్రహంగా ప్రశ్నించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్, పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జరిగిన సంఘటనపై ప్రధాన కార్యదర్శి తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా, రాహుల్ మళ్లీ అదే ప్రశ్న అడిగారు. అయితే, ఆయన ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించకపోవడంతో ఎవరు స్పందించాలో తోచక అధికారులెవరూ బదులివ్వలేదు.

ముఖ్యమంత్రి కూడా సహనంతో మౌనంగా ఉండిపోయారు. కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత ప్రధాన కార్యదర్శి తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. రాహుల్ మళ్లీ అదే ప్రశ్న అడగడంతో ప్రధాన కార్యదర్శి స్పందించారు. రాష్ట్ర అధికార యంత్రాంగానికి అధినేతగా జరిగిన లోపాలకు బాధ్యత వహించేందుకు సంసిద్ధంగా ఉన్నానని, తన రాజీనామాతో సమస్య పరిష్కారం కాగలదనుకుంటే, అందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దీంతో రాహుల్ మౌనం వహించారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన తనయుడికి బాసటగా నిలుస్తూ, తమ పార్టీ నేతలకు రక్షణ కల్పించడంలో వైఫల్యంపై ఛత్తీస్‌గఢ్ అధికారులను నిలదీశారు. ఈ దశలో రమణ్ సింగ్ జోక్యం చేసుకుని, కాంగ్రెస్ నేతలకు రక్షణ కల్పించామని, వారికి కల్పించే భద్రతా సిబ్బందిని కూడా తగ్గించలేదని చెప్పారు.

ఛత్తీస్‌గఢ్ అధికారుల రుసరుసలు: సమీక్ష సమావేశంలో రాహుల్ తీరుపై ఛత్తీస్‌గఢ్ అధికారులు రుసరుసలాడుతున్నారు. పాలకపక్షానికి ఆయన పెద్ద బాస్ అయితే కావచ్చునని, కేంద్ర ప్రభుత్వంలో గానీ, రాష్ట్రంలో గానీ ఆయనకు ఎలాంటి అధికార హోదా లేదని, అలాంటప్పుడు సమీక్ష సమావేశంలో పాల్గొనే అవసరమే ఆయనకు లేదని ఛత్తీస్‌గఢ్ అధికారి ఒకరు అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారిక పర్యటనలో భాగంగా సోనియా, రాహుల్ రాజ్‌భవన్‌కు అతిథులుగా వచ్చారని అన్నారు. అయితే, సమీక్ష సమావేశంలో ఎవరు పాల్గొనాలనేది గవర్నర్ విచక్షణాధికారంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

0 comments:

Post a Comment