Wednesday, 8 May 2013

కాంగ్రెస్‌ది ధృతరాష్ట పాలన: భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: కిరణ్ సర్కార్ పథకాలేవీ ప్రజలకు మేలు చేసేవికావని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. అవి ప్రకటనల కోసం ప్రవేశపెట్టిన పథకాలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. మహానేత వైఎస్‌ఆర్ మరణం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ధృతరాష్ట పాలన సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాజన్న రాజ్యం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. 

ఉపఎన్నికలు పెట్టండి: వైఎస్‌ఆర్ సీపీ నేత శోభా నాగిరెడ్డి

హైదరాబాద్: కర్ణాటక ఫలితాలు రాష్ట్రంలోనూ వస్తాయనుకుంటే ఉపఎన్నికలు నిర్వహించాలని వైఎస్‌ఆర్ సీపీ నేత శోభా నాగిరెడ్డి సవాల్ విసిరారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజాతీర్పు వచ్చిందన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గమనించాలని చురక అంటించారు. అవిశ్వాసం సందర్భంగా విప్‌ ధిక్కరించిన వారిని ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదని ఆమె ప్రశ్నించారు. సీబీఐ వ్యవహారశైలిపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. 

కాంగ్రెస్ చంకలు గుద్దుకోక్కర్లేదు: సబ్బం హరి

విశాఖపట్నం: కర్ణాటక ఫలితాలపై కాంగ్రెస్ చంకలు గుద్దుకోవక్కర్లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం మనరాష్ట్రంలో ఉండదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

నా పుట్టినిల్లు వైఎస్సార్‌సీపీ : కొణతాల రామకృష్ణ

‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతోనే వైఎస్సార్‌సీపీ ఏర్పడినప్పటి నుంచి పార్టీలో ఉన్నాను. పార్టీ నుంచి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. వైఎస్సార్‌సీపీ నాకు పుట్టినిల్లు లాంటిది. వైఎస్‌తో, ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం విడదీయనటువంటిది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తాను అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కాదని, కాంగ్రెస్ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నా అవేమీ పట్టించుకోకుండా ఆ పార్టీని వదిలేసినట్లు తెలిపారు. తాను బ్యాక్‌డోర్ నుంచి వచ్చిన నాయకుడిని కాదని, పోరాటాలు చేసి పైకొచ్చానని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాగుండాలని కోరుకునే వారిలో తాను ముందున్నానని, జగన్ సీఎం కావాలని, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు.

డాక్టర్ కుడిపూడి వైఎస్ఆర్

హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి 2009 సాదారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీచేసిన డాక్టర్ కుడిపూడి శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం శ్రీనివాస్‌తో పాటు వచ్చిన టీడీపీ నేత డాక్టర్ ఎ.సాంకత్యాయన్‌లకు వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలకమండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు ఎంఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రచ్చపై హీరో రామ్ చరణ్ వివరణ!

హైదరాబాద్: ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జరిగిన రచ్చపై హీరో రామ్ చరణ్ స్పందించారు. తన సెక్యూరిటీ చేతిలో దెబ్బలు తిన్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తనకు క్షమాపణ చెప్పారని తెలిపారు. వాళ్లు చాలా దురుసుగా డ్రైవింగ్ చేశారని, తన దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారని ఐఎఎన్ఎస్ వార్తా సంస్థతో ముంబైలో చెప్పారు. క్షమాపణ కోరుతూ పోలీసులకు లేఖ ఇచ్చారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా, నిజాయితీగా దర్యాప్తు చేశారని కితాబిచ్చారు. పోలీసులు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదన్నారు. అయితే క్షమాపణ కోరుతూ బాధితుల నుంచి తమకు ఎటువంటి లేఖ అందలేదని బంజారాహిల్స్ పోలీసులు చెప్పడం కొసమెరుపు. 

కాంగ్రెస్ విజయంకాదు - బిజెపి ఓటమి: గట్టు రామచంద్ర రావు

హైదరాబాద్: కర్ణాటకలో బీజేపీ ఓటమి తప్ప, అది కాంగ్రెస్ విజయం కాదని వైఎస్ఆర్ సిపి నేత గట్టు రామచంద్ర రావు అన్నారు. కర్ణాటక ఫలితాలు రాష్ట్రంలోనూ వస్తాయనుకుంటే ఉపఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ కు పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ నేతలకు ఉపఎన్నికలంటే ఎందుకంత భయం? అని ఆయన అడిగారు. 

మెజారిటీ(121) సాధించిన కాంగ్రెస్

కర్ణాటక: కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన 113 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకు 223 స్థానాలలో ఎన్నికలు జరిగాయి. బిజెపి 38, జెడి(ఎస్) 36, కెజెపి 4, ఇతరులు 14 స్థానాలలో గెలుపొందారు. 

సినీహీరో రామ్‌చరణ్‌పై హెచ్ఆర్ సిలో ఫిర్యాదు

హైదరాబాద్ : సినీహీరో రామ్‌చరణ్‌పై మానవహక్కుల సంఘం( హెచ్ ఆర్ సి)లో ఫిర్యాదు చేశారు. సాప్ట్ వేర్ ఉద్యోగులపై దాడి కేసులో రామ్ చరణ్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది సలీం హెచ్ ఆర్ సిని ఆశ్రయించారు. 

నరేంద్ర మోడీకి దెబ్బ- రాహుల్ కు ఘనత

దేశవ్యాప్తంగా తన ప్రభావం పెంచుకోవాలనుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి కర్నాటక ఫలితాలు ఆశాభంగం కలిగించాయి.ఆయన ప్రభావం పనిచేయలేదని కర్నాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మోడీ మంత్రం పని చేయలేదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభావం స్పష్టంగా కనిపించిందని సిద్దరామయ్య అంటున్నారు.. అందువల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని సిద్దరామయ్య చెబుతున్నారు.