గుంటూరు, 5 మే 2013: గుంటూరు జిల్లా బాపట్లలో ఆదివారం సాయంత్రం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు జరుగుతుంది. మహిళల ఆత్మగౌరవ పరిరక్షణే ధ్యేయంగా, వారి ఆర్థిక భద్రతతే లక్ష్యంగా 'మహిళా నగారా' పేరున నిర్వహిస్తున్న ఈ సదస్సుకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. మహిళా సమస్యలపై కూలంకషంగా చర్చించేందుకు పార్టీ నిర్వహిస్తున్న తొలి రాష్ట్ర స్థాయి సదస్సు కావడంతో అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివస్తారని అంచనా. సదస్సు నిర్వహణకు నిర్వాహకులు భారీ యెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. బాపట్లలోని ఆర్ట్సు అండ్ సైన్సు కళాశాల ప్రాంగణంలోని సదస్సు ప్రాంగణానికి ఇటీవల తెనాలిలో మరణించిన బేతాళకాంత సునీల పేరిట సునీల ప్రాంగణంగా నామకరణం చేశారు. సదస్సుకు హాజరయ్యే మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ సదస్సుకు హాజరయ్యే విఐపిలకు ప్రత్యేకంగా ఓ గ్యాలరీని ఏర్పాటు చేశారు. సదస్సుకు ముందు పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ వంగపండు ఉష నేతృత్వంలో కళాబృందాల ప్రదర్శన ఉంటుంది. శ్రీమతి వైయస్ విజయమ్మ ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి గన్నవరంలో దిగుతారు. అక్కడి ఆమె నుంచి రోడ్డు మార్గంలో బాపట్ల చేరుకుంటారు. ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకూ ఇంజినీరింగ్ కళాశాలలోని అతిథిగృహంలో ఆమె మహిళా ప్రతినిధులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ఆర్ట్సు అండ్ సైన్సు కళాశాలలో జరిగే సదస్సులో పాల్గొంటారని పార్టీ కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ తెలిపారు.
0 comments:
Post a Comment