Thursday, 2 May 2013

YS Rajashekar Reddy HD Photo Gallery

YSRCP Leader Rehman Press Meet Video

తన ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కన్వీనర్ రెహ్మాన్ స్పష్టం చేశారు.

టీడీపీకి దాడి వీరభద్రరావు రాజీనామా!


విశాఖ: టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు గురువారం రాజీనామా సమర్పించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు నేరుగా పంపించినట్టు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితుల వల్లే రాజీనామా సమర్పించానని దాడి వివరణ ఇచ్చారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశాఖ జిల్లాలో జరిగిన చంద్రబాబు పాదయాత్రకు దాడి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. దాడి బాటలోనే తనయుడు జిల్లా అధ్యక్ష పదవికి రత్నాకర్ గుడ్‌బై చెప్పారు. 
శుక్రవారం అనకాపల్లిలో కార్యకర్తలతో దాడి అత్యవసర సమావేశం కానున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపు అప్పట్లో లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలి దాడి టీడీపీలో చేరారు. దాడి రాజీనామాతో ఉత్తరాంధ్రలో బలమైన బీసీ నేతను టీడీపీ కోల్పోయింది. ఆరేళ్ల పాటు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా దాడి వీరభద్రరావు వ్యవహరించారు. 

ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ రెక్కల కష్టం: YSషర్మిల


ఖమ్మం: పేదలకు కార్పోరేట్ విద్య అందించిన ఘనత వైఎస్ఆర్‌దినని ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నదే వైఎస్ఆర్ కల అని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్‌ హయాంలో విద్యుత్ చార్జీలు ఒక్కసారి కూడా పెరగలేదని షర్మిల తెలిపారు. గూడులేని నిరుపేదలకు పక్కా ఇళ్లు కట్టించారని, వైఎస్ఆర్ రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వాన్ని కిరణ్‌ అనుభవిస్తున్నారని షర్మిల అన్నారు. 

పదవి అనుభవించడమే తప్ప కిరణ్‌ పేద ప్రజలకు ఏమీ చేయటం లేదని షర్మిల విమర్శించారు. కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు తప్ప కరెంట్ ఇవ్వడంలేదని. కిరణ్‌ మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని షర్మిల తెలిపారు. కిరణ్‌ పెట్టుబడుల లిస్ట్ పేరుకే పరిమితమవుతున్నాయని, బాబు అండదండలు చూసుకునే కిరణ్‌ రెచ్చిపోతున్నారని షర్మిల ఆరోపించారు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారిందని, కాంగ్రెస్‌ అధికార దుర్వినియోగం చేస్తోందని షర్మిల విమర్శించారు.

ప్రాణమున్నంత వరకూ జగన్ తోనే: రెహ్మాన్


హైదరాబాద్ : తన ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కన్వీనర్ రెహ్మాన్ స్పష్టం చేశారు. తాను పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నాననటం అవాస్తవమని.... ఉద్దేశపూర్వకంగానే కొన్ని ఛానళ్లు దుష్ర్పచారం చేస్తున్నాయని ఆయన గురువారమిక్కడ మండిపడ్డారు. మైనార్టీలకు జగన్ మాత్రమే న్యాయం చేయగలరని రెహ్మాన్ అన్నారు.

ఇలాంటి దుష్ప్రచారం చేయడం మానుకోవాలని యెల్లో మీడియాకు రెహ్మాన్‌ విజ్ఞప్తి చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ ఉందన్నారు. న్యూస్‌కు వ్యూస్‌కు తేడా ‌తెలుసుకోకుండా స్క్రోలింగ్‌లు వేయడం సరికాదని రెహ్మాన్ హితవు పలికారు. తనకు గాని, తన సామాజికవర్గానికి గాని అన్యాయం జరిగితే మీడియా ముందుకు వచ్చి తాను మాట్లాడతానన్నారు. అన్ని వర్గాల వారూ మంచిగా ఉంటేనే తామూ మంచిగా ఉంటామన్నారు.

ఈనాడు దుష్ప్రచారం చేస్తుంది: మారెప్ప


కర్నూలు: ఈనాడు దినపత్రికపై మాజీ మంత్రి మారెప్ప తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీలో చేరుతున్నట్లు తనపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోందని ఆయన గురువారమిక్కడ మండిపడ్డారు. తాను పార్టీ మారేది లేదని....చచ్చినా బతికినా వైఎస్‌ఆర్‌సీపీని వదిలే ప్రసక్తే లేదని మారెప్ప స్పష్టం చేశారు. 

సీఎం వ్యాఖ్యలను ఖండించిన ఆమోస్

హైదరాబాద్: తెలంగాణపై సీఎం కిరణ్ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ ఆమోస్ గురువారం హైదరాబాద్ లో ఖండించారు. 2014లోపు తెలంగాణపై కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకోదని సీఎం ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల అనుసరించాల్సిన వైఖరిని మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త పథకాల ప్రకటనల్లో మంత్రుల మధ్య విభేదాలు లేకుండా సీఎం కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని రక్షించేందుకు తప్ప సొంత ఎజెండా కోసం మాట్లాడకూడదని రాష్ట్ర మంత్రులకు ఈ సందర్బంగా ఆమోస్ హితవు పలికారు.

సోనియా గాంధీ నివాసం ఎదుట సిక్కుల ఆందోళన


న్యూఢిల్లీ : సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ ను నిర్దోషిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్న సిక్కులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. గురువారం ఉదయం సోనియా గాంధీ నివాసం ఎదుట నిరసనకు దిగిన సిక్కులు ఏకంగా టెన్‌ జన్‌పథ్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన సిక్కులు బారికేడ్లు ఎక్కి లోనికి వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేశారు.

తమకు న్యాయం చేయాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జన్‌కు ఉరిశిక్ష విధించాలంటూ నినాదాలతో జన్‌పథ్‌ ప్రాంతం దద్దరిల్లింది. అప్రమత్తంగా ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను తగులబెట్టిన సిక్కులను పోలీసులు అతి బలవంతంగా అక్కడి నుంచి తొలగించారు. 

విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు


న్యూఢిల్లీ : ఆడిటర్‌ విజయసాయి రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రెండు రోజులుగా సాగుతున్న వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. దర్యాప్తునకు విజయసాయిరెడ్డి ఎక్కడా ఆటంకం కలిగించలేదని ఆయన తరపు న్యాయవాది అత్యున్నత న్యాయస్థానానికి నివేదించారు. బెయిల్‌ పొందిన తర్వాత సీబీఐ మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. 

ఇదే కేసులో నిందితులుగా ఉన్న హోంమంత్రి, ఐఏఎస్ అధికారులు బయటే ఉన్న విషయాన్ని న్యాయవాదులు ప్రస్తావించారు. ఈ కేసులో ఎక్కువ ప్రభావితం చేసే వ్యక్తులు బయటే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే సీబీఐ విజయసాయిరెడ్డిని 300 గంటలు విచారించందని కోర్టుకు తెలిపారు. ఈ నెలలో విజయసాయిరెడ్డి కుమార్తె వివాహం ఉందని, దర్యాప్తునకు ఆయన అటంకం కలిగిస్తున్నారనడం అపోహేనని కోర్టుకు వివరించారు.