పులివెందుల : కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ మైనార్టీలో పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విప్ జారీ చేసి ప్రభుత్వాన్ని కాపాడారని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంతో పాటు కేంద్రాన్ని కూడా బాబే కాపాడుతున్నారని విజయమ్మ ఆరోపించారు.
విజయమ్మ బుధవారం పులివెందులలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ తో చంద్రబాబు దోస్తీ కట్టారన్నారు. కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కై జగన్ ను జైల్లో పెట్టించాయని ఆమె అన్నారు. చంద్రబాబు తనపై విచారణ జరగకుండా జగన్ ను టార్గెట్ చేశారన్నారు. అవినీతి మంత్రులంటూ ఇప్పుడు డ్రామాలాడుతున్నారని ఆమె మండిపడ్డారు.
జగన్ కు బెయిల్ రాకుండా డ్రామాలాడుతున్నారని విజయమ్మ ధ్వజమెత్తారు. ఫలానా పని చేయమని జగన్ ఎప్పుడైనా ఏ అధికారికి అయినా ఫోన్ చేశారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఏడు నెలలు సమయం ఇచ్చినా 26జీవోలు అక్రమమా, సక్రమమా అనేది కిరణ్ కుమార్ రెడ్డి తేల్చలేకపోయారని విజయమ్మ అన్నారు. నకిలీ స్టాంపులు, ఏలేరు...తదితర కుంభకోణాలపై విచారణ ఎందుకు జరపటం లేదని ఆమె ప్రశ్నించారు. ఐఎంజీ అడిగిన దానికంటే చంద్రబాబు ఎక్కువ భూమి కేటాయించారని విజయమ్మ గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరితో ప్రజలు కష్టాలు పడుతున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను సర్కార్ పట్టించుకోవటం లేదన్నారు. అంతకాకుండా ఎడాపెడా ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజలపై 4వేల కోట్ల రూపాయల భారం పడిందని విజయమ్మ అన్నారు.
0 comments:
Post a Comment