Sunday, 2 June 2013

లోకేష్ కోసం జూనియర్ కు వెన్నుపోటు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అప్పట్లో ఎన్.టి.ఆర్ ను వెన్నుపోటు పొడిచారని,ఇప్పుడు తన కుమారుడు లోకేష్ కోసం జూనియర్ ఎన్.టి.ఆర్.కు వెన్ను పోటు పొడుస్తున్నారని టిఆర్ఎస్ నేత, కెసిఆర్ కుమారుడు అయిన తారకరామారావు వ్యాఖ్యానించారు.తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని చెబుతున్న చంద్రబాబునాయుడు వచ్చిన తెలంగాణకు పీక నొక్కడానికి బీజం వేసిందే ఆయనని కెటిఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు రోమ్ నగరం తగలబడుతుంటే పిడేల్ వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తుల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.కిరణ్ కుమార్ రెడ్డి ప్రజామోదం లేని సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అని ఆయన విమర్శించారు.విశేషం ఏమిటంటే ఎన్.టి.ఆర్.కు వెన్నుపోటు పొడిచాడని చంద్రబాబుపై కెటిఆర్ ఆరోపణ చేస్తున్నారని, అప్పట్లి తిరుగుబాటు లేదా వెన్నుపోటులో కెసిఆర్ కు కూడా పాత్ర ఉన్న సంగతిని ఈయన మర్చిపోతున్నారా?

వివేక్ కు టిఆర్ ఎస్ సూట్ అయ్యేనా!

పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్.పి వివేక్ అప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావుకు అప్పుడే సలహా ఇస్తున్నారు.కెసిఆర్,కెకెల ద్వారానే తెలంగాణ రాదని, అందరిని కలుపుకుపోవాలని వివేక్ సూచిస్తున్నారు.ఎన్నికల ద్వారానే తెలంగాణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో చేరేవారికి సీట్లిస్తే తప్పేంటని,తెలంగాణ కోసం అందరినీ కలుపుకోవాలని కేసీఆర్‌కు కూడా సూచిస్తానని వివేక్ అన్నారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనపై విమర్శలు చేయిస్తున్నారని, తన వ్యాపారాలపై దాడులు చేయిస్తున్నారని కూడా వివేక్ ఆరోపించారు.వివేక్ కాంగ్రెస్ లో మాదిరిగా ఇక్కడ కూడా ఏమైనా హడావుడి చేస్తే భవిష్యత్తులో ఇబ్బందిపడతారేమో. ఎంత అయినా ఇది ఉప ప్రాంతీయ పార్టీ కదా!

Friday, 31 May 2013

బాబు మానసికస్థితిపై జూపూడి ప్రభాకర రావు అనుమానాలు

హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మానసిక పరిస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు గానీ, మిత్రుల గానీ ఆయనను విదేశాలకు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించడం మంచిదని సలహా ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖైదీలను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జైళ్లలో అభ్యంతరకర సౌకర్యాలు అందజేస్తున్నారని చంద్రబాబు చేసిన నిరాధారమైన ఆరోపణలపై జైళ్ల శాఖ డిజి కృష్ణంరాజు స్పందించారని తెలిపారు. టీడీపీ నేతలకు చెంపపెట్టులా కృష్ణరాజు వివరణ ఇచ్చారని చెప్పారు. ఆయన వివరణకు టీడీపీ నేతలు ఇంతవరకూ ఎందుకు స్పందిచలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ములాఖత్ లపై గతంలో వైఎస్ భారతి విసిరిన ఛాలెంజ్ కు ఇప్పటి వరకూ స్పందన లేదన్నారు. చంద్రబాబు తన అలవాట్లను ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చిల్లర మాటలు మాట్లాడటం మానుకోవాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు ఆరోపణలపై రాష్ట్రప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ పై టిడిపి నేతలు అనుచిత ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. జగన్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కూడా జూపూడి హెచ్చరించారు. 

టీఆర్‌ఎస్, జేఏసీకి టిడిపి ఆఫర్

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జెఎసి, టిఆర్ఎస్ లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టిడిపి నేత పెద్దిరెడ్డి ఆఫర్ ప్రకటించారు. కావాలంటే షరతులు పెట్టి తమను కలుపుకోవచ్చని కూడా చెప్పారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు (కెసిఆర్) నాయకత్వంలో తెలంగాణ వస్తే ఊరూరా ఆయన విగ్రహాలు పెడతామని చెప్పారు. ఆయన ఫొటోలు జేబుల్లో పెట్టుకుని తిరుగుతామన్నారు. 

టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేవారంతా పదవులకోసమేనని విమర్శించారు. ఉద్యమాన్ని పక్కనపెట్టి ఓట్లు, సీట్ల కోసమే కెసిఆర్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 2014 తర్వాత ఆ పార్టీలో వలసవెళ్లినవారు తప్ప ఉద్యమకారులుండరన్నారు. చిత్తశుద్ధి ఉంటే జెఎసి గొడుగు కింద కెసిఆర్ స్వతంత్ర ఉద్యమాలకు సిద్ధంకావాలని పిలుపు ఇచ్చారు.

తిరుపతి వెళ్లేందుకు విజయసాయిరెడ్డికి అనుమతి

హైదరాబాద్: ఆడిటర్ విజయసాయిరెడ్డి తిరుపతి వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తిరుపతి వెళ్లేందుకు జూన్ 1 నుంచి 3 వరకు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. 

'YSజగన్‌ను అణగదొక్కడానికే సీబీఐని ఉసిగొల్పారు'

న్యూఢిల్లీ : శక్తిమంతమైన ప్రజానాయకుడు జగన్‌ను అణగదొక్కడానికే సిబిఐని కాంగ్రెస్‌ ఉపయోగించుకుంటోందని శిరోమణి అకాళీదళ్‌ నేత, మాజీ ప్రధాని కుమారుడు నరేష్‌ గుజ్రాల్‌ అంటున్నారు. సిబిఐని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన దుయ్యబట్టారు. 

తమను కాదని జగన్‌ కొత్త పార్టీ పెట్టుకున్నందుకే జగన్ పై కాంగ్రెస్‌ పార్టీ సిబిఐని ఉసిగొల్పిందని బిజెపి సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా అభిప్రాయపడ్డారు. సిబిఐని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. 

'YSజగన్ పై విమర్శలు చేస్తూ పైశాచికానందం'

కడప(వైఎస్ఆర్ జిల్లా): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఎంపి జగన్మోహన రెడ్డిపై కాంగ్రెస్, టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి విమర్శించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకుని సంయమనంతో మాట్లాడాలని సలహా ఇచ్చారు. 

'తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే ఆలోచిస్తా':

కరీంనగర్ : తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే తన నిర్ణయాన్ని పునసమీక్షించుకుంటానని ఎంపీ వివేక్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు తనతో మాట్లాడారని ఆయన తెలిపారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని వారు సూచించారని వివేక్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఈరోజు సాయంత్రం కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని కలిసి స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు. ఎంపీ రాజయ్యతో సహా అందరం టీఆర్ఎస్ లో చేరతామని మందా జగన్నాథం తెలిపారు.

బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మాజీమంత్రి మోపిదేవి

హైదరాబాద్ :వాన్‌పిక్‌ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ శుక్రవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. 

సిఎం,చంద్రబాబులపై విరుచుకుపడ్డ కేటీఆర్

అధిష్టానానికి డెడ్‌లైన్లు విధించవద్దన్న సిఎం వ్యాఖ్యలపై కేసీఆర్ కుమారుడు ఎమ్మెల్యే కేటీఆర్ విరుచుకు పడ్డారు. ప్రజాదరణ లేని, ప్రజామోదం లేని సిఎంగా కిరణ్ ఉండటం తెలుగు ప్రజలు, తెలంగాణవాళ్లు చేసుకున్న పాపమని కేటీఆర్ అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇంకెంతకాలం తీర్చకుండా ఉంటారని ప్రశ్నించారు. కావూరి అలకబూనితే వెంటనే రాజీకి వెళ్లిన సిఎం కిరణ్, తెలంగాణ ఎంపీలు డెడ్‌లైన్ పెట్టినా కనీసం స్పందన లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది సిఎం అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీలకు ఓ న్యాయం..ఆంధ్రా ఎంపీలకు ఓ న్యాయమా అని కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబును కూడా కేటీఆర్ వదిలిపెట్టలేదు..లోకేష్ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను పక్కన పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.