Monday, 13 May 2013

చంద్ర బాబూ ఎందుకీ డ్రామా..!


వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ధ్వజం
నాడు ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాన్ని చేజార్చుకున్నారు
ఇప్పుడు మంత్రులను తొలగించమని గవర్నర్‌ను కోరడమా!

హైదరాబాద్: శాసనసభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే పడగొట్టే బంగారంలాంటి అవకాశాన్ని చేజార్చుకుని.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ గవర్నర్ వద్దకెళ్లి మంత్రులను తొలగించాలంటూ వినతిపత్రం ఇవ్వడం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆడుతున్న పెద్ద డ్రామా అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడిమాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంనాటికే మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చిందని, అప్పటికే మిగతా మంత్రులను కూడా సీబీఐ విచారించిందని, అయినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఇప్పుడు గవర్నర్‌ను కలిసి ఆయనేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు భ్రమలు కల్పించడమెందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పై చంద్రబాబు పైపై విమర్శలు చేస్తూ లోలోపల మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్న విషయాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని చెప్పారు.

నిజంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి ఉండేవారని, ఆరోజే ప్రభుత్వం పడిపోయేదని చెప్పా రు. ఇప్పుడు మంత్రులను తప్పించాలని గవర్నర్‌ను కోరుతున్న చంద్రబాబు.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగినాటికి, ఇప్పటికి అదే మంత్రుల విషయంలో ఏం మార్పు వచ్చిందో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్‌కు ఏదైనా అయితే తెగ బాధపడిపోయే చంద్రబాబు ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు. సీబీఐ పంజరం లో చిలుక అని, కేంద్రం అడుగుజాడల్లో నడుస్తోందని సుప్రీంకోర్టు అన్నప్పుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదని, ఆరోజు కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. సిగ్గుమాలిన రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందని ధ్వజమెత్తారు.

వారి కుట్రలో స్పీకర్ భాగస్వాములు కావద్దు
విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్లేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో కాలయాపన చేసి ఉప ఎన్నికలు జరగకుండా చూడాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కలిసి పన్నుతున్న కుట్రలో భాగస్వాములు కావొద్దని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు విజ్ఞప్తి చేశారు. తమను ఈ ఏడాది జూన్ 2 తర్వాత అనర్హులుగా చేస్తే ఉప ఎన్నికలు రావని, తమ నియోజకవర్గాల ప్రజలు శాసనసభలో ప్రాతినిధ్యం లేని వారవుతారని తెలిపారు.

అందువల్ల తమ అనర్హత విషయంలో జాప్యం చేయవద్దని కోరారు. తాము అవిశ్వాసంపై ఓట్లేసి రెండు నెలలు కావస్తున్నా, నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. తాము స్పీకర్ నోటీసులకు స్పందించి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం ఏమాత్రం లేదని, తమ వైఖరి ఏమిటో వ్యక్తిగతంగా తెలిపామని, మళ్లీ సోమవారం కూడా ఫ్యాక్స్ ద్వారా తెలిపామని చెప్పారు. స్పీకర్ సమక్షంలోనే విప్‌ను ధిక్కరించాక ఇంకా వ్యక్తిగతంగా హాజరై తెలపాల్సింది ఏముంటుందన్నారు. స్పీకర్ ఇచ్చిన 15 రోజుల సమయం కూడా పూర్తయిందని, అనవసరంగా నోటీసులు ఇచ్చి కాలయాపన చేస్తున్నారని మరో ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు రాకుండా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, తక్ష ణం తమను అనర్హులుగా ప్రకటించాలని కోరారు.

0 comments:

Post a Comment