Saturday, 25 May 2013

YSజగన్‌ను కేసులతో వేధిస్తూ జైలుకు పంపిన కుట్రలు


* నల్లకాలువ సభలో ప్రజలకిచ్చిన మాట.. ఓదార్పు
* ఆయన యాత్రల ప్రభంజనం చూసి కుళ్లుకున్న నేతలు
* కాంగ్రెస్ అధిష్టానం ఆంక్షలు.. ఆప్తులపై వేటు అస్త్రాలు
* కుటుంబాన్ని విడదీసే కుట్రలతో పార్టీని వీడిన జననేత
* వైఎస్సార్ సీపీ ఆవిర్భావానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ
* ప్రతి ఎన్నికలోనూ బ్రహ్మరథం పట్టిన రాష్ట్ర ప్రజానీకం

ప్రజలకు ఇచ్చిన మాట తప్పినట్లయితే.. ఆయనకు పదవులు దక్కేవి! మడమ తిప్పి.. ఓదార్పు యాత్రను వదిలేస్తే ఆయనను కేంద్రమంత్రి పదవి వరించేది! అధిష్టానం ఆదేశాలకు జీ హుజూర్ అంటూ శిరసును నేలకు తాటిస్తే ఇంకెన్నో భోగభాగ్యాలు లభించేవి! 

కానీ.. మాట తప్పటం.. మడమ తిప్పటం.. ఆయన రక్తంలోనే లేదు! అందుకోసం కష్టాలెన్ని ఎదురైనా వెరపులేదు!
ఫలితం.. అవినీతి అంటూ నోటీసులు, కేసులు, ఆస్తుల అటాచ్‌మెంట్లు, అనూహ్య అరెస్టులు, రిమాండ్ పేరుతో జైలు, బెయిల్ కూడా రానివ్వకుండా వేధింపులు! వారం, నెలా కాదు.. ఏకంగా ఏడాది కాలం గడచిపోయింది!

‘‘మాట తప్పటం కన్నా మరణించటం మేలు. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యం’’ అంటూ తన తండ్రి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎప్పుడూ చెప్పే మాటను నరనరానా జీర్ణించుకున్న వ్యక్తి. ఆయనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
ఇంతకీ జగన్ ప్రజలకు ఇచ్చిన మాట ఏమిటి? ఏ మాటపై నిలబడినందుకు జగన్‌కు ఇన్ని కష్టాలు?

నల్లకాలువ సభలో ఇచ్చిన మాట... నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో రాష్ట్ర ప్రజలంతా దిగ్భ్రమకు లోనయ్యారు. ఆత్మీయమైన ఆసరా కోల్పోయామంటూ తెలుగుజాతి యావత్తూ విలవిలాడింది. వైఎస్ మరణ వార్త విన్న షాక్‌లో ఎన్నో గుండెలు ఆగిపోయాయి. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది ప్రాణాలొదిలారు. ఈ మరణాలు జగన్‌మోహన్‌రెడ్డిని కదిలించివేశాయి. వైఎస్ మరణంతో పెద్ద దిక్కుకోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రజలంతా ఓదార్చగా.. వైఎస్ కోసం చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు తాను స్వయంగా ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి కలుస్తానని.. జగన్ మాట ఇచ్చారు.

వైఎస్ మరణించిన 22వ రోజున నల్లకాలువ వద్ద అశేష జనవాహిని సమక్షంలో ఆయన ఈ విషయం ప్రకటించారు. ఇచ్చిన మాట మేరకు 2010 ఏప్రిల్ 10న పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన యాత్ర ప్రారంభించారు. వైఎస్ కోసం చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా వారి ఇంటికి వెళ్లి.. వారికి తానున్నానంటూ ఓదార్పునందించారు. జగన్ ఓదార్పు యాత్ర ప్రజావెల్లువతో ప్రభంజనంలా మారింది. తమను ఓదార్చటానికి వచ్చిన జగన్‌లో ప్రజలు కన్న కొడుకును, తోబుట్టువును చూసుకున్నారు. ఆత్మీయుడిగా ఆదరించి అక్కున చేర్చుకున్నారు. తమ కష్టాలు చెప్పుకుని కన్నీరు కార్చారు. కంచంలో కూటిని నోటికి అందించారు. నీవు ఒంటరివి కావంటూ జగన్‌కూ ఓదార్పునందించారు. ఆయనకు, ఆయన కుటుంబానికి తోడుగా నిలిచారు.


* వైఎస్ మరణం తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చుతానని జగన్ మాట ఇవ్వటం నేరమా?
* కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఇంటికి వెళ్లి పరామర్శించటం మన సాంప్రదాయం కాదా?
* రాజన్న కొడుకుకు జనాదరణ పెరగటం చూసి కాంగ్రెస్ పెద్దలకు కన్నుకుట్టటం నిజంకాదా?
* రాజన్నను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారనటానికి ఓదార్పుయాత్ర అద్దం పట్టలేదా?

ప్రభంజనంగా మారిన ఓదార్పు..
వ్యక్తిగా ఓదార్పు యాత్ర ప్రారంభించిన జగన్ ప్రజల ఆదరాభిమానాల వెల్లువతో ఓ శక్తిగా మారారు. ప్రజల కష్టాలు, కడగండ్లను దగ్గరగా చూసి చలించిపోయి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర వైఎస్‌ను చరిత్రలోనే అరుదైన సంక్షేమపథగామిగా మారిస్తే.. ఓదార్పు యాత్ర జగన్‌ను ప్రజల ఆశలు, ఆకాంక్షలకు నిలువుటద్దంలా మార్చింది. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు, వారిలో భవిష్యత్‌పై భరోసా కల్పించేందుకుగాను జగన్‌లో వయసుకు మించిన ఓర్పును, పరిణతిని ఓదార్పు యాత్ర కల్పించింది. వేనవేల కిలోమీటర్ల ప్రయాణంలో కోట్లాది మంది జనం గుండె తలుపులు తట్టిన ఓదార్పుయాత్ర ఇక జగన్‌ది కాకుండా పోయింది. అది ప్రజల ఓదార్పుయాత్రగా మారిపోయింది. ఓదార్పు యాత్రకు లభిస్తున్న ప్రభంజనం కాంగ్రెస్ వృద్ధ జంబూకాల మదిలో కల్లోలం రేపింది.

జగన్ జననేతగా ఎదగటం వారికి ఇష్టం లేకపోయింది. కుట్రలు, కుతంత్రాలు బయల్దేరాయి. కాంగ్రెస్ నేతలు ఈ యాత్ర వద్దన్నారు. అధిష్టానం ఆంక్షలు పెట్టింది. ఎమ్మెల్యేలు, ఎంపీలెవరూ ఓదార్పు యాత్రలో పాల్గొనరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. జగన్‌కు మద్దతుగా నిలబడిన నాయకులపై వేటు పడింది. అయినా జగన్ వెనక్కు తగ్గలేదు. ఓదార్పు ఆగలేదు. అరెస్టయ్యే వరకూ ఆయన యాత్ర సాగుతూనే ఉంది. మొత్తం 13 జిల్లాల్లో 265 రోజుల పాటు సాగిన ఓదార్పు యాత్రలో 494 కుటుంబాలను జగన్ ఓదార్చారు. 18,162 కిలోమీటర్ల మేర ఓదార్పు యాత్ర సాగటం, 5,124 గ్రామాలు, పట్టణాలలో 2,217 సభలు నిర్వహించటం ఓ రికార్డు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారందరినీ తాము పరామర్శిస్తామని, కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున అందజేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఆ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండాఅటకెక్కించేసింది.

* జగన్ కోసం ప్రజలు రేయనక పగలనక ఎదురుచూడటం నిజం కాదా?
* ప్రజానాయకుడిగా ఎదుగుతున్న జగన్ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కుట్రలు సాగటం, తప్పుడు నివేదికలివ్వటం ఎందుకు?
* ఓదార్పుపై ఆంక్షలు.. జగన్‌ను జనం నుంచి దూరం చేయటానికి కాదా?
* ప్రజలను కదిలించగలిగే నాయకుడిగా జగన్ ఎదగటం కాంగ్రెస్ నేతలకు ఎందుకు కంటగింపయ్యింది?


పథకాల అమలు కోసం నిరంతర పోరాటం
వైఎస్ మరణం తర్వాత.. జగన్‌మోహన్‌రెడ్డికి జనం నీరాజనం పడుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు గండికొట్టటం ప్రారంభించింది. ఆరోగ్యశ్రీ పథకానికి కోత పెట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరతను తీర్చకుండా, మౌలిక వసతులు కల్పించకుండానే.. 133 జబ్బులను ప్రయివేటు ఆస్పత్రుల జాబితా నుంచి తొలగించి, ప్రభుత్వాస్పత్రులకు బదలాయించారు. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో ఆయా జబ్బులకు చికిత్స లభించక రోగులు అల్లాడుతున్నారు. అలాగే.. వేల సంఖ్యలో రోగులకు చికిత్సలకు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీకి నిధులూ అరకొరే. అటు లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులపై భరోసా కల్పించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ఆంక్షలతో సర్కారు తూట్లు పొడిచింది. ఫీజులు ఏ సంవత్సరమూ సక్రమంగా విడుదల చేయలేదు.

పైగా వయోపరిమితి, ఆదాయపరిమితి, ప్రభుత్వ కాలేజీల్లోనే చదవాలి అంటూ విపరీతమైన ఆంక్షలతో పాటు.. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ఫీజులపై పరిమితులు వంటి చర్యలతో మొత్తం పథకం స్ఫూర్తికే తూట్లు పొడిచారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల పథకానికీ సర్కారు ఎసరు పెట్టింది. కొత్తగా పెన్షన్లే ఇవ్వకపోగా ఉన్న వాటినే తొలగించింది. మహిళలకు పావలా వడ్డీ పథకం కాగితాలకే పరిమితమయింది. ఇక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చారు. రోజుకు 9 గంటలు విద్యుత్ అందిస్తామన్న వైఎస్ హామీకి పాతరేశారు. కనీసం ఏడు గంటల విద్యుత్ అయినా సరఫరా అవుతుందా అంటే.. రోజుకు రెండు మూడు గంటలు విద్యుత్ వస్తే ఎంతో గొప్పగా మారిపోయింది. వీటిపై జగన్ పోరాటానికి దిగారు.

ఓదార్పు యాత్ర కొనసాగిస్తూనే వివిధ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ ఎన్నో దీక్షలు నిర్వహించారు. అన్నదాత కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం 2010 డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో విజయవాడలో కష్ణా నది తీరాన జగన్ లక్ష్యదీక్ష నిర్వహించారు. జగన్‌తో పాటు లక్షలాది మంది రైతులు ఈ దీక్షలో పాల్గొన్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రానికి తెలియజెప్పటం కోసం జగన్ 2011 జనవరి 11న దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు వీధిలో జల దీక్ష పేరుతో ఒక రోజంతా నిరశనదీక్ష నిర్వహించారు. రాష్ట్రం నుంచి ప్రత్యేక రైలులో వేలాదిమంది రైతులు, నాయకులు ఢిల్లీ తరలివెళ్లారు. నిత్యావసరాల ధరలపై విశాఖలో 2011 జనవరి 22న జనదీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని కోరుతూ 2011 ఫిబ్రవరి 7 నుంచి 10 వరకూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి 88 కిలోమీటర్ల దూరం హరితయాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఫీజుల పథకాన్ని నిర్వీర్యం చేస్తుండటంపై 2011 ఫిబ్రవరి 18 నుంచి హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో వారం రోజుల పాటు జగన్ నిరాహార దీక్ష నిర్వహించారు.

రైతుల సమస్యలపై 2011 మే 15 నుంచి రెండు రోజులు గుంటూరులో, 2012 జనవరి 10 నుంచి 12 వరకూ 3 రోజుల పాటు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతు దీక్షలు నిర్వహించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేనేత దీక్ష చేపట్టారు. చిత్తూరులో సాగుపోరు ధర్నా, వైఎస్‌ఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కరెంటు పోరు ధర్నా, విజయవాడలో రైతు సమస్యలపై మహాధర్నా, ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఫీజుపోరు ధర్నా, నరసరావుపేటలో వస్త్రవ్యాపారులకు వ్యాట్ రద్దు డిమాండ్‌తో ధర్నా, మొగల్తూరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ధర్నా.. జగన్ నిర్వహించారు.

* ప్రజా సమస్యల పరిష్కరిం చాలని కోరుతూ ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు దీక్షలు చేయటం ప్రజాస్వామ్యంలో ఒక ఉద్యమ రూపం కాదా?
* జగన్ ఏ సమస్యపై నిరాహార దీక్ష చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం నిజం కాదా?
* వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను ఆయన మరణం తర్వాతి ప్రభుత్వాలు నిర్వీర్యం చేయటం నిజం కాదా?
* ప్రజలు పెద్ద ఎత్తున దీక్షలు, ధర్నాలలో పాల్గొంటుంటే అదే స్థాయిలో జగన్‌పై కుట్రలు, కుతంత్రాలు పెంచటం జగన్‌ను అడ్డుకోవటానికి కాదా?

పొమ్మనకుండా పొగబెట్టిందెవరు?
ఒకవైపు ఓదార్పుయాత్రకు ఆటంకాలు కలిగిస్తూ ఆంక్షలు విధిస్తూనే.. మరోవైపు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని తమవైపు తిప్పుకునే వ్యూహానికి కాంగ్రెస్ తెరతీసింది. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు కోరే సాకుతో సోనియాగాంధీ స్వయంగా చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు ఓదార్పును తాత్కాలికంగా వాయిదా వేసుకున్న జగన్.. తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల వెంటరాగా ఢిల్లీకి వెళ్లి.. ఓదార్పు యాత్రను కొనసాగించేందుకు సోనియాను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నెల రోజులు నాన్చిన సోనియా తర్వాత ఓదార్పును జిల్లాకో సభకు పరిమితం చేసుకోవాలని ఆంక్షలు పెట్టారు. అయితే ఇచ్చిన మాటను తప్పటానికి సిద్ధంగా లేని జగన్ 2010 జూలై 8న శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు.

జగన్ మద్దతుదారులపై వేటువేస్తూ పార్టీలో జగన్‌ను ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తూనే కుటుంబాన్ని చీల్చేందుకు కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించింది. ఇక కాంగ్రెస్‌లో ఉండలేని పరిస్థితులు తీవ్రమవటంతో జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కడప లోక్‌సభ స్థానానికి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానానికి విజయమ్మ రాజీనామా చేశారు. చివరకు వైఎస్‌ఆర్ ఆశయ సాధన కోసం, ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుచేసి పేదప్రజలను ఆదుకోవటం కోసం.. ఆ సంక్షేమ పథకాలే జెండా, ఎజెండాగా జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఆ క్రమంలో వైఎస్ తమ పార్టీ నేతని, ఆ పథకాలన్నీ తమ పార్టీ పథకాలని ప్రచారం చేసుకోవటానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. కానీ.. అవి విఫలమవటంతో వైఎస్‌ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంది.

* జగన్ కాంగ్రెస్‌లో ఉండగానే.. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో విలీనం మంతనాలు నిజం కాదా?
* విజయమ్మకు నెల రోజుల వరకూ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవటం వైఎస్‌ఆర్ కుటుంబం విషయంలో సోనియా వైఖరి ఎలా ఉందో అద్దం పట్టటం లేదా?
* జగన్ మద్దతుదారులపై వేటు వేయటం, ఆయన కుటుంబాన్ని చీల్చేందుకు ప్రయత్నించడం జగన్‌ను కాంగ్రెస్ నుంచి బయటకు పంపటం కోసం కాదా?


కుట్రలను ఛేదించుకుంటూ... 
దివంగతనేత రాజశేఖరరెడ్డి ఆశయాల స్ఫూర్తితో ప్రజాసంక్షేమం కోసం జగన్‌మోహనరెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అడుగడుగునా కుట్రలు, కుతంత్రాల నడుమ ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్షగా విజయపథాన ముందుకుసాగుతోంది. కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జగన్, విజయమ్మ తిరుగులేని ఆధిక్యంతో గెలుపొందారు. 2011 డిసెంబర్‌లో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జగన్‌కు మద్దతిస్తున్న 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి అనర్హత వేటుకు గురయ్యారు.

సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరును చేర్చినందుకు నిరసనగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి కూడా పదవికి రాజీనామా చేశారు. జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో 15 అసెంబ్లీ, నెల్లూరు లోక్‌సభ స్థానాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి మెజారిటీతో గెలుచుకుంది. కడప ఎన్నికల్లోనూ, ఆ తర్వాత ఉపఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ సీపీని ఓడించటం కోసం అధికార కాంగ్రెస్, దాని బద్ధశత్రువైన ప్రతిపక్ష టీడీపీలు రెండూ రహస్యంగా చేతులు కలిపినా ప్రయోజనం లేకపోయింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మరో 9 మంది ఎమ్మెల్యేల వరకూ ఆ పార్టీలను వీడి వైఎస్‌ఆర్ సీపీలో చేరినా ఓటమి భయంతోనే వారిపై అనర్హత వేటు వేయటానికి ఆయా పార్టీలు జంకుతున్నాయి.

* సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరును చేర్చటం వెనక కాంగ్రెస్ కుట్ర ఉందనటం నిజం కాదా?
* కడప ఎన్నికల్లో జగన్‌ను, విజయమ్మను ఓడించటానికి, కనీసం మెజారిటీ తగ్గించటానికి ప్రయత్నించాలని మంత్రులందరినీ మోహరించింది నిజం కాదా?
* లోక్‌సభ ఓటు మీకు, అసెంబ్లీ ఓటు మాకు అంటూ కడప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ రహస్య అవగాహనకు ఎందుకు రావలసి వచ్చింది?.. ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఓడించటానికి కాంగ్రెస్, టీడీపీలు పరస్పరం సహకరించుకోవటం నిజం కాదా?

జనం మధ్య ఉన్న జగన్‌ను పిలిచి అరెస్టు... 
2012 జూన్ 12న ఉప ఎన్నికలకు ముందు కుట్రలు మరింత పదునుతేలాయి. మే 28న నేరుగా కానీ, న్యాయవాది ద్వారా గానీ విచారణకు హాజరుకావాలని ఓదార్పుయాత్రలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి సమన్లు అందాయి. కానీ న్యాయస్థానానికి వెళ్లక ముందే తనను అరెస్టు చేసే అవకాశం ఉందని జగన్‌మోహన్‌రెడ్డి ఊహించారు. ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఆ అనుమానాన్ని నిజం చేస్తూ మే 25వ తేదీన తమ ఎదుట విచారణకు రావాలంటూ అంతకు రెండు రోజుల ముందు జగన్‌కు సీబీఐ నోటీసులిచ్చింది. ఎన్నికలు ముగిసే వరకూ సమయమివ్వాలని, జూన్ 12 తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకు హాజరవుతానని సీబీఐని జగన్ కోరారు. కానీ సీబీఐ ససేమిరా అంది.


25 నుంచి 27 వరకూ మూడు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారించిన సీబీఐ.. కోర్టుకు హాజరు కావటానికి ఒక రోజు ముందు అంటే మే 27 ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జగన్‌ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉప ఎన్నికల ప్రచారంలో జగన్‌ను పాల్గొననీయకుండా చేయటం, వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులను గందరగోళ పరిస్తే ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తాయనే ఇలాంటి కుట్రలు జరిగాయి. కానీ జనం స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఏ కేసులోనైనా 90 రోజుల్లోగా చార్జిషీటు సమర్పించటం, నిందితులపై ఆరోపణలు రుజువు చేయలేకపోతే బెయిల్ మంజూరు చేయటం చట్టంలోని నిబంధనలు. కానీ జగన్ కేసులో అవన్నీ తారుమారయ్యాయి. ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు విడతల వారీగా చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు.

* ఏడాది పాటు ఏ ఒక్కసారీ జగన్‌ను విచారించని సీబీఐ.. హఠాత్తుగా ఎన్నికల వేళ విచారణకు సమన్లు పంపటం వెనక కుట్ర లేదా?
* ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననీయకుండా జగన్‌ను అరెస్టు చేయటానికి సీబీఐని పురికొల్పటం నిజం కాదా?
* జగన్ ఎంపీ కనుక సాక్ష్యాలను తారుమారు చేస్తారని సీబీఐ అంటోంది? అంటే జగన్ ఇప్పుడే కొత్తగా ఎంపీ అయ్యారా? ఈ కేసు దాఖలై విచారణ కొనసాగిన 9 నెలల కాలంలో కూడా ఆయన ఎంపీనే కదా?
* జగన్‌కు బెయిల్ రాకుండా చేయటం కోసమే విచారణను సాగదీస్తున్నారని, చార్జిషీట్లను ముక్కలు ముక్కలుగా దాఖలు చేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదా?

దుష్ర్పచారాన్ని పటాపంచలు చేస్తూ..
తాము అనుకున్న పరిస్థితులు వచ్చేవరకూ జగన్‌ను జనం నుంచి దూరంగా ఉంచాలన్నది అధికార పార్టీ పథకంగా కనిపిస్తోంది. జగన్‌ను నిర్బంధిస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఛిన్నాభిన్నమయిపోతుందని, కార్యకర్తలు, నాయకులు మనోస్థయిర్యం కోల్పోతారని ఆశించినవారికి భంగపాటు ఎదురయ్యింది. కొండా సురేఖ దంపతులు దూరమయ్యారని, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్ టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని, జలగం వెంకట్రావ్ అసంతృప్తితో ఉన్నారని, దాడి చేరికతో కొణతాల పార్టీని వీడబోతున్నారని రకరకాల ఊహాగానాలు ప్రచారంలో పెట్టి పార్టీని గందరగోళ పరిచేందుకు కాంగ్రెస్, టీడీపీలతో పాటు మీడియాలో ఒకవర్గం విశ్వప్రయత్నాలు చేసింది. కానీ అవన్నీ పటాపంచలవుతున్నాయి.

టీడీపీ ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ.. ప్రజా సమస్యలపై నిబద్ధతతో పోరాడుతున్నది వైఎస్‌ఆర్ కాంగ్రెసేనని ప్రజలు గుర్తించారు. కుట్రలను ఎండగట్టడం, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి రాజన్న రాజ్యం వస్తుందన్న భరోసా కల్పించడం కోసం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్రను కొనసాగించే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకుని.. ఇటీవలే 2,000 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించారు.

వైఎస్ కుటుంబంపై సాగుతున్న కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారనటానికి విజయవంతంగా సాగుతున్న షర్మిల
పాదయాత్ర ప్రత్యక్ష నిదర్శనం. ఎన్నికలు ఏ క్షణాన వచ్చినా కుట్రదారులందరికీ ప్రజలు బుద్ధి చెప్పటం ఖాయం.

0 comments:

Post a Comment