Saturday, 25 May 2013

టీఆర్‌ఎస్.. కాంగ్రెస్‌లో కలిసేదే: బీజేపీ

హైదరాబాద్: తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న తమ పార్టీని విమర్శించే అర్హత, హక్కు టీఆర్‌ఎస్‌కు లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లు గెలిచినా ఆ పార్టీ కాంగ్రెస్‌లో కలవడం ఖాయమని చెప్పారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆరే స్వయంగా ఆ విషయాన్ని చెప్పారని తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధులు ఎస్.కుమార్, ప్రకాశ్‌రెడ్డితో కలిసి ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. దేశంలో జాతీయ పార్టీలు కూడా పెద్ద ప్రాంతీయపార్టీలుగా మారాయని, అందుకు బీజేపీ మినహాయింపు కాదన్న టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్న కేసీఆర్ పార్టీ అంతకుమించి మాట్లాడుతుందని ఊహించలేమన్నారు. ఎన్నికలకోసం తెలంగాణను ఉపయోగించుకోవాలన్నది తమ ఉద్దేశం కానేకాదన్నారు.

తెలంగాణ అమరవీరుల త్యాగం వృథా కాకూడదన్నదే తమ వాంఛ అని చెప్పారు. నిబద్ధతతో కూడిన తమ పార్టీని విమర్శించే స్థాయి టీఆర్‌ఎస్‌కు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదన్నారు. స్వతంత్రంగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసిందని చెప్పారు. రాష్ట్రం అగ్నిగుండంగా మారి రోజూ వందలాది మంది పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపులేకుండా ఉందని ఆయన దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నవారికి పదవులుతప్ప ప్రజాసమస్యలు పట్టట్లేదని మండిపడ్డారు. కరువు మండలాల్లో మంచి నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. 

0 comments:

Post a Comment