Tuesday, 18 June 2013

జగన్‌ది తప్పు ఎలా అవుతుంది?: భూమన

హైదరాబాద్: మంత్రులకు ఓ న్యాయం, వైఎస్ జగన్‌కు మరో న్యాయమా అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. మంత్రులు ఏతప్పు చేయలేదని సీఎం అసెంబ్లీలోనే చెప్పారని, మంత్రులది తప్పుకాకుంటే వైఎస్ జగన్‌ది తప్పు ఎలా అవుతుందన్నారు. క్విడ్‌ప్రోకో జరగనపుడు వైఎస్ జగన్‌ నేరస్తుడు, కుట్రదారుడు ఎలా అవుతారని అడిగారు. ఒక్క రోజు కూడా ప్రభుత్వభాగస్వామిగా లేని వైఎస్ జగన్ నేరస్తుడు ఎలా అవుతారని నిలదీశారు. 

చంద్రబాబుపై ఉన్న కుంభకోణాల సంగతి టీడీపీ నేతలు మరచిపోయారా అని అన్నారు. టీడీపీ ఓ పక్క ప్రభుత్వాన్ని కాపాడుతూ, మరో పక్క కళంకిత మంత్రులంటూ నాటకాలాడుతోందని భూమన విమర్శించారు. 

Friday, 14 June 2013

జగన్ కోసం యువకుడి ఆత్మహత్య

మెదక్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఎంపి జగన్మోహన రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వీరారెడ్డి అనే యువకుడు జగన్ ను విడుదల చేయడంలేదన్న మనఃస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కలిసికట్టుగా పనిచేయాలి: ఎంపీ మేకపాటి

తిరుపతి : చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా పక్కన పెట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పని చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శుక్రవారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు-ప్రజా ప్రతినిధుల సదస్సులో పాల్గొన్న ఆయన టీడీపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలపై మండిపడ్డారు. ఇక నుంచి వచ్చిన ప్రతి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ విజయకేతనం ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేకపాటి విజ్ఞప్తి చేశారు.

అక్రమ అరెస్టులకు సిఎం బాధ్యుడు: శంకర్రావు

హైదరాబాద్: తెలంగాణలో అక్రమ అరెస్టులకు ముఖ్యమంత్రి, డిజిపి, పోలీసు అధికారులదే బాధ్యత అని మాజీ మంత్రి శంకరరావు అన్నారు. వారిపైనే కేసులు పెట్టాలన్నారు. ఛలో అసెంబ్లీ సందర్భంగా ఎవరికైనా ప్రాణనష్టం జరిగినా, గాయాలయినా సీఎంపై చర్యలకు హైకోర్టులో పిల్ వేస్తానని ఆయన హెచ్చరించారు.

రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదే: YS విజయమ్మ

తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల నగారాను శుక్రవారం తిరుపతి నగరం నుంచి మోగించింది. రానున్న స్థానిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను సమర్థంగా ఢీకొట్టేందుకు పార్టీ శ్రేణులకు గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ కర్తవ్యబోధ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యమని ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయానికి కార్యకర్తలే మూలమని అన్నారు. 

సదస్సుకు తరలి వచ్చిన రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి నాయకులు, ప్రతినిధులను ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గ్రామ పంచాయతీలన్నీ కైవసం చేసుకోవాలని సూచించారు. అధికార పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడకుండా చూడాలని ఆమె అన్నారు. స్థానిక సమస్యలపై కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాకా ప్రతి ఎన్నికల్లోనూ పార్టీదే విజయమన్నారు.

వైఎస్ జగన్ ను దెబ్బ తీయడమే కాంగ్రెస్, టీడీపీల లక్ష్యమని విజయమ్మ అన్నారు. ఆరెండు పార్టీల ఎత్తుగడలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని విజయమ్మ మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ సత్తా ఏంటో చూపేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఓ అవకాశమన్నారు. అంతకు ముందు సభా ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

రేపు తెలంగాణ బంద్ కు కేసీఆర్ పిలుపు

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రేపు తెలంగాణ బంద్ కు
పిలుపునిచ్చారు. చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్ట్ లు చేసిన తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని ఆయన శుక్రవారమిక్కడ డిమాండ్ చేశారు. ప్రభుత్వ దమన కాండను నిరసిస్తూ శనివారం బంద్ పాటించాలని కేసీఆర్ కోరారు. 

అక్రమ అరెస్ట్ లు వద్దు:హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రాంతాల్లో అక్రమ అరెస్టులపై ఈ హౌస్ మోషన్ దాఖలు చేశారు. అరెస్టుల విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించాలని హైకోర్టు సూచన చేసింది. అక్రమ అరెస్ట్లులు లేకుండా చూడాలని పోలీస్ శాఖను హైకోర్టు ఆదేశించింది.

తెలంగాణ బంద్ కు ఓయూ జేఏసీ పిలుపు

హైదరాబాద్ : విద్యార్థుల అక్రమ నిర్బంధాలకు నిరసనగా ఓయూ జేఏసీ శనివారం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. అరెస్ట్ చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని ఓయూ జేఏసీ ఛైర్మన్ కిషోర్ డిమాండ్ చేశారు. కాగా మరోవైపు ఓయూ ఎన్సీసీ గేటు వద్ద విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

సోనియా గాంధీ తో ఆజాద్ భేటీ

న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు గులాంనబీ ఆజాద్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ముట్టడి అంశాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, అంతకు ముందు డిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గులాంనబీ ఆజాద్ ను కలిశారు. వారు కూడా అసెంబ్లీ ముట్టడి, రాష్ట్రంలో పరిస్థితులపైనే చర్చించినట్లు తెలిసింది.

మోడీ వివాదంతో జేడీయూలో చీలిక!

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ వివాంతో జేడీయూలో చీలిక ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎన్డీయేతో ఇప్పటికిప్పుడు తెగదెంపులు లేవని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ చెబుతోంటే, మరోవైపు నితీష్ కుమార్ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. బీహార్ లో శనివారం జరిగే ర్యాలీలో నితీష్ కుమార్ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా ఎన్డీయేలో కొనసాగడంపై జేడీయూ సస్పెన్స్ కొనసాగుతోంది.

కిరణ్ వేరేవారి కారులో ఎందుకు వెళ్లారు!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కారులో సచివాలయానికి వెళ్లడం చర్చనీయాంశం అయింది. చలో అసెంబ్లీ నేపధ్యంలో ఉద్రిక్త వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కిరణ్ రహస్యంగా వెళ్లిపోయారని కధనాలు వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి కాన్వాయ్ పూర్తి భద్రతతో ఉంటుంది కనుక అది పెద్ద ఇబ్బంది అవుతుందా అన్నది ప్రశ్న.ఏమైనప్పట్టికీ ఇలాంటి సమయాలలో వేరే నేత కారులో వెళ్లడం రకరకాల చర్చలకు ఆస్కారం ఇస్తుంది.

ఉస్మానియాలో ఉద్రిక్త వాతావరణం

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి ఆర్ట్స్‌ కాలేజ్‌ నుంచి బయల్దేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. రాళ్లు రువ్విన విద్యార్థులపై పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. ఈ సందర్భంగా పీజీ విద్యార్థి కృష్ణకు టియర్‌గ్యాస్‌ షెల్‌ తగలడంతో గాయపడ్డాడు. సొమ్మసిల్లిపోయిన విద్యార్థిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. దాంతో ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు.

ఎమ్.పి విజయశాంతికి దేవుడి ఆశిస్సులు ఉంటాయా?

తెలంగాణ రాష్ట్ర సమితి మెదక్ ఎమ్.పి విజయశాంతికి కొత్త దిగులు పట్టుకుంది. ఈసారి మెదక్ లోక్ సభ సీటు రాదన్న ప్రచారం ఆమెకు చికాకు కలిగిస్తోంది.టిఆర్ఎస్ అదినేత కె.చంద్రశేఖరరావు ఈసారి మెదక్ సీటు నుంచి పోటీచేయాలని భావిస్తుండడమే దీనికి కారణం.ఇప్పుడున్న పరిస్థితిలో మెదక్ నుంచి పోటీచేయడం బాగుంటుందని కెసిఆర్ అనుకుంటున్నారు.తన సొంత అసెంబ్లీ సెగ్మెంట్ అయిన సిద్దిపేట అందులో ఉండడం,పైగా తన ప్రభావంతో మెదక్ జిల్లాలో మరికొన్ని అసెంబ్లీ సీట్లు గెలిచే అవకాశం ఉండడం వంటి కారణాలతో ఈసారి సొంత జిల్లా నుంచి పోటీచేయాలని కెసిఆర్ యోచిస్తున్నారు. ఆయన ఇంతకుముందు కరీంనగర్ నుంచి మూడుసార్లు ( ఒక సాధారణ ఎన్నిక,రెండు ఉప ఎన్నికలు)మహబూబ్ నగర్ నుంచి ఒకసారి లోక్ సభకు ఎన్నికయ్యారు.కిందటిసారే మెదక్ నుంచి పోటీచేయాలని అనుకున్నా, విజయశాంతికి మాట ఇచ్చినందున ఆయన మహబూబ్ నగర్ నుంచి పోటీచేసి తీవ్రమైన పోటీని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నేపధ్యంలో ఆయన మెదక్ నుంచి పోటీచేస్తే, విజయశాంతికి సికింద్రాబాద్ సీటు ఇవ్వాలని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.కాని విజయశాంతికి ఇక్కడ నుంచి పోటీచేయడం ససేమిరా ఇష్టం లేదు.అయితే తప్పకపోతే తనకు మెదక్ బదులు జహీరాబాద్ లోక్ సభ స్థానం కేటాయించాలని ఆమె కోరుతున్నట్లు సమాచారం.కాని సాధ్యమైనంతవరకు మెదక్ ను వదలిపెట్టరాదన్న అబిప్రాయంతో ఉన్నారు.దేవుడు ఆశిస్సులు తనకు ఉంటే మెదక్ సీటు నుంచే పోటీచేస్తానని విజయశాంతి తాజాగా వ్యాఖ్యానించడం గమనించవలసిన అంశం. కాగా టిఎన్జీఓ నేత దేవీ ప్రసాద్ కూడా మెదక్ సీటు ఇస్తే పోటీచేయాలని లోక్ సభకు పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.ఈ మేరకు జెఎసి సమావేశాలలో కూడా ఆయన ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది.ఎన్.జి.ఓ నేతలు కొందరు టిఆర్ఎస్ నాయకత్వం తో దీనిపై మాట్లాడాలని కూడా బావిస్తున్నారు.మెదక్ సీటు మొత్తం మీద హాట్ ఫేవరైట్ గా ఉండడం విశేషం.

చంద్రబాబుది పిలవని పేరంటం

తెలుగుదేశం పార్టీ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై అవిశ్వాసం పెడతామని అనడాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎద్దేవ చేసింది.ఇది కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని ఆ పార్టీ ముఖ్య నేత డాక్టర్ మైసూరారెడ్డి అన్నారు. నామ్‌ కే వాస్తేగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.ఫెడరల్‌ లేదా మూడో ఫ్రంట్‌లో భాగస్వాములవుతామని, పిలవని పేరంటానికి చంద్రబాబు ఆరాట పడుతున్నారని మైసూరా వ్యంగ్యంగా అన్నారు. ఒకటి, రెండు సీట్లు కూడా రాని చంద్రబాబును ఎవరు చేర్చుకుంటారని మైసూరారెడ్డి ప్రశ్నించారు.శాసనసభ నిర్వహణకు సంబంధించి అధికార, ప్రతిపక్షాలకు సమాన బాధ్యత ఉందన్నారు. సభను అడ్డుకుంటున్న సభ్యులను సస్పెండ్‌ చేసి సభ నడిచేలా చూడడం పద్దతిగా ఉంటుందని ఆయన అబిప్రాయపడ్డారు.

కొండా మురళీ మళ్లీ లైన్ లోకి వచ్చేనట్లేనా!

గత కొంతకాలంగా అలకలో ఉన్నారని భావిస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ముఖ్యనేతలలోఒకరైన కొండా మురళీ, ఆయన భార్య సురేఖలు మళ్లీ పూర్తి స్థాయిలో పనిచేయడానికి సన్నద్దం అవుతున్నట్లు కనిపిస్తుంది.

జగన్‌ను సీఎం చేసేంతవరకు ప్రతి కార్యకర్త సైనికునిలా పనిచేయాలని కొండా మురళీ పిలుపునిచ్చారు. చంద్రబాబు పాదయాత్రను ప్రజలు చీదరించుకుంటే, షర్మిల పాదయాత్రను ప్రజలు గుండెలో పెట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత నీతిమాలిన రాజకీయాలు తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.

నరేంద్ర మోడీ తపనకు 'తంథాన' పలికితే సమైక్య భారతానికి విషమ ఘడియలే!

ఏమీ తెలియనట్టు, ఇంతకుముందెలాంటి ఘోరకలికి తాను కారణం కాదని బుకాయించజూచే వాడికి నటించేవాడికి మనపెద్దలు "నంగనాచి తుంగబుర్ర'' అని ఎద్దేవా చేసేవారు! ఇప్పుడు అలాంటి పరిణామం "హిందుత్వ'' పేరిట మతరాజకీయాలు నడుపుతున్న భారతీయ జనతా పార్టీ మూలంగా ఏర్పడింది. నిజానికి అది "హైందవం'' అనేది అసలైన సిసలైన లోకికభారతం, అదే "ఆది బౌద్ధం''. కులాతీత, మతాతీత వృత్తి సమాజాన్ని బౌద్ధధర్మం నిర్మించింది. దాన్ని చెడకొట్టి వృత్తులమీద, శ్రమజీవనంమీద ఆధారపడి బతికే వృత్తి సమాజాన్ని కాస్తా దెబ్బతీసి సమాజంలోని ఛాందస వర్గం సోమరిపోతులను, దోపిడీ వర్గాన్ని పెంచే మతరాజకీయానికి ప్రాణం పోసింది. ఆ సంప్రదాయ ఛాయల్లో స్వాతంత్ర్యానికి ముందూ, ఆ తరువాతా ఎదిగివచ్చిన ఛాందసవర్గానికి "హిందూ మహాసభ'' పేరిట కొన్నాళ్ళూ, 'జనసంఘ్' పేరిట మరికొన్నాళ్ళూ, 'రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్' ముసుగులో ఇంకొన్నాళ్ళు పెరుగుతూ వచ్చిన మతశక్తులకు ఎమర్జెన్సీ కాలంలో ఏర్పడిన "జనతాపార్టీ''లోకి దూరి, మత రాజకీయాలకు కానరాని ప్రతినిధిగా అవతరించిందే "భారతీయ జనతా పార్టీ''. దానికి పొట్టిపేరు బి.జె.పి. జనతాపార్టీ ప్రభుత్వంలో దూరడం ద్వారా కొన్నాళ్ళ పాటు మతరాజకీయాన్ని పెట్టెలో దాచి, జనతా ప్రభుత్వం కూలిపోయిన తరువాత తిరిగి మతరంగంలో ["హిందూత్వ''] జనంలో ప్రవేశించింది. ఎమర్జెన్సీ దుష్టపాలనకు నిలువెత్తు చిహ్నంగా మిగిలిపోయిన ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం జనరల్ ఎన్నికల్లో కుప్ప కూలిపోవటంతో హిందూత్వశక్తులు జనతా ప్రభుత్వంలో పాగావేశాయి.
ఆదినుంచీ ఈ శక్తులకు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చింది. ఆర్.ఎస్.ఎస్. సంస్థ. ఈ సంస్థలో ప్రధాన కార్యకర్త అయిన నాధోరామ్ గాడ్సే జాతిపిత గాంధీజీని ప్రార్థనా సమయంలో దారుణంగా హత్య చేసినవాడు. గాంధీ హత్యతో దేశం అట్టుడికి పోతున్న సమయంలో ఆర్.ఎస్.ఎస్. కార్యాలయాలపైన ప్రజలు తిరగబడుతున్న సమయంలో గాంధీ హత్యలతో తనకెలాంటి 'సంబంధంలేద'ని గాడ్సే ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త కాదనీ బుకాయించడానికి ఆర్.ఎస్.ఎస్. నాయకత్వం ప్రయత్నించి విఫలమవడం, గాడ్సే తమ్ముడు తన సోడరుడే గాంధీజీని హత్య చేసినవాడని అతను ఆర్,ఎస్,ఎస్, క్రియాశీల కార్యకర్త అని తరువాత వాంగ్మూలం యివ్వడం చేరపరాని చరిత్ర. ఈ చరిత్ర పూర్వరంగంనుంచి వచ్చిన వాడే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ! ఆ మాటకొస్తే బి.జె.పి. రాజకీయాలను మతరాజకీయాలుగా మలిచి, పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ దేశంలో అమలు జరిపిస్తున్నది ఆర్.ఎస్.ఎస్., భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంస్థలే.
ఈ తానులోని 'ముక్క' అయిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్ లో 2000 మంది ముస్లీం మైనారటీల ఊచకోతకు కారణం అయి, దేశ లౌకిక (సెక్యులర్) ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికే ప్రమాదంగా పరిణమించడం దేశప్రజలకు తెలుసు; అలాంటి మోడీని రేపు 2014 నాటి జనరల్ ఎన్నికలలో నరేంద్రమోడీని బిజెపి జాతీయ ప్రచారక్ సంఘ్ సారధిగా, అదే ఆర్.ఎస్.ఎస్. తానులో మరో ముక్కగా అవతరించిన బిజెపి అధ్యక్షుడుగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ తన నిర్ణయంగా గోవాలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకపక్షంగా ప్రకటించాడు. దాంతో బిజెపి శ్రేణుల్లో, నాయకుల్లో ముసలం పుట్టింది. ఇందుకు బిజెపి అగ్రనాయకుడు, ప్రధానమంత్రి పదవి తానింతవరకు నిర్వహించలేదన్న దిగులుతో ఉన్న లాల్ కిషన్ అద్వానీ కోపంతో గోవా సమావేశానికి గ్రైర్ హాజరై ఇంటివద్ద కూర్చున్నాడు. అయితే ఈ 'అలకపాన్పు' మానడానికి ఆయనకు రెండురోజులు కూడా పట్టలేదు.
ఏడాదిలోగా జనరల్ ఎన్నికలు జరుగనుండగా బిజెపిలో ముసలం వల్ల కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం లేదా పాత ఎన్.డి.ఎ. పక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం కష్టమని భావించిన బిజెపి అగ్రశ్రేణి నాయకులంతా పునరాలోచన చేసుకుని అద్వానీపై వత్తిడి తెచ్చి, ఆయన అన్ని పార్టీ పదవులకు యిచ్చిన రాజీనామానుంచి వెనక్కి తగ్గెట్టు చేయగలిగారు! కాని, ఇలా వెనక్కి తగ్గడానికి మూడ్ను చేసిన ఒక ప్రకటనలో అద్వానీ "పార్టీలో కొందరు పదవీకాంక్షతో తీసుకుంటున్నందువల్లనే పార్టీ పక్కతోవలు పడుతోంద''ని విమర్శించారు. నిజానికి "ప్రధానమంత్రి'' పదవిని తాను అనుభవించలేదన్న 'గుర్రు' అద్వానీలో కూడా చాలాకాలంగా గూడుకట్టుకుని ఉండిపోయిందని మరవరాదు! అయితే అదే తపనలో ఉన్న నరేంద్రమోడీ గుజరాత్ లో తన ప్రభుత్వం చేసిన మానవమారణకాండ తాలూకు కేసులనుంచి తప్పించుకుపోవాలన్న కోర్కె బలీయంగా తనలో పీడిస్తున్నందున బిజెపిలోని ఆర్.ఎస్.ఎస్. ముఠాను కూడగట్టుకుని దేశ ప్రధానమంత్రి పదవివైపు మోరలు చాచాడు.
అతని కోర్కెను రాజ్ నాథ్ సింగ్ రానున్న ఎన్నికల్లో బిజెపిని తిరిగి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన వాతావరణాన్ని సమీకరించగల శక్తి మోడీకి ఉందని భావించి, పార్టీ ప్రచార సంఘానికి సారథిగా చేశాడు. అయితే రాజ్ నాథ్ సింగ్ నిర్ణయం తప్పని బిజెపి సీనియర్ నాయకులు కొందరు భావించడానికి కారణం ఉంది. నరేంద్ర మోడీ మతతత్వ రాజకీయాన్ని మానవమారణకాండకు ఆయుధంగా మార్చినందువల్ల, ఇప్పటికి గుజరాత్ వరకే పరిమితమై ఉన్న మత దురహంకార రాజకీయం రేపు అతను ప్రధాని అయ్యే పక్షంలో దేశాన్ని అల్లకల్లోలంలోకి నెట్టే ప్రమాదం లేకపోలేదని లోలోన భయ సందేహాలున్నాయి.
మత దురహంకారానికి సరిహద్దులుండవన్న నిజాన్ని జర్మనీలో, అబిసేనియా (ఇటలీ)లో హిట్లర్, ముస్సోలినీలు నిరూపించడం ఒక చారిత్రిక సత్యం. ఆ హిట్లర్ "ఆర్య జాతి'' రక్తం ఏ జాతికన్నా కూడా పవిత్రమైనదన్న నమ్మకం మీదనే జర్మనీలో యూదుల్ని లక్షల సంఖ్యలో కాల్చి చంపాడు, గ్యాస్ ఛాంబర్లలో బంధించి చంపాడు. ఆ హిట్లర్ ఆరాధకులే భారతదేశంలోని హిందూ మహా సభ, విశ్వహిందూ పరిషత్, ఆర్.ఎస్.ఎస్. వర్గీయులని మరచిపోరాదు! ఈ 'హిట్లర్ ఆరాధన' పూర్వరంగాన్ని ఏయే భారత ప్రతినిధులు హిట్లర్ నాజీ పార్టీతో ఒకనాడు కలిసి వచ్చారో ప్రసిద్ధ పరిశోధకుడు జెఫ్రలాట్ భారతదేశంలో 'హిందూత్వ'' ముఠా పుట్టుపూర్వోత్తరాలను వెల్లడిస్తూ రాశాడు!
ఎందుకంటే, అయోధ్యలో తప్పుడు భావాల మీద ఆధారపడి బాబ్రీ మసీదును కూలగొట్టిన 'హిందుత్వ' ముఠా, గుజరాత్ లో మైనారిటీళ ఊచకోతకు వెనుకాడని మతశక్తులు రేపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రత్యామ్నాయం తామేనని భావిస్తున్నందువల్ల భారతదేశ లౌకిక వ్యవస్థను "కుమ్మరి పురుగుల్లా'' తొలుచుకుంటూ వెళ్ళి గుజరాత్ ఘటనలను జాతీయస్థాయిలో పునరావృత్తం చేయరన్న గ్యారెంటీ లేదు, ఆ భరోసాను ఎంతటి శాంతికాముకుడూ, మరెంతటి ప్రజాస్వామ్యవాదీ కూడా యివ్వలేరు. కనుకనే రాజ్యాంగబద్ధమైన లౌకిక, ప్రజాతంత్ర సమసమాజ వ్యవస్థాభిలాషులంతా ఇనుమడించిన చైతన్యంతో మతశక్తుల రేపటి ఎజెండాను ఈ రోజు నుంచీ, ఈ క్షణం నుంచీ మిలిటెన్సీతో ఎదుర్కొని లౌకిక సమైక్య భారత వ్యవస్థను, విభిన్నజాతులు, మతధర్మాలు, భిన్నభాషలతో దీపించె భారతదేశాన్ని వేయికళ్ళతో కాపాడుకోవలసిన అవసరం ఉంది. ప్రమత్తత ప్రాణం తీస్తూంది, అప్రమత్తత ప్రాణం పోస్తూంది! కనుకనే 'మోడీ' తపనను తుంచివేయాలి గాని 'తంథాన' పలకరాదు!

Tuesday, 11 June 2013

బిజెపిలో ముగిసిన సంక్షోభం

న్యూఢిల్లీ: బిజెపిలో సంక్షోభం ముగిసింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్వానీ చెప్పినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారు. అద్వానీతో పార్టీ సీనియర్ నేతల సమావేశం ముగిసింది. అనంతరం అద్వానీ నివాసంలోనే ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలో బిజెపి పార్లమెంటరీ సమావేశం జరుగుతుందని చెప్పారు. అద్వానీ చెప్పిన అంశాలను ఆ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. అయితే విలేకరుల సమావేశానికి అద్వానీ హాజరుకాలేదు. 

మెట్టు దిగిన అద్వానీ?

ఢిల్లీ: బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీని బుజ్జగించడంతో ఆ పార్టీ అగ్రనేతల రాయబారం ఫలించినట్లు కనిపిస్తోంది. అద్వానీ లేవనెత్తిన అంశాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్ హామీ ఇచ్చారు. ఈ సాయంత్రం రాజ్‌నాథ్‌సింగ్ అద్వానీని 
కలవనున్నారు. ఆ తరువాత సంక్షోభం సమసినట్లు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నాపై ఎలాంటి ఒత్తిడి లేదు: లక్ష్మీనారాయణ

హైదరాబాద్: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రిలీవ్‌ అయ్యారు. డిఐజీ వెంకటేష్‌కు తన బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్యాప్తుకు సంబంధించి మీడియాకు ఎలాంటి సమాచారాన్ని లీకు చేయలేదని అన్నారు. మీడియా నుంచే సమాచారాన్ని సేకరించానని చెప్పారు. దర్యాప్తులో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని లక్ష్మీనారాయణ తెలిపారు. 

శుక్లా మరణం పట్ల సోనియా సంతాపం

న్యూఢిల్లీ: తమ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సంతాపం తెలిపారు. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో మే 25న మావోయిస్టులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన గుర్గావ్ లోని వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

విసి శుక్లా కన్నుమూత

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా (84)కన్నుమూశారు. ఛత్తీస్ గఢ్ లో మే 25న మావోయిస్టుల దాడిలో గాయపడిన ఆయన వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1966లో ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. 

మే 25న జరిగిన కాల్పుల్లో గాయపడిన శుక్లాను ముందు జగదల్‌పూర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రికి తీసుకు వచ్చారు. గత వారం ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడినా, ఆ తర్వాత క్షీణించింది. శుక్లా మృతితో మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 29కి పెరిగింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన విద్యా చరణ్‌ శుక్లా, తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, చంద్రశేఖర్‌ కేబినెట్‌లో ఆయన కీలక శాఖలు నిర్వహించారు.

కేసీఆర్ పై హెచ్ఆర్సీలో రఘునందన్ ఫిర్యాదు

హైదరాబాద్ : టీఆర్ఎస్ బహిష్కృత నేత రఘునందన్ రావు మంగళవారం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. టీఆర్ఎస్ కార్యకర్త నాగరాజు ఆత్మహత్యపై విచారణ జరిపించాలని ఆయన తన పిటిషన్ లో హెచ్ ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రఘునందన్ రావు కోరారు. కాగా టీఆర్‌ఎస్ నిర్వహించిన సభ వేదికపైకి రానివ్వలేదని మనస్తాపం చెందిన నాగరాజు అనే టీఆర్ఎస్ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

రెచ్చగొడితే టీఎస్ఆర్ కే నష్టం: దగ్గుబాటి వెంకటేశ్వర రావు

హైదరాబాద్: తనను రెచ్చగొడితే కాంగ్రెస్ పార్టీ రాజసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి (టీఎస్ ఆర్ )కే నష్టమని ఆ పార్టీ ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి డి.పురంధరేశ్వరీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు మంగళవారం హైదరాబాద్ లో స్పష్టం చేశారు. టీఎస్ ఆర్ పంపిన లీగల్ నోటీస్ కు లీగల్ గానే సమాధానమిస్తానన్నారు. అయితే తమ ఇద్దరి మధ్య విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం జరగదని వెంకటేశ్వరరావు తెలిపారు. 

రానున్న ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని టీఎస్ ఆర్ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అయితే గత రెండు సార్లుగా కేంద్ర మంత్రి డి.పురంధరేశ్వరీ విశాఖపట్నం లోక్ సభ నుంచి గెలుపొందుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ లోక్ సభ స్థానంపై రగడ మొదలైంది.

చంద్రబాబు లక్షణం ఇది అంటున్న దాడి

టిడిపి అదినేత చంద్రబాబునాయుడు మనస్తత్వం గురించి టిడిపి మాజీ నేత దాడి వీరభద్రరావు విశ్లేషించారు. చంద్రబాబు తన విశ్వసనీయత పెంచుకోవడం కన్నా, ఎదుటివారిపై ఆరోపణలను చేయడం ద్వారా వారిని దెబ్బతీసే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటారని దాడి వ్యాఖ్యానించారు.దానివల్ల చంద్రబాబు తన విశ్వసనీయతను తానే చంపుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.ఆయన ఎంత సేపు ఎదుటవారిని ఎలా దెబ్బతీయాలనే చంద్రబాబు తరచూ ఆలోచిస్తుంటారని దాడి పేర్కొన్నారు.జైలులో కూడా జగన్ ను ఉండనివ్వరా అంటూ,జైల్లో జగన్ గదికి అడ్డంగా గోడలు ఏమైనా కట్టాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.జైళ్లు నియమ నిబంధనల మేరకే పనిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో సీబీఐ చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిందని దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా చేస్తున్నారని కూడా దాడి విమర్శించారు. 

బాబు, కిరణ్ ఒక్కటయ్యారు: ఈటెల రాజేంద్ర

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీఎం కిరణ్ ఒక్కటయ్యారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన మీడియా పాయింట్ వద్ద ప్రసంగించారు. 

తాము ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించినా పట్టువీడేది లేదని ఈటెల స్పష్టం చేశారు. సీఎం, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ల వ్యవహార శైలి రాచరిక వ్యవస్థను తలపిస్తుందని ఆయన విమర్శించారు. ఛలో అసెంబ్లీ అనుమతి కోసం ముఖ్యమంత్రిని కలుస్తామని ఈ సందర్బంగా ఈటెల తెలిపారు.

డి.ఎల్.కూడా టిడిపిని తప్పుపడుతున్నారా!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని సామెత.ఆ ప్రకారం కాంగ్రెస్ లో గొడవలు టిడిపికి కూడా తలనొప్పిగా చుట్టుకుంటున్నాయి.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బర్తరఫ్ చేసిన మాజీ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ తో పాటు టిడిపిని కూడా ఇరుకున పెట్టాయి.శాసనసభ లాబీలో డిఎల్ రవీంద్ర రెడ్డి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో చేసిన సంభాషణలో ఈ పరిస్థితి కనిపించింది.గత అసెంబ్లీ సమావేశాలలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టిడిపి మద్దతు ఇచ్చి ఉంటే కిరణ్ పదవి పోయేదని డిఎల్ వ్యాఖ్యానించారు.అయితే తాము వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసానికి ఎలా మద్దతు ఇస్తామని రేవంత్ ప్రశ్నించారు. ఒకవేళ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినా ఎమ్.ఐ.ఎమ్. పార్టీ కాంగ్రెస్ ను ఆదుకునేదని ఆయన అన్నారు.కిరణ్ ,చంద్రబాబు కలిసి పనిచేస్తున్నారని ప్రజలలోకి వెళ్లిందని డిఎల్ వ్యాఖ్యానించారు.కొద్ది కాలం క్రితం వరకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు తీవ్ర వ్యతిరేకంగా ఉన్న రవీంద్ర రెడ్డి ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి టిడిపి మద్దతు ఇచ్చి కిరణ్ ప్రభుత్వ పడిపోయేదని అంటున్నారు.అయితే అప్పుడు ఈయన మంత్రిగా ఉన్నారు.అది వేరే విషయం.ఒక పక్క శంకరరావు వచ్చేది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, టిఆర్ఎస్ ల ప్రభుత్వమని చెబుతుంటే,రవీంద్ర రెడ్డి ఇలా కిరణ్ పదవి పోయి ఉండేది కదా అని వ్యాఖ్యానించడమే కాకుండా,అలా జరగనందుకు బాధపడుతుండడం, మధ్యలో టిడిపిని ఆక్షేపించడం విశేషం.

క్విడ్‌ ప్రోకో కేసులో జగన్‌ ప్రమేయం లేదు -శంకర్రావు

హైదరాబాద్ : క్విడ్‌ప్రోకో కేసులో వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రమేయమేమీ లేదని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. 26 జీవోలను జారీ చేసిన మంత్రులందరినీ తప్పించాలని ఆయన మంగళవారమిక్కడ డిమాండ్‌ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిలను తొలగించాలని శంకర్రావు కోరారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రభుత్వంను ప్రజలే తొలగిస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

కారెక్కనున్న ఎర్రబెల్లి సోదరుడు!

వరంగల్‌: టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కారెక్కనున్నారు. ఇప్పటికే ఎర్రబెల్లి ప్రదీప్ రావు చేరికపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరంగల్ తూర్పు నియోజవర్గం ఎమ్మెల్యే టిక్కెట్ ను ఆశిస్తున్న ప్రదీప్ రావు నేడో, రేపో కేసీఆర్ ను కలవనున్నారు.

దాసరికి బొగ్గు మసి

ప్రముఖ దర్శక,నిర్మాత కేంద్ర బొగ్గు గనుల శాఖ మాజీ సహాయ మంత్రి డాక్టర్ దాసరి నారాయణ రావుకు బొగ్గు మసి అంటుకుంది. ఆయన మెడకు కోల్ గేట్ కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది. దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా యుపిఏను కుదిపేసిన బొగ్గు కుంభకోణం కేసులో ఆయన కూడా ఓ నిందితునిగా చేరిపోయారు. ఈ కుంభకోణం పార్లమెంటు ఉభయ సభలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఇదే కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు నివేదికను తెప్పించుకుని మార్పులు చేర్పులు చేసినందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్‌ తన పదవిని కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) వేగవంతం చేసింది. విచారణలో ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కొత్తగా కాంగ్రెస్ నేతలు పలువురు తెరపైకి వస్తున్నారు. లక్షా 86 వేల కోట్ల రూపాయల ఈ కోల్‌స్కామ్‌లో దాసరి నారాయణరావుపై కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. హర్యానాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ ఎంపి నవీన్‌ జిందాల్‌ కంపెనీలకు దాసరి నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు కేటాయింపులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో నవీన్‌ జిందాల్‌ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

వాస్తవానికి గత ఏడాదే బొగ్గు కుంభకోణం సెగ దాసరిని తాకింది. 2006 నుంచి 2009 మధ్య కాలంలో జరిగిన బొగ్గు కేటాయింపులను దృష్టిలోపెట్టుకొని సిబిఐ అధికారులు విచారణలు, సోదాలు, తనిఖీలు చేస్తున్నారు. ఈ కాలంలోనే ఆయన కేంద్ర బొగ్గు గనుల సహాయ మంత్రిగా పనిచేశారు. ఈ కాలంలోనే బొగ్గు గనుల కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయని కాగ్‌ సమర్పించిన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ లో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు సిబిఐ దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, పాట్నా, హైదరాబాద్‌, ధన్‌బాద్‌, నాగపూర్‌లతో పాటు 10 నగరాలలో 30 ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు చేసింది. ఆ సమయంలోనే హైదరాబాద్ లో దాసరిని విచారించినట్లు, ఆయన ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలిసింది. అయితే అప్పట్లో తనను సిబిఐ విచారించలేదని, తన ఇంట్లో తనిఖీలు జరగలేదని ఆయన ఖండించారు. 

ఎఫ్ఐఆర్ లో దాసరి, మాజీ మంత్రి నవీన్ జిందాల్ పేర్లను చేర్చిన సిబిఐ బృందాలుగా విడిపోయి ఈ రోజు(11.06.2013) ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌లోని 19 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా దాసరి నివాసంలో కూడా సోదాలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నవీన్‌ జిందాల్‌ గ్రూపు కంపెనీలకు భారీగా కోల్‌ బ్లాక్‌లు కేటాయించినందుకు ప్రతిఫలంగా దాసరి నారాయణరావు కంపెనీ సిరి మీడియాలో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ ఆరోపణ. దాసరికి చెందిన కంపెనీ షేర్లను మార్కెట్ రేటు కంటే నాలుగు రెట్లు అధికంగా జిందాల్‌ గ్రూపుతో అనుబంధం ఉన్న కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాలు, టీవీ సీరియళ్లు తీసే సౌభాగ్య మీడియా మన రాష్ట్రానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ. ఇది బాంబే స్టాక్‌ ఎక్ఛ్సేంజ్ లో లిస్ట్‌ అయింది. దీంట్లో సిరి మీడియా అనే కంపెనీకి 59.6 శాతం వాటా ఉంది. తెలుగు సినిమా దిగ్గజం, కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి దాసరికి చెందినదే ఈ సిరి మీడియా. అంటే సౌభాగ్య మీడియాలో మెజార్టీ వాటా దాసరిదే. ఈ సౌభాగ్యలో జిందాల్‌తో అనుబంధం ఉన్న న్యూఢిల్లీ ఎగ్జిమ్‌ అనే కంపెనీ 2 కోట్ల 25 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టింది. 2008 డిసెంబరు 8న ఈ పెట్టుబడి పెట్టారు. ఆ సమయంలో సౌభాగ్య షేరు ధర 27 రూపాయలు. మార్కెట్‌ రేటుకు నాలుగు రెట్లు ఎక్కువగా ఒక్కో షేరు 112 రూపాయల 50 పైసలకు న్యూఢిల్లీ ఎగ్జిమ్‌ ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో వాటా తీసుకుంది. ఇప్పుడు సీబీఐ ఈ వ్యవహారాన్ని శోధిస్తోంది. అందుకే సౌభాగ్య మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరిపింది. దాసరి నారాయణరావును ఏ క్షణంలో అయినా సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Monday, 10 June 2013

అద్వానీ రాజీనామాను ఆమోదించం: బీజేపీ

న్యూఢిల్లీ: సీనియర్ నేత ఎల్ కే అద్వానీ రాజీనామాను ఆమోదించేదే లేదు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం ముగిసిన తర్వాత రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. పార్టీకి అద్వానీ సూచనలు, సలహాలు చాలా అవసరం అని అన్నారు. అద్వానీ రాజీనామా అనంతర పరిస్థితులపై పార్లమెంటరీ కమిటీ భేటిలో చర్చించామని బీజేపీ నేతలు వెల్లడించారు. 

పార్టీ పదవులకు అద్వానీ రాజీనామా

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ బీజేపీలోని అన్ని పదవులకు సోమవారం రాజీనామా చేశారు. జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ బోర్డు, ప్రచార కమిటీ బాధ్యతలకు రాజీనామా చేస్తూ ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. 

నరేంద్ర మోడీని పార్టీ ప్రచార కమిటీ సారధిగా నియమించటంపై అసంతృప్తితో ఉన్న అద్వానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, పండిట్‌ దీన్‌దయాళ్‌, నానాజీ, వాజ్‌పేయి వంటి వారు రూపొందించిన సిద్ధాంతాలకనుగుణంగా పార్టీ పనిచేస్తున్నట్టు కనిపించడం లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌కు రాసిన లేఖలో అద్వానీ పేర్కొన్నారు. 

పార్టీ ప్రస్తుతం పనిచేస్తున్న తీరు, పార్టీ గమనం అర్థం కాకుండా ఉందని అన్నారు. ఈ పరిస్థితులతో రాజీపడటం తనకు ఇబ్బందిగా ఉందని అద్వానీ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మూడు పేరాల రాజీనామా లేఖలో అద్వానీ మూడు విభిన్న అంశాల్ని ప్రస్తావించారు. మొదటి పేరాలో జనసంఘ్‌, బీజేపీలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు. రెండో పేరాలో పార్టీ ప్రస్తుత తీరు, నాయకుల వ్యక్తిగత అజెండాలను ప్రస్తావించారు. 

మూడో పేరాలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ముప్పావు గంట సేపు సాగిన నరేంద్ర మోడీ ప్రసంగంలో ఎక్కడా తన పేరు ప్రస్తావించకపోవడం కూడా అద్వానీని మనస్థాపానికి గురి చేసినట్టు తెలుస్తోంది. మోడీకి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలియడంతో... గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. 

ఈ ఉదయం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ ఢిల్లీలో అద్వానీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాజీనామా నిర్ణయాన్ని అద్వానీ ప్రకటించడం విశేషం. మోడీని వ్యతిరేకిస్తున్నారనే తెలియగానే మోడీ అభిమానులు అనేక మంది ఢిల్లీలో అద్వానీ నివాసం ముందు ఆందోళనకు దిగారు. ఇది కూడా అద్వానీని కలిచివేసినట్టు తెలుస్తోంది. అయితే అద్వానీ రాజీనామాపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

మోడీతో లౌకికవాదానికి ముప్పు: చెన్నితల

తిరువనంతపురం: గుజరాత్ సీఎం నరేంద్రమోడీని 2014 లోక్‌సభ ఎన్నికల సమరానికి పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా బీజేపీ నియామించడంపై కేరళ పీసీసీ అధ్యక్షుడు రమేష్ చెన్నితల ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ నియామకం దేశ ప్రజాస్వామ్యం, లౌకికవాదానికి సవాల్ అని వ్యాఖ్యానించారు. మోడీ పనితీరు లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉంటుందన్నారు. మోడి, అద్వానీ నాణానికున్న రెండు పార్వ్శాలాంటి వారని పేర్కొన్నారు. మోడీని అద్వానీయే ఆమోదించలేకపోయారని చెన్నితల అన్నారు.

Sunday, 9 June 2013

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా

రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో సోమ వారం (175వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీ నర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆదివారం ప్రకటించారు. మండపేట కె.పి. రోడ్డు నుంచి సోమవారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. 7.2 కిలోమీటర్ల నడక అనంతరం మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 7.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. రామచంద్రపురంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడే రాత్రి బస చేస్తారు. సోమవారం మొత్తం 14.4 కిలోమేటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.

పర్యటించే ప్రాంతాలు
మారేడుబాక, పులగుర్త, మాచవరం, పసలపూడి, వై.ఎస్.ఆర్. స్టాట్యూ, రామచంద్రపురం

ఉపఎన్నికలకు వీలుంది: గోనె ప్రకాశ్‌రావు

హైదరాబాద్: ఎన్నికలకు ఏడాది గడువుంటే ఉపఎన్నికలు నిర్వహంచకూడదన్న నిబంధన ఏదీ లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్‌తో సీఈసీ కుమ్మక్కై ఉపఎన్నికలు రావని చెబుతోందని ఆరోపించారు. ఏడాదిలోపే గడువున్నా ఉపఎన్నికలు నిర్వహించిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ఎలక్షన్ కమిషన్‌ స్వతంత్ర సంస్థ అయినప్పటికీ ఇలాంటి నిర్ణయాలపై కోర్టు తీర్పుఉందని తెలిపారు. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు ఉపఎన్నికలు నిర్వహించాలని న్యాయపోరాటం చేస్తారని చెప్పారు.

ఆనం సోదరులకు మతిభ్రమించింది

తిరుపతి: జగన్‌ను విమర్శించడమే ఆనం సోదరులు పనిగా పెట్టుకున్నారని వైఎస్ఆర్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆనం సోదరులు మతిభ్రమించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పదవి వ్యామోహంతో సోనియా మెప్పుపొందేందుకు జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆనం సోదరులకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. 

టీడీపీలో గుర్తింపు పొందేందుకే వర్ల రామయ్య అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ-కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు త్వరలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

రేవంత్ డిమాండ్ కే సిబిఐ స్పందించిందా!

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధికార ప్రతినిది అంబటి రాంబాబు కొత్త ఆరోపణ సంధిస్తున్నారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన తర్వాతే సిబిఐ విజయసాయి రెడ్డి, జగన్ లను ఒకే జైలులో ఉంచరాదని కోర్టులో మెమో దాఖలు చేసిందని రాంబాబు అంటున్నారు.ఇక్కడే అనుమానం వస్తోందని ఆయన చెబుతున్నారు.ఇప్పటివరకు నిందితులను వేర్వేరు జైళ్లలో ఉంచాలని సిబిఐ కోరలేదని,రేవంత్ రెడ్డి కోరిన తర్వాతే ఇది జరిగినట్లు కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం సాక్ష్యాలు తారుమారు చేస్తారనే కారణంతోనే జగన్‌ను అరెస్టు చేశారని, అలాంటప్పుడు సిబిఐ ఈ విధంగా ఎలా వాదిస్తుందని ఆయన ప్రశ్నించారు.జగన్‌ను మానసికంగా వేధించి లబ్ధి పొందాలని కాంగ్రెస్, టీడీపీలు చూస్తున్నాయని , అందుకోసం సీబీఐని పావుగా వాడుకుంటున్నాయని రాంబాబు ఆరోపించారు.

సి.ఎమ్.క్యాంప్ ఆపీస్ వద్ద టిడిపి దర్నా

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేయాలని కోరుతూ ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ ను కలిసి తాము దీనిపై వివరించాలని అనుకున్నామని,కాని ఆయన అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా తమను అడ్డుకోవడం పద్దతి కాదని టిడిపి ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. వారంతా సి.ఎమ్.క్యాంప్ ఆపీస్ వద్ద భైఠాయించారు.అయితే ముఖ్యమంత్రి వీరికి ఎందుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదో తెలియదు.ముందుగా అప్పాయింట్ మెంట్ కోరకుండా వీరు క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారా?లేక లోపలికి వచ్చి వారు గొడవకు దిగే అవకాశం ఉందని కిరణ్ వారిని కలుసుకోలేదా అన్నది కూడా చర్చనీయాంశమే.ఏది ఏమైనా విచారణకు ఆదేశించిన కిరణ్ అదే సంగతి టిడిపి నేతలకు చెప్పి ఉంటే సరిపోయేదేమో.

ముఖ్యమంత్రి కిరణ్ ను అసమ్మతి మంత్రులు ఏమీ చేయలేరా!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి అధిష్టానంలో పట్టు పెరిగిందా?కాంగ్రెస్ లో ఆయనదే పై చేయి అవుతోందా?కాంగ్రెస్ లో దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తాజా పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ అసమ్మతిని తుంచడానికే మొగ్గు చూపుతోందని సి.ఎమ్ శిబిరంలో సంతోషం వ్యక్తం అవుతోంది. వైద్య శాఖ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డిని బర్తరఫ్ చేసిన తీరు పై అసమ్మతి ఏర్పాడింది. అసమ్మతి మంత్రులు డిల్లీ వెళ్లి దానిపై తమ అబిప్రాయాలు చెప్పినా అధిష్టానం సీరియస్ గా పట్టించుకోలేదన్న అబిప్రాయం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీనియర్ మంత్రి జానారెడ్డి వంటి వారు డి.ఎల్.ను బర్తరఫ్ చేసిన తీరుపై బహిరంగంగానే వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక మంత్రివర్గ భేటీలో వారు దీనిపై ముఖ్యమంత్రిని నిలదీస్తారని ప్రచారం జరిగింది.కాని అసలు ఆ అంశమే ప్రస్తావనకు రాకపోవడం గమనించదగిన అంశంగా ఉంది. డి.ఎల్. బర్తరఫ్ అదిష్టానం పెద్దలకు చెప్పే సి.ఎమ్. చేశారన్నది ఒక వాదనగా ఉంది.ఇక ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఢిల్లీ యాత్ర చేసినా పెద్దగా ఒరిగింది లేదని సి.ఎమ్. శిబిరం వ్యాఖ్యానిస్తోంది. మెదక్ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా దామోదరకు లేని విషయాన్ని అదిష్టానం గుర్తించిందని, అదే విషయాన్ని ఆయనతో అదిష్టానం పెద్దలు ప్రస్తావించారని,దాంతో ఆయన వైఖరిలో కొంత మార్చు వచ్చిందని కొందరు చెబుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ వద్ద దామోదర్ ప్రవర్తించిన తీరును వారు ఉదహరిస్తున్నారు. ఆయన చాలా వినయంగా కనిపించారని కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు. సోనియాగాందీ గతంలో కన్నా ఇప్పుడు చాలా విషయాలు సేకరించి వచ్చినవారితో మాట్లాడుతున్నారని, దాంతో ఏదో ఒక ఫిర్యాదు చేయాలని వెళ్లినవారే ఇబ్బంది పడవలసి వస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని బట్టి కిరణ్ కు ఎన్నికలవరకు ఎదురు లేదని అనుకోవచ్చా!

బిజెపి బ్రాండ్ అంబాసిడర్ గా నరేంద్ర మోడీ

మొత్తం మీద బిజెపి బ్రాండ్ అంబాసిడర్ గా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నియమితులయ్యారు. పార్టీ అగ్ర నేత ఎల్.కె. అద్వాని కి అంతగా ఇష్టం లేకపోయినప్పట్టికీ పార్టీ అద్యక్షుడుగా ఉన్న రాజ్ నాద్ సింగ్ ఆధ్వర్యంలో కార్యవర్గం ఈ నిర్ణయం తీసేసుకుంది.దీనిపై మోడీ అనుకూల వర్గం అంతా ఆనందంతో ఉంది.కొత్తగా పార్టీలో చేరిన మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణలో బీజేపీకే పట్టం కడతారని దీమా వ్యక్తం చేశారు. మోడి నాయకత్వాన్ని ప్రజలు కోరుతున్నారని అన్నారు.

స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు

కేంద్ర ప్రభుత్వం సిబిఐ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే,ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.తమను అనర్హులుగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండున్నర నెలలు జాప్యం చేసి ఆ తర్వాత వేటు వేశారని, తద్వారా ఉప ఎన్నికలు రాకుండా చేశారని ఆయన ఆరోపించారు. టిడిపి నేత చంద్రబాబు నాయుడు సలహా మేరకే ఈ వేటు పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాతో మందకృష్ణ భేటీ ఆంతర్యం!

ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రంపై బాగానే దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మద్య కాలంలో ఆంద్రప్రదేశ్ కు సంబందించిన పలువురు నేతలు,ప్రముఖులను ఆమె కలుసుకుని ఆయా అంశాలపై మాట్లాడుతున్నారన్న సమాచారం ఆసక్తికరంగా ఉంది. తాజాగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అదినేత మంద కృష్ణ మాదిగ తో కూడా ఆమె సమావేశం అయ్యారు.ఎస్ సిలను వర్గీకరణ చేయాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరినట్లు మంద కృష్ణ చెప్పారు. ఎస్ సిలను వర్గీకరణ చేయకుంటే కాంగ్రెస్ ఆ వర్గాల ఓట్లు కోల్పోతుందని ఆయన ఆమెతో అన్నారు.వర్షాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.కేవలం ఈ ఒక్క అంశం మాత్రమే చర్చించారా?లేక రాష్ట్ర రాజకీయాలపై కూడా సోనియా ఆరా తీశారా అన్నది చర్చనీయాంశం. ఒకవేళ ఆమె ఇతర విషయాల గురించి కూడా మాట్లాడి ఉంటే ఆమె రాష్ట్రంపై , ఇక్కడి కాంగ్రెస్ పరిస్థితులపై బాగా ఆందోళన చెందుతున్నారని అర్దం చేసుకోవచ్చు.

Tuesday, 4 June 2013

Special edition on Godavari Sakshigaa..

ఆ చేతి స్పర్శ కొండంత ధైర్యం... నిండైన భరోసా...

జగనన్న!
ఆ పేరు తలచుకుంటే సామాన్యుడి ఛాతీ సముద్రమంత అవుతుంది
ఆ రూపం గుర్తొస్తే చెయ్యి సగర్వంగా మీసం మీదకు చేరుతుంది
నిద్రలో, మెలకువలో శత్రువులు సైతం జపిస్తున్న పేరది
తడి నిండిన కళ్లతో రాష్ట్రమే తపిస్తున్న పేరది
గడిచిన చరిత్ర కాదు - నడుస్తున్న వర్తమానం తను
రాజకీయశక్తి కాదు... ఈ రాష్ట్ర భవిష్యత్తు తను..!

చెక్కిలి తాకే ఆ చేతి స్పర్శ నేనెప్పుడూ అనుభవించలేదు
కానీ దాని చల్లదనం నాకు తెలుసు
కొండంత ధైర్యాన్ని కరపత్రంలా పంచే
ఆ ఆలింగనాన్ని నేనెప్పుడూ అందుకోలేదు
కానీ ఆకాశమంత ఆ ఓదార్పు నాకు తెలుసు
నిద్రలేని రాత్రులు - అలుపెరుగని యాత్రలు
తలవంచని దీక్షలు - అన్నీ నాకు తెలుసు!

నిలువెత్తు ఆత్మస్థైర్యం తను
చిరునవ్వు చెరగని సంకల్పం తను
రాజభోగాల్ని కాదనుకుని రాళ్లబాటలో సాగుతున్న
సాహస యాత్రికుడతను
ఆడి తప్పని పాపానికి నిర్బంధపు శిలువ మోస్తున్న
చారిత్రక సాక్ష్యమతను!

నిజానికి!
నేనెవరో తనకి తెలీదు
తెలియాల్సినంత, తెలుసుకోవాల్సినంత విషయాన్ని కూడా కాదు నేను
కానీ... తన పోరాటం నా కోసం
నా గుప్పెడు మెతుకుల కోసం- నా గూడు నిలబడటం కోసం
నా బిడ్డల ఫీజు కోసం - పండుటాకుల పింఛను కోసం
నా ఆసరా కోసం - నా ఆరోగ్యసిరి కోసం
నా అన్నల కోసం - అక్కల కోసం
అవ్వల కోసం - తాతల కోసం
నాలాంటి సామాన్యుల స్వప్నం కోసం
తల తెగినా తలవంచని నా జాతి ఆత్మగౌరవం కోసం..!
అందుకే నిర్బంధాల కొలిమి వేయి నాలుకలు చాస్తోంది
అబద్ధాలతో అగ్నిపుత్రుణ్ని అణచివేయాలని చూస్తోంది
జగమంత జననేతని జనానికి దూరం చేయాలనే
ఢిల్లీ కుట్రకు దర్యాప్తు సంస్థల్ని ధారాదత్తం చేస్తోంది!

కానీ నడుస్తున్న కాలానికి, కదులుతున్న కెరటాలకి తెలుసు
సునామీని దాచుకున్న జనసంద్రం సమయం కోసం చూస్తోందని
జగన్నాథ రథచక్రం మళ్లీ జనం కొరకు వస్తుందని..!

చంచల్‌గూడ ఇప్పుడు జైలు కాదు
జగనన్నని మోస్తున్న జనగర్భం
పుటం పెట్టిన బంగారంలా ప్రజానేత బయటికొస్తాడు
‘కాష్టం’ మళ్లీ రాష్ట్రమవుతుంది!

హెరిటేజ్ పాలలో ఈగ

‘బ్రింగ్ హోమ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్’ అనే స్లోగన్‌తో ప్రచారం చేసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ పాల ప్యాకెట్‌లో క్రిమి కీటకాలు దర్శనమిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఒక వినియోగదారుడు కొనుగోలు చేసిన హెరిటేజ్ పాల ప్యాకెట్‌లో ఈగ దర్శనమివ్వడంతో అవాక్కయ్యాడు. గతంలో కూడా అనేకసార్లు హెరిటేజ్ పాలలో క్రిమికీటకాలు దర్శనమిచ్చిన విషయం విదితమే. పాల శుద్ధి, ప్యాకింగ్‌లో కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రజలు కోరుతున్నారు. 
- న్యూస్‌లైన్, భీమవరం 

ఈ వర్షంతో నాన్నే ఆశీర్వదించినట్లుంది

అది గోదారమ్మ పశ్చిమ తీరం.. మంగళవారం సాయంత్రం 4.40 అవుతోంది.. ఒక వైపు గోదారమ్మ హొయలు... మరోవైపు సూర్యుని సెగలు.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రేవువైపు షర్మిల నడుస్తున్నారు. మరోవైపు ఆమె వెంట తరలివస్తున్న జన నినాదాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతలో పొద్దంతాసెగలు చిమ్మిన సూర్యుడు మబ్బుల్లోకి పోయాడు. షర్మిల నదిలోకి వెళ్లి తల్లి గోదారికి దండం పెట్టారు. పసుపు, కుంకుమ, గాజులు గోదారమ్మకు సమర్పించారు. తలో ఆకాశంలో ఏదో మార్పు.. చూస్తుండగానే మబ్బులు కమ్ముకున్నాయి. ఒక్కొక్క చినుకూ రాలుతోంది. షర్మిల కొవ్వూరు బ్రిడ్జి మీదకు చేరారు. అంతే.. జోరున వర్షం కురిసింది. వర్షంలో తడిసి ముద్దవుతూనే షర్మిల ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. 
అది 2003లో వైఎస్సార్ నడిచిన బ్రిడ్జి, 2011లో జగన్‌మోహన్‌రెడ్డి హరితయాత్ర సాగిన బ్రిడ్జి.. ఆ జ్ఞాపకాలు మదిని తొలిచాయో ఏమో.. ఎప్పుడూ వేగంగా పడే ఆమె అడుగులు భారంగా పడ్డాయి. 

ఉబికి వస్తున్న ఉద్వేగాన్ని ఆపుకొంటూ, చెదరని చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు షర్మిల! తర్వాత రాజమండ్రిలో జరిగిన సభలో కొవ్వూరు బ్రిడ్జితో తమ కుటుంబ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘నాడు ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో నాన్న గోదావరి వంతెన మీదుగా అడుగులు వేసుకుంటూ ఇదే తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. ‘మరో ప్రజాప్రస్థానం’ అనే ఈ పాదయాత్రలో ఈ రోజు నేను కూడా అదే వంతెన మీద ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వస్తుంటే మనసు నిండా నాన్న గారి జ్ఞాపకాలతో గుండె బరువెక్కింది. 
ఆ రోజు నాన్న వంతెన మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. ఈ రోజు మేం అడుగు పెట్టగానే వర్షం బోరున కురిసి, స్వయంగా నాన్నే మమ్మల్ని ఆశీర్వదించినట్టు అనిపించింది. ఆ రోజు నాన్నకు మద్దతుగా అశేష జనవాహిని వంతెన మీద ఆయనతో నడిచినందుకు గోదావరే సాక్షిగా నిలిచింది. ఆ తరువాత రెండేళ్ల క్రితం జగనన్న పోలవరం సాధన కోసం ఇదే వంతెన మీద నడుచుకుంటూ వచ్చారు. ఆ రోజు జగనన్నకు, ఈ రోజు మాకు అదే జనవాహిని వచ్చి రాజన్న బిడ్డలకు తోడుగా, అండగా నిలబడ్డామని చెప్తుంటే మళ్లీ గోదావరే సాక్షిగా నిలబడింది’’ అని అన్నారు.

జెండా పట్టుకున్న కార్యకర్తలేమో ఆస్తులు అమ్ముకోవాలా?

టీడీపీని కబ్జా చేసి.. నందమూరి కుటుంబాన్ని తొక్కేసి.. ఒక్క లోకేశ్‌నే పైకి తేవాలనుకోవడం లోక కల్యాణం కాదు.. 
లోకాన్ని దోచుకుని మీరు సంపాదించుకున్న ఆస్తులేమో లోకేశ్‌కు ఇస్తారు.. జెండా పట్టుకున్న కార్యకర్తలేమో ఆస్తులు అమ్ముకోవాలా?
జెండా పట్టుకున్న కార్యకర్తలేమో ఆస్తులు అమ్ముకోవాలా?
చంద్రబాబూ.. మీకు పదవీ వ్యామోహం లేదంటే మీ పార్టీ వారే నమ్మరు
ఇప్పుడు వెలుగులు నింపుతానంటున్నారు.. మరి అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు ఏంచేశారు?
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 169, కిలోమీటర్లు: 2,235.8 
ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నో సినిమా డైలాగులు చెప్తున్నారు. తాను లోక కల్యాణం కోసం పాటు పడుతున్నానని చెప్తున్నారు. తనకు స్వార్థం లేదని, ప్రజాసేవే ముఖ్యమని, రాష్ట్రంలో వెలుగులు నింపుతానని, ధర్మ పోరాటం చేస్తున్నానని, తాను అవినీతి మీద పోరాటం చేస్తున్నానని.. ఇలా చంద్రబాబు డైలాగులు చెప్తున్నారు. చంద్రబాబుగారికి లోక కల్యాణం అంటే ఏమిటో తెలిసినట్టు లేదు. లోక కల్యాణం అంటే లోకంలోని ప్రజలకు మేలు చేయడం. ఒక్క ఆయన కుమారుడు లోకేశ్‌కు మేలు చేయాలనుకుంటే అది లోక కల్యాణం కాదు. 

మన రాష్ట్రంలో ఒక ప్రభుత్వం నిలబడటానికి 148 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం 146 మాత్రమే, అది కూడా అసమ్మతి ఎమ్మెల్యేలను కూడా కలుపుకొంటే. మరి మైనార్టీలో ఉన్న ఈ కాంగ్రెస్ ఎలా అధికారంలో ఉంది? కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలా పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మద్దతుతో కాదా?
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు తాను లోక కల్యాణం కోసం పాటుపడుతున్నానని అంటున్నారు. రెండెకరాల భూమితో రాజకీయ జీవితం ప్రారంభించిన చంద్రబాబు లోకాన్ని దోచుకొని కోట్లకు కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఆ ఆస్తుల్ని లోకేశ్‌కు ఇస్తారు. ఆయన్నే నమ్ముకొని, జెండా పట్టుకున్న కార్యకర్తలను మాత్రం పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొమ్మని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడూ.. మీ దృష్టిలో లోక కల్యాణం అంటే లోకేశ్‌కు మేలు చేయడమేనా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. ‘‘తెలుగుదేశం పార్టీని కబ్జా చేసి, నందమూరి కుటుంబాన్ని తొక్కేసి, ఒక్క లోకేశ్‌ను మాత్రమే పైకి తేవాలనుకుంటే అది లోక కల్యాణం అనిపించుకోదు’’ అని చంద్రబాబుకు ఆమె హితవు పలికారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో కుమ్మక్కైన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాలో పూర్తయి.. తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. రాజమండ్రిలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. 

ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

‘‘ఈ రోజు చంద్రబాబు ఎన్నో సినిమా డైలాగులు చెప్తున్నారు. చంద్రబాబు తనకు స్వార్థం, పదవీ వ్యామోహం లేవంటున్నారు. అయితే మరి ఎన్టీఆర్‌ను ఆయన ఎందుకు వెన్నుపోటు పొడిచినట్టు? ఆయన కుర్చీని, అధికారాన్ని ఎందుకు లాగేసుకున్నట్టు? పోనీ ఆయన్ను అధికారంలోంచి దింపేశాక, ఎన్టీఆర్ గారికి అంత మంది కుమారులుంటే.. ఏ ఒక్క కుమారుడికీ అధికారం ఇవ్వకుండా అందరినీ తొక్కేసి ఆ కుర్చీలో చంద్రబాబుగారే ఎందుకు కూర్చున్నట్టు? ఈయనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని చెప్పినా.. ఆ కుర్చీ మీద కన్నులేదని చెప్పినా కనీసం తెలుగుదేశంవారు కూడా నమ్మరు. నిజంగా మీరురాష్ట్రంలో వెలుగులు నింపే వారే అయితే అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో ఆ పని ఎందుకు చేయలేదు చంద్రబాబూ? నీ హయాంలో రాష్ట్ర ప్రజల బతుకులు ఎందుకు బుగ్గిపాలు చేశారు?

నరకాసురుడికి అధికారం ఇస్తారా?

‘నాకు అధికారం ఇస్తే రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే గాడిలో పెడతాను’ అంటున్నారు చంద్రబాబు. నరకాసురుడు వచ్చి తనకు మళ్లీ అధికారం ఇవ్వండి.. మంచి పాలన చేస్తానంటే ఎవరైనా ఇస్తారా? గాడ్సే వచ్చి మహాత్మాగాంధీ ట్రస్టుకు తనను అధ్యక్షుడిని చేయమంటే చేస్తారా? చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇస్తే మన రాష్ట్రానికి అధోగతే. చంద్రబాబు అవినీతి మీద ధర్మ పోరాటం చేస్తున్నారట. కనీసం ప్రజలు చూస్తున్నారని కూడా పట్టించుకోకుండా, ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో విచారణను తప్పించుకోవడానికి చీకట్లోనే చిదంబరాన్ని కలిసి ఒక వైపు వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ.. తనది ధర్మ పోరాటం అంటున్న చంద్రబాబును ఏమనాలి?

కుమ్మక్కైంది టీడీపీనే..

కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ప్రతిసారీ కుమ్మక్కయ్యారు. పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైందని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన చెప్పిందే నిజమైతే.. ఈ రోజు జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉండేవారా? ఇప్పటికే ఏ మంత్రో, ముఖ్యమంత్రో అయిపోయి ఉండేవారు కాదా? ఈ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డి మీద అబద్ధపు కేసులు పెట్టి ఏడాదిగా జైల్లో పెట్టేలా చేశాయి. చేతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అన్ని ప్రతిపక్ష పార్టీలూ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలకుండా చేయడానికి ఈ చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి మరీ కాపాడారు.

జగనన్న తరఫునే ఈ పాదయాత్ర..

నాన్నగారు బతికే ఉన్నా.. జగనన్న బయటే ఉన్నా.. నేను ఈ రోజు ఈ పాదయాత్ర చేసే అవసరమే వచ్చేది కాదు. కానీ వైఎస్సార్ పాదయాత్రలో, ఆయన వ్యక్తిగత ఇమేజ్‌తో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ కనీసం కృతజ్ఞత కూడా లేకుండా వైఎస్సార్‌ను దోషి అని, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును చేర్చింది. ఆయన కుమారుడిని రాజకీయంగా తొక్కేయాలని ఒక్కడి చుట్టూ 100 కుట్రలు పన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టేలా చేసింది. జైల్లో ఉండి కూడా మన రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్న జగనన్న తర పున నేను ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాను. అందుకే ఈ రోజు ఇలా మీ ముందు నిలబడ్డాను.’’

13 కిలోమీటర్ల మేర యాత్ర: పాదయాత్ర 169వ రోజు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ కేంద్రంలోని మెరక వీధి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నడుచుకుంటూ షర్మిల కొవ్వూరు-రాజమండ్రి మధ్య ఉన్న రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. జోరు వానలో తడుస్తూనే రాజమండ్రికి చేరుకున్నారు. ఇక్కడ భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి సెయింట్ పాల్ చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. మొత్తం 13 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,235.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో పార్టీ రాష్ట్ర నాయకులు వైవీ సుబ్బారెడ్డి, ఎంవీ మైసురారెడ్డి, పశ్చిగోదావరి జిల్లా పార్టీ కన్వీనర్, ఎమ్మెల్యే బాలరాజు, తూర్పు గోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు ద్వారంపూడి, ఆళ్ల నాని, మద్దాల రాజేశ్, తానేటి వనిత, పేర్ని నాని, బాబూరావు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, భాస్కర రామారావు, మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్ తదితరులు ఉన్నారు.

న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్న సీబీఐ

గూడూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏడాదిగా జైలులో అక్రమంగా నిర్బంధించడం ముమ్మాటికీ కుట్రపూరితచర్యేనని పలువురు న్యాయవాదులు, మేధావులు, సామాన్యప్రజలు అభిప్రాయపడ్డారు. కేంద్రం సీబీఐని కీలుబొమ్మలా ఆడిస్తోందన్నారు. ప్రాథమికంగా ఎటువంటి ఆధారాల్లేని కేసులు బనాయించి జగన్‌కు బెయిల్ రాకుండా సీబీఐతో పాటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నాయన్నారు. 

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి రోటరీ భవన్‌లో మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో చైతన్యపథం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రజాదరణ పొందిన నేత అయ్యారు. అసమర్థ పాలనతో కుదేలవుతున్న అధికార కాంగ్రెస్, కుదేలైన టీడీపీ కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డిపై కేవలం ఆరోపణలతోనే ఏడాదిగా జైల్లో ఉంచడం దారుణమన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సీబీఐని, న్యాయవ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్యాన్నే అవహేళన చేస్తున్నాయన్నారు. సోనియాగాంధీ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎదురు తిరిగినందుకే సీబీఐని ఉపయోగించి జగన్‌పై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. 

ఈ కేసులు ఆయన్నేమీ చేయలేవని, త్వరలో కడిగిన ముత్యంలా జగన్ నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అనేక కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిని పట్టించుకోని సీబీఐ, కేవలం ఆరోపణలకు సంబంధించి జగన్‌పై ఏళ్లతరబడి విచారణ చేయడం, ఏడాదిగా జైలులో నిర్బంధించడం ఏమిటని ప్రశ్నించారు. పేదల సంక్షేమం కోసం వైఎస్ అహర్నిశలు కృషి చేశారన్నారు. ఆయన అకాల మరణాన్ని తట్టుకోలేక ఎందరో అభిమానంతో మృతి చెందారని, వారిని ఓదారుస్తానని జగన్‌మోహన్‌రెడ్డి మాటిచ్చి ఓదార్పుయాత్ర చేపట్టారన్నారు. అదే పెద్ద తప్పన్నట్లు కాంగ్రెస్ పెద్దలు జగన్‌ను, ఆయన కుటుంబ సభ్యులను వేధించడం సబబు కాదన్నారు. కాంగ్రెస్ పెద్దలు జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఉంచాక బహిరంగసభల్లో మాట్లాడుతూ, జగన్ పార్టీ వీడకుంటే సీఎం అయ్యేవాడంటూ చెప్పడాన్ని బట్టే ఇది ఎంత కుట్రపూరిత చర్యో తెలుస్తుందన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు ఖాదర్‌బాషా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గద్దె దిగకుండా చంద్రబాబు వెన్నుదన్నుగా నిలుస్తుండడాన్ని బట్టే కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు తెలుస్తోందన్నారు. సీబీఐని పావుగా వాడుకుంటూ జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తున్నాయన్నారు. న్యాయవాది బాబురెడ్డి మాట్లాడుతూ, న్యాయస్థానాలు సీబీఐని తప్పుబడుతున్నా.. వారికి చలనమే లేదన్నారు. ఎలాంటి కేసుకైనా అరెస్టయిన 90 రోజుల్లో బెయిల్ రావాల్సి ఉండగా ఏడాదిగా జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఉంచడం ముమ్మాటికీ కుట్రేనన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అన్నారు. స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

తెలంగాణ రాబందుల పార్టీ

రాజకీయ పార్టీలు ఒకదానిని ఒకటి విమర్శించుకోవడానికి కొత్త,కొత్త డైలాగులు కనిపెడుతుంటాయి. టిడిపిని తెలంగాణ ద్రోహుల పార్టీగా టిఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తుంటారు. దానికి ప్రతిగా టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల పార్టీగా టిడిపి వ్యాఖ్యానించింది.టిడిపి ఎమ్మెల్యేలు సీతక్క,సత్యవతి రాధోడ్ లు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.తెలంగాణలో పలువురు మరణానికి కారణం టిఆర్ఎస్ అని వారు వ్యాఖ్యానించారు.అవకాశవాదులే టిఆర్ఎస్ లో చేరుతున్నారని వారు మండిపడ్డారు.సీమాంధ్ర పార్టీలో ఉండి ఏమీ చేయలేకపోయానని కడియం శ్రీహరి అంటున్నారని, 1969 నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే కడియంకు 2013లోనే కనువిప్పు ఎందుకు కలిగిందని వారు సూటిగా ప్రశ్నించారు. కడియంకు పదవీపై ఆశ లేకుంటే హన్మకొండ సీటును అమరవీరుల కుటుంబానికి ఇవ్వగలరా అని వారు అన్నారు.మొత్తం మీద తెలంగాణలో ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్న తీరు గందరగోళంగా మారుతోంది.

బీజేపీతో మాది మిత్ర వైరుధ్యమే: కేటీఆర్

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీతో తమకు మధ్య ఉన్నది మిత్రవైరుధ్యం మాత్రమేనని.. శత్రుత్వం కాదని టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ కోరుకునే ఏ సంస్థలకు చెందిన వారినైనా తాము సోదరులుగానే చూస్తామని తెలిపారు. వారితో చిన్నచిన్న అభిప్రాయ బేధాలుంటే పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్ లో విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ, యూపీఏ తెలంగాణ ఇస్తామంటూ మో సం చేశాయని విమర్శించారు. తమ పార్టీ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి తెలంగాణ కోసం పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్నప్పుడు ఏ ఒక్క రోజూ బీజేపీ సభ్యులు కలిసి రాలేదని తెలిపారు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు వల్లే తెలంగాణ ఇవ్వలేకపోయామని చెబుతున్న బీజే పీ నేతలు.. రేపు వెంకయ్యనాయుడు అడ్డు అంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలేనని వ్యాఖ్యానించారు. పోటీ పరీక్షల్లో ఈ ప్రాంత విద్యార్థులకు న్యాయం జరిగేందుకు ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు. 

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా

రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో బుధవారం (170వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం మంగళవారం ప్రకటించారు. రాజమండ్రి సెయింట్ పాల్స్ చర్చి వద్ద నుంచి షర్మిల బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభిస్తారు. 5.4 కిలోమీటర్ల నడక అనంతరం శానిటోరియం సమీపంలో మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 8.9 కిలోమీటర్ల మేర పాదయాత్రను కొనసాగిస్తారు. మధురపూడి సమీపంలోని బత్తుల సత్తిరాజు తోటలో రాత్రి బస. బుధవారం మొత్తం 14.3 కిలోమేటర్ల మేర ఆమె పాదయాత్ర సాగుతుంది.

పర్యటించే ప్రాంతాలు
రాజమండ్రి నగరంలోని సెయింట్‌పాల్స్ చర్చి, ఆజాద్‌చౌక్, నందం గనిరాజు సెంటర్, కంబాలచెరువు, వివేకానందచౌక్, రాజా థియేటర్ సెంటర్, క్వారీ మార్కెట్ సెంటర్, శానిటోరియం సెంటర్, కొంతమూరు, కోలమూరు, గాడాల, మధురపూడి.

కెసిఆర్ ప్రజల ఆస్తి

రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు రెండు రోజుల క్రితం టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుపై చేసిన విమర్శలను ఆయన కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు ఘాటుగా తిప్పికొట్టారు.తాము ఉద్యమంలో పాల్గొంటే మీరు పదవులలో కులుకుతారా అని ఆయన సీరియస్ గా ప్రశ్నించారు.తెలంగాణ ద్రోహులు చట్టసభలలో ఉంటే,తెలంగాణ బిడ్డలు రోడ్లపై ఉండాలా అని ఆయన ప్రశ్నించారు.టిఆర్ఎస్ కు ఓట్లు ,సీట్లు రాకూడదా అని కెటిఆర్ ప్రశ్నించారు.ఓట్లు,సీట్లతోనే టిఆర్ఎస్ రాజకీయ అస్థిత్వాన్ని సాధిస్తుందని ఆయన స్పష్టం చేవారు.మంత్రి శ్రీధర్ బాబును మంధని దాటితే ఎవరూ గుర్తించరని, కెసిఆర్ ఇప్పటికే మూడు జిల్లాలలో గెలిచారని ఆయన అన్నారు.కెసిఆర్ ప్రజల ఆస్తి అని ఆయన పేర్కొన్నారు.
కెసిఆర్ ఎక్కడ నుంచి పోటీచేసినా గెలుస్తారని తారకరామరావు సవాల్ చేశారు.

జానా మాటలు ఏమి చెబుతున్నాయి..

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ప్రకటనలు ఒక్కోసారి భలేగా ఉంటాయి.తెలంగాణపై ఆయన చేసిన ప్రకటన అలాంటిదే.తెలంగాణపై చర్చలు అనేది నిరంతర ప్రక్రియ అని ఆయన అంటున్నారు. తెలంగాణ అంశంలో అధిష్టానంపై తనకు నమ్మకం ఉందని చెబుతూ, తెలంగాణపై అధిష్టానం మరోసారి చర్చలకు పిలుస్తుందని జానా అంటున్నారు.చర్చలు నిరంతర ప్రక్రియ అంటే ఇప్పట్లో తేలదని ఆయన పరోక్షంగా చెప్పినట్లు అనుకోవాలా?అయితే అదే సమయంలో యధా ప్రకారం అదిష్టానంపై నమ్మకం ఉంచారు.కాగా పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడడానికి అజాద్ పిలిపించారని ఆయన వెల్లడించడం విశేషం. అంటే చివరికి పంచాయతీ ఎన్నికలు పెట్టాలా?వద్దా?అన్నదానిపై కూడా డిల్లీ పెద్దలే నిర్ణయించాల్సి వస్తున్నదని అనుకోవాలా?ఈ నెల 11లోపు పంచాయతీ రిజర్వేషన్లు పూర్తిచేస్తామన్నారు. జులై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలుంటాయని , ఆగస్టు చివరిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుండే అవకాశం ఉందని జానారెడ్డి తెలియచేశారు.కాగా మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్‌ గురించి బాధపడుతున్నానని అనడం విశేషం.

వై.ఎస్.ను తిడితే పదవి ఇచ్చారుగా..

డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించడంపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా ఉంది.దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని తిడితే మంత్రి పదవులు ఇచ్చారని, కిరణ్‌ను తిడితే మంత్రి పదవి నుంచి తొలగించారని ఆయన అన్నారు. డి.ఎల్.గతంలో వై.ఎస్.ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని జూపూడి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదీ కాంగ్రెస్ సంస్కృతి అని ఆయన ఎద్దేవ చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు నమ్మదగిన నేత వైఎస్ జగన్ ఒక్కరే అని అన్నారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, కిరణ్‌లకు ఓటమి తప్పదన్నారు. రాష్ట్రంలో నమ్మడానికి వీల్లేని వ్యక్తి ఎవరంటే చంద్రబాబే అని జూపూడి విమర్శించారు.కాంగ్రెస్ లో అయినా ఏ పార్టీలో అయినా అధికారంలో ఉన్నవారిని తిడితే ఊరుకుంటారా?ఆ సంగతి జూపూడికి తెలియనిదా!

అప్పట్లో నాగం, కెసిఆర్ లు ఒక గూటి పక్షులే!

మున్ముందు రోజులలో బిజెపి, టిఆర్ఎస్ లకు మధ్య కూడా మాటల యుద్దం ముదిరే సూచనలు కన్పిస్తున్నాయి.గతంలో నాగం జనార్ధనరెడ్డి తెలంగాణ కోరుకునే నాయకులు ఒకరినొకరు విమర్శించుకోకూడదని అంటుండేవారు. ఆయన ఇప్పుడు ఒక పార్టీలోకి వచ్చాక దానిని పక్కన బెట్టి విమర్శల పర్వంలోకి దిగారు.స్టేషన్ ఘనపూర్ లో కెసిఆర్ ఈయనపై విమర్శలు చేశారు. దానికి బదులు చెబుతూ, టీఆర్‌ఎస్ ఆవిర్భావం ముందే బీజేపీ రెండు రాష్ట్రాలు కావాలి కోరిందని నాగం చెప్పారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అడ్రస్ ఎక్కడ అని ఆయన అడిగారు. కేసీఆర్ నిక్కర్ వేసుకున్నప్పుడే ఉద్యమంలో జైలుకెళ్లానని నాగం అంటున్నారు. 2001లోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని కేసీఆర్ భావిస్తున్నారని... తెలంగాణ ఉద్యమం చరిత్ర తెలుసుకోవాలంటూ కేసీఆర్ కు నాగం సలహా ఇచ్చారు.చిత్రం ఏమిటంటే వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ లో ఉన్నప్పుడు ఆ పార్టీ వైఖరిని అనుగుణంగా ఇద్దరిని సమైక్యవాదులగానే పరిగణించాలి.నాగం అయితే ఒక సందర్భంలో రాష్ట్రం సమైక్యంగా ఉండవలసిన అవసరంపై శాసనసభలో మాట్లాడితే,కెసిఆర్ ఏకంగా ఆరుసూత్రాల పధకాన్ని 610 జిఓను వ్యతిరేకిస్తూ ప్రసంగించారు.ఇక 1969 నాటికి కెసిఆర్ పదిహేనేళ్ల లోపు వయసు కలిగిన వ్యక్తి కనుక ఆయనకు తెలంగాణ ఉద్యమం గురించి అప్పట్లో ఆయనకు అవగాహన ఉండకపోవచ్యు.అంత మాత్రాన నాగం తాను సీనియర్ అనుకుంటే ఎలా?నిజానికి రెండువేల ఒకటిలో కెసిఆర్ తెలంగాణ ఉద్యమం ఆరంభించాకే దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నది వాస్తవం.