Thursday, 16 May 2013

T.మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్!


కరీంనగర్‌: తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మండిపడ్డారు. సీఎంను చూస్తే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలకు లాగులు తడుస్తున్నాయని కేసీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. టి.మంత్రులు, కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం బూట్లు మోయడానికే పనికొస్తారు అని కేసీఆర్‌ అన్నారు. 

తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వమంటే నోరు మెదమని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు దద్దమ్మలు చవటలు అని అన్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ పూడికతో నిండిపోతుంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించడం లేదు అని అన్నారు. తెలంగాణ వస్తే ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల్లో నీరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని కేసీఆర్ తెలిపారు. 24గంటలు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని కేసీఆర్‌ హమీ ఇచ్చారు.

సోషల్ నెట్ వర్క్ - వ్యాఖ్యలపై తీర్పు

ఫేస్‌బుక్‌,ట్విట్టర్‌లలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారిని ఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల అనుమతితో మాత్రమే అరెస్ట్‌ చేయాలని సుప్రింకోర్టు అబిప్రాయపడింది. అభిప్రాయాలపై ముందే అరెస్ట్ లు వద్దని, విచారణ అనంతరమే వారిని అరెస్ట్ చేయాలని సూచించింది.అది కూడా ఉన్నత స్థాయి అదికారుల పర్యవేక్షణలోనే జరగాలని సుప్రింకోర్టు చెప్పడం విశేషం. మన రాష్ట్రానికి చెందిన జయ వింద్యాల కేసులో సుప్రింకోర్టు ఈ గైడ్ లైన్స్ జారీ చేసింది.ఏది ఏమైనా సోషల్ నెట్ వర్క్ లలో అభ్యంతరకర, అసబ్యకర భాష వాడకుండా, దేశద్రోహ, ఉగ్గరవాద, తీవ్రవాద అనుకూల వ్యాఖ్యలు చేయకుండా ఉంటే దేశానికిర సమాజానికి మంచిదని చెప్పక తప్పదు.పౌరహక్కుల విషయంలో స్వేచ్చ కలిగిన భారత్ లో ఆ స్వేచ్చ దుర్వినియోగం కాకుండా ఉండడం అవసరం.అలాగే ఎవరు పడితే వారు అరెస్టు చేయకుండా ఉండాలన్న సుప్రిం తీర్పు కూడా స్వాగతించదగిందే.

'షర్మిల యాత్రతో కార్యకర్తల్లో నూతనోత్సహం'

తిరుపతి: షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో కాంగ్రెస్‌-టీడీపీ పార్టీలు బెంబేలెత్తుతున్నాయని శ్రీకాళహస్తి వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త మధుసూదన్‌రెడ్డి అన్నారు. షర్మిల పాదయాత్ర వైఎస్ఆర్‌ సీపీ కార్యకర్తల్లో నూతనోత్సహం నింపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. షర్మిల పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా శ్రీకాళహస్తిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

నిరాహార దీక్ష చేపడతా: కొండా సురేఖ

వరంగల్: భూపాలపల్లి కేటీపీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్ఆర్‌ సీపీ నేత కొండా సురేఖ డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆమె హెచ్చరించారు. డిమాండ్ల సాధన కోసం ధర్నా చేస్తున్న కార్మికులను పరామర్శించి కొండా సురేఖ, మురళి దంపతులు సంఘీభావం తెలిపారు.

చంద్రబాబుకు ఆస్కార్ ఇవ్వాలి: తులసిరెడ్డి

హైదరాబాద్: తృతీయ ఫ్రంట్‌లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని చంద్రబాబు అనడం పెద్ద జోక్ అని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పగటికలలు కంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు హయాం అంతా కుంభకోణాలమయమేనని, తనపై ఉన్న అవినీతి కేసుల్లో బెయిల్‌ తెచ్చుకున్న బాబుకు నిజాయితీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అవినీతిపై చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు. 

Wednesday, 15 May 2013

YSజగన్ కు పీటీవారెంట్‌ జారీ చేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్ : దాల్మియా సిమెంట్ కంపెనీకి సంబంధించి ఐదో ఛార్జి షీటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు గురువారం పీటీ వారెంట్ జారీ చేసింది. జూన్ 7వ తేదీన ఆయన్ని కోర్టుకు హాజరు పరచాలని న్యాయస్థానం చంచల్ గూడ జైలు అధికారులను ఆదేశించింది. కాగా ఇప్పటికే జూన్ 7న కోర్టుకు హాజరు కావాలంటూ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. 

సీరియస్ గానే రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం

ఢిల్లీలో ఏదో రాజకీయ హడావుడి నడుస్తున్నట్లే ఉంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచిన అదిష్టానం పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా ఢిల్లీకి రావాలని కబురు చేయడం, ఆయన బయల్దేరడం తో రాజకీయ వర్గాలలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి, లేదా పిసిసి అద్యక్షుడులలో ఎవరో ఒకరిని మార్చవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎక్కువమంది బొత్సనే మార్చవచ్చని అంటున్నారు. అయితే ఇవేవి కావు కళంకిత మంత్రులపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా డిల్లీలో చర్చలు జరుగుతున్నాయని ఇంకొందరు భావిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర రాజకీయం సీరియస్ గానే ఉందని భావించాలి.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి లగడపాటి సన్నిహితుడు

నిన్న,మొన్నటివరకు విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ కు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు సడన్ గా ఆయన పార్టీ మారారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు. సమైక్యవాద ఉద్యమంలో లగడపాటితో సన్నిహితంగా ఉండడమే కాక, ఆయా విషయాలలో కూడా ఆయనకు మద్దతు ఇస్తున్న విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరడం ఆశ్చర్యంగానే ఉంటుంది.1083 లో టిడిపి పక్షాన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.నాదెండ్ల భాస్కరరావు అనుచరుడిగా టిడిపి లో సంక్షోభం ఏర్పడినప్పుడు నాదెండ్ల పక్షాన నిలిచారు.అప్పటి నుంచి రాజకీయంగా వెనుకబడ్డ అడుసుమిల్లి జయప్రకాష్ ఈ మద్య కాలంలో సమైక్యవాద ఉద్యమం ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఈయన పార్టీ మారడం ఆసక్తికరమై అంశమే. అడుసుమిల్లి జయప్రకాష్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. లగడపాటికి చెప్పకుండానే అడుసుమిల్లి పార్టీ మారి ఉంటారా!

YS Sharmila padaytra reach 2000km mailurai at Ravikampadu

మీది రైతు ప్రభుత్వమా ?


* ఎలా అయిందో చెబుతారా..? 
* మరో ప్రజాప్రస్థానంలో సీఎం కిరణ్‌కు షర్మిల ప్రశ్న
* పంటలన్నింటినీ చేనులోనే ఎండబెట్టినందుకా?
* పంట పొలాలకు కరెంటు, నీరు ఇవ్వనందుకా?
* పంటలకు మద్దతు ధర ఇవ్వనందుకా?
* ఇది రైతు ప్రభుత్వం కాదు.. రాక్షస ప్రభుత్వం
* పేదలు, మహిళలు, రైతులు అందరూ చితికిపోయారు
* ప్రజల వైపు నిలబడాల్సిన చంద్రబాబు.. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పక్షాన నిలిచారు
* ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినవారిని ప్రజలు నమ్మరు
* రాజన్న రాజ్యంలో రైతు రాజులా ఉంటాడు 

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈ ముఖ్యమంత్రి ఇది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి గారూ.. ఎందుకు మీది రైతు ప్రభుత్వం అయింది..? పంట పొలాలకు కరెంటు, నీళ్లు ఇవ్వనందుకా..? నోటి దగ్గరికొచ్చిన పంటలను చేనులోనే ఎండబెట్టినందుకా..? రైతు ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వనందుకా..? చెరకు అమ్మబోతే ధర లేదుగానీ.. చక్కెర కొనబోతే ధర చుక్కల్లో ఉన్నందుకా..? మీది ఏ విధంగా రైతు ప్రభుత్వం అయింది..?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.

‘‘ఇది రైతు ప్రభుత్వం కాదు.. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం..’’ అని నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో సాగింది. టీ నర్సాపురం మండల కేంద్రంలో జరిగిన రచ్చబండలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

విశ్వసనీయత లేని వారిని ఎవరూ నమ్మరు..: 
ఈరోజు ఏ పంటను మార్కెట్‌కు తీసుకొని పోయినా కనీస మద్దతు ధర లేదు. అయినా నిస్సిగ్గుగా ఈ ముఖ్యమంత్రి మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. అంటే అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని అనుకుంటున్నారా? గ్రామాల్లో ఐదు గంటలకు మించి కరెంటు లేదు. రైతులకైతే మూడు గంటలకు మించి కూడా రావడం లేదు. అదీ విడతల వారీగా ఇస్తున్నారు. అభయహస్తం పథకం ఎక్కడా అమలవడం లేదు. ముఖ్యమంత్రి గారు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామంటున్నారు తప్పితే.. ఎవరికీ కూడా ఆ రుణాలు అందడం లేదు. 

ఇప్పుడున్న ప్రభుత్వంలో పేదలు, మహిళలు, రైతులు అందరూ చితికిపోయారు. చంద్రబాబుగారేమో.. రైతులు, పేదల పక్షాన నిలబడకుండా ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన నిలబడ్డారు. చంద్రబాబు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు కళ్లారా చూసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఎన్టీఆర్ వాగ్దానం చేసిన రెండు పథకాలకు చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారు. ఒకటి.. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ఎత్తేశారు.

రెండు.. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి ఎక్కడపడితే అక్కడ బెల్టు షాపులు తెరిచారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఈ ప్రభుత్వం కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన చంద్రబాబు.. ఈ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు పలకొద్దని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు.

ఇక ఈ చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడు కాకుంటే ఇంకేమవుతారు? ఈ ప్రభుత్వం కూలిపోకుండా ఎందుకు కాపాడారు చంద్రబాబు గారూ.. అని ప్రజలు అడిగితే ఈరోజు కూడా ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. ఇలా విలువలు, విశ్వసనీయత లేనివారిని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, కుట్రలు పన్నినవారిని ఎవరూ నమ్మరు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. రాజన్న రాజ్యంలో జగనన్న రైతును రాజులా చూసుకుంటారు. మళ్లీ ప్రతి పేదవాడు తలెత్తుకొని తిరుగుతాడు. గ్రామాల్లో బెల్టు షాపులు, నాటు సారా ఉండవని మీకు మాటిచ్చి చెప్తున్నాను.

12.3 కిలోమీటర్ల పాదయాత్ర
149వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని క్రిష్ణానగర్ గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి ముత్యాలంపేట, టీ నర్సాపురం, గుర్వాయిగూడెం, శ్రీరామవరం, తిరుమలదేవిపేట వరకు సాగింది. మధ్యాహ్నంవారిగూడెం గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.40 గంటలకు షర్మిల చేరుకున్నారు. బుధవారం మొత్తం 12.3 కిలోమీటర్లు నడిచారు. 

ఇప్పటివరకు మొత్తం 1990.2 కి.మీ. పాదయాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో జిల్లా పార్టీ కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్, ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మొవ్వ ఆనంద శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, నేతలు బొడ్డు భాస్కరరామారావు, వైఎస్ కొండారెడ్డి, స్థానిక నాయకులు కర్ర రాజారావు, పాశం రామకృష్ణ, గంట ప్రసాద్ తదితరులున్నారు. 

నేటితో 2 వేల కిలోమీటర్లు పూర్తి.. రావికంపాడులో బహిరంగ సభ
షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం (150వ రోజు) నాటికి 2 వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించనుంది. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం రావికంపాడుకు చేరుకునేటప్పటికి 2 వేల కిలోమీటర్ల నడక పూర్తవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 24 అడుగుల వైఎస్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు. 

ఈ సందర్భంగా రావికంపాడులో జరిగే బహిరంగ సభకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పాటుగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరై షర్మిలకు సంఘీభావాన్ని ప్రకటిస్తారని పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం చెప్పారు. 2012 అక్టోబర్ 18న ఇడుపులపాయలో మొదలైన మరో ప్రజాప్రస్థానం పది జిల్లాల్లోని 67 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మున్సిపాలిటీలు, ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 115 మండలాల మీదుగా సాగింది.