* ఎలా అయిందో చెబుతారా..?
* మరో ప్రజాప్రస్థానంలో సీఎం కిరణ్‌కు షర్మిల ప్రశ్న
* పంటలన్నింటినీ చేనులోనే ఎండబెట్టినందుకా?
* పంట పొలాలకు కరెంటు, నీరు ఇవ్వనందుకా?
* పంటలకు మద్దతు ధర ఇవ్వనందుకా?
* ఇది రైతు ప్రభుత్వం కాదు.. రాక్షస ప్రభుత్వం
* పేదలు, మహిళలు, రైతులు అందరూ చితికిపోయారు
* ప్రజల వైపు నిలబడాల్సిన చంద్రబాబు.. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పక్షాన నిలిచారు
* ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినవారిని ప్రజలు నమ్మరు
* రాజన్న రాజ్యంలో రైతు రాజులా ఉంటాడు
మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈ ముఖ్యమంత్రి ఇది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి గారూ.. ఎందుకు మీది రైతు ప్రభుత్వం అయింది..? పంట పొలాలకు కరెంటు, నీళ్లు ఇవ్వనందుకా..? నోటి దగ్గరికొచ్చిన పంటలను చేనులోనే ఎండబెట్టినందుకా..? రైతు ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వనందుకా..? చెరకు అమ్మబోతే ధర లేదుగానీ.. చక్కెర కొనబోతే ధర చుక్కల్లో ఉన్నందుకా..? మీది ఏ విధంగా రైతు ప్రభుత్వం అయింది..?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.
‘‘ఇది రైతు ప్రభుత్వం కాదు.. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం..’’ అని నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో సాగింది. టీ నర్సాపురం మండల కేంద్రంలో జరిగిన రచ్చబండలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
విశ్వసనీయత లేని వారిని ఎవరూ నమ్మరు..:
ఈరోజు ఏ పంటను మార్కెట్‌కు తీసుకొని పోయినా కనీస మద్దతు ధర లేదు. అయినా నిస్సిగ్గుగా ఈ ముఖ్యమంత్రి మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. అంటే అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని అనుకుంటున్నారా? గ్రామాల్లో ఐదు గంటలకు మించి కరెంటు లేదు. రైతులకైతే మూడు గంటలకు మించి కూడా రావడం లేదు. అదీ విడతల వారీగా ఇస్తున్నారు. అభయహస్తం పథకం ఎక్కడా అమలవడం లేదు. ముఖ్యమంత్రి గారు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామంటున్నారు తప్పితే.. ఎవరికీ కూడా ఆ రుణాలు అందడం లేదు.
ఇప్పుడున్న ప్రభుత్వంలో పేదలు, మహిళలు, రైతులు అందరూ చితికిపోయారు. చంద్రబాబుగారేమో.. రైతులు, పేదల పక్షాన నిలబడకుండా ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన నిలబడ్డారు. చంద్రబాబు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు కళ్లారా చూసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఎన్టీఆర్ వాగ్దానం చేసిన రెండు పథకాలకు చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారు. ఒకటి.. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ఎత్తేశారు.
రెండు.. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి ఎక్కడపడితే అక్కడ బెల్టు షాపులు తెరిచారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఈ ప్రభుత్వం కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన చంద్రబాబు.. ఈ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు పలకొద్దని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు.
ఇక ఈ చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడు కాకుంటే ఇంకేమవుతారు? ఈ ప్రభుత్వం కూలిపోకుండా ఎందుకు కాపాడారు చంద్రబాబు గారూ.. అని ప్రజలు అడిగితే ఈరోజు కూడా ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. ఇలా విలువలు, విశ్వసనీయత లేనివారిని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, కుట్రలు పన్నినవారిని ఎవరూ నమ్మరు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. రాజన్న రాజ్యంలో జగనన్న రైతును రాజులా చూసుకుంటారు. మళ్లీ ప్రతి పేదవాడు తలెత్తుకొని తిరుగుతాడు. గ్రామాల్లో బెల్టు షాపులు, నాటు సారా ఉండవని మీకు మాటిచ్చి చెప్తున్నాను.
12.3 కిలోమీటర్ల పాదయాత్ర
149వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని క్రిష్ణానగర్ గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి ముత్యాలంపేట, టీ నర్సాపురం, గుర్వాయిగూడెం, శ్రీరామవరం, తిరుమలదేవిపేట వరకు సాగింది. మధ్యాహ్నంవారిగూడెం గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.40 గంటలకు షర్మిల చేరుకున్నారు. బుధవారం మొత్తం 12.3 కిలోమీటర్లు నడిచారు.
ఇప్పటివరకు మొత్తం 1990.2 కి.మీ. పాదయాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో జిల్లా పార్టీ కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్, ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మొవ్వ ఆనంద శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, నేతలు బొడ్డు భాస్కరరామారావు, వైఎస్ కొండారెడ్డి, స్థానిక నాయకులు కర్ర రాజారావు, పాశం రామకృష్ణ, గంట ప్రసాద్ తదితరులున్నారు.
నేటితో 2 వేల కిలోమీటర్లు పూర్తి.. రావికంపాడులో బహిరంగ సభ
షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం (150వ రోజు) నాటికి 2 వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించనుంది. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం రావికంపాడుకు చేరుకునేటప్పటికి 2 వేల కిలోమీటర్ల నడక పూర్తవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 24 అడుగుల వైఎస్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు.
ఈ సందర్భంగా రావికంపాడులో జరిగే బహిరంగ సభకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పాటుగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరై షర్మిలకు సంఘీభావాన్ని ప్రకటిస్తారని పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం చెప్పారు. 2012 అక్టోబర్ 18న ఇడుపులపాయలో మొదలైన మరో ప్రజాప్రస్థానం పది జిల్లాల్లోని 67 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మున్సిపాలిటీలు, ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 115 మండలాల మీదుగా సాగింది.
0 comments:
Post a Comment