హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే గ్రామస్థాయి నాయకత్వం బలంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. లోటస్ పాండ్ లో జరిగిన పార్టీ విసృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామస్థాయిలో మంచి నాయకులను ఎంపిక చేసుకోవాలని జగన్ చెప్పినట్లు ఆమె తెలిపారు. ప్రజల్లో పార్టీకి ఉన్న బలాన్ని చీల్చాలని కొందరు చూస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు.ఈ ఎన్నికల కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రజా సమస్యలపై మనం సైనికుల్లా పనిచేయాలని చెప్పారు. ప్రజలకు పార్టీ నాయకులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. స్థానిక ఎన్నికల్లో అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇద్దామని చెప్పారు. ఒక్క రోజు కూడా వృథా కాకుండా నాయకులు ప్రజల్లోనే ఉండాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో అందరినీ కలుపుకొని ఐక్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. గ్రామాలలో మంచి నాయకులను ఎన్నుకోవాలన్నారు. పార్టీ తరపున మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని నేతలకు సూచన చేశారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేస్తూ, అందరిని కలుపుకుకోవాలని చెప్పారు. సభ్యత్వ నమోదుకు ప్రజలలోకి వెళ్లవలసిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వం మైనార్టీలో ఉందని, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సహకారంతో నడుస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి అండతో కిరణ్ ప్రభుత్వం ఎటువంటి భయంలేకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతోందని చెప్పారు. వైఎస్ఆర్ సిపి ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండు కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. ఎన్నికలలో కూడా కలిసి నడుస్తున్నాయన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించవలసిన వ్వ్యూహంపై జరిగిన ఈ సమావేశానికి దాదాపు 150 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు.
0 comments:
Post a Comment