భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికీ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. వాటిలో ఓటు హక్కు, విద్యా హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, జీవించే హక్కు... ఇలా కొన్ని హక్కుల్ని భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికీ కల్పించింది. ఈ హక్కులకు అడ్డు తగులుతూ, కక్ష సాధింపు ధోరణితో వ్యక్తిని నిర్బంధించే హక్కు ఎవరికీ లేదు. అయితే జగన్ విషయంలో కాంగ్రెస్‌పార్టీ సీబీఐతో కుమ్మక్కై ఆయన ప్రాథమిక హక్కుకే భంగం కలిగేలా కుటిల రాజకీయాలకు పాల్పడుతోంది! ఇది రాజ్యాంగ ఉల్లంఘన తప్ప మరొకటి కాదు.
రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న యువనేత జగన్‌ను ఎదుర్కోవటానికి ఎన్ని కుయుక్తులు, ఎన్ని అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయో! నూట ఇరవై ఐదేళ్ల చరిత్ర కలిగి, రాజకీయాల్లో తలపండిన అతిరథ మహారథులు ఉన్న కాంగ్రెస్ పార్టీ; ముప్పై యేళ్ల రాజకీయానుభవం, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ... కడప లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన విషయం గుర్తొచ్చి, గుండెల్లో దడపుట్టి, జగన్‌కు ఎక్కడ ప్రజాదరణ పెరుగుతుందోనన్న భయంతో... ఈర్ష్య, కక్ష సాధింపులతో ఆయన్ని జైల్లో నిర్బంధించటం ఎంతవరకు న్యాయం?
కాంగ్రెస్, టీడీపీలకు ప్రజల మద్దతు ఉంటే, ప్రజలే కనుక వారిని కోరుకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచి సత్తా చూపించాలి కాని, అనవసరమైన వ్యర్థ ఆరోపణలతో, కుంటి సాకులతో జగన్‌ను జైల్లో నిర్బంధించటం ప్రాథమిక హక్కులను కాలరాయడమే! కాంగ్రెస్‌పార్టీ జగన్‌ను ఇలా అక్రమంగా జైల్లో నిర్బంధిస్తే, అంతకంతా వంద రెట్లు జగన్‌కు ప్రజాభిమానం పెరుగుతుందే తప్ప ఏమాత్రం తరగదు. న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని అంటారు. న్యాయమూర్తులైనా జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వొచ్చు కదా. జగన్ ఏమైనా దేశం విడిచి పారిపోతాడా? అసలు ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడన్న విషయం వీళ్లెవరికైనా గుర్తుందా?
జగన్ ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారోనని కాంగ్రెస్, తెలుగుదేశం, ఎల్లో మీడియాల భయం. అయినా జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవటం తప్పు కాదే! ఆయనకు ఆ హక్కు లేదా? ప్రజా సంక్షేమానికి పాటుపడగల సామర్థ్యం ఉంది. ప్రజాదరణ ఉంది. అది తెలుసుకోకుండా ‘నవ్విపోదురుగాక నాకేటి’ అన్న చందాన కాంగ్రెస్, టీడీపీలు ప్రవర్తిస్తే, ప్రజలే తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ తందాన అంటే సీబీఐ తాన తందాన అనటం బాగా అలవాటైపోయింది. దీన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక వ్యక్తి స్వేచ్ఛను నిర్బంధించటం శోచనీయం. ఇదేనా మనం భావితరాలకు ఇచ్చే రాజకీయ సందేశం, ఉపదేశం!
- చింతపల్లి సత్యనారాయణ ప్రసాద్, భవానిపురం, విజయవాడ
జగన్ బయట ఉండి వుంటే వీళ్లు ఇన్నేసి మాటలు అనేవారా?!
ఒక వ్యక్తి బాణం వదిలితే, ఎదుటి వ్యక్తి మనోధైర్యం గలవాడైతే, ఆ బాణం వారిని తాకదు. తిరిగి ప్రయోగించిన వ్యక్తికే వచ్చి గుచ్చుకుంటుంది. జగన్‌పై మాటల బాణాలు సంధించినవారికి కూడా ఇదే పరిస్థితి. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలని రాజశేఖరరెడ్డిగారు అనేక సందర్భాల్లో చెప్పేవారు. ఒక మాట మాట్లాడితే దానిలో నిబద్ధత ఉండాలి, నోటికొచ్చినట్లు మాట్లాడితే అది మాట్లాడినవారికే అనర్థం అనేవారు. ఎదుటివారికి బాధ కలిగించే ఏ మాటలైనా క్షమించరానివి.
అసలు జగన్ ఏం తప్పు చేశారని అందరూ ఇన్ని మాటలంటున్నారు? జగన్ ఆస్తులను అక్రమాస్తులు అనడమే తప్పు. వ్యాపారం సజావుగా సాగాలంటే పెట్టుబడులు రాబట్టాలి కదా. ఆ విధంగా వచ్చిన పెట్టుబడులన్నీ అక్రమాస్తులు అనడం సమంజసమేనా? సీబీఐ ఇంకా జగన్ ఆస్తుల విషయంలో ఒక నిర్థారణకు రాలేదు. నేటికీ అభియోగాలు మాత్రమే దాఖలు చేస్తోంది. అలాంటప్పుడు ‘అక్రమం’ అనే మాట ఎలా ఉపయోగిస్తారు. ‘జగన్ ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు, ఆ డబ్బుతో ఒక రాష్ట్రాన్నే కొనెయ్యగలడు’ అని కొందరు నాయకులంటున్నారు. ఒక నాయకుడైతే మరికాస్త ముందుకెళ్లి ‘జగన్‌కు పద్నాలుగేళ్లు జైలుశిక్ష వేయాలి’ అన్నాడు.
ఇంకొకాయన ‘ఉరిశిక్ష’ వేయించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఏం మాటలండీ ఇవి? ఒకసారి ఆ వ్యక్తులు తమ బిడ్డలమీద ప్రమాణం చేసి చెప్పమనండి... జగన్ దోషి అని. రాజకీయ కక్షతో జగన్‌ని అణగదొక్కటానికి ఆయనపై అనేక రకాలుగా రాళ్లు వేస్తున్నారు. అవి ఎంతమాత్రం జగన్‌ను తాకవు. అసలు జగన్ జైల్లో కాకుండా, బయట ప్రజల్లో ఉండి ఉంటే, వీరు ఇన్ని మాటలు ధైర్యంగా అనగలిగేవారా? ఆ ధైర్యం వారికి ఉందా? గుండెల మీద చేతులేసుకుని చెప్పమనండి. ఏదైతేనేం. జగన్ మీద ఒక మబ్బు పొర కమ్ముకుని ఉంది. అది త్వరలో తొలగిపోయి, స్వచ్ఛమైన వ్యక్తిగా బయటకు వస్తారు.
- టి.వి.సుబ్బారెడ్డి, కూకట్‌పల్లి, హైదరాబాద్
0 comments:
Post a Comment