Friday, 10 May 2013

YS జగన్‌కి కాదు...జనానికి ఈ నిర్బంధం


అంతా అనుకున్నట్లే జరిగింది. జగన్‌కి బెయిల్ రాలేదు. మరో నాలుగు నెలల తరవాతే బెయిల్‌కి అప్పీల్ చేసుకోవాలని సుప్రీంకోర్టు నిర్ణయం. గడువు లోపల సీబీఐ తన విచారణ పూర్తి చెయ్యకపోతే, అప్పుడు జగన్ అవసరమైతే మళ్లీ పిటిషన్ పెట్టుకోవచ్చట. ఒకవేళ అలా పెట్టుకోకుండా సీబీఐ ఎన్ని సంవత్సరాలు విచారణ జరపాలనుకున్నా అంతకాలం జగన్ జైల్లో నిరభ్యంతరంగా ఉండొచ్చు. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి గాను తన శక్తియుక్తులన్నిటినీ ధారబోసిన సీబీఐ న్యాయవాది బయటకు రాగానే ‘‘అవసరమైతే నాలుగునెలల తరవాత కూడా మరింత గడువు ఇవ్వాలని కోరతాం’’ అని వ్యాఖ్యానించారు. దీనినిబట్టే అర్థమవుతోంది సీబీఐ ఎలాంటి పన్నాగాలు పన్నుతోందో! కుట్ర ఫలించడంతో కాంగ్రెస్‌కు, తెలుగుదేశానికి, ఎల్లో మీడియాకు, సీబీఐకి అపరిమిత ఆనందం కలిగి వుంటుంది. జగన్‌కు బెయిల్ రాలేదు కదా! అందుకు. కానీ ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న సామాన్య ప్రజానీకానికిది పిడుగుపాటు. ఏం జరుగుతుందో, ఇంకా ఏం జరగబోతుందో దిక్కు తెలియని స్థితి. జగన్ నిర్బంధంతో జనానికి సంకెళ్లు పడినట్లయింది!
ఒక ముఖ్యమంత్రిని నిర్దేశించగల అధికారం హైకమాండ్‌కి ఉంటుంది. కానీ ఒక ముఖ్యమంత్రి కుమారుడు మంత్రివర్గాన్ని, గవర్నమెంటుని నిర్దేశించగల సూపర్ నేచురల్ పవర్ అని కేవలం సీబీఐ హ్రస్వదృష్టికి మాత్రమే కనిపిస్తుంది. ఆర్థికశాస్త్రనిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నదేమంటే... ఇన్వెస్ట్‌మెంట్‌కీ ఆర్జనకీ మధ్య తేడా తెలియనట్లు సీబీఐ ప్రవర్తించడం. జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడి అతని అక్రమార్జన ఎలా అవుతుంది? కానేకాదు అన్నది కామన్‌సెన్స్. కానీ సీబీఐ ఏ మాత్రం కామన్‌సెన్స్ లేకుండా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు జగన్ అక్రమార్జన అని తేల్చింది. కంపెనీరూల్స్‌కి తాజా కొత్త భాష్యం ఏమంటే... ముఖ్యమంత్రి కుమారుడి కంపెనీల్లో ఎవరూ పెట్టుబడి పెట్టకూడదు!

ఇంతవరకూ ఏ ఎనలిస్ట్‌కీ అందని పాయింట్ ఇది! అలా పెట్టుబడి పెట్టినవారంతా దోషులేనట. ఈ లాజిక్ కేవలం సీబీఐకి మాత్రమే అర్థమౌతుంది. అలా ప్రజల్ని నమ్మించడానికి ఎన్ని టక్కుటమార విద్యలైనా ప్రదర్శించగలదు. ఈ డ్రామాకి సహాయ సహకారాలు అందిస్తున్నవాళ్లు సచ్ఛీలులు! వాళ్లు చేసే వ్యాపార, పారిశ్రామిక వ్యవహారాల్లో పెట్టుబడులన్నీ సక్రమార్జన. ఆహా! ఎంత అద్భుత విన్యాసం. ఏ కొమ్ములు తిరిగిన ఆడిటర్ జనరల్‌కీ అర్థం కాని అర్థశాస్త్ర వైచిత్రి. రాజశేఖరరెడ్డిగారు తాను జీవించినంతకాలం, తనకి సాధ్యమైనంత సహాయం చేస్తూ, తన శత్రువుని కూడా చేరదీసిన గొప్పవ్యక్తి. ఆయన ప్రవర్తనాసరళి తెలుసుకోవడానికి ఆయన స్వచ్ఛమైన నవ్వు చాలు. ఆయన జనాన్ని ప్రేమించారు.

జనం కోసం జీవించారు. ఆ జనం కోసమే మరణించారు. కానీ నేడు జరుగుతున్నదేమిటి? ఆయన్ని ద్వేషించేవాళ్లు, ఆయన పెంచి పోషించిన పార్టీ కలిసి ఆయన తనయుడు జగన్‌ని రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి సహాయసహకారాలు అందించేందుకు ఎల్లో మీడియా రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. పర్యవసానమే జగన్ నిర్బంధం, బెయిల్ రాకపోవడం. జగన్‌ని జనానికి దూరంగా ఉంచినందువల్ల వీరు ఆశించినట్లు ఏమీ జరగదు. పైగా జనమే జగన్‌కి దగ్గరవుతారు.

జగన్ ఈ రెండుసంవత్సరాల్లో జనంతో మమేకమైన విధానం, అతని వ్యవహారశైలి, తీసుకున్న నిర్ణయాలు... అతని నాయకత్వ లక్షణాలను ప్రజలందరికీ సుపరిచితం చేశాయి. ఒక నిర్ణయం తీసుకుంటే, హరిహరాదులున్నా లెక్కచెయ్యని ధీశాలి జగన్. అందుకే ఇన్ని కష్టాలు. అందుకే ప్రజల్లో అతని మీద ఇంత విశ్వాసం. పాలక ప్రతిపక్షాలని ప్రజలు సమూలంగా కూకటివేళ్లతో పెకలించి దూరంగా విసిరేసే రోజు ఒకటి వస్తుంది. అదెంతో దూరంలో లేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. సీతమ్మ వనవాస కాలం దాటాక, రావణ వధ. సీతమ్మవారి చెర తొలగించబడినట్లే, ప్రజాతీర్పు కోరే ఆ రోజుతో జగన్ కష్టాలు చెల్లు. జనానికి సంకెళ్లు తెగిపడే రోజు, ఈ ఆంధ్రదేశానికి పట్టిన చీడ వదిలే రోజు కూడా అదే.

- వి.నాగరాజాచార్యులు, మియాపూర్, హైదరాబాద్

వచ్చేది కాంగ్రెస్ సమాధి నామ సంవత్సరం

నేను ఆర్‌టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నాను. డ్యూటీ మీద ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు తిరుగుతుంటాను. జనం మాటలు, అభిప్రాయాలు, వాదనలు నేను విన్నదాని ప్రకారం ఇలా ఉన్నాయి. డెబ్బై శాతం ప్రజలు ఎన్నికలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. వారిలో తొంభై శాతం ప్రజలు కాంగ్రెస్ సమాధి కోరుకుంటున్నారు. ఇక చంద్రబాబు జైలు శిక్ష నుండి తప్పించుకోవటానికి కాంగ్రెస్‌తో చెయ్యి కలిపి, తనని నమ్ముకున్న టీడీపీ నాయకుల రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తున్నాడన్నమాట కూడా వినిపిస్తోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇవే మనకు ఆఖరి పదవులు అనే నిర్ణయానికొచ్చేశారు. అటువైపు చంద్రబాబు మాటకు విలువ లేదు, అతడిని ప్రజలే కాదు, ఆ పార్టీలోని వారు కూడా నమ్మడం లేదు. ఈ రెండు పార్టీలు కలిసి తమ దుష్ర్పచారాలతో జగన్ పార్టీకి మేలే చేస్తున్నాయి. ‘పాతాళభైరవి’ సినిమాలో విలన్, హీరోను దేవతకు బలివ్వబోతాడు. కానీ విలన్ చేతిలోనే బలైపోతాడు. జగన్‌మీద కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్‌కూ చివరికి అదే పరిస్థితి ఎదురవుతుంది.

- ఎ.వి.వి.ఎస్.ఎన్.మూర్తి, కాకినాడ

0 comments:

Post a Comment