షర్మిల వద్ద ఖమ్మం జిల్లా గిరిజనుల ఉద్వేగం
కరెంటు చార్జీలు, పెరిగిన ధరలతో కుదేలైపోతున్నామని ఆవేదన
జగన్ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ఆకాంక్ష
ఎన్నికలు పెట్టి చూస్తే తెలుస్తుందంటూ సర్కారుకు సవాల్
‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: నాగరికపు మాయామర్మం తెలియని అమాయక గిరిజనులు వాళ్లు.. సమాజానికి దూరంగా అడవిలోకి విసిరేసినట్టుగా అక్కడక్కడ వారి తండాలు. మన్ను పండితే దేవుడికి దండం పెట్టి పండగ చేయడం... కరువొస్తే పస్తులుండటమే వాళ్లకు తెలుసు. సాయం చేసినోళ్లను గుండెల్లో పెట్టుకోవడం.. వాళ్ల సహజ గుణం. ఖమ్మం జిల్లాలో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో సాగుతున్న షర్మిల.. బూడిదంపాడు వద్ద ఆ గిరిజనాన్ని చూసి ఓ మర్రి చెట్టు కింద రచ్చబండ మీద కూర్చొని వారితో మాట్లాడారు.
కడుపులో కల్మషం లేకుండా, కుండబద్ధలు కొట్టినట్టు ఆ గిరిజనులు ఆమెతో మాట్లాడారు. పెరిగిన కరెంటు చార్జీలు, నిత్యావసరాల ధరలతో తాము కుదేలైపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తమ తరఫున పోరాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టారంటూ మండిపడ్డారు. ‘‘జగన్‌రెడ్డిని జైల్లో పెట్టామని సంబరపడుతున్నారు... జగన్ జైల్లో లేడు.. మా గుండెల్లో ఉన్నాడు. వైఎస్సార్ మా పల్లె పొలిమేరల్లో కొలువై ఉన్నాడు. ఒక్కసారి ఎన్నికలు పెట్టి సూడురి జగన్ ఎక్కడున్నాడో చూపిస్తాం’’ అని ఆ గిరిజన మహిళలు.. పాలకులకు సవాల్ విసిరారు. రచ్చబండలో సంభాషణ సాగిందిలా..
షర్మిల: అమ్మా..అయ్యా! మీలో మాట్లాడాలనుకునే వాళ్లుంటే చెయ్యి లేపండి, మీకు మైకిస్తాం. మహిళలు మాట్లాడిన తరువాత రైతులు, విద్యార్థులు కూడా మాట్లాడవచ్చు.
భూక్యా కౌసల్య: అందరికీ నమస్కారం! వైఎస్సార్ ఉన్నప్పుడు మేం ఎంత మంచిగున్నమో.. అంత మంచిగున్నాం. ఏనాడు ఇబ్బంది కలుగలే మాకు. ఇప్పుడు మమ్మల్ని ఎవరూ లెక్కజేయట్లేదు. బేంకుకు పోతే ఏ.. ఏందమ్మా ఎందుకొచ్చినవ్ అంటరు. కరెంటు బిల్లు ఇష్టమొచ్చినట్టు కట్టుకుండ్రు. ఒక్క బలుబుకు రూ.1000 కట్టుకుంటున్నరు. మేం బతకాలంటే చాలా కష్టమయితంది.
షర్మిల: వ్యవసాయం ఎలా ఉందమ్మా?
భూక్యా రాణి: వ్యవసాయం సేత్తాన్నామని మాటే కానీ ఎన్నడూ గింజ సేతికి రాలేదు. విత్తనం వేసినప్పుడు వానాలు రావు. సేను నోటికాడికి వచ్చినప్పుడు వరదొచ్చి మొత్తం కొట్టుకొని పోతది. ఆసుపత్రికి పోతే రూపాయికి రెండు రుపాయలు రాత్తున్నరు. జగన్ రావాలె.. అప్పుడే మేం తినాలె.
షర్మిల: ఏం పంటలు వేసుకున్నారు తల్లి?
అల్లం సీతమ్మ: పత్తి తోట పెట్టుకున్నావమ్మా, ఐదెకరాలేసినాగాని ఐదు కింటాలు రాలే. మందు కట్టల కు పోతే రూ.1000, రూ.2000 కట్టుకుట్టున్నరమ్మా.
షర్మిల: దిగుబడి తగ్గిందా తల్లి?
సీతమ్మ: అవునమ్మా... నీళ్లు లేక పత్తి ఎల్లలేదమ్మా.
షర్మిల: పొలానికి కరెంటు ఎంత సేపు వస్తుంది?
బదావత్ కమ్లీ: అప్పుడప్పుడు అర్ధ గంట ఇడుస్తరు. మొత్తం 2 గంటలు కూడా ఇడువరమ్మా. అప్పుకోసం బేంకుకు పోతే బయటికి నెట్టేత్తున్నరు.
షర్మిల: అసలు రుణాలు రావడం లేదా? పావలా వడ్డీ రుణాలు రావడం లేదా?
తేజావత్ ప్రమీల: అసలు రుణాలే ఇత్తలేరమ్మా. టీవీల కిరణ్‌కుమార్‌రెడ్డి వడ్డీ లేకుండనే అప్పులు ఇత్తున్నామని చెప్తున్నడు. బేంకుకు పోతే.. ఎల్లి.. ఆడికిపోయి అడుగుపో అని మేనేజర్ అంటడు.
షర్మిల: కొద్దిగా ఓపిక పట్టండి ... త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. మీ అందరికీ వడ్డీ లేని రుణాలు వస్తాయి.
0 comments:
Post a Comment